జగన్ చేసిన దీక్షగా చూడకండి.చేనేత కార్మికులు, పేద విద్యార్థుల గోడు పట్టించుకోండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ చేసిన దీక్షగా చూడకండి.చేనేత కార్మికులు, పేద విద్యార్థుల గోడు పట్టించుకోండి

జగన్ చేసిన దీక్షగా చూడకండి.చేనేత కార్మికులు, పేద విద్యార్థుల గోడు పట్టించుకోండి

Written By ysrcongress on Wednesday, February 15, 2012 | 2/15/2012


* కుళ్లు, కుతంత్రాలు మాని స్పందించండి
* చేనేత కార్మికులు, పేద విద్యార్థుల గోడు పట్టించుకోండి
* నేతన్నలను అక్కున చేర్చుకుంది వైఎస్.. ఎన్టీఆర్‌లే
* ఎన్టీఆర్ జనతా స్కీంను ఎత్తేసిన ఘనుడు చంద్రబాబు
* చేనేత కార్మికులకు వృద్ధాప్య పింఛన్ వయసును 60 నుంచి 50 ఏళ్లకు తగ్గించిన మనసున్న మారాజు వైఎస్
* చేనేత కార్మికుల సంక్షేమం కోసం వైఎస్ జారీ చేసిన జీవోలన్నీ ఏమయ్యాయి?
* ఆత్మహత్య చేసుకున్నవారి కుటుంబాలకు రూ.1.50 లక్షల పరిహారం అందించే జీవో 46 ఎక్కడ?
* ఆర్టిజాన్ కార్డులున్న కార్మికుడికి పావలా వడ్డీ రుణ సదుపాయం కల్పించే జీవో 76 అటకెక్కించింది ఎవరు?
* విద్యార్థులకు నాలుగు జతల బట్టలు అందించే జీవో 41ని ఏం చేశారు?
* ఫీజులు అందక పేద విద్యార్థులు, తల్లిదండ్రులు పడుతోన్న బాధలు పట్టవా?
* సర్కారు వైఖరిపై నిప్పులు చెరిగిన జగన్.. 
* 48 గంటల చేనేత దీక్ష విరమణ

అనంతపురం, న్యూస్‌లైన్ ప్రతినిధి: ‘‘పద్నాలుగు నెలల కాలంలో ఒక్క ధర్మవరంలోనే 11 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ దయనీయ పరిస్థితి నుంచి గట్టెక్కించి వారిని ఆదుకోవాలన్న ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వంగానీ దాన్ని నడిపిస్తోన్న ఢిల్లీ ప్రభుత్వంగానీ చేయడం లేదు. ఒక సెమిస్టర్ పూర్తయి మరో సెమిస్టర్‌లోకి విద్యార్థులు అడుగుపెట్టినా ప్రభుత్వం ఇప్పటికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయలేదు. ఫీజులు చెల్లిస్తేనే హాల్ టికెట్లు ఇస్తామని కాలేజీల యాజమాన్యాలు అంటుంటే.. ఫీజుల కోసం విద్యార్థులు వారి తల్లిదండ్రులను అడుగుతున్నారు. ఇప్పటికిప్పుడు ఆ పేద తల్లిదండ్రులు వేలాది రూపాయలు ఎక్కడ్నుంచి తెస్తారు..?’’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 

మనసున్న మారాజులైతే ముందుకు రండి.. కుట్రలు.. కుతంత్రాలు.. రాజకీయాలు.. మాని పెద్ద మనసుతో స్పందించి పేద ప్రజలను ఆదుకోండి అని హితవు పలికారు. చేనేత కార్మికుల వ్యక్తిగత రుణమాఫీ కోసం దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి బడ్జెట్‌లో కేటాయించిన రూ.312కోట్లు విడుదల చేయాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయి నిధులనూ మంజూరు చేయాలంటూ జగన్ మూడ్రోజుల దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఆదివారం ధర్మవరంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ప్రారంభమైన ఈ 48 గంటల దీక్షను జగన్... మంగళవారం సాయంత్రం 4.20 గంటలకు విరమించారు. ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుడు రమణ భార్య సరస్వతి, వృద్ధురాలు బయమ్మ జననేతకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. అనంతరం భారీ ఎత్తున తరలివచ్చిన జనసంద్రాన్ని ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే...

రోజుకు రూ.25తో నేతన్న బతికేదెలా..?
‘‘ధర్మవరంలో నలుగురు చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే 2010 డిసెంబర్ 25న నేనిక్కడికి వచ్చా. అప్పట్నుంచి ఇప్పటివరకూ 14 నెలల కాలంలోనే 11 మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్యలు చేసుకోవడానికి దారితీసిన దుర్భర సమస్యలను పరిష్కరించే ఆలోచన కూడా ఈ ప్రభుత్వం చేయడం లేదు. ధర్మవరంలో నేతన్నలు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారో పరిశీలించడానికి ముందుకు రాలేదు. వైఎస్ హయాంలో రేషం (సప్పూరి) రూ.1,400 పలికేది. ఇప్పు డు దాని ధర రూ.2,400కు పెరిగింది. వార్పు ధర కిలో రూ.1300 నుంచి రూ.3,200కు పెరిగింది. జరీ ధర రూ.180 నుంచి రూ.400కు చేరింది. ఇలా ముడిసరుకుల ధరలు సగటున 80 శాతం నుంచి 200 శాతం వరకూ పెరిగాయి. కానీ చేనేత కార్మికులు ఉత్పత్తి చేస్తున్న చీరల ధరలు మాత్రం 10 నుంచి 15 శాతం కూడా పెరగని పరిస్థితులు ఉన్నాయి. దీనివల్ల చేనేత కార్మికులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించిన విధానాల వల్లే ఈ దుస్థితి ఉత్పన్నమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల మల్బరీ రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఫలితంగా సాగు విస్తీర్ణం తగ్గింది. ఇప్పుడు పట్టుగూళ్ల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ దేశాలు ఇప్పుడు పట్టు ధరలను పెంచేసి చేనేత కార్మికులను నట్టేట ముంచుతున్నాయి. ఈ పరిస్థితిలో నేత కార్మికులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారిని గాలికొదిలేసింది. ఒక చేనేత కుటుంబం వారం రోజులు కష్టపడితే దక్కేది రూ.600. ఒక్కో చేనేత కుటుంబ సభ్యుడి రోజువారీ ఆదాయం రూ.25 మాత్రమే. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో రూ.25తో చేనేత కార్మికులు ఎలా బతుకుతారని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా.

చేనేత, పవర్‌లూమ్‌ను రెండు కళ్లలా చూడాలి..
చేనేత కుడికన్నైతే.. పవర్‌లూమ్స్ ఎడమకన్ను. రెండు కళ్లు బాగుంటేనే శరీరం బాగుంటుంది. ఏ కన్ను పాడైనా శరీరం కుప్పకూలుతుంది. పవర్‌లూమ్స్‌కు రాయితీ ఇవ్వాల్సిందే. విద్యుత్ చార్జీల్లో పవర్‌లూమ్స్‌కు 40% రాయితీ ఇస్తున్నారు. తమిళనాడు తరహాలో పవర్‌లూమ్స్‌కు వంద యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా ఇస్తే మరీ మంచిది. అదే సమయంలో చేనేత కార్మికుల గురించి ఆలోచించాలి. 11 రకాల వస్త్రాలు కేవలం చేనేత కార్మికులే ఉత్పత్తి చేయాలని సుప్రీంకోర్టు గతంలో మార్గదర్శకాలు ఇచ్చిం ది. ఆ 11 రకాలను ఏ పవర్‌లూమ్స్‌లో తయారుకాకుండా చూడాల్సిన ప్రభుత్వం.. వారికేతోడ్పాటును అందజేస్తోంది. ఈ 11 ఉత్పత్తులు పవర్‌లూమ్స్‌లో తయారవుతుంటే.. అందుకు అడ్డుకట్ట వేయకుండా ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తోన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఏం చేస్తోంది?

ఎన్టీఆర్ తెస్తే.. బాబు రద్దు చేశారు
చేనేతను ఆదుకున్న మనసున్న మారాజుల గురించి చెప్పుకోవాల్సి వస్తే వైఎస్ తర్వాత ఎన్టీఆర్ పేరు చెప్పుకోవాలి. పేదలకు రూ.35కే ధోవతి, చీర ఇచ్చేలా ఆయన జనతా స్కీంను ప్రవేశపెట్టారు. అయితే ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడు 1998లో జనతా స్కీంను పూర్తిగా ఎత్తేశారు. తద్వారా చేనేతలను కూలదోశారు..

వేల రూపాయల ఫీజులు ఎలా కడతారు..?
ప్రతి ఇంట్లోనూ ఒకరైనా ఒక డాక్టరో.. ఒక ఇంజనీరో.. ఒక కలెక్టర్ అయితే ఆ కుటుంబం పేదరికం నుంచి గట్టెక్కుతుందని దివంగత నేత ఒక స్వప్నాన్ని చూశారు. ఆ మేరకే ఫీజుల పథకాన్ని ప్రవేశపెట్టారు. కానీ ఈ ప్రభుత్వం దాన్ని నీరుగారుస్తోంది. ఒక సెమిస్టర్ పూర్తయి రెండో సెమిస్టర్‌లోకి విద్యార్థులు అడుగుపెడుతున్నా.. ఫీజుల నిధులు విడుదల కాలేదు. ఫీజులు చెల్లిస్తేనే హాల్‌టికెట్లు ఇస్తామని విద్యార్థులకు కాలేజీల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇంజనీరింగ్ విద్యార్థి రూ.35 వేల ఫీజు కోసం, డాక్టర్ కోర్సు చదవుతున్న విద్యార్థి రూ.55 వేల ఫీజు కోసం పేద తల్లిదండ్రులను అడుగుతున్నారు. ఆ పేద తల్లిదండ్రులు ఇప్పుడు వేలాది రూపాయలు ఎలా చెల్లించగలరు? ఇలాంటి పరిస్థితుల మధ్యే రంగారెడ్డి జిల్లాకు చెందిన వరలక్ష్మి అనే పేద విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. 

ఆమె తల్లిదండ్రులు ఒకరు వాచ్‌మెన్ మరొకరు స్వీపర్. ఫీజులు కట్టాలని కాలేజీ యాజమాన్యం అడగడంతో ఆమె తల్లిదండ్రులను డబ్బులు అడిగింది. చివరికి ఫీజు కట్టేందుకు డబ్బుల్లేక ఆ వరలక్ష్మి ఆత్మహత్య చేసుకుంది. ఈ దీక్షను ఒక్క జగన్ చేసిన దీక్షగానే చూడకండి. జగన్ కూడా ఒక మనిషే. మీరు కూడా మనుషులైతే.. మనసున్న మారాజులైతే ముందుకు రండి. కుట్రలు, కుతంత్రాలు మాని.. స్పందించండి. చేనేత కార్మికులను, పేద విద్యార్థులను ఆదుకోవాలని వారి తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, దాన్ని నడిపిస్తోన్న ఢిల్లీ ప్రభుత్వాన్ని చేతులు జోడించి అర్థిస్తున్నా’’.

నేతన్నల కోసం వైఎస్ ఇచ్చిన జీవోలన్నీ ఏమయ్యాయి...?
‘‘చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో మనసున్న మారాజుల గురించి చెప్పుకోవాలి. మనసున్న మారాజు అంటే దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి గుర్తుకు వస్తారు. చేనేత కార్మికులను ఆదుకున్నది వైఎస్ ఒక్కరే. చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబానికి తోడునీడగా ఉండటానికి రూ.లక్ష పరిహారం, ఆ కుటుంబాన్ని అప్పుల వాళ్లు వేధించకుండా ఉండేందుకు మరో రూ.50 వేలు అందించారు. మొత్తం రూ.1.50 లక్షల పరిహారం ఇచ్చేలా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవో 46ను జారీ చేశారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ఈ పరిహారం అందించేందుకు.. ఆ కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఆర్డీవో, డీఎస్పీ, హ్యాండ్‌లూమ్ అడిషనల్ కమిషనర్‌తో కమిటీని కూడా ఏర్పాటు చేశారు. 

వైఎస్ సువర్ణ యుగానికి ముందు.. ఒక పెద్ద మనిషి ఈ రాష్ట్రాన్ని పాలించారు. ఆయన పేరు చంద్రబాబు నాయుడు. రైతులుగానీ, చేనేత కార్మికులుగానీ పరిహారంగా ఇచ్చే రూ.లక్ష కోసమే ఆత్మహత్య చేసుకుంటారని అవహేళన చేసిన ఘనుడు ఆయన. ఆయన పాలనలోనే సుమారు 200 మందికిపైగా చేనేత కార్మికులు ప్రాణాలు తీసుకున్నారు. వారికి కూడా రూ.లక్షన్నర పరిహారం అందిస్తూ వైఎస్ రాజశేఖరరెడ్డి... జీవో 119 జారీచేశారు. అలాగే ఆర్జిజాన్ కార్డు ఉన్న ప్రతి చేనేత కార్మికుడికి పావలా వడ్డీకే రుణాలు ఇచ్చేలా జీవో 76 జారీ చేశారు. మామూలుగా పనిచేసేవారైతే 60 ఏళ్లకు వృద్ధులవుతారు. కానీ.. చేనేత కార్మికులు 50 ఏళ్లకే వృద్ధులుగా మారిపోతారు. బట్టలు నేయడం వల్ల ఎముకలు అరిగిపోతాయి. కళ్లు సరిగ్గా కనిపించవు. 

ఈ విషయాన్ని గ్రహించిన దివంగత నేత వైఎస్... చేనేత కార్మికులకు వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయడానికి వయోపరిమితిని 60 నుంచి 50 ఏళ్లకు తగ్గిస్తూ జీవో 278ను జారీ చేశారు. ఈ జీవో వల్ల 50 వేల మంది చేనేత కార్మికులకు ప్రయోజనం చేకూరింది. చదువుకునే ప్రతి విద్యార్థికి ఏడాదికి రెండు జతల దుస్తుల స్థానంలో నాలుగు జతలు అందివ్వాలని ఆ మహానేత జీవో 41 కూడా జారీ చేశారు. ఆ మేరకు విద్యార్థులకు బట్టలు అందించారు. నేతన్నలను ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఆనాడు వైఎస్ ఇచ్చిన ఈ జీవోలన్నీ ఇప్పుడేమయ్యాయి’’?
Share this article :

0 comments: