ఇండియా సిమెంట్‌కు 1996లోనే 0.013 టీఎంసీ కేటాయించిన టీడీపీ ప్రభుత్వం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇండియా సిమెంట్‌కు 1996లోనే 0.013 టీఎంసీ కేటాయించిన టీడీపీ ప్రభుత్వం

ఇండియా సిమెంట్‌కు 1996లోనే 0.013 టీఎంసీ కేటాయించిన టీడీపీ ప్రభుత్వం

Written By ysrcongress on Saturday, January 7, 2012 | 1/07/2012

జగన్ కేసులో ఆద్యంతం వివక్షపూరితంగా సీబీఐ వైఖరి!
‘నిర్ధారిత ఎజెండా’ మేరకే ఏకపక్షంగా సాగుతున్న విచారణ
ఇండియా సిమెంట్‌కు వైఎస్ హయాంలో నీటి కేటాయింపులపై వైఖరే నిదర్శనం
ప్రతిగా జగన్ కంపెనీల్లో ఆ సంస్థ రూ.140 కోట్లు పెట్టిందంటూ అసంబద్ధ వాదనలు
ఇండియా సిమెంట్‌కు 1996లోనే 0.013 టీఎంసీ కేటాయించిన టీడీపీ ప్రభుత్వం
ఆ మేరకు జీవో 244 జారీ.. ఈ వాస్తవాన్ని ఉద్దేశపూర్వకంగానే ‘విస్మరించిన’ సీబీఐ
2009 నాటి ఉత్తర్వుల్లో స్పష్టంగా ‘244 జీవో’ ప్రస్తావన.. అయినా పట్టించుకోని సంస్థ
ఎలాగైనా వైఎస్‌ను, ఆయన తనయుడు జగన్‌ను అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యం
అందుకోసం ప్రభుత్వ విధానాలకూ యథేచ్ఛగా దురుద్దేశాలు ఆపాదిస్తున్న సీబీఐ

ఇండియా సిమెంట్ (అప్పట్లో విశాఖ ఇండస్ట్రీస్) కంపెనీకి 1996లో చంద్రబాబు ప్రభుత్వం 0.013 టీఎంసీ నీటిని కేటాయించింది. ఆ మేరకు జీవో ఎంఎస్ నంబర్ 244ను జారీ చేసింది.2009లో... ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం పెరిగినందున నీటి కేటాయింపు పెంచాలన్న ఇండియా సిమెంట్ అభ్యర్థన మేరకు మరో 0.013 టీఎంసీని వైఎస్ ప్రభుత్వం కేటాయించింది. తద్వారా టీడీపీ ప్రభుత్వ విధానాన్నే కొనసాగించింది. ఆ మేరకు ఇచ్చిన ఉత్తర్వుల్లో కూడా, 1996లో బాబు హయాంలో ఇచ్చిన 244 జీవోను స్పష్టంగా ప్రస్తావించింది!

అయినా సరే.. వైఎస్ ప్రభుత్వ కేటాయింపులు సీబీఐకి తప్పుగా కన్పించాయి. ఇవి కచ్చితంగా ‘క్విడ్ ప్రొ కో’ వ్యవహారమేనని ఆ సంస్థ తేల్చేసింది! అంతకు రెండేళ్ల ముందు, అంటే 2007లో జగన్ కంపెనీల్లో ఇండియా సిమెంట్ పెట్టిన పెట్టుబడులకు బదులుగా ఈ కేటాయింపులు జరిగాయని తనకు తానుగా నిర్ణయానికి వచ్చేసింది. పైగా ఈ కేటాయింపులు అంతర్రాష్ట్ర జల విధానాలకే విరుద్ధమంటూ కోర్టులో బల్లగుద్ది మరీ వాదిస్తోంది. అంతేకాదు, వైఎస్ ప్రభుత్వం ఏకంగా 13 టీఎంసీలు కేటాయించిందంటూ న్యాయస్థానాన్నే తప్పుదోవ పట్టించింది!

- కానీ, 1996లో బాబు సర్కారు చేసిన అవే కేటాయింపుల్లో మాత్రం సీబీఐకి ఎలాంటి తప్పూ కన్పించలేదు. అంతేకాదు, అసలు ఆ కేటాయింపే దేశంలోకెల్లా అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ నిఘా నేత్రానికి ‘కన్పించలేదు’!

నిజానిజాలను నిగ్గుదేల్చేందుకు నిష్పాక్షికంగా దర్యాప్తు చేయాల్సిన కేంద్ర సంస్థ వైఖరిలో... రెండు ప్రభుత్వాలు తీసుకున్న ఒకే తరహా నిర్ణయాల పట్ల ఇంతటి ద్వంద్వ ప్రమాణాలెందుకు? ఈ వైఖరి తాలూకు ఆంతర్యమేమిటి? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తుల కేసులో సీబీఐ అనుసరిస్తున్న ఈ తీరు పట్ల న్యాయనిపుణులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తు పేరుతో ఆ సంస్థ వేస్తున్న ప్రతి అడుగులోనూ కసి, తీసుకుంటున్న ప్రతి చర్యలోనూ కక్షపూరిత వైఖరి కొట్టొచ్చినట్టుగా కన్పిస్తూనే ఉన్నాయని వారంటున్నారు. ఇండియా సిమెంట్ ఉదంతం దీనికి మరింతగా బలం చేకూరుస్తోందని అభిప్రాయపడుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ను, ఆయన కుమారుడు జగన్‌ను ఎలాగైనా సరే అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యంగా సీబీఐ దర్యాప్తు సాగుతోందన్న అభిప్రాయం ఇప్పటికే సర్వత్రా నెలకొన్న విషయం తెలిసిందే. అధికార కాంగ్రెస్, విపక్ష టీడీపీలకు కావాల్సినట్టుగా, అచ్చంగా ఆ పార్టీలు కోరుకుంటున్న రీతిలోనే విచారణ సాగుతోందని సీబీఐ వ్యవహార శైలి కూడా అసందిగ్ధంగా ధ్రువపరుస్తూనే వస్తోంది.

పాత విధానాన్నే కొనసాగించినా...

రాష్ట్రంలో ఏర్పాటైన పరిశ్రమలకు నీటి వసతి కల్పించడం ప్రభుత్వ విధి విధానాల్లో భాగం. తాండూరు ప్లాంటులో ఉత్పత్తి సామర్థ్యం పెరిగినందున అదనపు నీటి సౌకర్యం కల్పించాలని ఇండియా సిమెంట్ 2009లో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆ మేరకు కాగ్నా నది నుంచి ఫ్యాక్టరీకి మరో 0.013 టీఎంసీ నీటిని కేటాయిస్తూ 2009 ఆగస్టులో వైఎస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఫ్యాక్టరీకి తొలుత 1996లో బాబు అధికారంలోకి రాగానే 0.013 టీఎంసీని కేటాయించడాన్ని జీవో నంబరుతో పాటు ఆ ఉత్తర్వుల్లో స్పష్టంగా ప్రస్తావించారు. 

అయినా టీడీపీ హయాం నాటి ఈ కేటాయింపులు సీబీఐకి అసలు కన్పించనే లేదు. కానీ, వాటికి కొనసాగింపుగా, అంతే పరిమాణంలో వైఎస్ ప్రభుత్వం చేసిన కేటాయింపు మాత్రం ‘క్విడ్ ప్రొ కో’గా దర్యాప్తు సంస్థకు తోచింది. 2007లో జగతి పబ్లికేషన్స్‌లో ఆ సంస్థ పెట్టిన పెట్టుబడులనే అందుకు సాక్ష్యంగా ప్రస్తావించింది. ప్రభుత్వ విధి విధానాల్లో భాగంగా, అదీ గత ప్రభుత్వ విధానాన్ని కొనసాగించినందుకు ప్రతిగా, సాక్షిలో ఇండియా సిమెంట్స్ రూ.140 కోట్లు పెట్టిందని ఆరోపించింది. అదే నిజమనుకుంటే, తొలుత నీటిని కేటాయించినందుకు ప్రతిఫలంగా సీబీఐ లెక్క ప్రకారం బాబు ప్రభుత్వం ఎంత తీసుకున్నట్టు? కానీ ఇండియా సిమెంట్‌కు బాబు సర్కారు చేసిన నీటి కేటాయింపులను సీబీఐ అసలు పట్టించుకోవడమే లేదు. అంటే ఆ నిర్ణయంలో తప్పేమీ లేదని భావిస్తున్నట్టేనా? అలాంటప్పుడు, అచ్చంగా అదే విధానాన్ని తరవాతి ప్రభుత్వం కొనసాగిస్తే అది క్విడ్ ప్రొ కో ఎలా అవుతుంది? ఒకవేళ, 2004-09 మధ్య జరిగిన వ్యవహారాలపైనే దర్యాప్తు చేయాలన్న హైకోర్టు ఆదేశాల కారణంగా, 1996 నాటి నీటి కేటాయింపుల గురించి సీబీఐ పట్టించుకోవడం లేదా? అలాగైతే జగన్ కేసులో మాత్రం అవసరం లేకపోయినా 2004కు ముందు పరిణామాలను ఎందుకు దర్యాప్తు పరిధిలోకి తీసుకొస్తున్నట్టు? ఈ ప్రశ్నలకు సీబీఐ ఏమని సమాధానం చెబుతుంది?

ఓఎంసీ కేసులోనేమో అలా...

టీడీపీ ఆరోపణల ఆధారంగా విచారణ సాగిస్తున్న సీబీఐకి, ఆ పార్టీ హయాంలో తీసుకున్న నిర్ణయాలు మాత్రం పట్టడం లేదెందుకు? ఎల్లో మీడియా రాతల ఆధారంగా 2004కు ముందు నాటి జగన్ వ్యాపార కార్యకలాపాలను భూతద్దంలో చూస్తున్న దర్యాప్తు సంస్థ, ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉంది? ఎమ్మార్ కుంభకోణం, ఓబుళాపురం మైనింగ్ ఉదంతాల్లో సీఎంగా చంద్రబాబు పాత్రను సంస్థ ఎందుకు శోధించడం లేదు? ఈ విషయమై జగన్ స్వయంగా జీవో కాపీని అందజేసినా కూడా సీబీఐ మౌనముద్ర దాల్చడం వెనక కారణమేమిటి? ఓబుళాపురం మైనింగ్ బిడ్‌లో 15వ స్థానంలో నిలిచిన వ్యక్తి, బిడ్‌లో పాల్గొనొద్దంటూ జగన్ తనను బెదిరించారంటూ వాంగ్మూలమివ్వగానే సీబీఐ హడావుడి చేసింది. బిడ్‌లో తొలి స్థానంలో ఉండి ఉపసంహరించుకున్న, లేదా రెండో స్థానంలో ఉన్న వ్యక్తి ఆరోపించారంటే సరే అనుకోవచ్చు. 

కానీ, 15వ స్థానంలో ఉన్న వ్యక్తి ఫిర్యాదు చేయడమే ఆలస్యం.. ‘సాక్ష్యమివ్వండి’ అంటూ దానిపై హుటాహుటిన జగన్‌కు నోటీసులిచ్చి మరీ ఆయన వాంగ్మూలాన్ని సీబీఐ నమోదు చేసింది! 2002లోనే బాబు హయాంలోనే ఓఎంసీకి లీజు బదిలీ అయిందని వాంగ్మూలమిస్తూ జగన్ పేర్కొన్నారు. సంబంధిత జీవో కాపీతో సహా ఈ విషయాన్ని స్వయంగా సీబీఐ దృష్టికి తెచ్చారు. మరి, సీబీఐ ఆరోపిస్తున్నట్టు ఓబుళాపురంలో అక్రమ మైనింగ్ జరిగితే, కేసును దాని మూలాల నుంచి పరిశోధించాల్సిన బాధ్యత ఆ సంస్థది కాదా? అలాంటప్పుడు, బాబు హయాంలోనే జనార్దనరెడ్డికి లీజు బదిలీ అయిందని ఆధారాలతో సహా వెల్లడైనా పట్టించుకోలేదేం? బాబును కనీసం దీనిపై ప్రశ్నించలేదేం? జగన్ ఆస్తుల కేసులో 2004 నుంచి విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించినా, అంతకుముందు నాటి వ్యాపార కార్యకలాపాలపై విచారణ చేస్తున్న సీబీఐ... ఎమ్మార్, ఓఎంసీ వ్యవహారాలకూ అదే ప్రాతిపదికను ఎందుకు వర్తింపజేయడం లేదు?

ఎమ్మార్‌లోనూ అంతే...

ఎమ్మార్ అనే దుబాయ్ సంస్థకు భూములు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నది చంద్రబాబు ప్రభుత్వం. దానితో ఒప్పందం కుదుర్చుకున్నదీ చంద్రబాబు సర్కారే. ఏపీఐఐసీ ప్రమేయం లేకుండా థర్డ్ పార్టీతో ఒప్పందం కుదుర్చుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చంటూ ఒప్పందం జరిగిపోయింది కూడా టీడీపీ హయాంలోనే. నిర్దిష్ట కారణాలు లేకుండా ఆ ఒప్పందంలో జోక్యం చేసుకునే అధికారం ఏపీఐఐసీకి లేదంటూ స్పష్టంగా పేర్కొన్న కారణంగానే స్టైలిష్ హోం ఏర్పాటైంది. ఎమ్మార్ కుంభకోణానికి మూలం ఈ స్టైలిష్ హోమే! అయినా సరే, ఈ ఉదంతంలోనూ నాటి సీఎం చంద్రబాబును సీబీఐ కనీసం విచారించను కూడా లేదు. 

ఓఎంసీ, ఎమ్మార్ వంటి రెండు ప్రధాన కేసుల్లో టీడీపీ ప్రభుత్వ పాత్ర స్పష్టంగా కనిపిస్తున్నా, అటువైపు కనీసం కన్నెత్తి చూడటానికి కూడా సీబీఐకి మనసొప్పడం లేదు. వైఎస్ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యంగా సీబీఐ దర్యాప్తు సాగుతోందని ఈ భిన్నమైన వైఖరులు చెప్పకనే చెబుతున్నాయని సీబీఐలో సుదీర్ఘకాలం పని చేసిన విశ్రాంత ఐపీఎస్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ‘సీబీఐ దర్యాప్తు జరుగుతున్న తీరు చూసి నేను ఖిన్నుడనయ్యా. ఓఎంసీ వ్యవహారంలో చంద్రబాబు పాత్రను తక్కువ చేసి చూపేందుకు సీబీఐ ఉన్నతాధికారి ఒక ఆంగ్ల దినపత్రికతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా పరిగణించదగ్గవి. ముందే కూడబలుక్కుని చేస్తున్న వ్యవహారంగా దీనిని పరిగణించి చూడక తప్పదు’ అని ఆయనన్నారు.
- న్యూస్‌లైన్, హైదరాబాద్

సీబీఐ ‘నీటి’మాటలు

మీకు నీళ్లు కావాలి. హైదరాబాద్‌లో ఫోన్ చేస్తే ఇంటికి నేరుగా ట్యాంకర్ వస్తుంది. రూ.250 చెల్లిస్తే 5000 లీటర్లను మీరు చెప్పినచోట గుమ్మరించి వెళుతుంది. అంటే... లీటర్‌కు మీరు చెల్లిస్తున్నది 5 పైసలు. 
ఈ లెక్కన ఇండియా సిమెంట్స్‌కు రంగారెడ్డి జిల్లాలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం కేటాయించిన నీటి విలువెంత? 0.013 టీఎంసీలంటే సెకనుకు ప్రవహించేది 11.5 లీటర్లు. ఇదేనీరు 365 రోజులూ 24 గంటలూ ప్రవహిస్తే ఏడాదికి పంపే మొత్తం నీరు 36,26,64,000 లీటర్లు. లీటరు 5 పై. చొప్పున లెక్కిస్తే అయ్యే మొత్తం రూ.1.81 కోట్లు. 

మరి ఏడాదికి రూ.1.81 కోట్లు చెల్లిస్తే పోయేదానికి ఎవరైనా ఏకమొత్తంగా రూ.140 కోట్లు చెల్లిస్తారా? ఈ 140 కోట్లను కనీసం బ్యాంకులో డిపాజిట్ చేసినా... కనిష్టంగా 8 శాతం వడ్డీ వచ్చినా ఏడాదికి రూ.11.2 కోట్లు వస్తుంది కదా!! దాన్లో మహా అయితే 2 కోట్లు పడేస్తే పని అయిపోతుందిగా! ఇంకా అసలు మొత్తం అలాగే ఉండటంతో పాటు ఏటా రూ.9.2 కోట్లు ఆదాయం కూడా ఉంటుందిగా!! బుర్ర ఉన్న ఏ పారిశ్రామికవేత్త అయినా ఇలాగే ఆలోచిస్తాడు. దేశంలో అగ్రగామి సంస్థయిన ఇండియా సిమెంట్స్‌కు ఈ మాత్రం తెలివి లేదనుకోవాలా? లేక తమ వ్యాపార నిర్ణయాల్లో భాగంగానే వారు ‘సాక్షి’లో పెట్టుబడి పెట్టారనుకోవాలా? ఏ కాస్త ఆలోచించేవారైనా ఈ రెండోదే కరెక్టని తేలిగ్గానే ఊహిస్తారనుకోండి!!.

13 టీఎంసీలంటే మాటలా...?

సీబీఐ కోర్టులో వాదిస్తూ వైఎస్ ప్రభుత్వం 13 టీఎంసీలు కేటాయించిందని చెప్పినట్టు పలు పత్రికలు పేర్కొన్నాయి. అదే నిజమైతే అంతకన్నా అన్యాయమైన వాదనేమైనా ఉంటుందా? అసలు 13 టీఎంసీలంటే మాటలా...!! 75 లక్షల జనాభా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మొత్తానికే ఏడాదికి 12 టీఎంసీలు సరిపోతోంది. అదికూడా కృష్ణా తొలి, రెండవ దశల్లోను... హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్, సింగూరు, మంజీర అన్ని జలాశయాలను కలిపితే ఇంత నీరొస్తోంది. మరి రంగారెడ్డి జిల్లాలో ఇండియా సిమెంట్స్‌కు 13 టీఎంసీలిచ్చే జలాశయం ఎక్కడుంది? కనీసం ఇలాంటి వాదనలు చేసేటపుడైనా, రాసేటపుడైనా ఒకసారి సరిచూసుకోవాల్సిన అవసరం లేదా..? లేక చనిపోయిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి వచ్చి ఎలాగూ వివరణ ఇవ్వలేరు కదా అనే ధీమాతో నోటికొచ్చినట్టు ఇలాగే అభాండాలు వేస్తుంటారా...?
Share this article :

0 comments: