బొత్సకు మతిభ్రమించింది: శోభా నాగిరెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బొత్సకు మతిభ్రమించింది: శోభా నాగిరెడ్డి

బొత్సకు మతిభ్రమించింది: శోభా నాగిరెడ్డి

Written By news on Thursday, July 18, 2013 | 7/18/2013

 పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మతిభ్రమించి మాట్లాడుతున్నారని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ‌ శాసనసభాపక్షం ఉప నాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి నిప్పులు చెరిగారు. శ్రీమతి షర్మిల, వైయస్ కుటుంబంపై ‌బొత్స చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. మహానేత వైయస్ కుటుంబాన్ని విమర్శించడం మానుకోవాల‌ని హితవు పలికారు. బొత్స సత్యనారాయణ నోరు అదుపులో పెట్టుకోవాలని కూడా శోభా నాగిరెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద శ్రీమతి విజయమ్మ చేస్తున్న ఫీజు దీక్ష శిబిరం వద్ద ఆమె మీడియాతో మాట్లాడుతూ బొత్సపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.

బొత్స సత్యనారాయణ కుటుంబం అనేక పదవులు పొందడం‌ మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి పుణ్యమే గదా అని శోభా నాగిరెడ్డి గుర్తుచేశారు. ఈ రోజు ఆ మహానేత కుటుంబాన్నే విమర్శించడం బొత్సకు తగదన్నారు. రాజశేఖరరెడ్డిపై చేసిన వ్యాఖ్యలు బొత్స రాజకీయ పతనానికి నాంది అని శోభా నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. రాజశేఖరరెడ్డి పేరెత్తే అర్హత కూడా బొత్సకు లేదన్నారు. వైయస్‌ రాజశేఖరరెడ్డిపై చేసిన వ్యాఖ్యలను బొత్స సత్యనారాయణ వెనక్కి తీసుకోకపోతే ప్రజలే ఆయనకు తగిన బుద్ధి చెబుతారని శోభా నాగిరెడ్డి హెచ్చరించారు.

విజయనగరం జిల్లాలో శ్రీమతి షర్మిల పాదయాత్ర చేయడంతో బొత్స సత్యనారాయణ కోటలు బీటలువారాయని, దాంతో ఆయన మతిభ్రమించి మాట్లాడుతున్నారని శోభా నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. బొత్స విషయంలో శ్రీమతి షర్మిల చేసిన వ్యాఖ్యల్లో ఒక్కటైనా అబద్ధం ఉందా అని ఆమె ప్రశ్నించారు. మహిళలను కించపరుస్తూ మాట్లాడటం ఆయనకు అలవాటేనని పేర్కొన్నారు. గతంలో ఢిల్లీలో నిర్భయ సంఘటన జరిగినప్పుడు బొత్స అన్న మాటలను గుర్తుచేశారు. మహిళలు అర్ధరాత్రి బయటకు రావలసిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారన్నారు.

ఫీజు రీయింబర్సుమెంట్ పథకాన్ని‌ ప్రభుత్వం సక్రమంగా అమలు చేస్తే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ దీక్ష చేసేవారు కాదని శోభా నాగిరెడ్డి అన్నారు. ఫీజు రీయింబర్సుమెంట్ బకాయిలు చెల్లిస్తే శ్రీమతి విజయమ్మ దీక్ష విరమిస్తారని చెప్పారు. మహానేత వైయస్ఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలను సరిగా అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు
Share this article :

0 comments: