వికలాంగులపైనా రౌడీషీట్లు తెరుస్తున్న పులివెందుల పోలీసులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వికలాంగులపైనా రౌడీషీట్లు తెరుస్తున్న పులివెందుల పోలీసులు

వికలాంగులపైనా రౌడీషీట్లు తెరుస్తున్న పులివెందుల పోలీసులు

Written By ysrcongress on Wednesday, February 15, 2012 | 2/15/2012

ఇష్టారాజ్యంగా రౌడీషీట్లు..
ఎలాంటి కేసులు లేకున్నా.. చివరకు వికలాంగులపైనా రౌడీషీట్లు తెరుస్తున్న పులివెందుల పోలీసులు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులను, కార్యకర్తలను భయభ్రాంతులను చేయడమే లక్ష్యం

ఈ చిత్రంలోని వ్యక్తి పేరు మిట్టా బాలభాస్కర్ రెడ్డి. జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలం తాళ్లప్రొద్దుటూరు గ్రామ టీడీపీ నేత. ఇతడిపై 1995-2011 మధ్య కాలంలో 19 కేసులు నమోదయ్యాయి. రౌడీషీటర్‌గానూ పేరు నమోదై ఉంది. ప్రస్తుతం 10 కేసుల్లో విచారణ నడుస్తోంది. 2011 ఫిబ్రవరిలో కూడా ఇతడిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇంతటి ఘన చరిత్ర కలిగిన టీడీపీ నేతపై రౌడీషీట్ తొలగిస్తూ 9-1-2012న జిల్లా పోలీసులు ఉత్తర్వులు ఇచ్చారు!

ఈ ఫొటోలోని వ్యక్తి పేరు లింగాల మల్లేశ్వర రెడ్డి. పులివెందుల నియోజకవర్గం ఎర్రిపల్లె గ్రామస్తుడు. ఏడేళ్ల వయసున్నప్పుడు పోలియో సోకి, కుడిచేయి చచ్చుపడిపోయింది. డిగ్రీ వరకూ చదువుకున్నాడు. ఉద్యోగం దొరకకపోవడంతో ఉన్న పొలాన్ని సాగు చేసుకుంటూ.. నెల నెలా వచ్చే పింఛన్‌తో బతుకు బండి లాగిస్తున్నాడు. మల్లేశ్వరరెడ్డిపై ఒక్క కేసూ లే దు. అయినా.. ఇతడిపై పులివెందుల పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్ తెరిచారు!! 

ఈ రెండు ఉదాహరణలు చాలు.. వైఎస్సార్ జిల్లాలో పోలీసులు పక్కదారి పట్టారనేందుకు.. కాంగ్రెస్, టీడీపీల అవకాశవాద కలయికకు చిత్రిక పట్టేందుకు.. జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పనిచేస్తున్న వారిని భయభ్రాంతులను చేయాలనే ఏకైక ఉద్దేశంతోనే ఖాకీలు రౌడీ షీట్లను తామరతంపరగా తెరుస్తున్నారు. ఈ మూడు, నాలుగు నెలల కాలంలోనే ఒక్క పులివెందుల నియోజకవర్గంలోనే దాదాపు 40 మందికి పైగా వ్యక్తులపై రౌడీషీట్లు తెరిచారు. వీరిలో 90 శాతం మంది వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అభిమానులే కావడం గమనార్హం.

పులివెందులలో పోలీసు రాజ్యం!

పులివెందుల నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: ఏ వ్యక్తిపైన అయినా రౌడీషీట్ తెరవాలంటే అందుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. గత రెండేళ్లలో అతడిపై కనీసం మూడు కేసులు నమోదై ఉండాలి. రెండు కేసుల్లో శిక్ష పడి ఉండాలి. అలవాటుగా(హ్యాబిచువల్) నేరాలు చేసే స్వభావం కలిగిన వాడై ఉండాలి. వృద్ధులై ఉండకూడదు. వికలాంగులై కూడా ఉండకూడదు. రౌడీషీట్ తెరవాలంటే ఈ నిబంధనలను పాటించాలి. పాటించకపోతే అది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ను ఉల్లంఘించడమే అవుతుంది. అయితే, వైఎస్సార్ జిల్లా పోలీసులు వీటన్నిటినీ గాలికి వదిలేశారు. మూడైనా క్రిమినల్ కేసులు ఉండాలన్న నిబంధనను ఏదో రకంగా పాటించామనిపించుకునేందుకు ఏదో ధర్నాలో పాల్గొన్నాడనో.. ఎవరినైనా బెదిరించాడనో కేసులు నమోదు చేశారు. కేసులున్న వారిపై రౌడీషీట్ తెరవకుండా.. రౌడీషీట్ తెరవాలనుకున్న వారిపై కేసులు నమోదు చేస్తూ వచ్చారు. తర్వాత ఈ మాత్రం శ్రమ కూడా ఎందుకనుకున్నారో ఏమో.. ఎలాంటి కేసులు లేనివారిపై కూడా అడ్డగోలుగా రౌడీషీట్లు తెరవడం ప్రారంభించారు. 

ఒకే గ్రామంలో 11 మందిపై: ఖాకీల బరితెగింపునకు ప్రత్యక్ష ఉదాహరణ.. పులివెందుల నియోజకవర్గం ఎర్రిపల్లె. ఈ గ్రామంలో 11 మందిపై రౌడీషీట్లు తెరిచారు. వారు.. 1.సర్వోత్తమ రెడ్డి, 2.సూర్యశేఖర్ రెడ్డి, 3.రాంమోహన్ రెడ్డి, 4.గోపాల్ రెడ్డి, 5.దస్తగిరి రెడ్డి, 6.మల్లేశ్వర రెడ్డి, 7.గజ్జల వెంకట్రామి రెడ్డి, 8.చంద్రశేఖర్ రెడ్డి, 9.రసూల్, 10.జయక్రిష్ణా రెడ్డి, 11.రామాంజనేయ రెడ్డి. వీరిని స్టేషన్‌కు తీసుకెళ్లి.. ఫొటోలు తీసి, వేలిముద్రలు వేయించుకుని మరీ రౌడీషీటర్లు తెరిచారు. వాస్తవానికి వీరందరూ వ్యవసాయదారులు. 

రౌడీ షీటర్‌గా పేరు నమోదు చేసే సమయానికి ఒక్క సర్వోత్తమరెడ్డి మాత్రమే ధర్నాలో పాల్గొన్న కేసులో ముద్దాయి. మిగతా 10 మందిపై ఎలాంటి కేసులూ లేవు. ఈ పదిమందిలో మల్లేశర రెడ్డి వికలాంగుడు కూడా! పైగా.. ఎర్రిపల్లెలో ఎలాంటి ఫ్యాక్షన్ లేదు. గ్రామంలో పోలింగ్ బూత్ కూడా లేదు. పక్కనున్న ఉలిమెల్ల బూత్‌కు వెళ్లి వీరు ఓటు వేయాల్సి ఉంటుంది. ఉలిమెళ్లలో టీడీపీకి కాస్త పట్టు ఉండేది. అప్పట్లో టీడీపీవారు రిగ్గింగ్‌కు ప్రయత్నిస్తే ఎర్రిపల్లె గ్రామస్తులు అడ్డుకున్నారు. ఆ సందర్భంగా టీడీపీ వారు కేసు పెట్టారు. ఆ కేసును కూడా ఏడాదిన్నర క్రితం కోర్టు కొట్టివేసింది. ఉలిమెళ్ల టీడీపీ నేతల ప్రమేయంతోనే పోలీసులు తమపై రౌడీషీట్ తెరిచి ఉంటారని ఎర్రిపల్లె వాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

పోలీసుల దిగజారుడుకు పరాకాష్ట

కక్షసాధింపు కోసం ఖాకీలు చివరకు ఎంతకైనా తెగిస్తున్నారు.. ఏ స్థాయికైనా దిగజారుతున్నారు. గతేడాది అక్టోబరు 9న పులివెందుల పోలీసులు అకారణంగా రహమతుల్లా అనే పార్టీ కార్యకర్తను కొట్టడం.. అతడికి తగిలిన దెబ్బలను చూసి, చలించిన వై.ఎస్.జగన్ స్టేషన్ ఎదుట ధర్నా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పులివెందుల పోలీసులపై రహమతుల్లా ప్రైవేటు కేసు పెట్టారు. ఈ కేసులో సీఐ శంకరయ్య సహా పలువురు పోలీసులపై వారంట్లు కూడా జారీ అయ్యాయి. దీంతో పోలీసులు రహమతుల్లాపై పగ పెంచుకున్నారు. ఓ దారుణమైన స్కెచ్ గీశారు. 

స్కెచ్ ఇదీ.. 

పులివెందులలోని ఇస్లాంపురంలో షేక్ మహబూబ్ జాన్ అనే మహిళ నివాసముంటోంది. ఆమె భర్త అన్వర్ బాషా డ్రైవర్. తమ ఇంటి కుళాయి పన్ను కట్టమని వీరు స్థానికంగా ఉండే కాంగ్రెస్ నేతకు రూ.3వేలు ఇచ్చారు. అయితే, ఆ డబ్బును సదరు నేత వాడేసుకున్నాడు. కుళాయి కనెక్షన్ తీసేయడానికి మున్సిపల్ అధికారులు వచ్చారు. దీంతో మహబూబ్‌జాన్.. డబ్బులు వాడేసుకున్న కాంగ్రెస్ నేతపై గొడవకు దిగింది. పోలీసులు రంగప్రవేశం చేశారు. మోసం చేసినవారిపై కేసు పెడితే, ఆ డబ్బురాబట్టి ఇస్తామని మహబూబ్‌జాన్ భర్తకు చెప్పారు. మగవాళ్లు కేసు పెడితే బలంగా ఉండదని.. అందుకే మహబూబ్‌జాన్‌తోనే ఫిర్యాదు ఇప్పించమని అన్వర్‌కు చెప్పారు. 

దీంతో మహబూబ్‌జాన్‌ను వెంటబెట్టుకుని అన్వర్ బాషా స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ పోలీసులు తెల్లకాగితాలపై ఆమెతో వేలిముద్రలు వేయించుకుని పంపేశారు. తర్వాత రహమతుల్లా తనను బలాత్కారం చేసేందుకు ప్రయత్నించాడని మహబూబ్‌జాన్ ఫిర్యాదు చేసినట్లు ఆ తెల్లకాగితాల్లో రాసేసుకున్నారు. దీని ఆధారంగా రహమతుల్లాపై అత్యాచారయత్నం కేసు పెట్టారు. అయితే, పోలీసుల నిర్వాకం గురించి తెలుసుకున్న మహబూబ్‌జాన్ తెల్లబోయింది. తనను మోసం చేసి, తెల్లకాగితాలపై వేలిముద్రలు వే యించుకున్నారని.. అందులో పోలీసులు పేర్కొన్న విషయాలన్నీ అబద్ధాలని మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చింది. 

పోలీసులు మోసం చేస్తారనుకోలేదు: మహబూబ్ జాన్

పోలీసోల్లకు, రహమతుల్లాకు మధ్య ఏమన్నా ఉంటే వాళ్లూ వాళ్లూ చూసుకోవాల. నా పేరు బయటకు తీయడం ఎందుకు? తెల్లకాయితాల మీద వేలిగుర్తులు వేయించుకుని ఇట్టా పోలీసులే మోసం చేస్తారని ఊహించలేదు. 

ఎస్పీగారు మాట్లాడరట..!
జిల్లాలో పోలీసులు నమోదు చేస్తున్న రౌడీషీటర్ల కేసుల వివరాలు, రౌడీషీట్ తెరిచేందుకు పాటించాల్సిన నిబంధనలపై జిల్లా ఎస్పీ సుందర్‌కుమార్ దాస్‌తో మాట్లాడేందుకు ‘న్యూస్‌లైన్’ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నెల 9న ఎస్పీ అపాయింట్‌మెంట్ కావాలని ఆయన కార్యాలయాన్ని కోరితే.. తొలుత మధ్యాహ్నం క్రైం మీటింగ్ ఉందని.. సాయంత్రం వీలుంటుందని చెప్పారు. సాయంత్రం ఫోన్ చేసి అడిగితే.. ఎస్పీగారు ఇప్పుడే యూనిఫాం తీసేశారని.. రేపు కలవవచ్చని తెలిపారు. మరుసటి రోజు ఎస్పీ సెల్‌కే ఫోన్ చేస్తే.. బిజీగా ఉన్నానని సమాధానమిచ్చారు. ఓ రెండు గంటల తర్వాత మళ్లీ ఎస్పీ కార్యాలయానికి ఫోన్ చేస్తే.. ‘ఎస్పీగారు మీతో మాట్లాడరట’ అని కార్యాలయంలో ఉండే స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ చెప్పారు.
Share this article :

0 comments: