ఇన్‌పేషెంట్లకు మందుల్లేవు..ఐవీ ఫ్లూయిడ్స్ లేవు... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇన్‌పేషెంట్లకు మందుల్లేవు..ఐవీ ఫ్లూయిడ్స్ లేవు...

ఇన్‌పేషెంట్లకు మందుల్లేవు..ఐవీ ఫ్లూయిడ్స్ లేవు...

Written By ysrcongress on Monday, February 13, 2012 | 2/13/2012

దవాఖానాల్లో అల్లాడుతున్న రోగులు
30 వేల నుంచి 8 వేలకు తగ్గిన ఓపీ సేవలు
యాభై శాతానికి పడిపోయిన సర్జరీలు
ప్రజాసంఘాల మద్దతుకు జూడాల యత్నం
ఇక చర్చలు జరపం: మంత్రి కొండ్రు

హైదరాబాద్, న్యూస్‌లైన్: సర్కారీ ఆసుపత్రుల్లో మరణ మృదంగం మోగుతూనే ఉంది. జూనియర్ డాక్టర్ల సమ్మెతో రాష్ట్రంలోని అన్ని బోధనాసుపత్రుల్లో రోగులు విలవిల్లాడుతున్నారు. ఆదివారం అత్యవసర వైద్య సేవలు అందక 34 మంది రోగులు కన్నుమూశారు. గాంధీ ఆస్పత్రిలో 8, కర్నూలులో 9, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో 7, ఉస్మానియా ఆస్పత్రిలో 3, విశాఖలోని కింగ్‌జార్జి (కేజీహెచ్)లో 5, విజయవాడ సిద్ధార్థ ఆసుపత్రిలో రెండు మరణాలు సంభవించాయి. గత్యంతరం లేని పరిస్థితుల్లో పేద రోగులు ప్రైవేటు ఆసుపత్రుల వైపు పరుగులు తీస్తున్నారు. సమ్మెతో బోధనాసుపత్రుల్లో ఓపీ (ఓపెన్ పేషెంట్) సేవలు పడిపోయాయి. సాధారణంగా 10 బోధనాసుపత్రుల్లో రోజూ సుమారు 30 వేల మంది ఓపీ రోగుల పేర్లు నమోదయ్యేవి. ఈ సంఖ్య శని, ఆదివారాల్లో 8 వేలకు పడిపోయింది. 

రోగులకు చికిత్స అందించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా 600 మంది వైద్యులను నియమించామని సర్కారు చెబుతున్నా... ఎక్కడా డాక్టర్లు కనిపించడం లేదు. గాంధీ, ఉస్మానియా, కర్నూలు జనరల్ ఆస్పత్రి, విజయవాడలోని సిద్ధార్థ, కాకినాడలోని రంగరాయ, విశాఖ కేజీహెచ్, వరంగల్ ఎంజీఎం ఆసుపత్రుల్లో ఓపీ పేషెంట్లు గంటల తరబడి నిరీక్షించి వెనక్కు వెళ్తున్నారు. ఇన్‌పేషెంట్ల పరిస్థితి దయనీయంగా మారింది. వార్డుల్లో తనిఖీలకు వెళ్లేందుకే వైద్యులు లేక.. మందుల్లేక అల్లాడుతున్నారు. శస్త్రచికిత్సల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. రోజూ బోధనాసుపత్రుల్లో వివిధ రకాల ఆపరేషన్లు 1,200 నుంచి 1,500 వరకూ జరిగేవి. ఇప్పుడు అది 500కు పడిపోయింది. గాంధీలో రోజూ 60 శస్త్రచికిత్సలు జరుగుతుండగా... ఆదివారం కేవలం 20 మాత్రమే జరిగాయి. శస్త్రచికిత్సలు చేయించుకున్న రోగులకు ఐవీ ఫ్లూయిడ్స్, యాంటీ బయోటిక్స్ మందులు ఇవ్వడానికి స్టాకు లేదు. 

నేడు జూడాల భవిష్యత్ కార్యాచరణ..

జూనియర్ డాక్టర్లు సమ్మె ఉధృతిపై సోమవారం తమ కార్యాచరణ ప్రకటించనున్నారు. ఇప్పటికే మూడు రోజులుగా అత్యవసర సేవలు నిలిపివేసిన జూడాలు ప్రజా మద్దతును కూడగట్టేందుకు సిద్ధమవుతున్నారు. సోమవారం వివిధ విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల మద్దతును కూడగట్టి, ప్రభుత్వాసుపత్రుల్లో ఉన్న సమస్యలను వివరించడానికి సమాయత్తమవుతున్నారు. గ్రామీణ సర్వీసులు చేస్తామని చెప్పినా ప్రభుత్వం స్పందించడం లేదని, రెసిడెన్షియల్ విధానాన్ని అమలు చేస్తే స్టైపెండ్ అక్కర్లేదని చెప్పినా మంత్రులు దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నారన్న విషయాన్ని జనానికి వివరించి, వివిధ పద్ధతుల్లో ఆందోళన నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.

జూడాలతో ఇక చర్చలు జరిపేది లేదు: కొండ్రు

జూడాల నాయకులు ఎప్పుడేం చేస్తున్నారో, వాళ్ల వెనుక ఏ రాజకీయ శక్తులున్నాయో ఆ కదలికలన్నీ తమ వద్ద ఉన్నాయని, వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడేది లేదని వైద్య విద్య శాఖ మంత్రి కొండ్రు మురళి అన్నారు. ఆదివారం సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఇకపై జూనియర్ డాక్టర్లతో చర్చలు జరిపేది లేదని, తమంత తాముగా వాళ్లు వస్తే మాట్లాడతామని తెలిపారు. జూడాల ఉద్యమాన్ని కొన్ని రాజకీయ శక్తులు వెనకుండి నడిపిస్తున్నాయని ఆరోపించారు.

ఉద్యమం మరింత ఉధృతం చేస్తాం..: జూడాలు

తమ సమస్యలు పరిష్కరించకపోతే ప్రజాస్వామ్య సంఘాలతో కలిసి గాంధేయవాద పద్ధతిలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని జూనియర్ డాక్టర్ల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్. జి.నరేష్ హెచ్చరించారు. ఆదివారమిక్కడ ఆయన సంఘం ఉపాధ్యక్షుడు బాలరాజు, కన్వీనర్ నర్సయ్య, ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు జెల్లా లింగయ్యలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 46 రోజులుగా జూడాలు తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యమిస్తున్నా.. సమ్మెకు దిగిన కారణాలను వెతకకుండా ప్రభుత్వం వాస్తవాలను వక్రీకరిస్తోందని ధ్వజమెత్తారు. గ్రామీణ ప్రాంతాల్లో మూడేళ్ల పాటు వైద్య సేవలను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
Share this article :

0 comments: