వడ్డీలేని రుణాలెక్కడ? సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి షర్మిల ప్రశ్న - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వడ్డీలేని రుణాలెక్కడ? సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి షర్మిల ప్రశ్న

వడ్డీలేని రుణాలెక్కడ? సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి షర్మిల ప్రశ్న

Written By news on Friday, April 5, 2013 | 4/05/2013

వడ్డీ లేని రుణాలంటూ సీఎం కోట్లు ఖర్చు పెట్టి ప్రచారం చేసుకుంటున్నారు
పల్లెల్లో ఏ మహిళను అడిగినా.. అసలు రుణాలే అందడం లేదంటున్నారు
అందినా కూడా రూ.1.75 నుంచి రూ.2.50 దాకా వడ్డీ పడుతుందంటున్నారు
ఇవాళ ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని ఆసుపత్రికి వెళ్తే కార్డును చెత్తబుట్టలో వేయమంటున్నారు
వైఎస్సార్ పెట్టిన సంక్షేమ పథకాలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది
అవిశ్వాసానికి మద్దతివ్వకుండా చంద్రబాబు ప్రజలను మరింత కష్టాల్లోకి నెట్టారు
రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న మహిళలకు వడ్డీలేని రుణాలిస్తారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ గురువారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 111, కిలోమీటర్లు: 1,517.4

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి:‘‘వైఎస్సార్ రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు తూట్లు పొడుస్తోంది. పక్కా ఇళ్ల పథకాన్ని పాడెక్కించింది. ఇవాళ ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని ఆసుపత్రికి వెళ్తే కార్డును చెత్తబుట్టలో వేయమని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారేమో వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తున్నామని గొప్పలు చెప్తున్నారు. రూ.కోట్లు ఖర్చు చేసి ప్రచారం చేసుకుంటున్నారు. కానీ పల్లెల్లో ఏ మహిళను అడిగినా కూడా అసలు మాకు రూణాలే అందటం లేదని చెప్తున్నారు. ఒకటి, రెండు మహిళా సంఘాల గ్రూపులకు రుణాలు ఇచ్చినా రూ. 1.75 పైసలు నుంచి రూ. 2.50 పైసల వరకు వడ్డీ వసూలు చేస్తున్నారని చెప్తున్నారు. మరి ముఖ్యమంత్రి ఈ వడ్డీలేని రుణాలు ఎక్కడ ఇస్తున్నట్లు?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ఈ ప్రజా వ్యతిరేక సర్కారుపై వైఎస్సార్ సీపీ అవిశ్వాసం పెడితే దానికి మద్దతివ్వకుండా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలను మరింత కష్టాల్లోకి నెట్టారని నిప్పులు చెరిగారు. ‘‘అమ్మా.. అక్కా మీ అందరికీ భరోసా ఇచ్చి చెప్తున్నా, ఒక్క ఆరు నెలలు, ఏడాది పాటు ఓపిక పట్టండి రాజన్న రాజ్యం వస్తుంది. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకానికీ జగనన్న జీవం పోస్తారు’’ అని ఆమె ప్రజలకు భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర గురువారం కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలో సాగింది. ఈ సందర్భంగా గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడులో జరిగిన రచ్చబండలో షర్మిల మహిళలతో మాట్లాడారు. 

వాళ్ల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ‘‘అమ్మా..! మూడేళ్ల కిందట రూ.1.50 లక్షలు అప్పు తెచ్చుకున్నాం... అసలు, వడ్డీ కలిసి రూ.3 లక్షలు లెక్క చేశారు. అప్పు కట్టకపోతే ఇంట్లో గిన్నెలు, సామాను తీసుకుపోతామని వెంటపడి బెదిరించారు. దిక్కు తోచక ప్రతి మహిళా సభ్యురాలు రూ. 30 వేల చొప్పున బయట అప్పు తెచ్చి కట్టినాం’’ అని అదే గ్రామానికి చెందిన నాగలక్ష్మి చెప్పిన సందర్భంలో షర్మిల పైవిధంగా స్పందించారు.

జగనన్న రైతును మళ్లీ రాజును చేస్తారు: గుడ్లవల్లేరు మండల కేంద్రంలో భారీగా తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల కొద్దిసేపు ప్రసంగించారు. షెడ్యూల్ ప్రకారమైతే ఇక్కడ షర్మిల రచ్చబండలో పాల్గొనాల్సి ఉండగా.. ఊహించని విధంగా జనం భారీగా తరలిరావడంతో ఆమె వేదికనెక్కి కొద్దిసేపు మాట్లాడారు. ‘‘రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న రైతును మళ్లీ రాజును చేస్తాడు. రైతులకు ఒక పక్క ఎరువుల ధరలు ఎక్కువైపోతే.. మరోపక్క నీళ్లు లేవు, ఇంకో పక్క కరెంటు లేదు. అన్నింటికీ మించి సర్కారు సాయం లేదు. కుదేలైపోయిన రైతన్నను ఈ సర్కారు ఏ విధంగానూ ఆదుకోవడం లేదు. రైతన్నల కష్టాలు అర్థంకాని ఈ పాలకులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసం పెడితే.. చంద్రబాబు కాంగ్రెస్ ప్రభుత్వానికి రక్షణగా నిలబడి కాపాడారు. ఇంత దుర్మార్గపు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు, ఈ ప్రజావ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికీ సమయం వచ్చినప్పుడు మీరు గట్టిగా బుద్ధి చెప్పి జగనన్నను ఆశీర్వదించిన రోజున రాజన్న రాజ్యం మళ్లీ వస్తుంది’’ అని షర్మిల ఉద్ఘాటించారు.

రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి..

‘‘రాజన్న రాజ్యంలో జగనన్న రైతులకు, మహిళలకు వడ్డీ లేకుండానే రుణాలిస్తారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర లభించేటట్టు, అవసరమైతే ప్రభుత్వమే పంట కొనుగోలు చేసేటట్టు రూ. 3 వేల కోట్లతో ఒక స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తారు. ప్రతి రైతూ అప్పుల ఊబిలోంచి బయటికి వచ్చి బాగుపడేటట్టు చేస్తారు. మన విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంటు, పేదల కోసం ఆరోగ్యశ్రీ మళ్లీ నిలబడతాయి. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత వృద్ధులకు, వితంతువులకు పింఛను రూ. 700 అవుతుంది. వికలాంగులకైతే రూ. 1000 అవుతుంది’’ అని షర్మిల వెల్లడించారు. పిల్లల చదువును తల్లిదండ్రులు భారంగా భావించే పరిస్థితి లేకుండా చేసేందుకు జగనన్న ‘అమ్మ ఒడి’ పథకం ప్రవేశపెడతారని తెలిపారు. ‘‘ఈ పథకం కింద.. కుటుంబానికి ఇద్దరు పిల్లల వరకు.. వారు పదో తరగతి చదివేంత వరకు ఒక్కొక్కరికీ రూ. 500 చొప్పున అమ్మ అకౌంట్లోనే పడతాయి. ఇంటర్మీడియెట్ చదివితే రూ.700, డిగ్రీ చదివితే రూ. 1000 అమ్మ అకౌంట్లోనే పడతాయి. అంతకంటే పెద్ద చదువులు చదివే వారికి ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం ఎలాగూ ఉండనే ఉంది. రాష్ట్రంలో గుడిసె అనేదే లేకుండా ప్రతి నిరు పేదకూ పక్కా ఇల్లు కట్టిస్తారు. పేదవాళ్లు కూడా సగౌరవంగా పెద్దాసుపత్రికి వెళ్లి ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం చేయించుకునే రోజులు మళ్లీ వస్తాయి. వైఎస్సార్ హామీ ఇచ్చినట్టు ప్రతి పేద కుటుంబానికీ నెలకు 30 కిలోల బియ్యం ఇస్తారు. ఆ రోజు వచ్చేంత వరకు మీరందరూ జగనన్నను ఆశీర్వదించాలని, వైఎస్సార్ పార్టీని బలపరచాలని, మాతో కలిసి కదం తొక్కాలని మా ప్రార్థన’’ అని ఆమె కోరారు.

13.7 కిలోమీటర్ల మేర యాత్ర..

గురువారం 111వ రోజు ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గంలోని నడపూరు గ్రామం నుంచి ప్రారంభమయింది. అక్కడి నుంచి షర్మిల నడుచుకుంటూ అగ్రహారం, రెడ్డిపాలెం, గుడివాడ నియోజకవర్గంలోని వడ్లమన్నాడు, వేమవరం, కౌతవరం మీదుగా గుడ్లవల్లేరుకు చేరుకున్నారు. ఇక్కడ వైఎస్సార్ విగ్రహానికి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ప్రజలను ఉద్దేశించి కొద్దిసేపు ప్రసంగించారు. ఇదే మండల కేంద్ర శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. గురువారం మొత్తం 13.7 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 1,517.4 కిలోమీటర్ల యాత్ర పూర్తయ్యింది. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో ఎమ్మెల్యే కొడాలి నాని, నాయకులు ఆర్కే, తలశిల రఘురాం, వాసిరెడ్డి పద్మ, కుక్కల నాగేశ్వర్‌రావు, లక్ష్మీపార్వతి, చిత్తర్వు నాగేశ్వర్‌రావు, కాపు భారతి, డాక్టర్ హరికృష్ణ, జ్యోతుల నవీన్, స్థానిక నాయకులు దూల నాగేశ్వర్‌రావు, ఉప్పాల రాంప్రసాద్‌గౌడ్, షకీరబేగ్(మాజీ ఎంపీ ఎంకే బేగ్ కుమార్తె)తదితరులున్నారు.
Share this article :

0 comments: