బలమున్న చోట దౌర్జన్యం.. లేనిచోట వాయిదా తంత్రం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బలమున్న చోట దౌర్జన్యం.. లేనిచోట వాయిదా తంత్రం

బలమున్న చోట దౌర్జన్యం.. లేనిచోట వాయిదా తంత్రం

Written By news on Friday, January 25, 2013 | 1/25/2013

సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ ఇష్టారాజ్యం
ఆది నుంచీ అధికార దుర్వినియోగం
సభ్యత్వ నమోదు నుంచే అక్రమాలు 
సీఎం, సహకార మంత్రి సొంత జిల్లాల్లో మెజారిటీ సంఘాలకు ఎన్నికలు బంద్!
గెలవలేని చోట ఎన్నికలు వాయిదా వేయాలంటూ అధికారులకు ఆదేశాలిస్తున్న మంత్రులు
నామినేషన్ల సందర్భంగా పలు జిల్లాల్లో ఉద్రిక్తత
సీఎం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు
గుంటూరులో బట్టబయలైన కాంగ్రెస్, టీడీపీ ఫిక్సింగ్
అన్యాయాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టు

హైదరాబాద్, సాక్షి నెట్‌వర్క్: సహకార ఎన్నికల్లో గెలుపు ముద్ర వేయించుకోవడానికి అధికార కాంగ్రెస్ పార్టీ దండోపాయాన్ని ప్రయోగిస్తోంది. సభ్యత్వ నమోదు నుంచి పోలింగ్ దాకా అంతా తన కనుసన్నల్లోనే నడిపించేందుకు ఎత్తులు వేస్తోంది. ఓడిపోతామని అనుమానం ఉన్నచోట ‘వాయిదా’ మంత్రం జపిస్తూ.. బలమున్న చోట ఇతర పార్టీలను అడ్డుకుంటూ దౌర్జన్యకాండకు దిగుతోంది. మరికొన్ని చోట్ల కుమ్మక్కు రాజకీయాలతో ప్రజా బలమున్న పార్టీని అడ్డుకుంటోంది. ఒక్కచోట కాదు అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి! సీఎం సొంత జిల్లా చిత్తూరు, సహకార శాఖ మంత్రి కాసు కృష్ణారెడ్డి జిల్లా గుంటూరులో అయితే అక్రమాలు తారస్థాయికి చేరాయి. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రం పీలేరులో గురువారం నామినేషన్లు వేయకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కాంగ్రెస్ నేతలు అడ్డుకోవడంతో ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

గుంటూరు జిల్లాలో కాంగ్రెస్, టీడీపీ ఫిక్సింగ్ మరోసారి బహిరంగంగా వెల్లడైంది. గురువారం వెల్దుర్తి మండలం శిరిగిరిపాడు సొసైటీకి వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు నామినేషన్ వేయడానికి వెళ్తుండగా.. కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఒక్కటై అడ్డుకున్నారు. అన్యాయాన్ని ప్రశ్నించేందుకు వెళ్లిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ రెండు జిల్లాల్లో మెజార్టీ ప్రాథమిక సహకార సంఘాల (పీఏసీఎస్)లకు ఎన్నికలు జరపకుండా ఇప్పటికే వాయిదా వేసేశారు. అనేక జిల్లాల్లో కూడా ఇలాగే వందలాది సొసైటీల ఎన్నికలను వాయిదా వేసేందుకు అధికారిక ఉత్తర్వులిచ్చేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది.

ఆది నుంచి అదే తీరు..

సహకార ఎన్నికల్లో ఆది నుంచి అధికార పార్టీ వ్యవహారం అభ్యంతరకరంగానే ఉంది. తొలుత ప్రతిపక్ష పార్టీలకు చెందిన రైతులకు ప్రాథమిక పరపతి సంఘాల్లో సభ్యత్వం ఇవ్వకుండా అడ్డుకుంది. అధికారులను తన కనుసన్నల్లో ఉంచుకొని.. తాము సూచించిన వారికే సభ్యత్వాలు ఇప్పించుకొంది. మిగతా వారికి సభ్యత్వాలు దక్కకుండా అనేక అడ్డంకులు సృష్టించింది. పారదర్శకంగా జరగాల్సిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఇష్టారీతిగా సాగించింది. కొన్నిచోట్ల అయితే సభ్యత్వ పుస్తకాలను పరపతి సంఘాల కార్యాలయాల్లో ఉంచకుండా అధికారులు తమ ఇళ్లలో ఉంచుకొని, అధికార పార్టీకి చెందిన రైతులకే సభ్యత్వం ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు కుల ధ్రువీకరణ పత్రాలు కూడా సకాలంలో అందకుండా ‘మీసేవ’లో జాప్యం చేయించారు. ఫలితంగా వేలాది మంది ఎస్సీ, ఎస్టీలకు సభ్యత్వం దక్కకుండా పోయింది. మరికొన్ని చోట్ల విపక్ష పార్టీ రైతుల మీద దాడులు, దౌర్జన్యాలు జరిగాయి. అన్ని రకాలుగా ప్రయత్నించిన తర్వాత కూడా.. గెలుపు దక్కే అవకాశం లేని చోట ఎన్నికలు వాయిదా వేయించేందుకు ప్రభుత్వం శతథా ప్రయత్నిస్తోంది.

మంత్రి అనుమతి లేకుండానే జీవోలు..

సహకార సంఘాల ఎన్నికల నిర్వహణలో మంత్రుల జోక్యం ఎక్కువైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలానా సంఘంలో పరిస్థితి బాగోలేదని, కాంగ్రెస్ ఓడిపోతుందనే సమాచారం రాగానే మంత్రులు తమ ఫోన్లకు పని చెపుతున్నారు. సహకార శాఖ ఉన్నతాధికారులకు ఫోన్లు చేసి ఆ సొసైటీ ఎన్నికలు నిలిపివేసేలా ఉత్తర్వులివ్వాలని ఆదేశిస్తున్నారు. మంత్రులతో పాటు అన్ని స్థాయిల్లోనూ అధికార పార్టీ నేతలు సహకార ఎన్నికలలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. వారి సూచనలను సహకార శాఖ ఉన్నతాధికారులు సైతం తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు. వాస్తవానికి జీవో జారీ చేయాలంటే సంబంధిత శాఖ మంత్రి అనుమతి అవసరం. అయితే సహకార శాఖ మంత్రి కాసు కృష్ణారెడ్డి అందుబాటులో లేకపోయినా.. బుధ, గురువారాల్లోనే పెద్ద ఎత్తున జీవోలు వెలువడ్డాయి. ఎన్నికలు వాయిదా వేసే అధికారం.. సహకార చట్టంలోని నిబంధన 22(సి) ప్రకారం ప్రభుత్వానికి ఉంది. కానీ ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు లేకపోతేనే వాయిదా వేయాలని చట్టంలో స్పష్టంగా ఉంది. అధికార పార్టీకి అనుకూలంగా లేని ప్రాంతాల్లో ‘ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు లేవు. ఎన్నికలు నిర్వహిస్తే శాంతిభద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉంది.’ అంటూ జీవోల్లో పేర్కొనడం గమనార్హం. ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో సగానికిపైగా పీఏసీఎస్‌ల ఎన్నికలు వాయిదా వేయడానికి రంగం సిద్ధమైందని సమాచారం. సహకార శాఖ మంత్రి సొంత జిల్లా గుంటూరులోనూ పలు సంఘాలకు ఎన్నికలు వాయిదా వేశారు.

చిత్తూరులో అన్నీ సమస్యాత్మకమేనట: రాష్ట్రంలో 2,949 సహకార సంఘాలకుగాను 2,931 సంఘాలకే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అందులో 819 కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా, 390 కేంద్రాలు అత్యంత సమస్యాత్మకమైనవిగా ప్రభుత్వం గుర్తించింది. చిత్తూరు జిల్లాలో 77 సంఘాలకుగాను 72 సంఘాల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ అయింది. అయితే అందులో ఈ జిల్లాలో 29 సమస్యాత్మక, 43 అత్యంత సమస్యాత్మక కేంద్రాలున్నట్లు గుర్తించడం గమనార్హం.

ఎన్నికలు నిష్పాక్షికంగా జరపండి: సీఎస్

సహకార ఎన్నికలు నిష్పాక్షికంగా, శాంతియుతం గా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూ గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. గురువారం ఆమె జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ ప్రక్రియను చిత్రీకరించేందుకు వీడియో కెమెరాలు కావాలని గుంటూరు, కడప కలెక్టర్లు సీఎస్‌కు విజ్ఞప్తి చేశారు. ఇందుకు ఆమె పరిశీలిస్తానని హామీనిచ్చారు.

పీలేరులో దౌర్జన్యకాండ..

సీఎం నియోజకవర్గ కేంద్రమైన పీలేరులో నామినేషన్ల సందర్భంగా అధికార కాంగ్రెస్ నేతలు దౌర్జన్యకాండకు దిగారు. గురువారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సహకార ఎన్నికల నామినేషన్లు వేయనీయకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నారుు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు, వైఎస్సార్ సీపీ నేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి నేతృత్వంలో నామినేషన్లు వేసేందుకు 13 మంది నాయకులు సింగిల్ విండో కార్యాలయం వద్దకు చేరుకోగా కాంగ్రెస్ వాళ్లు మూకుమ్మడిగా దాడి చేశారు. మైనార్టీ నాయకుడు జిలానీ సాహెబ్‌పై చేయిచేసుకున్నారు. ఆయన వెంట వచ్చిన ఇద్దరు మహిళా అభ్యర్థులు భయంతో పరుగులు తీశారు. పోలీసులు సైతం అధికార పార్టీకే వత్తాసు పలికారు. జాండ్ల, రేగళ్లుకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు వేసిన తర్వాత వారిని తమ వెంట తీసుకుని వెళతామన్న వైఎస్సార్‌సీపీ నాయకుల అభ్యర్థనకు నో చెప్పారు. అనంతరం అక్కడికి చంద్రగిరి నాయకుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చేరుకోగా ఆయన్నూ వెళ్లిపోవాలని ఆదేశించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కేకలు వేస్తూ ముందుకు రావడంతో పోలీసులు కార్యాలయ గేట్లు మూసేసి తాళం వేశారు. సాయంత్రం 4 గంటల వరకు సింగిల్‌విండో కార్యాలయ గేట్లు తెరవలేదు. దీంతో వైఎస్సార్‌సీపీ నాయకులు నామినేషన్ వేయకుండానే వెనుదిరిగారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఆ పార్టీ నేత చింతల రామచంద్రారెడ్డి తదితరులు కార్యాలయం వద్దే పీలేరు-తిరుపతి జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. తరువాత క్రాస్‌రోడ్డు వరకు ప్రదర్శనగా వెళ్లి ఆందోళన నిర్వహించారు.

కృష్ణాలో 11 సొసైటీ ఎన్నికలపై స్టే!

కృష్ణా జిల్లాలో సహకార సంఘాల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవంగా గెలిచే అవకాశం ఉన్న 11 సొసైటీల ఎన్నికలను ప్రభుత్వం గురువారం నిలిపేసింది. వైఎస్సార్‌సీపీ తరపున కేడీసీసీ చైర్మన్ పదవి కోసం పోటీపడుతున్న ఆప్కాబ్ మాజీ చైర్మన్ వసంత నాగేశ్వరరావు ఎప్పుడూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే ఐతవరం సొసైటీతోపాటు మరో పదింటి ఎన్నికలను వాయిదా వేసింది. మరికొన్నింటిని వాయిదా వేసేందుకు రంగం సిద్ధం చేసింది. కేడీసీసీ బ్యాంకును కైవసం చేసుకుంటామనే భయంతోనే ప్రభుత్వం ఈ సొసైటీల్లో ఎన్నికలు నిర్వహించడం లేదని వసంత నాగేశ్వరరావు ఆరోపించారు. ఎన్నికలు నిలుపుదల చేసిన 11 సహకార సంఘాల్లో 10 సంఘాలను గెల్చుకునే సత్తా తమ పార్టీకి ఉందని, దీన్ని అడ్డుకునేందుకే ప్రభుత్వం వాయిదా వేసిందని మండిపడ్డారు. స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ ఐతవరం, అల్లూరు సొసైటీ కార్యాలయాల ఎదుట ధర్నాలు, జాతీయ రహదారిపై రాస్తారోకో జరిగాయి. రెండో దశలో ఎన్నికలు జరిగే సొసైటీల్లో కూడా కీలకమైన సంఘాల ఎన్నికలపై స్టే ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.

విశాఖలో ఎన్నికల వాయిదా యత్నాలు: విశాఖ జిల్లాలో అత్యధిక సహకార సంఘాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెల్చుకుంటుందన్న ఉద్దేశంతో అధికార పార్టీ నేతలు కుట్రలకు తెరతీస్తున్నారు. కీలకమైన నేతలు పోటీ చేసే సంఘాలు, పేరెన్నికగన్న సంఘాలపై కన్నేశారు. ముఖ్యంగా నక్కపల్లి, కోటఉరట్ల, మునగపాక, పెందుర్తి తదితర సహకార సంఘాల ఎన్నికలు నిలిపివేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం సాగుతోంది.


గుంటూరులో ఫిక్సింగ్

గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలంలోని శిరిగిరిపాడు సొసైటీకి నామినేషన్‌ల సందర్భంగా కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు వ్యవహారం బయటపడింది. వైఎస్సార్‌సీపీ నాయకులు నామినేషన్లు వేయకుండా కాంగ్రెస్ నాయకుడు, జీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ కుర్రి పున్నారెడ్డి, టీడీపీ నేత కళ్లం రామాంజనేయరెడ్డిలు బహిరంగంగా వారి అనుచరులతో కలిసి అడ్డుకున్నారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. వైఎస్సార్‌సీపీ నాయకుడు సబ్బసాని కోటిరెడ్డి నామినేషన్ వేసేందుకు వెళ్తున్న సమయంలో కాంగ్రెస్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్డు పై అటకాయించారు. 

కిడ్నాప్ చేసి తీసుకువెళ్లి టీడీపీ నాయకుడు కళ్లం రామాంజనేయరెడ్డి ఇంట్లో నిర్బంధించారు. వెల్దుర్తి ఎస్సై ఆయనను గృహనిర్బంధం నుంచి విడిపించారు. వైఎస్సార్‌సీపీ డెరైక్టర్లుగా నామినేషన్ దాఖలు చేయకుండా అభ్యర్థుల నుంచి కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు పత్రాలు లాక్కొని చించేశారు. తర్వాత పోలీసుల రక్షణలో వైఎస్సార్‌సీపీ నేత నామినేషన్ వేశారు. వైఎస్సార్‌సీపీ వెల్దుర్తి మండల నాయకుడు జూలకంటి వీరారెడ్డి శిరిగిరిపాడుకు రాగా ఆయనపైనా కాంగ్రెస్, టీడీపీ నాయకులు దాడిచేసి గాయపరిచారు. ఈ విషయం తెలుసుకున్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కార్యకర్తలకు ధైర్యం చెప్పేందుకు శిరిగిరిపాడు గ్రామానికి చేరుకున్నారు. ఆయన్ను సైతం శాంతి భద్రతల పేరుతో పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించి, తర్వాత విడిచిపెట్టారు. మరోవైపు విజయావకాశాలు లేవన్న కారణంతో రొంపిచర్ల మండలం సుబ్బయ్యపాలెం సొసైటీ ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేసింది.

నెల్లూరు జిల్లాలో కర్రలు, రాళ్లతో దాడి..

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సిద్ధవరంలో గురువారం సొసైటీ ఎన్నికల నామినేషన్ సందర్భంగా అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు బీభత్సం సృష్టించారు. సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, అనుచరులపై కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. స్థానికులు భయంతో పరుగులు తీశారు. దాడిలో శ్యాంప్రసాద్ రెడ్డి అనుచరులకు గాయాలయ్యాయి. బుజ్జమ్మ అనే మహిళ తలకు బలమైన గాయమైంది. 

చిత్తూరులో 11 సంఘాల ఎన్నికలు నిలిపివేత

సీఎం కిరణ్ సొంత జిల్లాలో సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు అనుమానంగా కనిపించడంతో ప్రభుత్వం 11 సహకార సంఘాల ఎన్నికలను నిలిపివేస్తూ ఉత్తర్వులిచ్చింది. వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు విజ యం సాధించగలరనే అంచనాతో.. ఈ సొసైటీల్లో ఓట ర్ల జాబితాలో అక్రమాలు జరిగాయంటూ ఎన్నికల నిర్వహణ నిలిపివేసింది. ఈ మేరకు గురువారం జిల్లా కలెక్టర్, జిల్లా సహకార శాఖాధికారికి ఉత్తర్వులు అం దాయి. ఓటర్ల జాబితా తయారు చేయలేదంటూ ఇప్పటికే గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని ఒక సొసై టీ ఎన్నికను నిలిపేశారు. జిల్లాలో 73 సహకార సంఘాలకు ఎన్నికల నిర్వహణ కోసం షెడ్యూల్ జారీ కాగా.. 61 సింగిల్ విండోలకే ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
Share this article :

0 comments: