రాజన్న రాజ్యం వచ్చే వరకు ఓపిక పట్టండి.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాజన్న రాజ్యం వచ్చే వరకు ఓపిక పట్టండి..

రాజన్న రాజ్యం వచ్చే వరకు ఓపిక పట్టండి..

Written By news on Saturday, May 11, 2013 | 5/11/2013

సర్కారుపై షర్మిల ధ్వజం
ఫీజులు కట్టలేక పేద విద్యార్థులు చదువులు మానేస్తున్నారు
వైఎస్ తెచ్చిన పథకాలను ఈ ప్రభుత్వం తుంగలో తొక్కుతోంది
పేదల కోసం పెట్టిన ఫీజుల పథకానికీ కిరణ్ సర్కారు తూట్లు పొడుస్తోంది
రాజన్న రాజ్యం వచ్చే వరకు ఓపిక పట్టండి..


‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘వైఎస్సార్ రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తుంగలో తొక్కింది. పేదరికం పోవాలంటే ప్రతి ఒక్కరూ పెద్ద చదువులు చదవాలనే గొప్ప ఆశయంతో వైఎస్సార్ తెచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంటు పథకానికి ఈ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. 

విద్యార్థులకు పాతిక శాతమిస్తాం... ముప్పాతిక శాతమిస్తాం అంటూ ఫీజులు భిక్షం వేసినట్లుగా వేస్తోంది. ఫీజులు కట్టలేక విద్యార్థులు చదువులు మానేసే రోజులు మళ్లీ వచ్చాయి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘అమ్మా..! కొద్దిగా ఓపిక పట్టండి, త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుంది. అంత వరకు మీ చదువులు ఆపొద్దు’’ అని ఆమె విద్యార్థులకు సూచించారు. ప్రజాసమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర శుక్రవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో సాగింది. పెనుబల్లి మండలం మండాలపాడు గ్రామంలో జరిగిన రచ్చబండలో చిన్నారి అనే విద్యార్థిని మాట్లాడుతూ.. ‘‘వైఎస్సార్ ఉన్నప్పుడు ఒక్క రూపాయి లేకుండానే డిగ్రీ పూర్తి చేశాను. ఇప్పుడు ఎమ్మెస్సీ జువాలజీ చేస్తున్నాను. ఇంత వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందలేదు’’ అని చెప్పడంతో షర్మిల పై విధంగా స్పందించారు.

వడ్డీలేని రుణాలు ఎవరికి ఇస్తున్నారు?
షర్మిల యాత్రలో సాగుతుండగా దారి వెంట పలువురు మహిళలు కలిసి ఆమెకు తమ సమస్యలు వివరించారు. షర్మిల వారితో మాట్లాడుతూ.. ‘‘అమ్మా..! వడ్డీ లేని రుణాలు అందడం లేదని మీరు బాధపడుతున్నారు. పల్లెల్లో ఏ మహిళను అడిగినా కూడా అసలు మాకు రూణాలే అందటం లేదని చెప్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రేమో వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తున్నామని రూ. కోట్లు ఖర్చు చేసి గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. మరి ఈ ముఖ్యమంత్రి వడ్డీలేని రుణాలు ఎవరికి ఇస్తున్నట్లు?’’ అని విమర్శించారు. ‘‘ఆమ్మా... అక్కా... సమయం వచ్చినప్పుడు ఈ కాంగ్రెస్, టీడీపీలకు గట్టిగా బుద్ధిచెప్పి జగనన్నను ఆశీర్వదించిన రోజున రాజన్న రాజ్యం మళ్లీ వస్తుంది. రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత వైఎస్సార్ ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకానికీ జీవం పోస్తారు’’ అని షర్మిల వారికి ధైర్యం చెబుతూ ముందుకు కదిలారు.

రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి..
మార్గమధ్యంలో తనను కలిసి సమస్యలు చెప్పుకొన్న రైతులు, కూలీలతో షర్మిల మాట్లాడుతూ...‘‘రాబోయే రాజన్న రాజ్యంలో అన్ని వర్గాల వారికీ జగనన్న మేలు చేస్తారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర లభించేటట్టు, అవసరమైతే ప్రభుత్వమే పంట కొనుగోలు చేసేటట్టు రూ. 3 వేల కోట్లతో ఒక స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తారు. మన విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంటు పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తారు. పేదల కోసం ఆరోగ్యశ్రీని నిలబెడతారు. వృద్ధులకు, వితంతువులకు పింఛను రూ. 700 చేస్తారు. వికలాంగులకైతే రూ. 1,000 ఇస్తారు. పిల్లలను పనికి కాకుండా బడికి పంపేలా తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు ‘అమ్మ ఒడి’ పథకం ప్రవేశపెడతారు. చిన్నారికి రూ. 500 చొప్పున పదో తరగతి వరకు తల్లి ఖాతాలో డబ్బులు వేస్తారు. ఇలా కుటుంబానికి ఇద్దరేసి పిల్లలకు పథకం వర్తింపజేస్తారు. ఇంటర్ చదివితే రూ. 700 చొప్పున, డిగ్రీ చదివితే రూ. 1,000 చొప్పున అమ్మ అకౌంట్లోనే పడతాయి. అంతకంటే పెద్ద చదువులు చదివే వారికి ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం ఉండనే ఉంది’’ అని షర్మిల ధైర్యం చెప్పారు.

12.2 కిలోమీటర్ల మేర యాత్ర..
పాదయాత్ర 144వ రోజు శుక్రవారం షర్మిల ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని వీఎం బంజర శివారు నుంచి యాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి రామచంద్రరావు బంజర, మండాలపాడు, లంకపల్లి, కొత్తలంకపల్లి మీదుగా నడిచారు. సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. శుక్రవారం మొత్తం 12.2 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 1,929.6 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు, జలగం వెంకటరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, నేతలు భానోతు మదన్‌లాల్, వైఎస్ కొండారెడ్డి, స్థానిక నాయకులు నంబూరి రామలింగేశ్వరరావు, మట్టా దయానంద్ విజయకుమార్, సాదు రమేష్‌రెడ్డి, భూక్యా దళ్‌సింగ్, మెండెం జయరాజ్ ఉన్నారు.

పదేళ్ల కిందట ఇక్కడే వైఎస్ పాదయాత్ర..
మహానేత వైఎస్ చేపట్టిన ‘ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చేరుకొని శనివారానికి సరిగ్గా 10 ఏళ్లు పూర్తవుతుండగా.. షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర కాకతాళీయంగా శనివారమే సత్తుపల్లికి చేరడం విశేషం. నాడు వైఎస్ పాదయాత్ర చేస్తూ సత్తుపల్లి బస్టాండ్ రింగ్‌సెంటర్ వద్ద బహిరంగసభలో ప్రసంగించి తాళ్లమడ గ్రామ శివారులో బస చేశారు. మరుసటి రోజున యాత్ర పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. షర్మిల కూడా శనివారం సత్తుపల్లి బస్టాండ్ రింగ్‌సెంటర్‌లో జరిగే బహిరంగ సభలో ప్రసంగించి తాళ్లమడ శివారులోనే రాత్రి బస చేయనున్నారు. ఆదివారం పశ్చిమగోదావరి జిల్లాలోకి యాత్ర ప్రవేశించనుంది.

షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’
శుక్రవారం యాత్ర ముగిసేనాటికి
రోజులు: 144, కిలోమీటర్లు: 1,929.6
Share this article :

0 comments: