బీజేడీ కోసం పోలవరానికి చెక్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బీజేడీ కోసం పోలవరానికి చెక్

బీజేడీ కోసం పోలవరానికి చెక్

Written By news on Saturday, April 6, 2013 | 4/06/2013

- కాంగ్రెస్‌పై మండిపడ్డ కొణతాల
- కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రావడానికి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారు
- ఒడిశా పార్టీ మద్దతు కోసమే ఇదంతా... 

 కేంద్రంలో మరోసారి పగ్గాలు చేపట్టేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను పణంగాపెట్టి ఒడిశాకు ప్రయోజనం కలిగేలా వ్యవహరిస్తోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ నిప్పులు చెరిగింది. అక్కడి బిజూ జనతాదళ్ (బీజేడీ) పార్టీ మద్దతు కోసం పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపిందని ధ్వజమెత్తింది. పలువురు పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో కలిసి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కోఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ శుక్రవారమిక్కడ విలేకరులతో మాట్లాడారు.

‘ఈరోజు ప్రకటన చూస్తే.. రాష్ట్రం నుంచి 33 మంది ఎంపీలను గెలిపించడం వల్ల కేంద్రంలో మనుగడ సాగిస్తున్న యూపీఏ ప్రభుత్వం ఒడిశా అభ్యంతరం చెప్పిందని ప్రాజెక్టును ఆపడం దురదృష్టకరం. ఆ మాటకొస్తే ఒడిశా గత 40 -50 ఏళ్లుగా అభ్యంతరం చెబుతూనే ఉంది. మహారాష్ట్రతో పాటు ఒడిశా కూడా ఆమోదం తెలిపి ఒప్పందంపై సంతకాలు చేశాకే ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ 2014లోనూ కేంద్రంలో పగ్గాలు చేపట్టేందుకు వీలుగా ఒడిశాలోని బీజేడీ అనుగ్రహం కోసం రాష్ట్ర ప్రజలను బలిచేస్తోంది’ అని ధ్వజమెత్తారు. 

రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలుగుతున్నా సీఎం కిరణ్ కళ్లు మూసుకొని నీరో చక్రవర్తిలా ఫిడేల్ వాయించుకుంటున్నారని దుయ్యబట్టారు. సంక్షేమ కార్యక్రమాలు ఎలాగూ చేయట్లేదు, జల వనరుల ప్రాజెక్టులకు కేంద్రం అడ్డుపడుతున్నా సీఎం మాట్లాడకుండా ఉండడం సిగ్గుచేటన్నారు. సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగితే, రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాకే కోట్ల రూపాయలను ప్రాజెక్టుకు కేటాయించి కాల్వల నిర్మాణం పూర్తి చేశారని గుర్తు చేశారు. బ్యారేజీ నిర్మాణానికి చట్టపరమైన ఇబ్బందులు వచ్చినా అన్నీ అధిగమించి ఆయన టెండర్లను పిలిచారన్నారు. వైఎస్ బతికి ఉంటే ఇప్పటికే ప్రాజెక్టు పూర్తయి ఉండేదన్నారు. వైఎస్ ఆనాడు టెండర్లు పిలిస్తే, అప్పటి సీఎం రోశయ్యకు చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఆ టెండర్లు ఆరు నెలలు పాటు ఖరారుకాక కాలదోషం పట్టాయన్నారు. రెండవ కృష్ణుడుగా వచ్చిన కిరణ్ కుమార్‌రెడ్డి మళ్లీ టెండర్లను పిలిచి ఏడాది కాలయాపన చేసి వాటిని రద్దు చేశారన్నారు. 

ఇప్పుడు మూడోసారి టెండర్లు పిలిచి, ఖరారు చేసినప్పటికీ అర్ధరాత్రి రైతుల పేరుతో శంకుస్థాపన అంటూ కొంత ఆర్భాటం చేసి మొసలి కన్నీరు కార్చారని దుయ్యబట్టారు. చంద్రబాబు ఈ ప్రాజెక్టును ఎలా కాలగర్భంలో కలిపారో.. కిరణ్ కూడా అలాంటి ప్రయత్నమే చేస్తున్నారన్నారు. దుష్టశక్తులు ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి దాసోహం అన్నట్టు వ్యవహరిస్తోందని విమర్శించారు. నిర్వాసితుల సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. తక్షణమే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని, లేదంటే వైఎస్సార్ సీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతుందని హెచ్చరించారు.
Share this article :

0 comments: