జోనల్ మేనేజరుతో సీఎం కుమ్మక్కవుతారా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జోనల్ మేనేజరుతో సీఎం కుమ్మక్కవుతారా?

జోనల్ మేనేజరుతో సీఎం కుమ్మక్కవుతారా?

Written By ysrcongress on Sunday, April 1, 2012 | 4/01/2012

రూ.16 కోట్ల లబ్ధికి... రూ.30 కోట్ల ప్రతిఫలమట!

ఇదీ... చార్జిషీట్లో సీబీఐ మోపిన ప్రధాన అభియోగం
ప్రస్తుతానికి హెటెరో డ్రగ్స్, అరబిందో ఫార్మాలపైనే గురి
వాటికి జడ్చర్ల సెజ్‌లో భూములిచ్చినందుకే పెట్టుబడులట!
ఎకరా రూ.7 లక్షల చొప్పున లీజుకివ్వటం వల్ల రూ.12 కోట్ల నష్టమట.. అరబిందో 
తన భూమిని అనుబంధ సంస్థకు బదలాయించుకోవటమూ నేరమేనట
నాడు ‘ఈనాడు’లో ఏం రాశారో... నేడు చార్జిషీట్లోనూ అదే
దానికి జీవోలతో సహా ‘సాక్షి’ నాడే సమాధానమిచ్చినా పట్టని సీబీఐ
మరణించిన వ్యక్తి ఎలాగూ రాలేరనే ఆయనపై నిందలు .. నేరుగా అభాండాలు
కేసులో ఏమీ లేకున్నా సాగదీసి బురదజల్లడానికే కుయుక్తులు

(సాక్షి ప్రత్యేక ప్రతినిధి)
కోర్టుకు రాసిన లేఖ నుంచి... కోర్టుకిచ్చిన అభియోగపత్రం వరకూ అంతా కుట్రే. పక్కా పథకం ప్రకారం సాగిన కుతంత్రమే. దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఎలాగూ తిరిగి రాలేరు. ఎన్ని నిందలు మోపినా సమాధానం చెప్పుకోలేరు. సీబీఐకయినా... ఎల్లో సిండికేట్‌కయినా అదే ధైర్యం. అందుకే... నిండు సభలో ఆయన ఎదురొడ్డి తిప్పికొట్టిన విపక్షాల విమర్శలన్నిటినీ సీబీఐ తన చార్జిషీట్లో పొందుపరిచింది. నాడు జడ్చర్ల సెజ్‌పై వైఎస్‌తో పాటు మంత్రి గీతారెడ్డి ప్రభృతులంతా... కేటాయింపులన్నీ ప్రభుత్వ విధివిధానాల మేరకే జరిగాయని చెప్పిన వాస్తవాల్ని పక్కనపెట్టేసింది. రూ. 16 కోట్లు లబ్ధి చేకూర్చారని.. అందుకే ఆ కంపెనీలు రూ.30 కోట్లు ‘సాక్షి’లో పెట్టుబడులు పెట్టాయని.. అతకని అబద్ధాల్ని వినిపించింది. మొత్తమ్మీద సీబీఐ అభియోగపత్రం తేల్చిందొక్కటే. ఈ కేసులో ఏమీ లేదని! ఈ 9 నెలలూ తవ్వి వీళ్లు తేల్చిందేమీ లేదని. ఎలాగైనా కేసును ఇంకొన్నాళ్లు సాగదీసి... బురద జల్లే కార్యక్రమాన్ని మాత్రం ఎల్లో ఫెలోల సాయంతో కొనసాగిస్తారని...! ఇంకా స్పష్టంగా తేలిందేమిటంటే... ఈ దర్యాప్తు రిమోట్ ఢిల్లీలోనే ఉందని..! 

రూపాయి లబ్ధి చేకూర్చినందుకు... మూడు రూపాయలు ఎదురిస్తారా ఎవరైనా? ఇవ్వరనేది కామన్‌సెన్స్. ఇస్తారనటం నాన్సెన్స్. సీబీఐ తనది ఈ రెండవ సెన్సే అంటోంది. ‘టార్గెట్ వైఎస్సార్’ అజెండాతో ముందుకెళుతున్న దర్యాప్తు సంస్థ... కోర్టులకు, జనానికి కూడా ఆలోచించే శక్తి ఉంటుందన్న వాస్తవాన్ని విస్మరించేసింది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ఫార్మా సెజ్‌లో అరబిందో ఫార్మా, హెటెరో డ్రగ్స్‌లకు భూమిని కేటాయించటం ద్వారా ైవె .ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం వారికి లబ్ధి చేకూర్చిందని... అందుకు ప్రతిగానే వారు ‘సాక్షి’ గ్రూపులో పెట్టుబడులు పెట్టారని శనివారం దాఖలు చేసిన చార్జిషీట్లో సీబీఐ ప్రధానంగా పేర్కొంది. ఇలా భూములు కేటాయించటం వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.16 కోట్ల మేర నష్టం వాటిల్లిందంటూ... అందుకు ప్రతిఫలంగా ఆ కంపెనీలు ‘సాక్షి’ గ్రూపులో 29.5 కోట్లు పెట్టుబడి పెట్టాయని పేర్కొంది. దీన్ని క్విడ్ ప్రోక్వోగా అభివర్ణించింది. ఇక్కడ గమనించాల్సిందొక్కటే. గడిచిన తొమ్మిది నెలలుగా సీబీఐ కొండను తవ్వుతూనే ఉంది. రాజకీయ పక్షాలు, ‘ఈనాడు’, దాని తోకలు అందించిన మందుగుండు సాయంతో రెచ్చిపోయి మరీ తవ్వింది. ఏమీ దొరక్క చివరికో చచ్చిన ఎలుకను పట్టుకుంది. విధిలేక దాన్నే ఓ అద్భుతమైన ఖనిజమంటూ నమ్మించే కసరత్తు మొదలెట్టింది. ఇదీ... ‘సాక్షి’ పెట్టుబడుల వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు తీరు. 

సీబీఐ ప్రధాన అభియోగమిదీ...

‘‘హెటెరో డ్రగ్స్, హెటెరో ల్యాబ్స్, హెటెరో హెల్త్‌కేర్ వంటి కంపెనీలున్న హెటెరో గ్రూప్... సాక్షి గ్రూపులో మొత్తంగా 19.50 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. అరబిందో ఫార్మా కూడా జగతి పబ్లికేషన్స్‌లో రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఈ రెండింటికీ విశాఖపట్నం జిల్లా నక్కపల్లిలో ప్రత్యేక ఆర్థిక మండళ్లను కేటాయించటంతో పాటు జడ్చర్ల సెజ్‌లో భూముల్ని కేటాయించారు’’ ఇదీ సీబీఐ ఛార్జిషీట్లో మోపిన ప్రధాన అభియోగం. మరి దీన్లో నిజమెంత?

ఇదెక్కడైనా సాధ్యమా?

16 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చారని... అందుకు ప్రతిగా ఆ కంపెనీలు రూ.29.5 కోట్లు ‘సాక్షి’లో పెట్టుబడి పెట్టాయని సీబీఐ చేస్తున్న వాదన ఏమాత్రమైనా నమ్మేదిగా ఉందా? అసలిందులో తర్కం ఏ కోశాన్నయినా ఉందా? అసలు ఆ భూముల కేటాయింపు ద్వారా ఆయా కంపెనీలకు రూ.16.5 కోట్లు లబ్ధి కలిగిందనటం నిజమేనా?

నిజంగా ఆ మేరకు లబ్ధి కలిగిందా? ఓ సారి చూస్తే...

జడ్చర్ల సెజ్‌లో అరబిందో ఫార్మా, హెటిరో డ్రగ్స్‌కు తలా 75 ఎకరాలను ఎకరా రూ.7 లక్షల చొప్పున పాతికేళ్ల పాటు లీజుకిచ్చిన మాట వాస్తవమే. దీనికి ధరల నిర్ణాయక కమిటీ ఎకరాకు రూ.15 లక్షల్ని నిర్ణయించి ఉండొచ్చు కూడా. కానీ ప్రభుత్వం రూ.7 లక్షలకు కేటాయించడానికి కూడా సహేతుకమైన కారణాలున్నాయి. ఎక్కడైనా ఏపీఐఐసీ ఏ కంపెనీకి భూమి కేటాయించినా చుట్టూ కంచె, మధ్యలో రోడ్లు, ఇతరత్రా సదుపాయాల్ని కల్పించి ఇస్తుంది. జడ్చర్లలో మాత్రం ఈ రెండు కంపెనీలకూ అభివృద్ధి చేయని భూమిని అప్పగించారు. చుట్టూ కంచె వేసుకోవటంతో పాటు రోడ్ల నిర్మాణాన్నీ ఈ కంపెనీలే చేపట్టాయి. దీంతో పాటు ఇక్కడ భూ సేకరణ ద్వారా నిర్వాసితులైన వారికి సహాయ పునరావాసాల్ని కల్పించే బాధ్యత కూడా ఈ కంపెనీలే తీసుకున్నాయి. పెపైచ్చు 250 ఎకరాల సెజ్‌లో ఏ సంస్థలూ ముందుకు రాకపోయేటప్పటికి... యాంకర్ యూనిట్లుగా ఇవి వస్తే మిగతా వాటికి మార్గం సుగమమవుతుందని భావించి ఈ కేటాయింపులు చేశారు. మరి వాటికి కంచె వేయటానికి, రోడ్లు, ఇతరత్రా మౌలిక సదుపాయాలు కల్పించడానికి వేరే ఖర్చులవకుండా ఉంటాయా? సీబీఐ గనక నిజాయతీగా తన దర్యాప్తును చేసి ఉంటే ఆ మొత్తాన్ని కూడా కలపాలిగా? ఈ అంశాల్ని కూడా ఛార్జిషీట్లో ప్రస్తావించాలిగా? మరి విస్మరించిందెందుకు? అడ్డగోలు అబద్ధాలెందుకు?

ఇదీ... సీబీఐ చె ప్పిన కథ

జడ్చర్లలో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి చేయటానికి ఏపీఐఐసీ 954 ఎకరాల్ని సేకరించింది. నాటి ఏపీఐఐసీ ఎండీగా ఉన్న బి.పి.ఆచార్య... దీన్లో 250 ఎకరాల్ని ప్రత్యేక ఆర్థిక మండలికి కేటాయిస్తే బాగుంటుందని ప్రతిపాదించారు. 2006 అక్టోబర్ 27న కేంద్ర వాణిజ్య శాఖ అనుమతినిచ్చింది. తరవాత ఏపీఐఐసీలోని ధరల నిర్ణాయక కమిటీ దీనికి ధరను నిర్ణయిస్తూ... 2006 డిసెంబర్ 31లోపు గడువును నిర్దేశించి ఎకరా రూ.15 లక్షల చొప్పున కేటాయించవచ్చని, లేదంటే యాంకర్ యూనిట్లను ప్రోత్సహించేందుకు 50 ఎకరాలు కేటాయించొచ్చని... వీటిలో ఏది ముందయితే అది చేయాలని సూచించింది. తరవాత డిసెంబరు 27న మళ్లీ భేటీ అయి 15 లక్షల ధరను ఎకరాకు రూ.20.23 లక్షలకు సవరించింది. అయితే ధర సవరించకముందే... అంటే 2006 నవంబర్ 17నే అరబిందో ఫార్మా ఎండీ కె.నిత్యానందరెడ్డి, హెటెరో డెరైక్టరు ఎం.శ్రీనివాసరెడ్డి తమకు తలా 75 ఎకరాలు కావాలంటూ ఏపీఐఐసీకి లేఖ రాశారు. ఎకరా రూ.7 లక్షల చొప్పున కేటాయించాలంటూ దాన్లో 10 శాతం మొత్తాన్ని ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ) కింద చెక్కు కూడా ఇచ్చారు. దాన్ని కిందిస్థాయి అధికారులు ఆమోదించి ఏపీఐఐసీ ఎండీకి పంపారు. ఆయన దాన్ని చూసి... ఆఫర్ లెటర్లు సిద్ధం చేయాలని వారికి ఆదేశాలిచ్చారు. 

‘‘ధరల నిర్ణాయక కమిటీ చెప్పినట్లుగా ఎకరా రూ.15 లక్షలకు కేటాయించి ఉంటే ఎకరాకు మరో రూ.8 లక్షలు వచ్చి ఉండేది. అలా చేయకపోవటం వల్ల ఏపీఐఐసీకి మొత్తమ్మీద 150 ఎకరాలపై రూ.12.26 కోట్ల నష్టం వచ్చినట్లు కాగ్ కూడా గతంలో చెప్పింది. మరోవంక మెదక్ జిల్లా పాశమైలారంలోని ఈపీఐపీలో అరబిందోకు 33.33 ఎకరాలు కేటాయించారు. కానీ దీన్ని అరబిందో సంస్థ ట్రైడెంట్ లైఫ్ సెన్సైస్‌కు బదలాయించింది. ట్రైడెంట్‌కు ఏపీఐఐసీ నేరుగా ఇచ్చి ఉంటే నాటి ధర ప్రకారం చదరపు మీటరు రూ.500కు ఇవ్వాల్సి ఉండేది. కానీ అరబిందోనే బదలాయించటం వల్ల దానికి చదరపు మీటరు రూ.150 చొప్పున దక్కినట్లయింది. తద్వారా దానికి రూ.4.3 కోట్ల అనుచిత లబ్ధి కలిగింది. ఇదండీ.. సీబీఐ చెప్పిన కథ. నక్కపల్లి సెజ్‌లో ఈ రెండు కంపెనీలకూ భూములు కేటాయించారని చెప్పిన సీబీఐ.. తన చార్జిషీట్లో దాని వివరాల్ని ప్రస్తావించలేదు. మొత్తమ్మీద ఏపీఐఐసీ ఈ భూముల్ని తక్కువకు విక్రయించటం ద్వారా ఆయా కంపెనీలకు రూ.16.56 కోట్ల లబ్ధి చేకూరినట్లు తేల్చింది. అందుకు ప్రతిగా ఆ కంపెనీలు సాక్షి గ్రూపులో రూ.29.5 కోట్లు పెట్టుబడిగా పెట్టాయని అభియోగం మోపింది. 

చార్జిషీట్లో... ‘ఈనాడు’ కథనం!

‘బోనులో బీపీ ఆచార్య’ అంటూ 2011 జనవరిలో ‘ఈనాడు’లో ఓ కథనం అచ్చయింది. జడ్చర్ల సెజ్‌లో హెటిరో, అరబిందో సంస్థలకు తక్కువ ధరకే భూములు కేటాయించినా లీ ఫార్మా అనే సంస్థకు మాత్రం ఎకరా రూ.33 లక్షల ధర నిర్ణయించారని ‘ఈనాడు’ అప్పట్లో వాపోయింది. లీ సంస్థ ఈ రెండింటికన్నా ముందే ధరఖాస్తు చేసుకున్నా దాన్ని అనుమతించలేదని పేర్కొంది. ఇదంతా సీబీఐ విచారణలో తేలినట్టుగా రాసి పారేసింది. దానికి సమాధానంగా ఆ నెల 8న ‘సాక్షి’ పూర్తి వివరాలు అందించింది. అవేంటంటే...

1) అరబిందో, హెటిరో సంస్థలకు 2006 నవంబరు 17న చెరో 75 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఇవి లీ ఫార్మా కన్నా ముందే దరఖాస్తు చేసుకున్నాయి. 2) లీ ఫార్మాకు కూడా 2006 నవంబరు 28న అది కోరిన 10 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఆఫర్ లెటర్ ఇచ్చారు. 3) లీ సంస్థకు ఆఫర్ చేసిన ధర రూ.10 లక్షలు. అంతేతప్ప రూ.33 లక్షలు కాదు. 4) ఎకరా రూ.10 లక్షలుగా నిర్ణయించడానికి కారణం... చుట్టూ కంచె వేయటం, రోడ్ల వంటి మౌలిక సదుపాయాలు కల్పించటం... ఇవన్నీ ఈ పదెకరాలకూ ఏపీఐఐసీనే చేస్తుంది. అందుకే ఎకరాకు రూ.3 లక్షలు అదనంగా పేర్కొంది.

అదీ అసలు విషయం. 

ఇవన్నీ విస్మరించిన ‘ఈనాడు’ అదేదో మహా పాతకమైనట్లుగా కథనం వండి పారేసింది. చిత్రమేమిటంటే ప్రస్తుత సీబీఐ చార్జిషీట్లో అక్షరం పొల్లుపోకుండా ‘ఈనాడు’ కథనాన్ని ఆంగ్లంలోకి తర్జుమా చేయటం!! సీబీఐతో ఎల్లో సిండికేట్ సాగిస్తున్న దోస్తీకి ఇంతకన్నా ఆధారాలేం కావాలి? మున్ముందు ఎల్లో బుర్రల్లో ఏం పుడుతుందో... ఈ దర్యాప్తు కూడా అన్ని మలుపులు తిరుగుతుందని చెప్పటానికి ఇంతకన్నా రుజువులేం కావాలి?

అనుబంధ కంపెనీకి బదలాయించటమూ లబ్ధేనా?

అరబిందో సంస్థ తన అనుబంధ కంపెనీకి భూమిని బదలాయించటం వల్ల కూడా ఏపీఐఐసీకి నష్టం వచ్చినట్లు చూపిం చిన సీబీఐ... దాన్ని కూడా క్విడ్ ప్రో క్వోకు సాక్ష్యంగా తీసుకోవటం దేనికి పరాకాష్టన్నది ఆ సంస్థకే తెలియాలి. ఎందుకంటే ట్రైడెంట్ లైఫ్‌సెన్సైస్ సంస్థ అరబిందోకు అనుబంధం కాదని ఒకచోట పేర్కొన్న సీబీఐ... అనుబంధ సంస్థో కాదో తెలియటం లేదని మరోచోట పేర్కొంది. నిజానికి ట్రైడెంట్ పూర్తిగా అరబిందోకు అనుబంధమని గతంలోనే పలు పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. 2009 చివర్లో వాటాదారుల ఆమోదంతో ఇది అరబిందోలో విలీనమైపోయింది కూడా. 

జోనల్ మేనేజరుతో సీఎం కుమ్మక్కవుతారా?

ఈ బదలాయింపునకు సంబంధించి సీబీఐ చెప్పిన కథ వింటే ఆశ్చర్యమనిపిస్తుంది. జోనల్ మేనేజరు స్థాయి వ్యక్తి సీఎంతో కలిసి కుట్రపన్నారనే స్థాయికి సీబీఐ దిగజారిపోయిందని తెలిసి బాధనిపిస్తుంది. అదెలాగంటే... ట్రైడెంట్ లైఫ్‌సెన్సైస్ సంస్థ అరబిందోకు పూర్తి అనుబంధమని కె.నాగరాజు అనే ఛార్టర్డ్ అకౌంటెంట్ ఇచ్చిన సర్టిఫికెట్‌ను నాటి ఏపీఐఐసీ జోనల్ మేనేజరు తీసుకున్నారట. మిగిలిన ధ్రువపత్రాలు లేకున్నా ఓకే చేసేశారట. ఈయన ఓకే చేయటం వల్లే అరబిందో తన భూమిని ట్రైడెంట్‌కు బదలాయించిందని, దానివల్లే ఏపీఐఐసీకి నష్టం వచ్చిందని... ఈ రకంగా లబ్ధి పొందింది కాబట్టే అరబిందో పెట్టుబడి పెట్టిందంటూ బోడిగుండుకూ- మోకాలుకూ ముడివేసే ప్రయత్నం చేశారు. వినటానికే వింతనిపిస్తోంది కదూ!!!.
Share this article :

0 comments: