మీ సంతకం కొండంత బలం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మీ సంతకం కొండంత బలం

మీ సంతకం కొండంత బలం

Written By news on Tuesday, January 1, 2013 | 1/01/2013

* నెలలో దాదాపు 25 రోజుల పాటు జగన్ మీ కోసం మీ మధ్యలోనే ఉన్నారు
* ఈ చేతగాని ప్రభుత్వం, పనికిరాని ప్రతిపక్షం కుమ్మక్కై తనను జైల్లో పెట్టించాయి
* అక్రమంగా నిర్బంధించి ఇవాళ్టికి 219 రోజులైంది..
* బెయిల్ రాజ్యాంగమిచ్చిన హక్కు.. 90 రోజులకు బెయిలివ్వాలనేది నిబంధన
* కానీ చార్జిషీట్ల మీద చార్జిషీట్లు వేసి.. సీబీఐ బెయిల్ రాకుండా అడ్డుకుంటోంది
* అభివృద్ధి, సంక్షేమం, అన్నీ అందరికీ అందాలని వైఎస్ ఎన్నో సంతకాలు చేశారు
* జగన్‌ను మీ వాడిగా భావించి ఒక్క సంతకం చేయండి
* మా కుటుంబానికి జరుగుతున్న అన్యాయాన్ని ఒక్క సంతకంతో ఎదిరించండి

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలు తమ పట్ల చూపుతున్న ఆదరణ, ఆప్యాయతలే తమ కుటుంబానికి కొండంత అండ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని తమ కుటుంబ సభ్యుడిగా భావించి ప్రతి ఒక్కరూ ఆయన అక్రమ నిర్బంధాన్ని నిరసిస్తూ సంతకాలు చేయడానికి ముందుకు రావాలని రాష్ట్ర ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు. ప్రజలు చేసే ప్రతి సంతకం తమకు తిరుగులేని విజయాన్ని అందిస్తుందన్నారు. నూతన సంవత్సర వేడుకలకు బదులుగా పార్టీ శ్రేణులు ‘జగన్ కోసం.. జనం సంతకం’ కార్యక్రమం ముమ్మరంగా చేపడుతున్న సంద ర్భంగా ఆమె సోమవారం ప్రజలకు ప్రత్యేకంగా సందేశమిచ్చారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడానికి ఓ అమ్మగా తాను సంతకాలు చేయాల్సిందిగా కోరుతున్నానన్నారు.

విజయమ్మ సందేశం ఆమె మాట ల్లోనే..
‘‘మా కుటుంబాన్ని మీ కుటుంబంగా ప్రేమించే ప్రతి హృదయానికి నేను మనస్ఫూర్తిగా వందనాలు చెబుతున్నా. ఇవాళ, రాష్ట్రమంతటా ‘జగన్ కోసం .. జనం సంతకం’ ఉద్యమం నడుస్తోంది. కుట్రలు, కుతంత్రాలు, నీతిమాలిన అభియోగాలతో జగన్‌బాబును మనందరి నుంచి దూరం చేశారు. నెలలో దాదాపు 25 రోజుల పాటు మీ మధ్య మీతో ఉన్న జగన్‌ను ఈ చేతగాని ప్రభుత్వం, పనికిరాని ప్రతిపక్షం కుమ్మక్కై మోసపూరితంగా, కిరాతకంగా జైలుపాలు చేశాయి. జగన్‌ను అక్రమంగా నిర్బంధించి ఇవాళ్టికి 219 రోజులైంది. నా భర్త వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రాణం పోయేంత వరకు ఆయన జీవితాన్ని, ఆయన పదవిని మీ కోసం అంకితం చేశారు. మీ గుండెల్లో పచ్చబొట్టుగా నిలిచిన నా భర్తను దూరం చేసేందుకు ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు. ఇవాళ ఎవరేం మాట్లాడినా, ఏం చేసినా జవాబు చెప్పుకోలేరని ఆయన పేరును ఎఫ్‌ఐఆర్‌లో దోషిగా పెట్టారు.

ప్రజా కోర్టులో జగన్‌బాబు నిర్దోషి అని చెప్పండి
బెయిల్ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు.. 90 రోజు లకు బెయిల్ ఇవ్వాలనేది రూలు. అయితే చార్జిషీట్ల మీద చార్జిషీట్లు వేస్తున్నారు. విచారణ మొదలు పెట్టి ఇవాళ్టికి సుమారు 17 నెలలవుతోంది. విచారణ పూర్తి కాలేదంటూ ఇప్పటికీ సాక్షులను ప్రభావితం చేస్తాడని చెప్పి జగన్‌కు బెయిల్ రాకుండా అడ్డుకుంటున్న సీబీఐ వైఖరికి నిరసనగా మిమ్మల్నందరినీ పేరుపేరునా అభ్యర్థిస్తున్నాను. ఇవాళ... రండి...‘జగన్‌కోసం జనం సంతకం’తో ఉద్యమించండి . రాజశేఖరరెడ్డిగారు అభివృద్ధి, సంక్షేమం, అన్నీ అందరికీ అందాలని, ప్రతి గడప గడపకూ అది చేరాలని మీ కోసం ఎన్నో సంతకాలు చేశారు. మీరు మీ మనవడిగా.. మీ కొడుకుగా.. మీ అన్నగా.. మీ తమ్ముడిగా జగన్‌ను భావించి మీరూ సంతకం చేయండి. ఒక్క సంతకం.. తొలి సంతకం మీరు చేయండి. ప్రజాకోర్టులో జగన్‌బాబు నిర్దోషి అని మీ సంతకం మళ్లీ మళ్లీ చెప్పాలని కోరుకుంటున్నా.

మీ కలంతో జవాబు చెప్పండి
ఇవాళ ఒక సంతకం ఓ ఉప్పెనలాగా జగన్‌బాబును జైలు గోడల నుంచి, ఈ కుట్రల నుంచి విముక్తి కలిగిస్తుందని నా నమ్మకం. భర్తను పోగొట్టుకున్న నాకు, కొడుకు దూరమైన నాకు మీ సంతకం కొండంత బలం ఇస్తుందని నమ్ముతున్నాను. మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. మీరు, మీ కుటుంబంతో, మీ సన్నిహితులతో మీ స్నేహితులతో మీ శ్రేయోభిలాషులతో సంతకాలు పెట్టించండి. ఇవాళ జరుగుతున్న ఈ అన్యాయాన్ని మీ కలంతో జవాబు చెప్పండి. ఈ పోరాటంలో అమ్మగా మిమ్మల్ని వేడుకుంటున్నా. ఈ పోరాటంలో మీ సంతకం తిరుగులేని విజయంగా ఉండాలని ఆ దేవ దేవుడిని ప్రార్థిస్తున్నా. మీరు ప్రేమతో, అభిమానంతో పెట్టిన ఈ సంతకాలు, ఇవాళ భారత రాష్ట్రపతి శ్రీ ప్రణబ్‌కుమార్ ముఖర్జీ గారికి నివేదనతో అందిద్దాం. జగన్‌బాబును తెచ్చుకుందాం.’’

నూతన సంవత్సర వేడుకలకు దూరం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డిని అక్రమ నిర్బంధంలో ఉంచినందుకు నిరసనగా పార్టీ సీనియర్లు ఇచ్చిన పిలుపు మేరకు కార్యకర్తలు, నాయకులు నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమైన ముఖ్య నేతలు కూడా ఆయా జిల్లాల్లో సంతకాల సేకరణను సమీక్షించారు. జనవరి 1న ఎక్కడా ఎలాంటి ఆడంబరాలకు తావివ్వకుండా జనం వద్దకు వెళ్లాలని కూడా వారు విజ్ఞప్తి చేశారు. 

ఏడు నెలలుగా జగన్‌ను జైలులో ఉంచడాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు ‘జగన్ కోసం.. జనం సంతకం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జనవరి 1 వేడుకలకు బదులుగా సంతకాల ఉద్యమాన్ని ముమ్మరంగా నిర్వహించాలని నాయకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 2013 జనవరి తొలి రోజున జగన్‌కు మద్దతుగా వాడవాడలా సంతకాలు సేకరించడానికి ఎక్కడికక్కడ సిద్ధమవుతున్నారు.
Share this article :

0 comments: