సీబీఐ తీరుకు పరాకాష్ట.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీబీఐ తీరుకు పరాకాష్ట..

సీబీఐ తీరుకు పరాకాష్ట..

Written By news on Sunday, January 20, 2013 | 1/20/2013

భారతి సిమెంట్ విషయంలో చెప్పటానికి ఏమీ లేదనుకుందో ఏమో...! సీబీఐ తనకు తోచిన అంశాలన్నిటినీ ఆరోపణలుగా పేర్చేసింది. వివిధ సంస్థలకు ప్రభుత్వం ఇచ్చిన జీవోలన్నిటినీ ఈ నివేదికలో ప్రస్తావించిందే తప్ప... ఆ జీవో అక్రమమైనదా? ఒకవేళ అక్రమమైనదైతే ఎందుకు? అదేమైనా నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చారా? అంతకు ముందు ఎన్నడూ, ఏ ప్రభుత్వమూ అలాంటి జీవోలివ్వలేదా? అనే అంశాల జోలికి మాత్రం వెళ్లలేదు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో... జగన్ సంస్థల్లో పెట్టుబడి పెట్టిన సంస్థలకు సంబంధించి వచ్చిన జీవోలన్నిటినీ వరసగా పేర్కొంది. వారు పెట్టుబడి పెట్టారు కాబట్టి ఆ జీవోలు అక్రమమైనవనే ధోరణికి వెళ్లిపోయింది. దీన్నేమనుకోవాలి?

వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేరికతో ముడిపెట్టి...
రఘురామ్ సిమెంట్స్‌లో (ప్రస్తుతం భారతి సిమెంట్) వై.ఎస్.జగన్ సన్నిహితుడైన జె.జగన్మోహన్‌రెడ్డి డెరైక్టర్‌గా చేరారని, ఆ తరవాతే దానికి కడప జిల్లాలో 2,000 ఎకరాల్లో సున్నపురాయి మైనింగ్ లీజును ప్రభుత్వం మంజూరు చేసిందని, జేజే రెడ్డి చేరాక వై.ఎస్.జగన్ కూడా దాన్లో డెరైక్టర్‌గా చేరారని సీబీఐ పేర్కొంది. ఇక్కడ సీబీఐ తెలివిగా వదిలిపెట్టిన అంశం వారు ఎప్పుడు డెరైక్టర్లుగా చేరారన్నదే. 

ఇవీ వాస్తవాలు...
రఘురామ్ సిమెంట్‌లో జె.జగన్మోహన్‌రెడ్డి డెరైక్టర్‌గా చేరింది 2006 జనవరి 1న. పెన్నా సిమెంట్స్‌లో ఉద్యోగులుగా ఉన్న రామచంద్రం, లక్ష్మీ కాంతం, వాసుదేవన్‌లు అప్పటిదాకా దీన్లో డెరైక్టర్లు. జె.జె.రెడ్డి స్థానికుడు కావటం, భూసేకరణ తదితర అంశాల్లో అనుభవం, అవగాహన ఉండటంతో... ఆయనకు నచ్చజెప్పి డెరైక్టర్‌గా చేర్చుకున్నారు. తన సొంత వెంచరు మొదలుపెడదామని చూస్తున్న జె.జె.రెడ్డి కూడా వీరితో కలిశారు. ఈ మొత్తం ప్రక్రియ కనీసం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి తెలిసే అవకాశం కూడా లేదు. ఈ సంస్థ మైనింగ్ లీజుకు దరఖాస్తు చేసుకోవటంతో 2006 మార్చి 27న దీనికి లీజు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

అయితే ప్రభుత్వం ఇలా కేటాయించడాన్ని అంబుజా సిమెంట్స్ సంస్థ ట్రిబ్యునల్‌లో సవాలు చేసింది. రఘురామ్ సిమెంట్స్‌కు లీజు సరికాదంది. లీజు వ్యవహారం చట్టపరమైన వివాదాల్లో చిక్కుకోవటంతో రఘురామ్ డెరైక్టర్లకు దీనిపై ఆసక్తి తగ్గిపోయింది. జె.జె.రెడ్డి మాత్రం న్యాయ పోరాటాన్ని కొనసాగించారు. ట్రిబ్యునల్‌లో పోరాడారు. చివరికి 2006 సెప్టెంబర్ 8న ప్రభుత్వానికి అనుకూలంగా ట్రిబ్యునల్ ఈ వివాదాన్ని పరిష్కరించింది. అంటే... లీజుకు అడ్డంకులు తొలగిపోయాయన్న మాట. అయితే తనకు సొంతగా ప్లాంటు పెట్టి ఉత్పత్తిని బయటకు తెచ్చే సామర్థ్యం లేకపోవటంతో తన సన్నిహితుడైన వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని జేజే సంప్రదించారు. జేజే పదేపదే కోరటంతో 2006 డిసెంబర్ 1న వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కూడా రఘురామ్ సిమెంట్స్‌లో డెరైక్టర్‌గా చేరారు. అంటే జె.జె.రెడ్డి డెరైక్టర్‌గా చేరిన దాదాపు ఏడాది తరవాత అన్న మాట. ఈ తేదీల్ని కావాలని విస్మరించిన సీబీఐ... జె.జె.రెడ్డి చేరిన తరవాత వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి కూడా చేరారంటూ లింకు చేస్తుండటాన్ని ఏమనాలి?

రుణం తీసుకోవటమూ తప్పేనా?
సొంత ఆడిటింగ్ సంస్థను నడుపుతూ... ఎస్‌బీఐ, సిండికేట్, ఐఓబీ వంటి బ్యాంకులకు ఆడిటర్‌గా... ఫైనాన్షియల్ కన్సల్టెంట్‌గా విశేష అనుభవమున్న విజయసాయిరెడ్డి గతంలో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌కు(ఓబీసీ) నాన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా వ్యవహరించారు. ఆ సమయంలో రఘురామ్ సిమెంట్స్ సంస్థ దాన్నుంచి రూ.200 కోట్ల రుణాన్ని నిబంధనలకు విరుద్ధంగా తీసుకుందని సీబీఐ నివేదికలో పేర్కొంది. దీనికి అదనంగా మరో రూ.134.78 కోట్ల రుణం కూడా తీసుకున్నట్లు తెలిపింది. ఇది నిజంగా నిబంధనలకు విరుద్ధమా?

ఇదీ వాస్తవం...
ఎక్కడా మొత్తం పెట్టుబడిని ప్రమోటర్లే పెట్టాలని, వారి డబ్బుతోనే ఉత్పత్తి ఆరంభించాలని నిబంధనలేమీ లేవు. ఉంటే ఈ దేశంలో 99% కంపెనీలు ఇప్పటికీ ఆరంభమై ఉండేవి కావు. ఎందుకంటే ఏ సంస్థను ఆరంభించినా బ్యాంకు రుణాలు తప్పనిసరి. సవివరమైన ప్రాజెక్టు రిపోర్టును సమర్పిస్తే... తగు హామీని చూపిస్తే రుణం తేలిగ్గానే మంజూరవుతుంది కూడా. భారతి సిమెంట్ విషయంలోనూ అదే జరిగింది. సవివరమైన ప్రాజెక్టు నివేదికను అందజేయటంతో పాటు యంత్రాలు, భూముల్ని హామీ చూపించాక ఓబీసీ రూ.200 కోట్ల రుణం మంజూరు చేసింది. ఇంకా గమనించాల్సిన అంశమేంటంటే... దీనికి రుణం మంజూరు చేస్తూ బ్యాంకు బోర్డు నిర్ణయం తీసుకున్నపుడు... ఆ సమావేశానికి విజయసాయిరెడ్డి హాజరు కాలేదు. తమకు తెలిసిన సంస్థల విషయంలో నిర్ణయం తీసుకునేటపుడు దానికి సంబంధించిన వ్యక్తులు సమావేశంలో ఉండకపోవటమన్నది ఒక సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని ఆయన పాటించారు. మరీ ముఖ్యమైన అంశమేంటంటే... ఆ రుణం తీర్చేశారు కూడా. తక్కువ విలువగల ఆస్తుల్ని తనఖా పెట్టి, ఎక్కువ రుణం తీసుకుని ఎగ్గొడితే సమస్య గానీ... తగిన నివేదిక చూపించి రుణం తీసుకుని, దాన్ని తిరిగి తీర్చేయటం తప్పెలా అవుతుంది? అసలు బ్యాంకులున్నది రుణాలివ్వటానికి కాదా? జగన్ సంస్థకు రుణమిచ్చారు కాబట్టి అది నేరమేనా? అదే ఓబీసీ నుంచి ఎన్ని సంస్థలు రుణాలు తీసుకోలేదు? ఏటా ఎన్ని బ్యాంకులు ఎన్ని వేల సంస్థలకు రుణాలివ్వటం లేదు? వాటన్నిటినీ సీబీఐ ఎందుకు తవ్వటం లేదు? జగన్ ఒక్కడి విషయంలోనే ఎందుకింత విపరీతంగా ప్రవర్తిస్తోంది?

సీబీఐ తీరుకు పరాకాష్ట.. వికాపై అనుమానాలు
అన్నిటికన్నా దారుణం... సీబీఐ దురుద్దేశాలకు పరాకాష్టగా నిలిచే అంశం ఫ్రాన్స్ సంస్థ వికా నుంచి వచ్చిన పెట్టుబడుల్ని కూడా సందేహించటం. ఈ సంస్థ భారతిలో 51 శాతం వాటా కోసం దాదాపు రూ.2,700 కోట్లు ఖర్చు చేసిందని, ఒక్కో షేరును దాదాపు రూ.671 చొప్పున కొనుగోలు చేసిందని, ఇది అనుమానాలకు తావిస్తోందని సీబీఐ పేర్కొంది. వికా సంస్థ ఈ కొనుగోలు కోసం నిధులను అమెరికాకు చెందిన అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి సేకరించిందని, ఇది సందేహించే తీరులో ఉందని పేర్కొంది. 

ఇంతకన్నా నీచమైన ఆలోచన ఉంటుందా? వికా సంస్థేమైనా భారతి సిమెంట్ కోసం ఫ్రాన్స్‌లో పుట్టుకొచ్చిందా? భారతితోనే ఇండియాలో అడుగుపెట్టిందా? 1853లో ఏర్పాటైన ఈ సంస్థపై కూడా సీబీఐ సందేహం వ్యక్తం చేసిందంటే దాని స్థాయిని ఏమనుకోవాలి? ప్యారిస్ స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టయిన ఈ సంస్థ అక్కడే కాకుండా ఏడు దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయం సీబీఐకి తెలియదా? 6,600 పైచిలుకు ఉద్యోగులతో... 21 మిలియన్ టన్నుల సిమెంట్‌ను ఉత్పత్తి చేస్తూ... ఏటా 15వేల కోట్ల రూపాయలకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తున్న ఈ సంస్థను కూడా ఒక్క జగన్‌మోహన్‌రెడ్డి కోసం అనుమానించిందంటే సీబీఐ టార్గెట్ ఎవరనేది కనిపించటం లేదా?

సాగర్‌తో ఇండియాలోకి వికా...
భారతి సిమెంట్‌లో మెజారిటీ వాటా కొనుగోలు చేయకముందు ఇండియాలో... అదీ ఆంధ్రప్రదేశ్‌లో సాగర్ సిమెంట్స్‌ను టేకోవర్ చేసింది వికా. సాగర్‌తో కలిసి కర్ణాటకలో భారీ గ్రీన్‌ఫీల్డ్ సిమెంట్ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేసింది. సాగర్‌తో జట్టుకట్టాకే భారతి సిమెంట్‌లో వాటా కోసం సంప్రదింపులు జరిపింది. చివరికి మెజారిటీ వాటాను సొంతం చేసుకుంది. మరి అన్నీ వదిలేసి భారతి సిమెంట్‌లో వాటా కొనుగోలు చేయటాన్ని మాత్రమే అనుమానిస్తున్న సీబీఐని ఏమనాలి? 

ూ 2008లో మైహోమ్ సిమెంట్స్‌లో వాటా కోసం బహుళజాతి సంస్థ సీఆర్‌హెచ్ 42.6 కోట్ల డాలర్లు వెచ్చించింది. 2008లోనే వికా సంస్థ సాగర్ సిమెంట్స్‌లో వాటా కొనుగోలు చేసింది. అదే ఏడాది ఎల్ అండ్ టీ కాంక్రీట్‌కు చెందిన ఆర్‌ఎంసీ వ్యాపారాన్ని బహుళజాతి దిగ్గజం లఫార్జ్ రూ.1,480 కోట్లకు కొనుగోలు చేసింది. 2007లో అంబుజా సిమెంట్స్‌లో వాటాను హోల్సిమ్ సంస్థ టన్నుకు 301 డాలర్ల ఎంటర్‌ప్రైజ్ వాల్యూ చెల్లించి సొంతం చేసుకుంది.
Share this article :

0 comments: