ఒక్కొక్కరికి ఒక్కో రూలా..? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఒక్కొక్కరికి ఒక్కో రూలా..?

ఒక్కొక్కరికి ఒక్కో రూలా..?

Written By news on Monday, December 31, 2012 | 12/31/2012


ఈ సంవత్సరంలోని చివరి రోజు ఈరోజు. మామ మరణం నుండి పూర్తిగా కోలుకోకమునుపే జరిగిన సంఘటన, మా జీవితాలను రెండేళ్ల పరిధిలో రెండవసారి అతలాకుతలం చేసిన ఘటన, జగన్ అరెస్టు ఈ సంవత్సరంలో జరిగింది. మామ చనిపోయినప్పుడు అత్తను ఓదార్చడానికి, షర్మికి ధైర్యం చెప్పడానికి జగన్ ఇంట్లో ఉన్నాడు. కాని ఈసారి కష్టంలో ఉన్న మాకు వున్న ఒక్క అండను కాంగ్రెస్, టిడిపి పెద్దలు, సీబీఐ అధికారులు జైలుపాలు చేశారు.

ఏడు నెలలు దాటింది - అసలు ఒక తప్పు జరిగిందా లేదా అని నిర్ధారణ లేకుండా ఇంతకాలం - ఏడు నెలలు ఒక మనిషిని జైలులో పెట్టారు. ఒక కుటుంబాన్ని, ముగ్గురు ఆడబిడ్డలను తీవ్ర మనఃక్షోభకు గురిచేశారు. ప్రజల స్వేచ్ఛను కాపాడడానికి, అధికారుల అధికార దుర్వినియోగం నుండి మాలాంటి వారిని కాపాడడానికి రాజ్యాంగాన్ని నిర్మించిన పెద్దలు పెట్టిన ప్రతి ఒక్క నిబంధనను నిలువునా సమాధి చేస్తూ, ఒక సభ్యసమాజం చూసి తల వంచుకునేలా ఒక మనిషిని వేధించారు. ఒక మనిషి స్వేచ్ఛను మింగివేశారు. అసలు దేవుడిచ్చిన జీవితాన్ని, మా స్వేచ్ఛను హరించడానికి వీళ్ళెవరు? అసలు ఒక నేరం జరిగిందో లేదో తెలియకుండానే ఇంతమందిని, ఇన్ని రోజులు జైలుపాలు చేశారు. వాళ్ల కుటుంబాలకు ఎడతెగని బాధ, శోకం కల్గించారు. ఇదేనా మనకున్న స్వాతంత్య్రం అని కొన్నిసార్లు అనిపిస్తుంది. ఇలా అధికారం వుంది కదా అని, పదవిని అడ్డం పెట్టుకుని మనకు నచ్చని వారికి అన్యాయం చెయ్యడాన్ని దేవుడు మన్నించడు, ప్రజలు మెచ్చుకోరు.

ల్యాంకో శ్రీధర్‌కు ఒక రూలు, మ్యాట్రిక్స్ ప్రసాద్‌గారికి ఒక రూలు, మోపిదేవి గారికి ఒక రూలు, ధర్మానగారికి ఒక రూలు, రాజశేఖరరెడ్డి గారి కొడుకుకి ఒక రూలు, ములాయంగారి కోడలికి, సోనియగాంధి గారి అల్లుడికి ఒక రూలు. ఇది న్యాయమా? ధర్మమా? ఒకటే రాజ్యాంగం... చట్టాలకు అందరూ సమానులే. మరి ఎందుకీ వివక్ష?

అయినా జగన్ చేసిన తప్పేంటి? ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమా? లేక ప్రజలలో ఒకడిగా వుంటూ, వారి ప్రేమ, ఆప్యాయతలను సంపాదించుకోవడమా? మా మామగారు చేసిన తప్పేంటి? తన రాష్ట్రంలో ఇల్లు లేని వారు ఉండకూడదనుకోవడమా? పేదవాడు పెద్ద ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవాలని అనుకోవడమా? డబ్బులు లేని కారణంగా విద్యార్థులు చదువులు ఆపకూడదు అనుకోవడమా? లేక ముసలివాళ్లకు మూడు పూటల తినడానికి అన్నం వుండాలనుకోవడమా? మామ ప్రేమ ప్రతి ఇంటిని, ప్రతి మనిషిని తాకింది. అందుకే ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మడం లేదు.

అసలు జగన్ అప్పుడు ఒక ప్రభుత్వ అధికారి కాదు, ఒక ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, మంత్రి కాదు. అబద్ధాలు మాట్లాడే నాయకులకు, కేసులను పక్కదోవ పట్టిస్తున్న సీబీఐ అధికారులకు అసలు ‘అవినీతి’ అనే పదం జగన్‌కు వర్తించదు అనే విషయం తెలుసు. అయినా వాళ్లకు నీతి, నియమాలుండవనుకుంటా, మంచి మానవత్వాలు తెలియవనుకుంటా! అందుకే ఇన్ని కుట్రలు, ఇన్ని అబద్ధాలు కలగలిపి మమ్మల్ని హింసిస్తున్నారు. అయినా ప్రజలు ఇవన్నీ గమనిస్తూ వున్నారు. వాళ్లకు అన్నీ తెలుసు. అందుకే జగన్‌ను జైలులో పెట్టి 7 నెలలు అయినా, వాళ్లు జగన్‌ను ప్రేమిస్తున్నారు, మాకు అండగా నిలబడుతున్నారు.

కిరణ్‌కుమార్‌రెడ్డి గారు అన్నారు - ‘జగన్ జైలులో ఎందుకు ఉన్నాడు’ అని! ఆయనకు నేను చెబుతున్నా - జీవోలు ఇచ్చినందుకు కాదు జగన్ జైలులో వున్నది; కంపెనీలు స్థాపించి, షేర్లు అమ్మి, ఎవరి వాటా వారికి ఇచ్చినందుకు కాదు జగన్ జైలులో వున్నది; వాటాదారులకు లాభాలు ఆర్జించినందుకు కాదు జగన్ జైలులో వున్నది; 30 వేల పైచిలుకు మందికి ఉపాధి కల్పించినందుకు కాదు జగన్ జైలులో వున్నది, తనకు వచ్చిన లాభాన్ని తనకు భూములు అమ్మిన రైతులతో పంచుకున్నందుకు కాదు జగన్ జైలులో వున్నది... ఒక కొడుకుగా తన తండ్రి మరణవార్త విని చనిపోయిన వారి కుటుంబాలను ఓదార్చాలనుకున్నాడు కాబట్టి ఈరోజు జగన్ జైలులో వున్నాడు. తన తండ్రి నేర్పినట్టు మాట తప్పక, మడమ తిప్పక బతకాలని, ఇచ్చిన మాటకు కట్టుబడి వుండాలనుకున్నాడు కాబట్టి ఈరోజు జగన్ జైలులో వున్నాడు.

బైబిల్‌లో ఒక మాట ఉంది - ‘‘అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు’’ అని! జగన్ నాతో అప్పుడప్పుడు అంటూ ఉంటాడు - ‘‘పైనుండి దేవుడు గాని, నాన్నగాని నన్ను చూసినప్పుడు నా గురించి సంతోషించేలా, గర్వపడేలా బతకాలి’ అని! అందుకే ఈ నాయకులు, అధికారుల మాదిరి ప్రజలను వంచిస్తూ, నోటినిండా అబద్ధాలు, గుండెనిండా కుట్రలు పెట్టుకోవడం జగన్‌కు రాదు, చేయలేడు. అందుకే కొంతకాలం కష్టం వుండవచ్చు. కాని జగన్ అన్నట్టు పైనుండి చూసే మామ ఆశీర్వాదం, దేవుని దయ జైలు గోడలు బద్దలు కొట్టి జగన్‌ను బయటికి నడిపిస్తాయి. జగన్‌ను ప్రేమించే ప్రజల మధ్యకి, కుటుంబం దగ్గరికి దేవుడే నడిపిస్తాడు. ఇది నా నమ్మకం. ఇది నా ప్రార్థన!


- వైఎస్ భారతి
w/oవైఎస్ జగన్






sakshi
Share this article :

0 comments: