ఉచిత విద్యుత్ ఇవ్వటమే.. వైఎస్ చేసిన నేరమా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఉచిత విద్యుత్ ఇవ్వటమే.. వైఎస్ చేసిన నేరమా?

ఉచిత విద్యుత్ ఇవ్వటమే.. వైఎస్ చేసిన నేరమా?

Written By news on Thursday, April 4, 2013 | 4/04/2013

* ప్రజలపై ఎలాంటి పన్నులూ వేయకపోవటం వైఎస్ చేసిన పాపమా?
* విద్యుత్ ప్రాజెక్టులను ప్రైవేటుకు కట్టబెట్టిన ఘనత చంద్రబాబుది
* వైఎస్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన జెన్‌కోకే ప్రాజెక్టులు అప్పగించారు
* వైఎస్ ఎన్ని పథకాలు చేపట్టినా ప్రజలపై ఒక్క పైసా భారం వేయలేదు
* ఇప్పుడు సర్కారు ఆదాయం రెట్టింపయినా.. ప్రజలకు ఒక్క మేలూ లేదు
* రెండో రోజుకు చేరిన వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలి ‘సత్యాగ్రహం’

సాక్షి, హైదరాబాద్: ‘‘వై.ఎస్.రాజశేఖరరెడ్డి చేసిన తప్పేమిటి..? నైరాశ్యంలో మునిగివున్న రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వటం ఆయన చేసిన నేరమా? ప్రభుత్వ సంస్థ అయిన ఏపీ జెన్‌కోను బలోపేతం చేస్తూ విద్యుత్ ప్రాజెక్టులు ఇవ్వటం ఆయన చేసిన తప్పా? పరిశ్రమలను ప్రోత్సహించటానికి వాటి విద్యుత్ చార్జీల టారిఫ్‌ను తగ్గించటం ఆయన చేసిన పొరపాటా? ప్రజలపై ఎలాంటి పన్నులు విధించక పోవటమే ఆయన చేసిన పాపమా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ.. వైఎస్ విమర్శకులను సూటిగా ప్రశ్నించారు.

విద్యుత్ కోతలు, వాతలకు నిరసనగా రెండు రోజులుగా కరెంటు సత్యాగ్రహం చేస్తున్న విజయమ్మ.. బుధవారం దీక్షా శిబిరం వద్ద మీడియాతో మాట్లాడారు. వైఎస్ వల్లనే విద్యుత్ రంగం భ్రష్టు పట్టిందని టీడీపీ చేస్తున్న విమర్శలపై ఆమె తీవ్రంగా స్పందించారు. ‘‘చీకటి ఒప్పందాలు చేసుకుని విద్యుత్ ప్రాజెక్టులను ప్రైవేటు రంగానికి కట్టబెట్టిన ఘనత చంద్రబాబుది.. కానీ వైఎస్ అధికారంలోకి రాగానే విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రభుత్వ సంస్థ అయిన జెన్‌కోకు అప్పగించారు’’ అని ఆమె గుర్తు చేశారు.

జెన్‌కోను వైఎస్ బలోపేతం చేశారు... 
‘‘చంద్రబాబు విద్యుత్ ప్రాజెక్టులు ప్రయివేటు వ్యక్తులకు ఇచ్చారు. వైఎస్ ఆ పని చేయలేదు.. జెన్‌కోకు ఇచ్చారు. ముద్దనూరు వద్ద 420 మెగావాట్ల ప్రాజెక్టు పూర్తి చేయించారు. మళ్లీ 210 మెగావాట్ల ప్రాజెక్టును కూడా ఇచ్చారు. ఇపుడు పూర్తయిన 500 మెగావాట్ల భూపాలపల్లి విద్యుత్ ప్రాజెక్టు ఆయనే ఇచ్చారు. త్వరలో రాబోతున్న 1,600 మెగావాట్ల కృష్ణపట్నం ప్రాజెక్టునూ వైఎస్సే ఇచ్చారు. అసలు రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వటం తప్పా? 30 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు ఉచితంగా విద్యుత్‌ను ఇచ్చారు.

రైతులకు వైఎస్ 1,600 కోట్ల యూనిట్ల విద్యుత్‌ను ఇచ్చారు. వ్యవసాయ రంగానికి ఏడు గంటల విద్యుత్ ఇచ్చారు. భారీ ఎత్తున సాగునీటి ప్రాజెక్టులను చేపట్టారు. పరిశ్రమలకు యూనిట్‌కు 75 పైసలు చొప్పున టారిఫ్‌ను తగ్గించారు. అంతేకాదు.. రైతులు చెల్లించాల్సిన రూ. 1,300 కోట్ల విద్యుత్ బకాయిలను వైఎస్ ఒక్క కలం పోటుతో రద్దు చేశారు’’ అని విజయమ్మ వైఎస్ హయాంలో విద్యుత్ రంగంతో పాటు.. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి చేపట్టిన చర్యలను వివరించారు. వైఎస్ ఎన్ని అభివృద్ధి పథకాలు చేపట్టినా ఒక్క పైసా కూడా పన్నులు పెంచలేదని గుర్తుచేశారు.

సర్కారు ఆదాయం పెరిగినా.. ప్రజలకు ఏం చేసింది?
‘‘వైఎస్ తొలి ఏడాది పాలనలో 40 వేల కోట్ల రూపాయలుగా ఉన్న బడ్జెట్.. ఐదో ఏడాది కల్లా రూ. 1.04 లక్ష కోట్లకు చేరుకుంది. మరి ఆయన చేసినన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ఎందుకు చేయలేక పోతోంది?’’ అని ఆమె ప్రశ్నించారు. ‘‘రాష్ట్ర వార్షిక ఆదాయం 62 వేల కోట్ల రూపాయల నుంచి ప్రస్తుతం 1.27 లక్ష కోట్లకు పెరిగింది. మరి, ఇంత ఆదాయం పెరిగినపుడు అదనంగా ప్రభుత్వం ప్రజలకేమైనా చేసిందా? ఒక్క ఇల్లు అదనంగా ఏమైనా కట్టించి ఇచ్చారా? ఒక్క రేషన్ కార్డు అయినా ఇచ్చారా? కొత్తగా ఒక్క పెన్షన్ అయినా ఇచ్చారా? పోనీ పెన్షన్లు పెంచారా? అదేమీ చేయలేదు’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘చంద్రబాబు హయాంలో విద్యుత్ చార్జీలపై 89, 99 నంబరు జీవోలు తెచ్చి రైతులను వేధించారు. రైతులు ఇళ్ల వద్ద లేకుంటే వారి భార్యలను కొట్టారు. బ్రిటిష్ వారి హయాంలో మాదిరిగా రైతులను జైల్లో పెట్టి వారి గోళ్లను పీకించిన సంఘటనలు అప్పట్లో జరిగాయి’’ అని ఆమె గుర్తుచేశారు. వైఎస్ రెక్కల కష్టంతో అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలన్నా, పోరాడాలన్నా తమకు బాధగా ఉందని.. అయితే ప్రజా సంక్షేమం రీత్యా తప్పటం లేదని విజయమ్మ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రజలకు మంచి చేస్తే వారు గుండెల్లో పెట్టి చూసుకుంటారు కనుక ఆ విషయం గుర్తుంచుకుని ప్రజలపై మోపిన విద్యుత్ భారాన్ని తక్షణం రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
Share this article :

0 comments: