రాష్ట్రాల విభజన అనవసరం: సీపీఎం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్రాల విభజన అనవసరం: సీపీఎం

రాష్ట్రాల విభజన అనవసరం: సీపీఎం

Written By ysrcongress on Sunday, January 29, 2012 | 1/29/2012

భాషా ప్రాతిపదికన ఏర్పాటైన రాష్ట్రాల విభజన అనవసరమని సీపీఎం అభిప్రాయపడింది. ఈ విషయంపై తమ వైఖరిలో మార్పు లేదని తేల్చి చెప్పింది. పార్టీ 20వ మహాసభల కోసం తయారు చేసిన ముసాయిదా రాజకీయ తీర్మానాన్ని సీపీఎం అగ్రనేతలు ప్రకాశ్ కారత్, సీతారాం ఏచూరి శనివారం ఢిల్లీలో విడుదల చేశారు. ఈ నెల 17 నుంచి 20 వరకు కోల్‌కతాలో నిర్వహించిన పార్టీ కేంద్ర కమిటీ సమావేశాల్లో ఆమోదించిన ముసాయిదా తీర్మానంలో అనేక అంశాలపై పార్టీ తన వైఖరిని వెల్లడించింది. 

ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కీలక అంశం ప్రత్యేక తెలంగాణపై సీపీఎం వైఖరిని అందులో పొందుపర్చింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు డిమాండ్‌ను టీఆర్‌ఎస్ మొదలు పెట్టగా గడిచిన రెండేళ్లలో ఉద్యమం ఊపందుకుందని పేర్కొంది. బీజేపీ, ఇతర పార్టీలు అందుకు మద్దతు తెలుపుతుండగా, 2009 ఎన్నికల ముందు వరకు టీడీపీ మద్దతిచ్చిందని, తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు కూడా ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతున్నారని తెలిపింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సీపీఐ కూడా మద్దతు తెలిపిందని, అయితే భాషా ప్రాతిపదికన ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌ను విభజించకుండా సమైక్యంగా ఉంచాలని సీపీఎం స్పష్టం చేసిందని పేర్కొంది. 

తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర హోం మంత్రి ప్రకటన, అనంతరం వెనకంజ వేసి శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా కేంద్రం ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితిని ఉద్రిక్తంగా మారేలా చేసిందని విమర్శించింది. ఇకనైనా జాప్యం చేయకుండా వెంటనే తెలంగాణపై నిర్ణయాన్ని ప్రకటించాలని అభిప్రాయపడింది. తెలంగాణతో పాటు విదర్భా, గూర్ఖాలాండ్, బోడోలాండ్, కమతాపురి వంటి ప్రత్యేక రాష్ట్రాల కోసం డిమాండ్లు ఉన్నాయని వివరించింది. ఆర్థికంగా నిలదొక్కుకోలేని చిన్న రాష్ట్రాలు కేంద్రంపై పూర్తిగా ఆధారపడతాయని, దానివల్ల సమాఖ్య వ్యవస్థ బలహీన పడుతుందని సీపీఎం అభిప్రాయపడింది.
Share this article :

0 comments: