నన్ను లేకుండా చేసే కుట్ర: జగన్‌ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నన్ను లేకుండా చేసే కుట్ర: జగన్‌

నన్ను లేకుండా చేసే కుట్ర: జగన్‌

Written By ysrcongress on Sunday, January 8, 2012 | 1/08/2012

ముందు నన్ను పంపించేసి, తర్వాత నా పార్టీని నాశనం చేయాలని చూస్తున్నారు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే ప్రజలు కాంగ్రెస్ లేదా టీడీపీకే ఓట్లేస్తారన్నది వారి పన్నాగం

 ‘‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జగన్ అనే మనిషి.. వీరిద్దరూ లేకుండా పోయి ఉంటే ప్రజలకు వేరే గత్యంతరం ఏముంది? ఏ గత్యంతరం లేకపోతే ఎలాగూ వారు కాంగ్రెస్ పార్టీకే ఓటు వేస్తారు. లేదంటే తెలుగుదేశం పార్టీకైనా ఓటేస్తారు. కాబట్టి ముందు జగన్ను పంపించేసి.. తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నాశనం చేయాలని అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకులు కలసికట్టుగా కుట్రలు చేస్తున్నారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. గుంటూరు జిల్లాలో 47వ రోజు శనివారం ఓదార్పు యాత్రలో భాగంగా ఆయన సత్తెనపల్లి, అమరావతి, పెదకూరపాడు నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు. మండెపూడి గ్రామంలో నామాల నాగరాజు కుటుంబాన్ని ఓదార్చారు. 10 వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. పలు గ్రామాల్లో ఆయన ప్రసంగించారు. ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..

చంద్రబాబుకో న్యాయం.. వైఎస్‌కో న్యాయం!
ఇవాళ రాష్ట్రంలో రాజకీయాలు ఎలా తయారైపోయాయంటే.. చనిపోయిన వైఎస్సార్‌కు ఒక ధర్మమట.. బతికున్న చంద్రబాబు నాయుడుకు ఇంకో న్యాయమట. చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పార్టీతో ఒక అవగాహనకు వచ్చిన తరువాతే రైతుల మీద ప్రేమ నటిస్తూ.. అవిశ్వాస తీర్మానం పెట్టారు. అవిశ్వాసం వెనుక అసలు ఉద్దేశం వేరే ఉంది. జగన్ ఎప్పుడూ విలువల గురించి మాట్లాడుతూ ఉంటాడు.. విశ్వసనీయత గురించి మాట్లాడుతూ ఉంటాడు కదా..! అవిశ్వాస తీర్మానం విషయంలో కూడా జగన్ అదే విలువలకు, విశ్వసనీయతకు కట్టుబడి ఉంటే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడానికి ఎమ్మెల్యేలు జంకుతారని చంద్రబాబు ప్లాన్ వేశారు. ఇదే అదను చూసి కాంగ్రెస్ పార్టీ వాళ్లు జగన్‌కు సంబంధించిన ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి లొంగదీసుకోవాలని చూశారు. నాకు మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేల సంఖ్యను ఏ ఐదుకో, ఆరుకో కుదించాలని కుటిల ప్రయత్నాలు చేశారు. తరువాత జగనే వారిని మాకు మద్దతుగా పంపించారని ప్రచారం చేసి నేరం నా మీదకే నెట్టాలని పన్నాగం పన్నారు. ఎలాంటి ప్రలోభాలకూ లొంగకుండా వైఎస్సార్ బాటలో రైతుల కోసం నిలబడ్డ 17 మంది ఎమ్మెల్యేలను చూసి నేను గర్వపడుతున్నాను.

ప్రభుత్వానికి రైతుల కన్నీళ్లు పట్టడం లేదు
ఇవాళ చాలా గ్రామాల నుంచి తిరుగుతూ వస్తున్నాను. బస్తా వడ్లు రూ.750 కూడా గిట్టని అధ్వాన పరిస్థితులు ఉన్నాయని వరి రైతులు చెప్తున్నారు. రైతులు లక్ష ఎకరాలను బీడుగా పెట్టి సమ్మెకు దిగి ఏడాది గడుస్తున్నా ఈ ప్రభుత్వం వారి సమస్యలను పట్టించుకునే పరిస్థితిలో లేదు. ఇక్కడికి వస్తుంటే దారిలో.. మిర్చి ఏరుతున్న అక్కా చెల్లెమ్మలు నాకోసం పరిగెత్తుకుంటూ వచ్చారు.. వారిలో కొందరు అవ్వలు కూడా ఉన్నారు. ఎంత కూలీ పడుతోంది అవ్వా..అని అడిగాను. వారిలో కొందరు వేరే ప్రాంతాలకు చెందిన కూలీలు ఉన్నారు. ఇక్కడైతే రోజుకు రూ.150 దాకా గిట్టుతోందని చెప్పారు. వారి కూలీ పెంచమని రైతన్నలను అడుగుదామంటే వారి పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ప్రభుత్వం నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయకపోవడం వల్లఎకరాకు 30 క్వింటాళ్లు పండాల్సిన మిరప ఈ ఏడాది 15 క్వింటాళ్లు పండితే చాలా గొప్ప అని మిర్చి రైతులు చెప్పారు. ఎకరాకు రూ. 20- 30 వేల అప్పే మిగులుతోందని రైతులు కన్నీళ్లు పెడుతున్నారు.
Share this article :

0 comments: