వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి గంగారెడ్డి, సంతోష్‌రెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి గంగారెడ్డి, సంతోష్‌రెడ్డి

వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి గంగారెడ్డి, సంతోష్‌రెడ్డి

Written By ysrcongress on Tuesday, January 10, 2012 | 1/10/2012

ఉదయం ఆర్మూరు బయల్దేరనున్న జగన్
పంజాగుట్టలో వైఎస్ విగ్రహానికి నివాళులు
మధ్యాహ్నానికల్లా వైఎస్సార్ దీక్షా ప్రాంగణానికి
దారి పొడవునా నేతల స్వాగత ఏర్పాట్లు
వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి గంగారెడ్డి, సంతోష్‌రెడ్డి

హైదరాబాద్/ఆర్మూర్ (నిజామాబాద్), న్యూస్‌లైన్: రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోరుతూ నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలో మంగళవారం నుంచి మూడు రోజుల పాటు వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టనున్న నిరాహార దీక్షకు అంతా సిద్ధమైంది. దీక్షలో పాల్గొనేందుకు మంగళవారం ఉదయం జగన్ హైదరాబాద్ నుంచి బయల్దేరతారు. ముందుగా ఉదయం 7 గంటలకు పంజాగుట్టలో తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అక్కణ్నుంచి నిజామాబాద్ మీదుగా మధ్యాహ్నం 12 గంటలకు ఆర్మూరు చేరుకుని, వైఎస్సార్ ప్రాంగణంలో దీక్ష ప్రారంభిస్తారు. 12వ తేదీన దీక్ష ముగుస్తుంది. ఆ సాయంత్రం నాలుగింటికి దీక్షా మైదానంలోనే బహిరంగ సభ జరుగుతుంది.

పూర్తయిన ఏర్పాట్లు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ నేతృత్వంలో దీక్షా ప్రాంగణం వద్ద ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. జగన్‌కు భారీగా స్వాగతం పలికేందుకు నేతలు, కార్యకర్తలు దారి పొడువునా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మాజీ ఎంపీ కె.గంగారెడ్డి, మాజీ మంత్రి శనిగరం సంతోష్‌రెడ్డి తదితర నాయకులు దీక్ష ప్రారంభం సందర్భంగా జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించారు.

తరలి రానున్న నేతలు: అనర్హత వేటు పడుతుందని తెలిసినా, రైతుల పక్షాన నిలిచి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసిన ఎమ్మెల్యేలు మంగళవారం రైతు దీక్షలో పాల్గొంటున్నారు. ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, కాపు రామచంద్రరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, కొండా సురేఖ, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ధర్మాన కృష్ణదాస్, గొల్ల బాబురావు, గుర్నాథరెడ్డి, చెన్నకేశవరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ప్రసాదరాజు, పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎం.సుచరిత, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, తెల్లం బాలరాజు, శ్రీనివాసులు, ఎమ్మెల్సీ కొండా మురళీ, ఎంపీలు సబ్బం హరి, మేకపాటి రాజమోహన్‌రెడ్డిలతో పాటు అంబటి రాంబాబు, సినీ నటి రోజా కూడా దీక్షలో పాల్గొంటారు.

అడ్డుకోవడం సరికాదు: గట్టు

రైతు దీక్షను అడ్డుకునే ప్రయత్నాలు సరికాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు అన్నారు. తెలంగాణ కోసం రాజీనామా చేసిన ఎమ్మెల్యేలపైనే పోటీకి ఉబలాటపడుతున్న టీడీపీ, కాంగ్రెస్‌లను ఏమీ అనకుండా.. ఈ ప్రాంత ఆకాంక్షలను గౌరవిస్తూ, ఉప ఎన్నికల్లో పోటీ పెట్టబోమని ప్రకటించిన జగన్‌ను అడ్డుకుంటామనడం ఏ మేరకు సబబని సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన ప్రశ్నించారు. ఆర్మూరు ఎర్ర జొన్న రైతుల సమస్యలను కూడా దృష్టిలో ఉంచుకుని ఆయన అక్కడ దీక్షకు పూనుకుంటున్నారన్నారు. దీక్షలో పాల్గొనేందుకు ఆర్మూరు చుట్టుపక్కల 60, 70 కిలోమీటర్ల దూరం నుంచీ రైతులు తరలి వస్తున్నట్టు వివరించారు. జగన్ తెలంగాణలో ప్రవేశిస్తే తమ పునాదులు కదులుతాయని టీడీపీ, కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారని, అందుకే కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. బాబులా ఆయనేమీ ఎన్నికల ప్రచారానికి వెళ్లడం లేదని గుర్తు చేశారు. ‘‘తెలంగాణవాదులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు. ఎవరైనా రెచ్చగొట్టినా వైఎస్సార్ కాంగ్రెస్ రెచ్చిపోదు. సంయమనంతో రైతు సమస్యలపై పోరాడతాం’’ అన్నారు.

నేడే వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి: సంతోష్‌రెడ్డి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు మాజీ మంత్రి సంతోష్‌రెడ్డి ప్రకటించారు. ఆర్మూరులో రైతు దీక్ష సభలో పార్టీ సభ్యత్వం తీసుకుంటానని స్పష్టం చేశారు. సోమవారం పార్టీ అధినేత జగన్‌ను ఆయన నివాసంలో కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతుదీక్షను నిజమాబాద్ జిల్లా చరిత్రలోనే కనీవినీ ఎరగని రీతిలో విజయవంతం చేస్తామన్నారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా రైతులకు విజ్ఞప్తి చేశారు. ‘‘జిల్లాలో పసుపు రైతుల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. వైఎస్ హయాంలో క్వింటాల్ రూ.18 వేలున్నది రూ.3,000కు పడిపోయింది. ఎర్రజొన్న రైతులకు ప్రభుత్వం రూ.10.8 కోట్ల బకాయి ఉంది’’ అన్నారు. దీక్ష ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వాటిని వసూలు చేయిస్తామన్నారు. దీక్షను అడ్డుకుంటామన్నప్రకటనలు సరికాదన్నారు.

అన్ని జాగ్రత్తలూ: ఐజీ

‘రైతు దీక్ష’కు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్టు హైదరాబాద్ రీజియన్ ఐజీ రాజీవ్ రతన్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ‘‘జగన్ పర్యటనను అడ్డుకుంటామన్న కొన్ని పార్టీల ప్రకటనల నేపథ్యంలో మరిన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. కరీంనగర్, మెదక్, వరంగల్ జిల్లాల సిబ్బందిని బందోబస్తుకు రప్పించాం. ఏపీఎస్పీ, ఆర్‌ఏఎఫ్‌నూ రంగంలోకి దించడానికి సిద్ధంగా ఉంచాం’’ అని వివరించారు. జగన్ ప్రయాణించే మార్గంలోనూ పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు.
Share this article :

0 comments: