పరిటాల శ్రీరాం కోసం గాలింపు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పరిటాల శ్రీరాం కోసం గాలింపు

పరిటాల శ్రీరాం కోసం గాలింపు

Written By news on Thursday, January 3, 2013 | 1/03/2013

ఎమ్మెల్యే సునీత ఇళ్లలో సోదాలు 

విమానాశ్రయాలను అప్రమత్తం చేసిన పోలీసులు

 కాంగ్రెస్ నేత కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డిపై హత్యా యత్నం కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్‌ను అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాలను ఎస్పీ షహనవాజ్ ఖాసీం ఏర్పాటు చేశారు. పోలీసులు బుధవారం పలు చోట్ల సోదాలు చేశారు. శ్రీరామ్ విదేశాలకు పారిపోకుండా చూసేందుకు విమానాశ్రయ అధికారులను అప్రమత్తం చేశారు. సుధాకర్‌రెడ్డిని చంపేందుకు వెళ్తున్న కిరాయిముఠాను డిసెంబర్ 30న అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం ఎన్‌ఎస్ గేట్ వద్ద పోలీసులు అరెస్టు చేయడం, శ్రీరామ్ సహా 13 మందిపై కేసు నమోదు చేయడం తెలిసిందే. కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశారు. 

సూత్రధారి శ్రీరామ్ కోసం బుధవారం తెల్లవారుజామున అనంతపురం జిల్లాలో పలుచోట్ల గాలించారు. రామగిరి మండలం వెంకటాపురంలోని సునీత ఇంట్లో తెల్లవారుజాము 4 నుంచి 5 గంటల వరకు సోదా చేశారు. పక్కనే ఉన్న గంగంపల్లిలోని సునీత సమీప బంధువుల ఇళ్లనూ గాలించారు. అనంతపురంలోని సునీత ఇంటినీ సోదా చేశారు. శ్రీరామ్ బెంగళూరులో బంధువుల ఇళ్లలో తలదాచుకున్నారన్న సమాచారంతో అక్కడికి బృందాన్ని పంపారు. శ్రీరామ్ ధర్మవరం కోర్టులో లొంగిపోతారన్న వార్తల నేపథ్యంలో కోర్టు ఆవరణలో పోలీసులు మోహరించారు.


ఎక్కడైనా గాలిస్తాం: ఎస్పీ

హత్యా యత్నం కేసులో శ్రీరామ్ పాత్రపై మా వద్ద పూర్తి సాక్ష్యాధారాలున్నాయి. దీన్ని ఫ్యాక్షన్ కేసుగా పరిగణిస్తున్నాం. శ్రీరామ్‌తో పాటు మిగతా నిందితులను పట్టుకోవడానికి బుధవారం ఎనిమిది చోట్ల సోదాలు చేశాం. శ్రీరామ్‌ను అరెస్టు చేసి తీరతాం. ఆయన విదేశాలకు పారిపోతారనే విమానాశ్రయ అధికారులను అప్రమత్తం చేశాం. నిందితుల కోసం ఎక్కడైనా గాలించే అధికారం పోలీసులకుంటుంది. వారిని మాకు సరెండర్ చేస్తే స్వాగతిస్తాం.
Share this article :

0 comments: