‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పత్రికకు వైఎస్ జగన్ బహిరంగలేఖ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పత్రికకు వైఎస్ జగన్ బహిరంగలేఖ

‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పత్రికకు వైఎస్ జగన్ బహిరంగలేఖ

Written By ysrcongress on Monday, January 2, 2012 | 1/02/2012

కొత్త సంవత్సరం తొలిరోజునే... నా ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతో మీ పత్రిక పనిగట్టుకుని ఓ కట్టుకథను పతాక శీర్షికగా ప్రచురించటం బాధాకరం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో ఓ ఎల్లో సిండికేట్ నామీద బురద చల్లటమే ధ్యేయంగా... తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూర్చటమే లక్ష్యంగా పనిచేస్తుండటం ఈ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైన విషయమే. నా మీదే కాదు, గతంలో దివంగత నేత, నా తండ్రిగారైన స్వర్గీయ వై.ఎస్.రాజశేఖరరెడ్డిగారిపైనా ఈ సిండికేట్ కట్టుకథల కనికట్టు విద్యల్నే ప్రయోగించింది. పేదవాడి కన్నీరు తుడిచేందుకు, కష్టాల్ని రూపుమాపేందుకు అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలుచేసిన జనరంజక నాయకుడాయన. ప్రజాక్షేత్రంలో ఆయన్ను ప్రత్యక్షంగా ఎదుర్కొనే దమ్ములేని ఈ సిండికేట్... తప్పుడు ప్రచారాలే ఆయుధంగా పోరాడి పలుమార్లు భంగపడింది. 

తెలుగుదేశం పార్టీ, ఓ రెండు తెలుగు దినపత్రికలు, మరో మూడు తెలుగు చానెళ్ల్లు ఈ సిండికేట్‌లో భాగస్వాములు. రాజశేఖరరెడ్డి గారు చనిపోయాక కూడా ఈ సిండికేట్ ఆయనపై నిందారోపణలు మానలేదు. ఆయన సమాధానం చెప్పే స్థితిలో లేడని తెలిసి కూడా... ఆయన కీర్తి ప్రతిష్టల మీద దాడి చేయాల్సిన అవసరం లేదు. కానీ వారు పదేపదే ఆ దాడిని కొనసాగిస్తున్నదెందుకో తెలుసా!? ఆయన ఆశయాలే వారసత్వంగా రూపుదిద్దుకున్న ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’ని ఓడించాలంటే ఈ గోబెల్స్ తరహా దొంగ యుద్ధమే మార్గమన్నది వారి నిశ్చితాభిప్రాయం కాబట్టి!!. 

ఇప్పుడు ఈ సిండికేట్ మరింత బలం పుంజుకుంది. రాష్ట్రాన్నేలుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ రూపంలో వారికో కొత్త మిత్రుడు దొరికాడు. కోర్టుల్లో తప్పుడు కేసులు వేయించడం దగ్గర నుంచి, మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయించటం దాకా ఈ సిండికేట్ పక్కా పథకంతో, స్పష్టమైన అవగాహనతో పని చేస్తోంది. నాకు మనస్తాపం కలిగించిన విషయమేంటంటే ఒక జాతీయ స్థాయి పత్రికైన మీ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కూడా ఈ కూటమిలో భాగస్వామి కావటం. తెలుగుదేశం పార్టీ ఎలా కావాలనుకుంటే అలా మీ పత్రికలో కథనాలు వెలువడటం. అగ్రశ్రేణి పత్రిక అయి ఉండీ తెలుగుదేశం పార్టీ చేతిలో పావుగా మారిపోవటం. 

నేనింత తీవ్రమైన ఆరోపణ చేస్తున్నది ఇవ్వాళ ఒక్కరోజున నాకు వ్యతిరేకంగా వచ్చిన ఏదో ఒక వార్తను దృష్టిలో పెట్టుకుని కానేకాదు. స్వయంగా మీడియా సంస్థను నిర్వహిస్తున్న వాడిని... పత్రికా స్వాతంత్య్రం వర్థిల్లాలని త్రికరణ శుద్ధిగా విశ్వసిస్తున్న వాడిని... ప్రజాస్వామ్యం కోసం, ప్రజా క్షేమం కోసం, పత్రికా స్వేచ్ఛ పరిఢవిల్లాలని కాంక్షించే వాడిని నేను. అలాంటి నేను మీ పత్రిక ఎల్లో సిండికేట్‌లో భాగమైందని ఆరోపిస్తున్నానంటే అది తొందరపాటు వ్యాఖ్య కాజాలదని మీరు అర్థం చేసుకోగలరనే అనుకుంటాను. గడిచిన కొంతకాలంగా నా ప్రతిష్టను, మా పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా తరచు మీ పత్రికలో కట్టుకథనాలు వస్తూనే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు నామీద ఎటువంటి ప్రచారం చేస్తున్నారో... నాకు వ్యతిరేకంగా ఎలాంటి సందేశాన్ని ప్రజల్లోకి పంపించాలనుకుంటున్నారో దానికి అనుగుణమైన కథనాలు మీ పత్రికలో వస్తూనే ఉన్నాయి. పెపైచ్చు మాపై కథనం రాస్తున్నపుడు ఏనాడు కూడా మా వివరణ తీసుకోవాలన్న సృ్పహే మీ ప్రతినిధులకు రావటం లేదు. 


పాత కథనాల సంగతి వదిలేద్దాం. జనవరి ఒకటవ తేదీన జగమంతా కోటి ఆశలతో కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటున్న వేళ మీ పత్రికలో వచ్చిన పతాక కథనం మరోసారి గమనించండి!!. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి నేను ప్రయత్నిస్తున్నానట!! దాని కోసం నవంబర్ 18న ఢిల్లీకి వచ్చి నా సన్నిహితులైన ఎంపీలు దీపేందర్‌సింగ్ హుడా, అసదుద్దీన్ ఒవైసీల ద్వారా రాయబారం నడిపానట!! సీబీఐ కేసులో అరెస్ట్ చేయకుండా ఉంటే 2014 ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేయడానికి సిద్ధంగా ఉన్నానట!!. ముఖ్యమంత్రి పదవి కూడా నాకు ఇస్తారట!! ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే నవంబర్ 16 నుంచి డిసెంబర్ 2 వరకు నేను గుంటూరు జిల్లాలో రెండో విడత ఓదార్పు యాత్రలో ఉన్నాను. మరి నవంబరు 18న ఢిల్లీలో వారిని కలవటం ఎలా సాధ్యం? ఇక దీపేందర్‌సింగ్ హుడాను కలిసి ఆరు మాసాలైంది. అది కూడా పార్లమెంటులో పలకరించుకోవటం తప్ప, ప్రత్యేకించి ఒక సీరియస్ అంశంపై మాట్లాడుకున్నదెన్నడూ లేదు. ఇక అసదుద్దీన్ ఒవైసీ మా రాష్ట్రానికి చెందిన ఎంపీ. నా మిత్రుడు. నేను పార్లమెంటుకు వచ్చిన ప్రతిసారీ మేం సెంట్రల్ హాల్లో మాట్లాడుకుంటూనే ఉంటాం. అందులో దాపరికమేమీ ఉండదు. అసలు ఢిల్లీలోనే లేని నాపై ఇంత కట్టుకథను మీ పత్రికలో ఎలా అల్లగలిగారో నాకైతే అర్థం కావడం లేదు.

ఇంత తీవ్రమైన ఆరోపణ చేస్తూ కథనం రాస్తున్నపుడు మా పార్టీ ప్రముఖులను గానీ, నన్ను గానీ వివరణ కోరే ప్రయత్నం కూడా మీ ప్రతినిధి చేయలేదు. ఈ కథనంలోని అంశాలు ఎంత హాస్యాస్పదమో జరుగుతున్న పరిణామాల్ని గమనించగలిగే ఇంగిత జ్ఞానం ఉన్న ఎవ్వరికైనా తేలిగ్గానే అర్థమవుతుంది. 

రాజశేఖరరెడ్డి మరణం తరవాత... ఇద్దరు ముఖ్యమంత్రుల, రెండున్నరేళ్ల కాంగ్రెస్ పరిపాలనలో వ్యవసాయ రంగం దారుణంగా క్షీణించిందని... రైతులు, రైతు కూలీల బతుకులు బజారు పాలయ్యాయని... ప్రజారోగ్య సేవలపై నిర్లక్ష్యం వహిస్తున్నారని... పేదల చదువును అటకెక్కిస్తున్నారని... పింఛన్లనివ్వక వృద్ధుల్ని సతాయిస్తున్నారని అనేక ఉద్యమాలు నిర్వహించింది మేము. దాదాపు ప్రతి అంశంపైనా నిరాహార దీక్షలు చేపట్టింది నేను. అయినా ఫలితం లేకపోవటంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బంగాళా ఖాతంలో కలిపేయాలని పిలుపునిచ్చిందీ నేనే. ఇలాంటి ప్రభుత్వానికి ఒక్క క్షణం కూడా అధికారంలో కొనసాగే నైతికార్హత లేదని ఎలుగెత్తింది కూడా నేనే తప్ప ప్రతిపక్ష నేతగా చలామణి అవుతున్న చంద్రబాబు నాయుడు కాదు. 

కాంగ్రెస్‌తో అంటకాగుతున్న చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి... తప్పించుకోలేని పరిస్థితిని కల్పించి అవిశ్వాస తీర్మానం పెట్టించింది కూడా మేమే. అవిశ్వాసం నెగ్గి ప్రభుత్వం పడిపోయే పరిస్థితి లేదని తెలిసినా... విలువలకు, విశ్వసనీయతకు పెద్దపీట వేస్తూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 17 మంది ఎమ్మెల్యేలు పదవుల్ని తృణప్రాయంగా భావించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలిచారు. వారు మా పార్టీ వారని సగర్వంగా చెబుతున్న నేను... కాంగ్రెస్‌తో కలిసిపోతానంటే... పార్టీని విలీనం చేస్తానంటే ఏ ఒక్కరైనా నమ్మే పరిస్థితి ఉందా? ఇవన్నీ నవ్విపోయే కథలు కావా? రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా క్షీణించి... ఫీజులు కట్టలేని స్థితిలో వరలక్ష్మి అనే విద్యార్థిని మరణించిన సందర్భంలో... అవిశ్వాసం పెట్టమంటూ ఆరు నెలల కిందటే పిలుపునిచ్చాం. అప్పుడూ రైతాంగం, రైతుకూలీల పరిస్థితి ఇంతే దారుణంగా ఉంది. వరుస తుపానులతో అతలాకుతలమైన రైతు క్రాప్ హాలిడే ప్రకటించి ప్రభుత్వంపై గళమెత్తిన సందర్భమది. ప్రభుత్వం ఏ కొంచెం పట్టించుకోని పరిస్థితి. అప్పటికింకా కాంగ్రెస్‌లో పీఆర్పీ విలీనం కాలేదు. 

అవిశ్వాసం పెడితే ప్రభుత్వం పడిపోతుందని గమనించిన చంద్రబాబు... ప్రభుత్వాన్ని కాపాడాలన్న ఏకైక లక్ష్యంతో దానికి నో అన్నారు. ఇపుడు పీఆర్పీ కాంగ్రెస్‌లో విలీనమయ్యాక... ప్రభుత్వమెలాగూ కూలిపోయే పరిస్థితి లేదని తెలుసుకున్నాక... అవిశ్వాసం పెట్టి తమ భుజాలు తామే చరుచుకుంటున్నారు. దీన్నిబట్టి అర్థమవుతున్నదేమిటి? కాంగ్రెస్‌లో కలిసిపోయే అవకాశమున్నది ఎవరికి? ఆ పార్టీతో చేతులు కలిపి... దాన్ని కాపాడుతూ అంటకాగుతున్న తెలుగుదేశానికా... లేక కాంగ్రెస్‌ను ఎదిరించి ఎన్నికలకు సైతం సిద్ధమైన మా పార్టీకా? మరి ఎన్నడైనా మీ పత్రికలో తెలుగు దేశం పార్టీకి సంబంధించి ఇలాంటి కథనాలు వచ్చాయా? కారణమేంటో మీకు ఇప్పటికైనా తేలిగ్గా అర్థమవటం లేదా?

కాంగ్రెస్-తెలుగుదేశం పార్టీల దోస్తీకి సంబంధించి ఇటీవలి కాలంలో రాష్ట్రంలో ఎన్నెన్నో దృష్టాంతాలు బయటపడ్డాయి. రైతులకోసమంటూ సభలో అవిశ్వాసం పెట్టినపుడు చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో నిందించిందంతా రెండున్నరేళ్ల కిందట మరణించిన దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డిని కాదా? ఎందుకాయన ప్రస్తుత ప్రభుత్వాన్ని ఇంతలా వెనకేసుకొస్తున్నారు? ఈ ప్రభుత్వం ప్రిజమ్ సిమెంట్స్‌కు కారు చౌకగా వెయ్యి ఎకరాల భూ సంతర్పణ చేస్తే దాన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు ఒక్క మాటైనా మాట్లాడలేదేం? రోశయ్య ప్రభుత్వం నగరం నడిబొడ్డున అమీర్‌పేటలో భూ సంతర్పణ చేస్తే కనీసం దాని ఊసైనా ఎత్తలేదేం? కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిని నిలబెట్టకపోవటానికి కారణం కాంగ్రెస్‌తో కుదిరిన ఒప్పందం కాదా? చిత్తూరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి అనుకూలంగా ఓట్లేయించలేదా? బాన్సువాడ ఉపఎన్నికల్లో పోటీ చేయకుండా తమకు బలమున్న గ్రామాల్లో కాంగ్రెస్‌కు ఓట్లు వేయించిన విషయం కౌంటింగ్‌లో బయటపడలేదా? సాక్షాత్తూ కాంగ్రెస్ పార్టీ, బాబు కుమ్మక్కయి న్యాయ వ్యవస్థ ప్రతిష్టను నడిబజార్లో నిలబెట్టలేదా? ఇవన్నీ కాంగ్రెస్‌కు టీడీపీకి ఉన్న దోస్తీని... కాంగ్రెస్‌లో టీడీపీ విలీనమయ్యే అవకాశాలను... కళ్లకు కట్టడం లేదా? ఇన్ని జరిగినా వారి మైత్రిపై మీ పత్రికలో ఒక్క కథనం కూడా రాలేదెందుకని? బాబుకు అనుకూలంగా... మాకు వ్యతిరేకంగా ఆయన ఏది రాయించాలనుకుంటే అది మీ పత్రికలో ఎలా అచ్చవుతోంది? 

మరో విషయం! సీబీఐ విచారణ నేపథ్యంలో నేను అరెస్టును తప్పించుకోవటం కోసమే కాంగ్రెస్‌తో రాయబారాలు జరుపుతున్నానని, అందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దాన్లో కలిపేస్తానని మీ కథనం సారాంశం. అరెస్టును తప్పించుకోవాల్సిన అవసరం నాకేమొచ్చింది? నేనేం నేరం చేశానని? ఓ పత్రిక నడపటమే నేను చేసిన నేరమన్నట్లు ఎల్లో సిండికేట్ వేసిన తప్పుడు కేసులో నాపై దర్యాప్తు సాగుతోంది. సాగనివ్వండి. మేం ఆరంభించిన పత్రిక దేశం మొత్తమ్మీద 9వ స్థానానికి చేరటం ఎల్లో సిండికేట్ కడుపు మంటను మరింత పెంచుతోంది. పెరగనివ్వండి. సాక్షి పత్రిక సర్క్యులేషన్ తాజా ఏబీసీ ప్రకారం 14.5 లక్షలు. తాజా ఐఆర్‌ఎస్ ప్రకారం మొత్తం పాఠకుల సంఖ్య కోటి 40 లక్షలు. 

ఈ విజయగాథ చెప్పడంలేదా మేం స్థాపించినది ఏదో ఆషామాషీ మీడియా సంస్థ కాదని... ఇందులో పెట్టుబడులు పెట్టినవారు అల్లాటప్పాగా పెట్టలేదని... మాపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని? ‘సాక్షి’లానే సర్క్యులేషన్ ఉన్న ‘ఈనాడు’ పేపరు మా కన్నా రెట్టింపు వాల్యుయేషన్‌తో 100 రూపాయల షేరును రూ.5,28,630కు అమ్మితే తప్పులేనిది... అందులో సగం వాల్యుయేషన్‌తో మా దగ్గర కొందరు పెట్టుబడులు పెడితే అది తప్పెలా అవుతుంది? నేను చేయని నేరానికి... నన్ను అరెస్టు చేయొద్దంటూ రాయబారాలు సాగించాల్సిన ఖర్మ నాకేముంటుంది? అందుకోసం ఏకంగా పార్టీని విలీనం చేస్తాననేంత అవసరం నాకెందుకుంటుంది? ఇలాంటివి కనీసం సృ్పహలోకే రానట్లుగా తోచింది రాసేసి... పతాక శీర్షికలో అచ్చువేసినందుకే నా బాధ. 

కాంగ్రెస్‌తో మేం కుమ్మక్కయ్యామంటూ... ఏనాటికైనా మేం కాంగ్రెస్‌లో కలిసిపోతామంటూ రెండు రోజులుగా చంద్రబాబు నాయుడు చేస్తున్న దౌర్భాగ్య ప్రచారం... మీ పత్రికలో మీ సొంత కథనంగా ప్రచురితమైనందుకే నా అభ్యంతరమంతా!! అయినా ముఖ్యమంత్రి పదవంటూ నా నొసటన రాసి ఉంటే అది ఇచ్చేది దేవుడు. ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ ప్రభుత్వం మాదవుతుంది. నేను నమ్ముతున్నది ప్రజల్ని. నేను కోరుకుంటున్నది వారి సంక్షేమాన్ని. నాకు పదవంటూ వస్తే అది ప్రజల నుంచే తప్ప ఢిల్లీ పెద్దల దయాదాక్షిణ్యాలతో కానేకాదు. ఇవన్నీ చెప్పటానికే ఈ లేఖ రాస్తున్నా. ఇకనైనా నా బాధను, అభ్యంతరాలను అర్థం చేసుకుంటారని ఆశిస్తూ... నాకు వ్యతిరేకంగా చంద్రబాబు అమలుచేస్తున్న ఎజెండాలో మీరు భాగం కావద్దని అభ్యర్థిస్తూ... 

మీ 




(వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి)


జయదీప్ బోస్, ఎడిటోరియల్ డెరైక్టర్ (ది టైమ్స్ గ్రూప్)ను ఉద్దేశించి వైఎస్ జగన్ రాసిన బహిరంగ లేఖ.

ఇదీ.. టైమ్స్ కథనం సారాంశం
‘జగన్స్ ఆలివ్ బ్రాంచ్ టు కాంగ్రెస్’ అనే పతాక శీర్షికతో టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన కథనం సారాంశం ఒక్కటే. మైనింగ్ కేసులో గాలి జనార్థనరెడ్డి అరెస్టయినట్లే... ఆస్తుల కేసులో తాను కూడా అరెస్టవుతానని వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి భయం పట్టుకుందని...! అందుకోసం ఓ ఇద్దరు ఎంపీల ద్వారా కాంగ్రెస్‌తో సంధికి ప్రయత్నాలు చేశారని, దానిపై కాంగ్రెస్ ఇంకా అధికారికంగా స్పందించలేదని. సంధి ఒప్పందంలో భాగంగా 2014 ఎన్నికలకు ముందే తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని, అందుకు ప్రతిగా కాంగ్రెస్ పార్టీ జగన్‌మోహన్‌రెడ్డికి ముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వవచ్చనేది ఈ కథనం సారాంశం. అందుకోసమే పీఆర్పీ నేతలను మంత్రివర్గంలో చేర్చుకోకుండా దూరంగా ఉంచుతున్నారని కూడా కథనం అల్లేశారు.
Share this article :

0 comments: