నిర్దోషి అని తేలాక ఈ సంవత్సర కాలాన్ని ఎవరు తెచ్చిస్తారు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నిర్దోషి అని తేలాక ఈ సంవత్సర కాలాన్ని ఎవరు తెచ్చిస్తారు?

నిర్దోషి అని తేలాక ఈ సంవత్సర కాలాన్ని ఎవరు తెచ్చిస్తారు?

Written By news on Friday, May 10, 2013 | 5/10/2013

* టీడీపీ, కాంగ్రెస్ నాయకులు పెడితే నడుస్తున్న కేసు ఇది
* వైఎస్సార్ చనిపోయాక.. జగనన్న కాంగ్రెస్‌ను వీడాక తప్పులు కనిపించాయా?
* వైఎస్ బతికి ఉన్నప్పుడు ఇంద్రుడు, భగీరథుడు అని పొగిడిన వారే ఇప్పుడు దోషి అంటున్నారు
* అబద్ధపు కేసులతో ఏడాది కాలంగా జైల్లో ఉంచుతారా?
* నేరాన్ని నిర్ధారించకుండానే శిక్ష వేస్తారా?
* ఇది ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నట్టు కాదా?
* ఒక వ్యక్తిని ఏడాది దాకా రిమాండ్‌లో ఉంచొచ్చని ఏ చట్టం చెబుతోంది?
* జగన్ నిర్దోషి అని తేలాక ఈ సంవత్సర కాలాన్ని ఎవరు తెచ్చిస్తారు?
మరో ప్రజాప్రస్థానం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘జగనన్నపై నడుస్తున్న కేసు సివిల్ కేసో... క్రిమినల్ కేసో కానే కాదు.. కేవలం పొలిటికల్ కేసు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కేసు పెడితే నడుస్తున్న కేసు.. వైఎస్సార్ మన మధ్య నుంచి వెళ్లిపోయిన తర్వాత.. జగనన్న కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించిన తర్వాత మాత్రమే ఈ తప్పులన్నీ సీబీఐకి, కాంగ్రెస్‌కు, టీడీపీకి కనిపిస్తున్నాయంటే దీన్ని పొలిటికల్ కేసు కాకుంటే ఇంకేం అంటారు..’’అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ప్రశ్నించారు. వైఎస్సార్ బతికి ఉన్నప్పుడు ఇంద్రుడు, భగీరథుడు అని పొగిడిన వాళ్లే.. ఇప్పుడు వైఎస్సార్ దోషి అని, ఆయన చేసిన పనుల వలన జగన్ లబ్ధి పొందారని కేసులు పెట్టారన్నారు. 

వైఎస్సార్ బతికి ఉన్నప్పుడు ఈ తప్పులు సీబీఐకిగాని, కాంగ్రెస్‌కుగాని, టీడీపీకిగాని కనిపించ లేదా అని నిలదీశారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో సాగింది. ‘‘ఈ పొద్దు కొడుకును ఇడుస్తారని అనుకున్న బిడ్డా..! కానీ దొంగల చెయ్యే పైకయింది. టీవీ జూస్తంటే కూడు కూడా ముట్టబుద్ది కాలేదు. కుట్రగాండ్లంతా ఒక్కటై ఈ పని జేసిండ్రు’’ అని రంగారావు బంజర గ్రామానికి చెందిన 75 ఏళ్ల వృద్ధురాలు గోపిశెట్టి అనసూర్య, ‘‘అన్నకు బెయిల్ వస్తుందని ఈరోజు పనికి కూడా పోలే... కానీ ఆ దేవునికి దయపుట్టలేదు. సీబీఐ జేడీ లక్ష్మీనారాయణే రాజకీయ శత్రువుగా మారి ఈ పని జేస్తుండక్కా..’’ అని పెనుబల్లికి చెందిన వెంకటనర్సమ్మతో పాటు పలువురు యువకులు, మహిళలు షర్మిలతో చె ప్పుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆవేదనను వింటూ ముందుకు సాగిన షర్మిల పెనుబల్లి మండల కేంద్రంలో నిర్వహించిన సభలో మాట్లాడారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే...

నేరాన్ని నిర్ధారించకుండానే శిక్షా..:
కాంగ్రెస్, టీడీపీ చేతిలో చెయ్యి వేసుకొని సీబీఐని వాడుకొని అబద్ధపు కేసులు పెట్టి జగనన్నను జైలుపాలు చేశారు. ఎన్నో ఆరోపణలు చేశారు. కానీ ఏ ఒక్క ఆరోపణకు ఆధారం చూపించకుండానే జగనన్నను సంవత్సర కాలంగా జైల్లో పెట్టారు. ఏ వ్యక్తినైనా దోషి అని నిర్ధారించకుండానే ఇన్ని రోజులపాటు అరెస్టు చేసి జైల్లో ఉంచుతారా? ఇది నేరాన్ని నిర్ధారించకుండానే శిక్ష వేసినట్లు కాదా? అని అడుగుతున్నాం. 

ఆరోపణలు రుజువు కాకుండా ఏ వ్యక్తినైనా సంవత్సరం రోజుల పాటు రిమాండ్‌లో ఉంచ్చొచ్చని ఏ చట్టం చెప్తోంది? తీరా కేసు అంతా జరిగిన తర్వాత జగన్‌మోహన్‌రెడ్డి నిర్దోషి అని తేలాక.. ఆయనను సంవత్సరంపాటు జైల్లో ఉంచిన దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు. ఆ రోజున జరిగిన తప్పుకు ఎవరికి శిక్ష పడుతుంది? ఎంత శిక్ష పడుతుంది? ఆయన నిర్దోషి అని తేలిన తర్వాత జగన్‌మోహన్‌రెడ్డి నష్టపోయిన ఈ సంవత్సర కాలాన్ని సీబీఐ గానీ, ఈ నాయకులు గానీ వెనక్కి తెచ్చి ఇవ్వగలరా? అని అడుగుతున్నాం.

జగన్‌కు ప్రాథమిక హక్కులు లేవా?
జగన్‌మోహన్‌రెడ్డిపై చేసిన ఆరోపణల్లో ఏ ఒక్కటీ రుజువు కాకుండానే ఇంతకాలం పాటు జైల్లో పెట్టారంటే ఆయన ప్రాథమిక హక్కును కాలరాస్తున్నట్టు కాదా? ఆయన మనిషి కాదా? జగన్‌మోహన్‌రెడ్డి భారతీయుడు కాదా? ఆయనకు ప్రాథమిక హక్కులు లేవా? ఈ వ్యవస్థలు ఇలా పని చేస్తున్నాయి అంటే దీన్ని ప్రజాస్వామ్యం అంటారా? అని అడుగుతున్నాం. 

ఈ నాయకులకు జగనన్నను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేదు. అందుకే కుట్రలు పన్ని నీచమైన రాజకీయాలు చేస్తున్నారు. కానీ బోనులో ఉన్నా సింహం.. సింహమే. ఈరోజు కాకపోతే ఒకరోజు తప్పకుండా వస్తాడు. వచ్చేరోజు కూడా దగ్గర్లోనే ఉంది. ఆ రోజును ఆపే దమ్మూధైర్యం ఈ నాయకులకు లేదు. ఎందుకంటే దేవుడు ఉన్నాడనేది ఎంత నిజమో.. మంచి వాళ్ల పక్షాన ఆయన నిలబడతారనేది అంతే నిజం.

గురువారం 143వరోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని రాంనగర్ శివారు నుంచి ప్రారంభమైంది. మైబూబ్‌నగర్, పెనుబల్లి మండలంలోని ఉప్పలచెలక గ్రామం ద్వారా సత్తుపల్లి నియోజకవర్గంలోకి అడుగుపెట్టారు. అక్కడ్నుంచి రంగారావు బంజర, ఎడ్ల బంజర మీదుగా పెనుబల్లి చేరుకున్నారు. అక్కడ భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. పెనుబల్లి ఏరియా ఆసుపత్రి సమీపంలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8.25 గంటలకు చేరుకున్నారు. గురువారం 11.8 కిలోమీటర్లు నడిచారు.

ఇప్పటివరకు మొత్తం 1,917.4 కి.మీ. యాత్ర పూర్తయింది. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, బానోతు మదన్‌లాల్, ఎడవల్లి కృష్ణ, స్థానిక నాయకులు మట్టా దయానంద్ విజయకుమార్, నంబూరి రామలింగేశ్వరరావు, బుక్యా దళ్‌సింగ్, మెండెం జయరాజ్ తదితరులున్నారు.
Share this article :

0 comments: