బరిలో దిగుతున్న నాగం, రాజేశ్వరరెడ్డి భార్య టీఆర్‌ఎస్ అభ్యర్థులు కాదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బరిలో దిగుతున్న నాగం, రాజేశ్వరరెడ్డి భార్య టీఆర్‌ఎస్ అభ్యర్థులు కాదు

బరిలో దిగుతున్న నాగం, రాజేశ్వరరెడ్డి భార్య టీఆర్‌ఎస్ అభ్యర్థులు కాదు

Written By ysrcongress on Sunday, January 1, 2012 | 1/01/2012

*తెలంగాణలో పోటీ చేయబోమన్న జగన్ ప్రకటనతో కలకలం
*టీఆర్‌ఎస్‌తో మ్యాచ్‌ఫిక్సింగ్ అని ప్రచారం చేయండంటూ కాంగ్రెస్ నేతలకు కిరణ్, తమ్ముళ్లకు చంద్రబాబు ఆదేశాలు
*బలమైన ఆకాంక్షను గౌరవించేందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం
*బరిలో దిగుతున్న నాగం, రాజేశ్వరరెడ్డి భార్య టీఆర్‌ఎస్ అభ్యర్థులు కాదు
*వైఎస్సార్ కాంగ్రెస్ తరఫునే పోటీ చేయనున్న కొండా సురేఖ
*వాస్తవాలిలా ఉన్నా కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్న కాంగ్రెస్, టీడీపీ
*ఎమ్మెల్సీ, స్థానిక ఎన్నికల్లో పరస్పరం అంటకాగిన చరిత్ర ఆ పార్టీలది...

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్న (దొంగలే ‘దొంగా!’ అన్నట్టుగా) సామెతను అధికార కాంగ్రెస్, విపక్ష టీడీపీ మరోసారి నిస్సిగ్గుగా నిజం చేసి చూపిస్తున్నాయి! రెండేళ్లుగా నిత్యం తెరచాటు కుమ్మక్కులతో అంటకాగుతూ, రాష్ట్రంలో నీతిబాహ్య రాజకీయాలకు పరాకాష్టగా, మ్యాచ్‌ఫిక్సింగులకు మరో పేరుగా నిలిచిన ఆ రెండు పార్టీలకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత తాజా ప్రకటన వెన్నులో చలి పుట్టిస్తోంది. ప్రత్యేక రాష్ట్రం కోసం బలమైన ఆకాంక్షతో తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో వారిపై పోటీ పెట్టబోమని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడం కాంగ్రెస్, టీడీపీల్లో తీవ్ర కలకలం సృష్టించింది. ఇది తమ రాజకీయ ప్రయోజనాలకు భారీ దెబ్బ అని బెంబేలెత్తుతున్న ఆ పార్టీలు, ఆయన ప్రకటనకు శాయశక్తులా వక్రభాష్యాలతో దుష్ర్పచారం చేసే వ్యూహానికి తెర తీశాయి. ఆ క్రమంలో టీఆర్‌ఎస్‌తో వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఫిక్సింగ్ అంటూ హాస్యాస్పద ఆరోపణలకు తెగబడుతున్నాయి!

రాజీనామా చేసిన తెలంగాణ ఎమ్మెల్యేలు ఏ పార్టీ తరఫున బరిలో దిగినా పోటీ పెట్టరాదని స్వార్థపూరిత, అవకాశవాద రాజకీయాలకు దూరంగా, నైతిక విలువలతో కూడిన సూత్రబద్ధమైన నిర్ణయం తీసుకున్నట్టు జగన్ శుక్రవారం స్పష్టం చేయడం తెలిసిందే. ప్రజా శ్రేణులు ఇందుకు హర్షిస్తాయన్న విశ్వాసాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. కానీ కాంగ్రెస్, టీడీపీలు మాత్రం ఆ ప్రకటనలో కూడా రాజకీయ కోణం వెదుకుతూ కోడిగుడ్డుపై ఈకలు పీకే పనిలో పడ్డాయి. ఈ అంశంపై జగన్‌కు వ్యతిరేకంగా ముమ్మరంగా ప్రచారం చేయాల్సిందిగా సీఎం కిరణ్ శనివారం కాంగ్రెస్ నేతలను పిలిచి మరీ ఆదేశించారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా మీడియా కమిటీ సమావేశం నిర్వహించి, టీఆర్‌ఎస్‌తో జగన్ మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకున్నారంటూ ప్రచారం చేయాల్సిందిగా నేతలందరికీ చెప్పారు.

రెండేళ్లుగా మూడు ఫిక్సింగులు, ఆరు కుమ్మక్కులుగా సాగుతున్న కాంగ్రెస్, టీడీపీ... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఇలా ఫిక్సింగ్ ఆరోపణలకు దిగి మరింతగా నవ్వుల పాలవుతున్నాయని ఆ పార్టీల నేతలే వ్యాఖ్యానిస్తున్నారు! అదీగాక అసలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఒకటైతే.. కాంగ్రెస్, టీడీపీ నేతలు మాత్రం అందుకు ఏ మాత్రమూ సంబంధం లేని ఆరోపణలు గుప్పిస్తూ అవగాహన రాహిత్యాన్ని బయట పెట్టుకుంటున్నారని రాజకీయ పరిశీలకులు కూడా అభిప్రాయపడుతున్నారు. 

‘‘తెలంగాణలో ఉప ఎన్నికలు జరిగే ఆరు అసెంబ్లీ స్థానాలకు ప్రాతినిధ్యం వహించింది కాంగ్రెస్, టీడీపీ వారే. వారిలో నలుగురు టీఆర్‌ఎస్‌లో చేరగా, నాగం జనార్దనరెడ్డి సొంత పార్టీ పెట్టుకుని పోటీ చేస్తున్నారు. స్వతంత్రునిగా గెలిచిన రాజేశ్వర్‌రెడ్డి ఆకస్మికంగా మరణించారు. ఇలాంటప్పుడు మృతుల కుటుంబం నుంచి బరిలో దిగే వారికి మద్దతిచ్చే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఆయన భార్యకు మద్దతిస్తామని జగన్ ప్రకటించారు. ఈ వ్యవహారంలో టీఆర్‌ఎస్‌తో మ్యాచ్ ఫిక్సింగ్‌గా చెప్పేందుకు అసలేముందో కాంగ్రెస్, టీడీపీ నేతలే చెప్పాలి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని అమితంగా అభిమానించే ఎమ్మెల్యే కొండా సురేఖ, తెలంగాణపై కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ గతంలోనే రాజీనామా చేశారు. 

తాజాగా అవిశ్వాస తీర్మానం సందర్భంగా కూడా తెలంగాణపై తన వైఖరిని వెల్లడించి మరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారామె. ఆది నుంచీ వైఎస్సార్ కాంగ్రెస్ వెన్నంటి ఉన్న సురేఖ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరిగితే ఆమెనే బరిలో దించుతామని ఆ పార్టీ నేతలు ప్రకటించారు’’ అని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. ఈ వాస్తవాలతో నిమిత్తమే లేకుండా జగన్ ప్రకటనపై వీలైనన్ని వక్రీకరణలతో పబ్బం గడుపుకునేందుకు కాంగ్రెస్, టీడీపీ వృథాగా ప్రయాస పడుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఇదేమీ తమ పార్టీ ఇప్పుడు కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదని, బాన్సువాడ ఉప ఎన్నిక సందర్భంలోనూ ఇలాగే సూత్రబద్ధ వైఖరిని ప్రకటించి పోటీ పెట్టలేదని గుర్తు చేస్తున్నారు. 

‘నైతికతకు పెద్దపీట వేసి సూత్రబద్ధ నిర్ణయాలు తీసుకున్న చరిత్రే కాంగ్రెస్, టీడీపీలకు లేదని అందరికీ తెలుసు. ఇతర పార్టీలు తీసుకునే అలాంటి నిర్ణయాలను గౌరవించే నైజం కూడా తమకు లేదని తాజాగా అవి రుజువు చేసుకుంటున్నాయి’’ అని వారు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ ప్రకటనలో స్పష్టత ఉందని, ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానమూ లేదని టీడీపీ, కాంగ్రెస్ నేతలు కూడా ప్రైవేటు సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. ‘కాకపోతే ఆ ప్రకటనతో రాజకీయంగా కలిగే నష్టాన్ని తగ్గించుకోవడంతో పాటు మాపై ఉన్న ఫిక్సింగ్ మచ్చను చెరుపుకునే ప్రయత్నంలో జగన్‌పై ఇలాంటి విమర్శలకు దిగుతున్నాం’ అని ఆ నేతలు పేర్కొంటున్నారు!

రెండేళ్లుగా కాంగ్రెస్‌కు తందానా
రోశయ్య సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి పరోక్షంగా, పలుమార్లు ప్రత్యక్షంగా కూడా చంద్రబాబు సహకరిస్తూ వస్తున్నారు. కిరణ్ సీఎం అయ్యాక జరిగిన స్థానిక సంస్థల ఎమ్మె ల్సీ ఎన్నికల్లో... అప్పటిదాకా ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న టీడీపీ, కాంగ్రెస్ బహిరంగంగానే సహకరించుకున్న వైనాన్ని రాష్ట్రమంతా విస్తుపోయి చూసింది! ఇక చిత్తూరు, కడప జిల్లాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనైతే ఆ రెండు పార్టీలూ బాహాటంగానే మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకున్నాయి. కాంగ్రెస్‌కు మద్దతుగా కడపలో టీడీపీ అసలు అభ్యర్థినే నిలపలేదు. సీఎం, చంద్రబాబుల సొంత జిల్లా అయిన చిత్తూరులోనేమో పరస్పరం ఓట్లు వేసుకున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి అయితే తనకు ద్వితీయ ప్రాధాన్యతా ఓటు వేయాల్సిందిగా నేరుగా టీడీపీ క్యాంపులోకి వెళ్లి మరీ ప్రచారం చేశారు! 

నెల్లూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి పునరావృతమైంది. ఎమ్మెల్యేల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనేమో టీడీపీ ఎమ్మెల్యేలు తమ ప్రాధాన్యతా ఓట్లను కాంగ్రెస్ అభ్యర్థులకు వేశారు. ఇదేమని విలేకరులు ప్రశ్నిస్తే, వ్యూహంలో భాగమంటూ పొంతన లేని సమాధానంతో చంద్రబాబు సమర్థించుకున్నారు. బాన్సువాడ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్, కాం గ్రెస్ పోటీ చేసినా టీడీ పీ దూరంగా ఉంది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తే బాబు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఇక 2010 డిసెంబర్‌లో రైతు సమస్యలపై నిరవధిక దీక్ష చేసిన ఆయన, అవసరమైతే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తానన్నారు. కానీ, కాంగ్రెస్‌లో పీఆర్‌పీ విలీనమై, ప్రభుత్వానికి ఇక ఎలాంటి ఢోకా లేదని నిర్ధారణకు వచ్చాక, వైఎస్సార్ కాంగ్రెస్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకుని అవిశ్వాసం పెట్టారు!

బలమైన ఆకాంక్ష మేరకే: బాజిరెడ్డి
హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌ను గౌరవిస్తామని ఇడుపులపాయలో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్లీనరీలోనే జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారని పార్టీ అధికార ప్రతినిధి బాజిరెడ్డి గోవర్ధన్ గుర్తు చేశారు. ‘‘ప్రజల ఆకాంక్ష మేరకు, తెలంగాణ కోసం రాజీనామా చేసిన వారి స్థానాల్లో వారికే కేటాయించాలని జగన్ నిర్ణయించారు. 6 అసెంబ్లీ స్థానాలకు రాజీనామా చేసిన తెలంగాణ ఎమ్మెల్యేలు ఒక బలమైన ఆకాంక్షతో పదవులు వదులుకున్నారు. కాబట్టి వారిని గౌరవించాలనే ఉద్దేశంతోనే వారు ఏ పార్టీ నుంచి రంగంలోకి దిగినా పోటీ పెట్టరాదని పార్టీ నిర్ణయించినట్టు ప్రకటనలో జగన్ స్పష్టంగా పేర్కొన్నారు’’ అన్నారు. బాజిరెడ్డి శనివారం ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

‘‘రైతుల కోసం శాసనసభ్యత్వాలను వదులుకునేందుకు సిద్ధపడ్డ ఎమ్మెల్యేల స్థానాల్లో జరగబోయే ఉప ఎన్నికల్లో కూడా పదవులు వదులుకున్న వారినే పోటీకి నిలపాలని నిర్ణయించాం. ఇలాంటి దృఢమైన నిర్ణయం తీసుకునే సాహసాన్ని ఏ పార్టీలూ చేయలేవు’’ అని ఆయనన్నారు. ఉప ఎన్నికల్లో కొండా సురేఖ వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తారన్నారు. తెలంగాణ జేఏసీ పిలుపు మేరకే ఆమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారని గుర్తు చేశారు. ఆమెపై పోటీ చేయవద్దని టీఆర్‌ఎస్‌ను కోరలేదన్నారు. దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది టీఆర్‌ఎస్సేనని, అది వారిష్టమని చెప్పారు.
Share this article :

0 comments: