బండి, ఫోన్ ఉంటే ధనవంతులే! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బండి, ఫోన్ ఉంటే ధనవంతులే!

బండి, ఫోన్ ఉంటే ధనవంతులే!

Written By news on Wednesday, January 23, 2013 | 1/23/2013

ప్రణాళిక సంఘానికి నివేదిక ఇచ్చిన నిపుణుల కమిటీ
ముస్లింలను కూడా ఎస్సీ/ఎస్టీల కేటగిరిలోకి చేర్చాలని సిఫార్సు

సాక్షి, హైదరాబాద్: పట్టణాల్లో పేదలను గుర్తించడానికి కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. కేంద్ర ప్రణాళిక సంఘం నియమించిన ప్రొఫెసర్ ఎస్‌ఆర్ హాషీమ్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి నిపుణుల కమిటీ ఈ మేరకు ఒక నివేదికను ప్రణాళిక సంఘానికి సమర్పించింది. పేదల జాబితా నుంచి తొలగించడానికి, చేర్చడానికి సామాజిక, నివాస, వృత్తిపరమైన స్థితిగతులను పరిగణనలోకి తీసుకోవాలని కమిటీ తేల్చింది. దాదాపు రెండున్నర సంవత్సరాలపాటు వివిధ వర్గాల నుంచి సేకరించిన సమాచారం, క్షేత్రస్థాయిలో సమాచారంతోపాటు, గతంలో పేదరిక నిర్మూలనకు అవలంబించిన పలు పద్ధతులను పరిశీలించిన తరువాత ఈ కమిటీ సమగ్ర నివేదిక అందచేసింది. పట్టణాల్లో టెలిఫోన్, ద్విచక్ర వాహనం ఉన్న వారు పేదల జాబితా నుంచి ఆటోమేటిక్‌గా తొలగిపోయేలా విధానం రూపొందించాలని వివరించింది. నిర్ధారించిన మూడు కేటగిరీల్లో సూచించిన అంశాల ఆధారంగా -12 స్కోరింగ్ పాయింట్లు లెక్కించాలని సూచించింది. 12 పాయింట్లు సాధించిన వారికి పేదల జాబితాలో చేర్చడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, జీరో పాయింట్లు వచ్చిన వారిని జాబితా నుంచి తక్షణం తొలగించాలంది. గృహనివాస స్థితిగతుల్లో వెనుకబాటుతనం ఉన్న వారిని నిరుపేదలుగా గుర్తించాలని కూడా సూచించింది. సామాజిక ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ముస్లింలను కూడా ఎస్సీ/ఎస్టీల సామాజిక కేటగిరిలోకి తీసుకుని రావాలని ఈ కమిటీ సిఫార్సు చేసింది.

కమిటీ సిఫార్సులివీ..

ఇళ్లు లేనివారు, ఇల్లు ఉన్నా.. ఒక్కగది అదీ పైకప్పు లేకుండా పాలిథిన్ కవర్లతో కప్పడం, ఇటుక గోడల స్థానంలో వెదురు కర్రలు, మట్టిగోడలున్న వారిని పేదల జాబితాలో చేర్చాలి.
వృత్తిపరమైన స్థితిగతులకు సంబంధించి ఆదాయ వనరు లేకుండా ఇంటిలోని పెద్దలు లేదా పిల్లలు భిక్షాటన, చిత్తుకాగితాలు ఏరుకోవడం, ఇళ్లలో పనిచేసే కార్మికులు, దినసరి కూలీలు, సక్రమంగా వేతనాలు రానివారిని పేదలుగా గుర్తించాలి.

18 ఏళ్లు దాటిన వారు కుటుంబంలో లేకపోవడం, 18-60 సంవత్సరాల మధ్యవయస్సులో పనిచేయడానికి శరీరం సహకరించని వారు, సంపాదించిన పెద్దలంతా వైకల్యంతో ఉండడం లేదా దీర్ఘకాలిక అనారోగ్యం లేదా 65 సంవత్సరాల వయస్సుపైబడి ఉన్న వారిని కూడా పేదల జాబితాలో చేర్చాలి.

టెలిఫోన్, ద్విచక్రవాహనంతోపాటు నాలుగు గదులున్న ఇల్లు, ల్యాప్‌టాప్, రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండిషనర్, ఇంటర్నెట్‌తో కూడిన కంప్యూటర్, వాషింగ్ మిషన్ వీటిల్లో ఏ మూడు కలిగి ఉన్నా వారిని పేదల జాబితా నుంచి తొలగించాలి. 
Share this article :

0 comments: