తేదీ లేని ఈ లేఖపై కనీసం ఆయన సంతకమూ లేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తేదీ లేని ఈ లేఖపై కనీసం ఆయన సంతకమూ లేదు

తేదీ లేని ఈ లేఖపై కనీసం ఆయన సంతకమూ లేదు

Written By ysrcongress on Friday, February 17, 2012 | 2/17/2012

** అది 2010 అక్టోబరు. ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే పి.శంకర్రావు హైకోర్టుకు లేఖ రాశారు. తేదీ లేని ఈ లేఖపై కనీసం ఆయన సంతకమూ లేదు. దానికి జతపరిచిందల్లా అప్పట్లో టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో వచ్చిన ఓ కథనం. ఆ కథనానికి ఉన్న ఆధారమల్లా... రోశయ్య హయాంలో ఏపీఐఐసీ చైర్మన్‌గా వచ్చిన శివరామసుబ్రహ్మణ్యం కాంగ్రెస్ అధిష్టానానికి ఎమ్మార్‌పై ఫిర్యాదు చేస్తానంటూ చేసిన వ్యాఖ్యలే.

** నవంబరు 5న శంకర్రావు మరో లేఖ రాశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన ‘సాక్షి’ దినపత్రిక, ‘సాక్షి’ టీవీలో పెట్టుబడులపై విచారణ జరిపించాలంటూ రాసిన ఆ లేఖతో పాటు 75 పేజీల అనుబంధాన్ని కూడా సమర్పించారు. అప్పట్లో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ బి.ప్రకాశరావు ఈ లేఖను టేకెన్ అప్ రిట్‌గా పరిగణించి... రోస్టర్ ప్రకారం ఈ కేసు విచారణను జస్టిస్ వంగాల ఈశ్వరయ్య బెంచ్‌కు అప్పగించారు.

** జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా కేసు వేసి కాంగ్రెస్ అధిష్టానానికి దగ్గరవటంతో.. డిసెంబరు 1న శంకర్రావును రాష్ట్ర చేనేత, జౌళి శాఖల మంత్రిగా నియమించారు. 

** శంకర్రావు ఉత్సాహం ఇనుమడించింది. జగన్ ఆస్తుల్ని జప్తు చేయాలని కోరుతూ కోర్టుకు మరో అఫిడవిట్ అందజేశారు. 2011 ఫిబ్రవరి 9న మరో అఫిడవిట్ దాఖలు చేస్తూ.. 333 పేజీల డాక్యుమెంట్లూ అందజేశారు. ఇంతలో దీనిపై విచారణ ఆరంభించిన జస్టిస్ ఈశ్వరయ్య బెంచ్... దీన్ని పార్ట్ హర్డ్‌గా(సగం విన్నట్లు) మార్క్ చేసింది. ఇలా ఒక బెంచ్ సగం విన్నట్లు మార్క్ చేస్తే దాన్ని ఆ తర్వాత కూడా ఆ బెంచే వినాల్సి ఉంటుంది. దీన్ని జగతి పబ్లికేషన్స్ తరఫు లాయర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రాథమిక విచారణలో ఉన్న కేసుల్ని పార్ట్‌హర్డ్‌గా పేర్కొనటం చరిత్రలో ఎక్కడా లేదని స్పష్టంచేశారు.

** జస్టిస్ ఈశ్వరయ్య విచారణ కొనసాగిస్తుండగానే.. మార్చి 14న టీడీపీ నేతలు ఎర్రన్నాయుడు, పి.అశోక్ గజపతిరాజు, బెరైడ్డి రాజశేఖరరెడ్డి హైకోర్టులో మరో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. జగన్ ఆస్తులపై దర్యాప్తు చేయాలంటూ వేసిన ఈ పిల్‌లోని అంశాలు మక్కికి మక్కి శంకర్రావు పిటిషన్లోనివే. దీనికి కొన్ని సొంత ఆరోపణల్ని జోడించి అక్కడక్కడ మార్చారు. విశేషమేంటంటే టీడీపీ నేతలు పిల్ దాఖలు చేసిన మర్నాడే జగన్‌కి, సీబీఐకి, ఇతరత్రా అన్ని పక్షాలకూ నోటీసులు జారీ అయ్యాయి.

** ఇంతలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ వచ్చారు. పార్ట్ హర్డ్‌లను రద్దు చేశారు. దీంతో పిల్ కనక ఈ కేసు జస్టిస్ కక్రూ ముందుకు వచ్చింది. రాజకీయ దురుద్దేశాలతో, రాజకీయ ప్రత్యర్థులు వేసిన ఈ పిటిషన్లో ప్రజాహితం ఏమీ లేదని, దీన్ని కొట్టివేయాలని జగన్ తరఫు న్యాయవాదులు కోరారు. ‘‘రాజకీయ ప్రత్యర్థులు వేశారు కనక దీన్లో రాజకీయ ప్రయోజనాలు ఉండి ఉండొచ్చు. అంతమాత్రాన ప్రజా ప్రయోజనాల్ని విస్మరించలేం’’ అంటూ జస్టిస్ కక్రూ విచారణ సాగించారు.

** జూలె 12న ఎమ్మార్ కేసుతో పాటు ‘సాక్షి’లోకి వచ్చిన పెట్టుబడులపై కూడా సీబీఐతో ప్రాథమిక విచారణకు ఆదేశిస్తూ జస్టిస్ కక్రూ ఆదేశాలు ఇచ్చారు. వై.ఎస్.జగన్ దీన్ని సవాలు చేయగా... ‘‘ఇది ప్రాథమిక విచారణే కదా? అంత భయమెందుకు? మీరేమీ తప్పు చేయకుంటే అదే తేలుతుందిగా?’’ అని జస్టిస్ కక్రూ స్పష్టంచేశారు. జగన్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కూడా అదే చెప్పింది. ‘‘ప్రాథమిక విచారణే కదా? విచారణ జరిపాక నివేదిక ప్రతిని మీకు అందజేస్తారు. దాన్లోని అంశాల ఆధారంగానే తదుపరి దర్యాప్తును ఆదేశిస్తారా, లేదా అన్నది ఆధారపడి ఉంటుంది. హైకోర్టు సహజ న్యాయ సూత్రాలను పాటిస్తుందనే ఆశిస్తున్నాం. అలాకాక మీకేమైనా అన్యాయం జరిగితే మా వద్దకు రావచ్చు’’ అని స్పష్టంచేసింది.

** ఆగస్టు 1న రాష్ట్ర హైకోర్టుకు సీబీఐ తన నివేదిక అందజేసింది. ఆ నివేదిక ప్రతిని తమకు అందజేయాలని జగన్‌మోహన్‌రెడ్డి తరఫు న్యాయవాదులు అడగ్గా కోర్టు అంగీకరించలేదు. సరికదా.. సీబీఐ చేత పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశాలిచ్చింది. దీన్ని జగన్‌మోహన్‌రెడ్డి తరఫు న్యాయవాదులు గట్టిగా సవాల్ చేశారు. నివేదిక ప్రతిని అందజేయకుండా ఇలా ఆదేశించటం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు. నివేదికలో ఏముందో తెలుసుకునే హక్కు తమకుందన్నారు. సుప్రీంకోర్టు కూడా తమకు నివేదిక ఇవ్వాలనే చెప్పిందన్నారు. కానీ జస్టిస్ కక్రూ ఏం చెప్పారో తెలుసా...? ‘‘మాకు సీబీఐ నివేదిక ఇచ్చింది. దాన్ని మేం తెరిచి చూసి మళ్లీ మూసేశాం. అయినా మేం పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది ఆ నివేదిక ఆధారంగా కాదు కనక దాన్ని మేం ఇవ్వాల్సిన పనిలేదు’’ అని.

** ప్రాథమిక విచారణకు ఆదేశించిన మర్నాటి నుంచే జగతి పబ్లికేషన్స్‌తో పాటు వివిధ కంపెనీల ప్రతినిధుల్ని పిలవటం, విచారించటం చేసిన సీబీఐ... పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించిన మర్నాటి నుంచే సోదాలు మొదలు పెట్టింది. జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లను భయభ్రాంతుల్ని చేస్తూ.. ఏకకాలంలో వారి ఇళ్లు, కార్యాలయాలు, జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన సంస్థలు, ఆయన ఇళ్లన్నింటిపై దాడులు చేసింది. 

** 2011, అక్టోబరు 25న జస్టిస్ కక్రూ పదవీ విరమణ చేశారు. తరవాత రెండు నెలలకు ఆయన్ను మన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. తెలుగురాని వ్యక్తిని ఈ పదవిలో నియమించటం సరికాదని పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది.

** దర్యాప్తును తీవ్రం చేసిన సీబీఐ... పలువురిని విచారణకు పిలుస్తూ చివరకు ఓఎంసీ కేసులోనూ జగన్‌ను విచారించింది. ఎమ్మార్ కేసులో వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి సన్నిహితుడైన సునీల్‌రెడ్డిని అరెస్టు చేసింది. ‘సాక్షి’ పెట్టుబడుల కేసులో జగతి సంస్థల ఆడిటర్ విజయసాయిరెడ్డిని అరెస్టు చేసింది.
Share this article :

0 comments: