వాహనాలపై పన్నుల పంజా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వాహనాలపై పన్నుల పంజా

వాహనాలపై పన్నుల పంజా

Written By ysrcongress on Sunday, January 1, 2012 | 1/01/2012

* ఎడాపెడా పన్నులు, అడ్డగోలు చార్జీలతో సామాన్యుడి నడ్డి విరిచేందుకు సర్కారు సిద్ధం
* కరెంటు చార్జీలు, ఆస్తిపన్ను.. వ్యాట్.. మద్యం ధరలు అన్నీ పైపైకే
* ఒక్క కరెంటు భారమే రూ.14 వేల కోట్ల పైచిలుకు..
* చుక్కలు చూడనున్న విత్తన ధరలు 
* వాహనాలపై పన్నుల పంజా
* పేదలపైనా కనికరం లేదు..

‘ముందుంది మరింత మంచి కాలం..’’ అంటూ రాష్ట్ర సర్కారు ప్రకటనలతో హోరెత్తిస్తోంది! అవును.. ఇది నిజమే. ముందుంది అంతా సర్కారుకు మంచికాలమే!! జనానికే అది ‘ముంచే’ కాలంగా మారబోతోంది. ఎందుకంటారా..? కొత్త సంవత్సరంలో కనీవినీ ఎరుగని రీతిలో పన్నులు, చార్జీల మోత మోగబోతోంది. పేద, సామాన్య, ధనిక తేడా లేకుండా అన్ని వర్గాలను పీల్చి పిప్పి చేయనున్నారు. కరెంటు చార్జీలు.. ఇంధన సర్దుబాటు చార్జీలు.. వాహనాలపై జీవిత పన్ను.. ఆస్తి పన్ను.. మద్యంపై వ్యాట్.. విత్తనాల రేట్లు.. ఇలా ఏది దొరికితే దాన్ని ఎడాపెడా పెంచేశారు. ఫలితంగా కొత్త సంవత్సరంలో జనంపై వెయ్యి కాదు.. రెండు వేలు కాదు.. ఏకంగా రూ. 18 వేల కోట్లకు పైగా భారం పడనుంది. ఇది రాష్ట్ర ప్రజలకు సర్కారు ఇచ్చే న్యూ ఇయర్ గిఫ్ట్!!

హైదరాబాద్, న్యూస్‌లైన్: కొత్త సంవత్సరంలో ఇంధన సర్దుబాటు చార్జీల రూపంలో అన్ని రకాల విద్యుత్ వినియోగదారులపై రూ.9,500 కోట్ల మేర భారం పడనుంది. ఈ భారం 2008-09 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2011-12) అర్ధ సంవత్సరానికి మాత్రమే. మరో అర్ధ సంవత్సరం ఇంధన సర్దుబాటు చార్జీలను తర్వాత లెక్కించి వినియోగదారులపై మోపనున్నారు. వీటితోపాటు ఏప్రిల్ నుంచి కరెంటు చార్జీల పెంపు అమల్లోకి రానుంది. దీంతో జనంపై మరో రూ.5 వేల కోట్ల భారం పడనుంది. అంటే ఒక్క కరెంటు చార్జీల భారమే రూ.14,500 కోట్ల దాకా ఉండబోతోందన్నమాట! 

2008-09 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గృహ వినియోగదారులపై వేయాల్సిన ఇంధన సర్దుబాటు చార్జీలు రూ.500 కోట్లను భరించేందుకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిఅంగీకరించడంతో ఆ మేర వినియోగదారులపై భారం తగ్గింది. లేదంటే ఆ రూ.500 కోట్లను కూడా కలిపితే మొత్తం భారం రూ.15,000 కోట్లకే చేరి ఉండేది. ఇంధన సర్దుబాటు చార్జీలను పేద, ధనిక తేడా లేకుండా అన్ని వర్గాల నుంచి వసూలు చేయనున్నారు. చివరికి 50 యూనిట్లలోపు కరెంటు వినియోగించే పేదలను కూడా వదల్లేదు. ఈ ఇంధన సర్దుబాటు చార్జీల మోత కారణంగా సగటున వంద యూనిట్లు వాడే వారందరిపై అదనంగా రూ.84 భారం పడనుంది!

వాహనాలపై పన్నులు సిద్ధం..
ఇప్పటికే ప్రతిపాదనల రూపంలో సిద్ధంగా ఉన్న వాహనాల జీవితకాల పన్ను పెంపు కూడా కొత్త సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది. ఇకపై ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలు కొనుగోలు చేసే వారిపై జీవితకాల పన్ను పెంపు ద్వారా వారిపై రూ.1000 కోట్ల భారం పడనుంది. ప్రస్తుతం ద్విచక్ర వాహనాలపై జీవితకాల పన్ను 9 శాతంగా ఉంది. ఇక నుంచి ద్విచక్ర వాహనాలను మూడు విభాగాలుగా విభజించి మరీ పన్నులతో బాదనున్నారు. లక్ష రూపాయలలోపు వాహనాలపై జీవితకాల పన్నును 12 శాతానికి, లక్షకు పైబడిన వాహనాలపై 18 శాతానికి, 250 సీసీ వాహనాలపై 20 శాతానికి పెంచనున్నారు. 

అలాగే ప్రస్తుతం రూ.10 లక్షల లోపు ఉన్న నాలుగు చక్రాల వాహనాలపై 12 శాతంగా ఉన్న జీవిత పన్నును 14 శాతానికి పెంచనున్నారు. పది లక్షల రూపాయలపైబడిన నాలుగు చక్రాల వాహనాలపై జీవితకాల పన్నును 18 శాతం పెంచారు. రూ.7.5 లక్షలు అంతకంటే ఎక్కువ విలువైన కార్లు కొనుగోలు చేసిన వారికి కనీసం రూ.25 వేలు, గరిష్టంగా లక్ష రూపాయల దాకా భారం పడ నుంది. ఆటోలు, ట్రాక్టర్లు, తేలిక పాటి సరుకు రవాణా వాహనాలనూ వదల్లేదు. ప్రస్తుతం వీటికి అమలవుతున్న ‘క్వార్టర్లీ’ పన్నును జీవితకాల పన్ను పరిధిలోకి తీసుకురానున్నారు.

మద్యానికి మస్తు కిక్కు..!
మద్యం విక్రయాలపై ప్రస్తుతం 70 శాతం ఉన్న వ్యాట్‌ను వంద శాతానికి పెంచనున్నారు. ఇందుకు సంబంధించి ఆర్థిక శాఖ ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ఇది అమల్లోకి వస్తే మద్యం ప్రియులపై అదనంగా రూ.1,500 కోట్ల భారం పడనుంది. అంటే మద్యం ప్రియులు ఇప్పటి ధరలకంటే అదనంగా 30 శాతం ఖర్చు చేయాల్సి ఉంటుందన్నమాట! అంటే.. ప్రస్తుతం మందుకోసం సగటున రోజుకు రూ.100 ఖర్చు చేసేవారు.. ఇకపై రూ.130 చెల్లించుకోవాల్సి వస్తుంది.

రైతన్నకు విత్తన ముప్పు...
విత్తనాల ధరలు పెంచాలంటూ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. ప్రస్తుతం రూ.930 ఉన్న బీటీ-2 పత్తి విత్తనాల ధరను కనీసం రూ.1,000కి పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు వ్యవసాయ శాఖ జనవరి 7న సమావేశం నిర్వహిస్తోంది. విత్తన కంపెనీల డిమాండ్‌కు తలొగ్గి విత్తన రేట్లను వెయ్యికి పెంచితే 450 గ్రాముల పత్తి విత్తన ప్యాకెట్‌పై రూ.70 పెరుగుతుంది. దీనివల్ల పత్తిరైతులపై రూ.120 కోట్ల భారం పడుతుంది.

ఆస్తి పన్ను ఆకాశానికి...
ఆస్తి పన్ను అయితే ఏకంగా 50 నుంచి 200 శాతానికి పెంచేశారు. నివాస గృహాలకైతే 50 నుంచి 150 శాతం, వాణిజ్య కట్టడాలకు 100 నుంచి 200 శాతం పెంచాలన్న ప్రతిపాదనను సర్కారు ఇప్పటికే ఆమోదించింది. ఇది 2012 నుంచే అమల్లోకి రానుంది. దీని భారం రూ.1,000 కోట్లు. ఈ పన్ను పెంపు వల్ల 150 చదరపు గజాల స్థలంలో రెండు పడక గదుల ఇళ్లు నిర్మించుకున్న మధ్య తరగతి జీవిపై కనీసం ఏడాదికి రూ.4వేల భారం పడుతుంది.

గత రెండేళ్లలో జనంపై రూ.8 వేల కోట్ల భారం..
గత రెండేళ్లలో ప్రభుత్వం నానా రకాల పన్నులు, చార్జీలతో ప్రజల నెత్తిన మోయలేని భారం మోపింది. వ్యాట్, విద్యుత్ చార్జీలు, ఆర్టీసీ చార్జీలు, వాహనాల పన్ను.. ఇలా అన్నీ పెంచేసి, సామాన్యుడి నడ్డి విరిచింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా పంచదార, వస్త్రాలపైనా వ్యాట్ విధించారు. ఐదేళ్లపాటు పన్నులు, చార్జీలు పెంచకుండా జనరంజక పాలనను అందించిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం.. ఈ రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై ఏకంగా రూ.8 వేల కోట్లకు పైగా భారం మోపింది. వైఎస్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒక్కసారి కూడా కరెంట్ చార్జీలను పెంచలేదు. పైగా పారిశ్రామిక రంగం విద్యుత్ చార్జీలను తగ్గించారు. చార్జీల పెంపునకు అధికారులు చేసిన ప్రతిపాదనలను ఆయన తిరస్కరించారు.

అంతర్గత సామర్థ్యం పెంచుకోవడం ద్వారా వనరులను సమీకరించుకోవాలని సూచించారు. 2009 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కూడా వచ్చే ఐదేళ్లు గృహవినియోగదారులపై విద్యుత్ చార్జీలను పెంచబోమని వైఎస్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రెండేళ్లలో రైతులపైనా పెనుభారం పడింది. కేంద్ర ప్రభుత్వ చర్యల కారణంగా ఎరువుల ధరలు భారీగా పెరిగి, రాష్ట్ర రైతాంగంపై ఏకంగా రూ.3,500 కోట్ల మేర భారం పడింది. 2010 మార్చిలో డీఏపీ బస్తా రూ.486 ఉండగా.. ఇప్పుడది రూ.956కి చేరింది!
Share this article :

0 comments: