సీబీఐని విమర్శిస్తే కేసులు తిరగదోడుతుందని బాబుకు భయమా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీబీఐని విమర్శిస్తే కేసులు తిరగదోడుతుందని బాబుకు భయమా?

సీబీఐని విమర్శిస్తే కేసులు తిరగదోడుతుందని బాబుకు భయమా?

Written By news on Thursday, May 9, 2013 | 5/09/2013

- వైఎస్సార్ సీపీ నేత శోభా నాగిరెడ్డి సవాల్ 
- రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ వేర్వేరు కాదు
- ఎప్పుడు ఎన్నికలొచ్చినా ఆ రెండు పార్టీలకు డిపాజిట్లు గల్లంతే
- కర్ణాటకలో బీజేపీ మాదిరే రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌కు ఓటమి ఖాయం 
- విప్ ధిక్కరించిన 17 మంది ఎమ్మెల్యేలపై ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే అనర్హత వేటు వేయట్లేదు
- సీబీఐని విమర్శిస్తే కేసులు తిరగదోడుతుందని బాబుకు భయమా?

సాక్షి, హైదరాబాద్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు అంత ధీమా ఉంటే రాష్ట్రంలో ఎన్నికలకు సిద్ధపడాలని వైఎస్సార్ కాంగ్రెస్ శాసన సభాపక్ష ఉపనేత భూమా శోభానాగిరెడ్డి సవాల్ విసిరారు. మైనార్టీలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై టీడీపీ అవిశ్వాసం పెట్టి పడగొట్టాలని, లేదంటే కాంగ్రెస్ పార్టీనే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు సిద్ధపడాలని, ప్రజలు ఎవరి నాయకత్వాన్ని కోరుతున్నారో అప్పుడు తేలుతుందని చెప్పారు. 

కర్ణాటక ఫలితాలే రాష్ట్రంలో పునరావృతమౌతాయని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ... కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా కర్ణాటకలో అధికార బీజేపీ తరహాలో చిత్తుగా ఓడిపోవడం ఖాయమని, ప్రజలు వారికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వబోతున్నారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీలు వేరువేరుగా లేవని, ఆ రెండూ కలిసిపోయాయని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. 

అందుకే గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కుమ్మక్కై పోటీ చేసిన స్థానాల్లో డిపాజిట్లు కూడా కోల్పోయారని గుర్తుచేశారు. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా, ప్రజాపక్షంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని తెలిపారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాసం సందర్భంగా ప్రజాపక్షంగా నిలిచేందుకు పార్టీ విప్‌లను ధిక్కరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసిన వారిపై రెండు నెలలు గడుస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. ఉప ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేకనే కాంగ్రెస్, టీడీపీలు కలిసి రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్సార్‌సీపీనే విజయభేరి మోగిస్తుందని, బలమైన ప్రతిపక్షంగా, ప్రజలకు అండగా ఉంటున్నందునే తమ పార్టీ గెలుస్తుందని చెప్పారు. కర్ణాటకలో అధికార బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాల వల్లే అక్కడ కాంగ్రెస్ గెలిచిందన్నారు. అక్కడి ఓటర్లకు ప్రత్యామ్నాయంగా వేరే పార్టీ లేకపోవడంతో కాంగ్రెస్‌కు ఓటేశారని వివరించారు. 

రాష్ట్రంలో 30 ఏళ్లనాటి పరిస్థితులు పునరావృతమవుతాయి
రాష్ట్రంలో 30 ఏళ్ల నాటి పరిస్థితులు మళ్లీ వస్తాయని శోభ చెప్పారు. 1983లో ఎన్‌టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ప్రజలు ఏ విధంగా ఎదురు చూసి టీడీపీని అధికారంలోకి తెచ్చారో, ప్రస్తుతం అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని, వైఎస్సార్ సీపీకి ఓటేసి జగన్‌ను సీఎం చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు.

మూడు దశాబ్దాల క్రితం సైకిల్ గుర్తుతో ఎన్టీఆర్ స్వీప్ చేస్తే, ఇప్పుడు అదే గుర్తుతో చంద్రబాబు డిపాజిట్లు కోల్పోతున్నారని అన్నారు. జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే ఏ నేరం రుజువు కాకముందే 12 నెలలుగా నిర్బంధించారని అన్నారు. దేశంలో ఏ వ్యక్తిపై కూడా ఇంత అన్యాయంగా వ్యవహరించలేదని తెలిపారు. వీరికంటే బ్రిటిష్ వాళ్లే నయమనిపిస్తోందన్నారు. విచారణ పేరుతో జగన్‌కు బెయిల్ రాకుండా 12 నెలలుగా వేధిస్తున్నారన్నారు. 

ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా హడావుడి చేసే టీడీపీ అధినేత చంద్రబాబు.. సీబీఐపై దేశవ్యాప్తంగా అన్ని రాజకీయపార్టీలు స్పందిస్తున్నా, ఎందుకు మిన్నకుండిపోయారని ప్రశ్నించారు. సీబీఐపై సుప్రీంకోర్టు ఘాటైన విమర్శలు చేసినా బాబు స్పందించకపోవడంలో ఉన్న మతలబేమిటని అన్నారు. కాంగ్రెస్ జేబు సంస్థగా ఉన్న సీబీఐని విమర్శిస్తే తనపై ఉన్న కేసులను తిరగతోడుతారనే భయంతోనా లేక ఆ సంస్థ జగన్‌ను వేధిస్తుందనే కారణం చేత మాట్లాడటంలేదేమో అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

ఆఖరి పాయింట్ వచ్చిందనే కాంగ్రెస్‌లో సంబరం: గట్టు
ఆటలో ఓడినా ఆఖరి పాయింట్ వచ్చిందనే సంబరంలో కాంగ్రెస్ ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ఎద్దేవా చేశారు. అన్ని రాష్ట్రాల్లో ఘోర ఓటమిని చవిచూస్తున్న కాంగ్రెస్ కర్ణాటక ఫలితాలను చూసి సంబరపడిపోతోందని అన్నారు. కర్ణాటక ఫలితాలు బీజేపీ ఓటమి తప్ప కాంగ్రెస్ విజయం కాదని వివరించారు. మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 2014లో ఘోరంగా ఓడిపోవడం ఖాయమన్నారు. కాంగ్రెస్‌కు బ్రాంచి ఆఫీసుగా మారిన టీడీపీకి కూడా అదే గతి పడుతుందని చెప్పారు.
Share this article :

0 comments: