పరిటాల శ్రీరామ్ ‘సైన్యం’పై పోలీసుల విశ్లేషణ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పరిటాల శ్రీరామ్ ‘సైన్యం’పై పోలీసుల విశ్లేషణ

పరిటాల శ్రీరామ్ ‘సైన్యం’పై పోలీసుల విశ్లేషణ

Written By news on Tuesday, January 1, 2013 | 1/01/2013

* ఆర్వోసీ మాజీ నేత నాగూర్ హుస్సేన్ నేతృత్వం
* సునీత, మరో టీడీపీ ఎమ్మెల్యే మార్గనిర్దేశనం
* పూర్తిగా సహకరిస్తున్న ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే
* జనాన్ని భయపెట్టి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యం
* వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్ నేతల హత్యకు కుట్ర

పరిటాల రవి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతల తనయుడు పరిటాల శ్రీరామ్‌పై నమోదైన హత్యాయత్నం కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఉద్యమం ముసుగులో ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసి ప్రత్యర్థులను మట్టుబెట్టిన తండ్రి బాటనే శ్రీరామ్ కూడా ఎంచుకున్న వైనం ఈ ఉదంతంతో వెలుగులోకి వచ్చింది. కిరాయి సైన్యంతో ప్రత్యర్థులను హతమార్చేందుకు శ్రీరామ్ పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేయడం, ఆయనతో పాటు 13 మందిపై సోమవారం కేసు నమోదు చేయడం తెలిసిందే. నిజానికి రవి హత్యానంతరం అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి. అయితే రవి మరణించిన ఆరేళ్ల తర్వాత ఆయన ప్రత్యర్థి గంగుల సూర్యనారాయణరెడ్డి అలియాస్ మద్దెలచెర్వు సూరిని కూడా 2011 జనవరి 3న హైదరాబాద్ నడిబొడ్డున కాల్చి చంపేశారు. 

సూరి అనుచరుడు భానుకిరణ్‌ను పరిటాల వర్గమే కోవర్టుగా మార్చుకుని ఈ హత్య చేయించినట్లు ఆరోపణలొచ్చాయి. తర్వాత నెలకే పరిటాల హత్య కేసు నిందితుడు తగరకుంట కొండారెడ్డిని పరిటాల వర్గీయులు కాల్చిచంపారు. ఈ కేసులో పరిటాల బావమరిది బాలాజీ కూడా నిందితుడు. 2011 సెప్టెంబరు 15న ధర్మవరం మండలం కామిరెడ్డిపల్లికి చెందిన ముగ్గురు పరిటాల వర్గీయులు హత్యకు గురయ్యారు. ఆర్వోసీ హిట్‌లిస్ట్‌లో ఉన్న కాంగ్రెస్ నేత కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డే వీటికి ప్రధాన సూత్రధారి.

ఇలా పథకం రచించారు..
రవి హత్య తర్వాత ఆయన కుటుంబీకులు, సానుభూతిపరులు ప్రతీకారంతో రగిలిపోతున్నారు. అయితే ఆర్వోసీ మాజీ నేత పోతుల సురేశ్, చమన్‌లను పోలీసులు జిల్లా నుంచి బహిష్కరించారు. ఆ ఇద్దరికీ పరిటాల సునీత కుటుంబంతో సంబంధాలు కూడా క్షీణించాయి. పరిటాల వర్గీయులకు అంగబలం కరువైన నేపథ్యంలో సునీత రాజకీయ వారసుడు రంగంలోకి దిగడాన్ని తాము ఆదిలోనే గుర్తించినట్లు పోలీసువర్గాలు వెల్లడించాయి. ఆర్వోసీలో కీలకంగా వ్యవహరించిన నాగూరు హుసేన్ రవికి అత్యంత సన్నిహితుడు. సురేశ్, చమన్ సహాయ నిరాకరణ నేపథ్యంలో హుసేన్ సాయాన్ని శ్రీరామ్ అర్థించినట్టు పోలీసులు నిర్ధారిస్తున్నారు. 

ధర్మవరానికి చెందిన హుసేన్ ఓ యువ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు సన్నిహితుడు. ఆయనపై రెండు కేసుల్లో నాన్‌బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నా అరెస్టు చేయకుండా సదరు ఎమ్మెల్యే చక్రం తిప్పుతున్నారు. ఆ ఎమ్మెల్యే పరిటాల సునీతకు అత్యంత సన్నిహితుడు కూడా. సునీత, ఆ ఎమ్మెల్యే రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే ప్రజలను భయోత్పాతానికి గురి చేయాలని భావిస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే హుసేన్ నేతృత్వంలో మాజీ నక్సల్స్, కిరాయి హంతకులతో పక్షం క్రితం సునీత సొంతూరు రామగిరి మండలం వెంకటాపురంలో ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేశారు. సునీతకు అత్యంత సన్నిహితుడైన టీడీపీ యువ ఎమ్మెల్యే ఒకరు ఈ సైన్యానికి ఆయుధాలు సమకూర్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

తొలి లక్ష్యం సుధాకర్..!
ప్రైవేటు సైన్యానికి పరిటాల వర్గీయులు ఓ హిట్‌లిస్ట్‌ను అందించారు. త్రిబుల్ మర్డర్ కేసు నిందితుడు, కాంగ్రెస్ నేత కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డి; పరిటాల రవి అనుచరుడు తగరకుంట ప్రభాకర్ హత్య కేసు నిందితులు తగరకుంట భాస్కర్‌రెడ్డి, తగరకుంట ఓబిరెడ్డి; కారు బాంబు కేసు నిందితులు వాసుదేవరెడ్డి, రాప్తాడు వైఎస్సార్‌సీపీ నేత తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి; సూట్‌కేసు బాంబు కేసు నిందితుడు మల్లకాల్వ రామ్మోహన్‌రెడ్డి; పరిటాల రవి హత్య కేసు నిందితుడు వన్నా హనుమంతరెడ్డి; మొన్నటిదాకా టీడీపీలో ఉండి ఇటీవలే వైఎస్సార్‌సీపీలో చేరిన రామగిరి సింగిల్‌విండో 
మాజీ అధ్యక్షుడు రామాంజనేయులు; సూరి సోదరుడు మద్దెలచెర్వు సుధీర్‌రెడ్డిలతో పాటు టీడీపీలోని పరిటాల వ్యతిరేక వర్గీయులువేపకుంట రాజన్న, బద్దలాపురం నారాయణస్వామి పేర్లు ఆ లిస్టులో ఉన్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

తనపై అనుమానం రాకుండా పరిటాల శ్రీరామ్ సింగపూర్ వెళ్లడానికి వీసా, టికెట్లు కూడా తీసుకున్నట్టు విచారణలో వెల్లడైంది. సుధాకర్‌రెడ్డితో ఫ్యాక్షన్ కక్షలున్న హుసేన్, ముందుగా ఆయననే టార్గెట్ చేసినట్టు విచారణలో తేలింది. అందుకు శ్రీరామ్ సరేనన్నారు. హుసేన్, శ్రీరాములు ఇద్దరూ కలిసి రామగిరి మండలం వెంకటాపురానికి చెందిన వడ్డే నాగరాజు, పాపిరెడ్డిపల్లికి చెందిన అలకుంట వడ్డే రామకృష్ణ, మురికి శ్రీనివాసులు, ఈడిగ శ్రీనివాసులు, కమ్మ నగేశ్ నాయుడు, ఈడిగ శివశంకర్, రాఘవేంద్ర, జయచంద్ర, సూర్యనారాయణ, వెంకటపతిలను ఓ బృందంగా ఏర్పాటు చేశారని, వారికి ఆయుధాలిచ్చి సుధాకర్‌రెడ్డి హత్యకు పురమాయించారని సమాచారం.

శ్రీరాములుతో మొదలు
పరిటాల, మద్దెలచెర్వు కుటుంబాల మధ్య 1968 దాకా స్నేహమే ఉండేది. రవి తండ్రి పరిటాల శ్రీరాములు, సూరి తండ్రి మద్దెలచెర్వు నారాయణరెడ్డి మధ్య మొదలైన అభిప్రాయ భేదాలు శత్రుత్వానికి, ఆధిపత్య పోరుకు దారి తీశాయి. 1975లో శ్రీరాములును ప్రత్యర్థులు నరికి చంపడం ‘అనంత’లో రక్తచరిత్రకు నాంది పలికింది. రెండు కుటుంబాల ఆధిపత్య పోరు ఆ హత్యతో జిల్లా అంతటికీ పాకింది. 1979లో శ్రీరాములు పెద్ద కుమారుడు పరిటాల హరిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. 

వీటికి ప్రతీకారంగా నారాయణరెడ్డిని 1983లో శ్రీరాములు వర్గీయులు చంపేశారు. నారాయణరెడ్డి కుమారులు సూరి, రఘునాథరెడ్డి చిన్న పిల్లలు కావడంతో సమీప బంధువు సానే చెన్నారెడ్డి వారికి అండగా నిలిచారు. 1989లో ఆయన పెనుకొండ ఎమ్మెల్యేగా గెలవడంతో శ్రీరాములు చిన్న కొడుకు పరిటాల రవీంద్ర అజ్ఞాతంలోకి వెళ్లారు. అప్పట్లో పీపుల్స్‌వార్ కొండపల్లి సీతారామయ్య వర్గంలో దళ సభ్యులైన పోతుల సురేశ్‌కు రవి పరిచయమయ్యారు. చమన్ వారికి సానుభూతి చూపారు. రవి, సురేశ్, చమన్ త్రయం వర్గ శత్రువులను తుదముట్టించేందుకు పథకం రచించింది. 1991 మే 7న చెన్నారెడ్డిని ఆయన ఇంట్లోనే కాల్చి చంపారు. 

1993 అక్టోబరు 24న సూరి ఇంట్లో టీవీ బాంబు పేల్చడంతో సూరి తల్లి సాకమ్మ, సోదరుడు రఘునాథరెడ్డి, సోదరి పద్మావతి తదితరులు బలయ్యారు. ఈ ఘటనతో రవి, సురేశ్‌లను పీపుల్స్‌వార్ బహిష్కరించింది. దాంతో సురేశ్ నేతృత్వంలో ఆర్వోసీ (రీ ఆర్గనైజింగ్ కమిటీ) పేరుతో ప్రైవేటు సైన్యాన్ని రవి ఏర్పాటు చేశారు. దాని సాయంతో వ్యతిరేక వర్గీయులను ఏరిపారేయించారు. చెన్నారెడ్డి కుమారులు సానే రమణారెడ్డి, ఓబుళరెడ్డిలతో పాటు వందలాది మందిని చంపించారు. ఈ ఫ్యాక్షన్ చిచ్చుకు జిల్లాలో 1,183 మంది బలయ్యారు.

* పరారీలో ఉన్నారన్న డీఎస్పీ త్వరలో అరెస్టు చేస్తామని వెల్లడి
* ముగ్గురి అరెస్టు, ఏడుగురి పరారీ సునీత, చమన్ పాత్రపైనా దర్యాప్తు
* నాగూర్‌హుస్సేన్‌తో పాటు 13 మంది నిందితులు

ధర్మవరం (అనంతపురం), సాక్షి: దివంగత మంత్రి పరిటాల రవి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతల తనయుడు పరిటాల శ్రీరామ్ (24)పై హత్యాయత్నం కేసు నమోదైంది. ధర్మవరం మండలం కామిరెడ్డిపల్లికి చెందిన కాంగ్రెస్ నేత కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డి హత్యకు కుట్ర పన్నారంటూ సెక్షన్ 147, 148, 302 ఆర్-డబ్ల్యూ 511, 149, 115,118, 120(బి), 251(బి)ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముగ్గురిని ధర్మవరం రూరల్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. శ్రీరామ్ పరారీలో ఉన్నారని, ఆయనను త్వరలో అరెస్టు చేస్తామని డీఎస్పీ షేక్ నవాబ్‌జాన్ తెలిపారు. అవే సెక్షన్ల కింద మరో నిందితుడు నాగూర్ హుస్సేన్, సునీత కారు డ్రైవర్ రాములులపై కూడా కేసు నమోదు చేశామన్నారు. 

ఈ కేసులో సునీత, పరిటాల రవికి ఒకప్పటి అనుచరుడు చమన్‌తో పాటు మరికొందరి పాత్రపై దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. దీని వెనక ప్రముఖుల పాత్రను త్వరలోనే తేలుస్తామన్నారు. విలేకరులకు డీఎస్పీ వెల్లడించిన మేరకు వివరాలిలా ఉన్నాయి. ధర్మవరానికి చెందిన నాగూర్ హుస్సేన్, అదే మండలానికి చెందిన తాడిమర్రి సుధాకర్‌రెడ్డి అలియాస్ కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డి మధ్య చాలా ఏళ్లుగా ఫ్యాక్షన్ తగాదాలున్నాయి. ఇరువర్గాల మధ్య అనేక సార్లు దాడులు జరిగాయి. కేసులు కూడా నమోదయ్యాయి. 2004 నుంచి హుస్సేన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అప్పట్నుంచీ పరస్పరం హతమార్చుకోవడానికి వారు ప్రయత్నిస్తూ వచ్చారు. 

ఈ నేపథ్యంలో 2011 సెప్టెంబర్‌లో కామిరెడ్డిపల్లికి చెందిన బోయ నరసింహులు, ఆయన కుమారుడు, కుమార్తె దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో సుధాకర్‌రెడ్డి ప్రధాన నిందితుడు. రిమాండ్ అనంతరం జిల్లా బయట ఉంటున్న ఆయన, శుక్రవారం ఓ కేసులో సంతకం చేయడానికి ధర్మవరం రూరల్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చాడు. సుధాకర్‌రెడ్డి వెంట ఉన్న అరవ చలపతి, తుమ్మల ప్రకాశ్ ఈ విషయాన్ని ప్రత్యర్థి వర్గానికి చేరవేశారు. దాంతో వారు సుధాకర్‌రెడ్డి హత్యకు 10 మందితో కలిసి పథకం వేసి కుణుతూరు వద్ద బ్రిడ్జి సమీపంలో మాటు వేశారు. అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉండటంతో సుధాకర్‌రెడ్డి వాహనం నెమ్మదించగానే తమ వాహనాన్ని అడ్డు పెట్టి హతమార్చాలని భావించారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో రూరల్ ఎస్‌ఐ అబ్దుల్ కరీం సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. వారిని చూడగానే వాహనంలో ఉన్న ఏడుగురు పారిపోయారు. 

రామగిరి మండలం వెంకటాపురం వాసి వడ్డే నాగరాజు, పామిరెడ్డిపల్లికి చెందిన మురికి శ్రీనివాసులు, అలకుంట వడ్డే రామకృష్ణలను అరెస్టు చేశారు. వారి నుంచి మూడు వేటకొడవళ్లు, సఫారీ వాహనం స్వాధీనం చేసుకుని అనంతపురం సబ్ జైలుకు తరలించారు. పరారైన వారిలో ఈడిగ శ్రీనివాసులు, కమ్మ నగేశ్ నాయుడు, ఈడిగ శివశంకర్, రాఘవేంద్ర, జయచంద్ర, సూర్యనారాయణ, వెంకటపతి ఉన్నారు.

source: sakshi
Share this article :

0 comments: