బాబును ముట్టుకోలేదేం...? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబును ముట్టుకోలేదేం...?

బాబును ముట్టుకోలేదేం...?

Written By ysrcongress on Tuesday, January 31, 2012 | 1/31/2012

నిష్పాక్షిక దర్యాప్తుకు ఆదేశించండి..
జగనే లక్ష్యంగా సీబీఐ దర్యాప్తు.. అందుకు అడుగడుగునా సాక్ష్యాలే
ప్రజా నాయకునిగా ఆయన ఎదుగుదలను కాంగ్రెస్ సహించలేకపోతోంది
వైఎస్, జగన్‌ల పరువుప్రతిష్టల్ని మంటగలిపేందుకే సీబీఐ విచారణ
జీవోలిచ్చిన మంత్రులు, అధికారులనొదిలి జగన్‌ను టార్గెట్ చేస్తోంది
సీబీఐ, ఈడీ, ఐటీలను కేంద్రం నిస్సిగ్గుగా దుర్వినియోగపరుస్తోంది
సాక్షులను బెదిరించేందుకు పశుబలం వాడుతున్న సీబీఐ..
డెలాయిట్ ఉదంతం, ఎమ్మార్ దర్యాప్తే ఇందుకు ఉదాహరణలు
ఇండియా సిమెంట్స్‌కు వైఎస్ హయాంలో 0.013 టీఎంసీల నీరిస్తే.. 
13 టీఎంసీలిచ్చారంటూ కోర్టు ముందే వక్రీకరించింది
ఎమ్మార్ పాపం బాబుదేనని తెలిసినా కనీసం విచారించలేదు
దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్నా.. ఇంతటి ఇబ్బందులు, 
భయాందోళనలు మాకెన్నడూ లేవు.. ప్రజాస్వామ్యంలో ఉన్నామా, పోలీసు రాజ్యంలోనా అని ఆవేదన కలుగుతోంది

డాక్టర్ మన్మోహన్ సింగ్ జీ,
గౌరవనీయులైన ప్రధానమంత్రికి,

గత ఏడాది ఆగస్టు 19వ తేదీన మీకు ఒక లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను. కాంగ్రెస్‌ను వ్యతిరేకించిన పార్టీలను అణచివేయడానికి సీబీఐ ఒక సాధనంగా ఎలా వ్యవహరిస్తున్నదో, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించినవైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఏదో ఒకవిధంగా ఇరికించడానికి సంశయాలను రేకెత్తించే రీతిలో ఎలా దర్యాప్తు కొనసాగిస్తున్నదో ఆ లేఖలో మీకు వివరించాను. మీరు జోక్యం చేసుకుని, సీబీఐ సరైన రీతిలో దర్యాప్తులు జరిపేలా చర్యలు తీసుకుంటారని నేనెంతో విశ్వాసంతో ఎదురుచూశాను. కానీ దురదృష్టవశాత్తూ పరిస్థితులు మరింత అధ్వానంగా మారాయి. చివరి శ్వాస వరకూ కాంగ్రెస్‌లోనే ఉండి మృతి చెందిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. పార్టీ అధిష్టానవర్గం పెత్తనాన్ని ధిక్కరించడమే కాక, బయటకు వచ్చిన తరవాత మా రాష్ట్రంలో అపూర్వమైన రీతిలో ప్రజాదరణను చూరగొని ప్రజా నాయకునిగా ఎదిగాడనే ఒకే ఒక్క కారణంతో.. వైఎస్ పరువుప్రతిష్టలను మంటగలపాలనే కృతనిశ్చయంతో సీబీఐ అతిగా వ్యవహరిస్తోంది.

సీబీఐ తాను దర్యాప్తు చేస్తున్న కేసులన్నింటినీ, 2009 మే వరకూ ఎలాంటి అధికార పదవుల్లోనూ లేని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ముడిపెట్టేందుకు ఉద్దేశపూర్వకంగానే ప్రయత్నిస్తోందని చెప్పక తప్పదని మీ దృష్టికి తెస్తున్నాను. సీబీఐ నిర్వాకం గురించి తొలుత చెప్పాలంటే.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో గానీ, కేంద్రంలో గానీ మంత్రిగా లేకపోయినా ఆయనను ప్రధాన నిందితునిగా చేస్తూ చాలా లోపభూయిష్టమైన ఎఫ్‌ఐఆర్‌ను దర్యాప్తు సంస్థ దాఖలు చేసింది. ఏ అధికార పదవుల్లోనూ లేని జగన్, ఏ ఫైళ్లలోనూ సంతకం చేసే అవకాశమే లేదు. డాక్టర్ పి.శంకర్రావు హైకోర్టులో వేసిన పిటిషన్‌కు, సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించడానికి వాస్తవికమైన ప్రాతిపదిక అయిన.. ప్రజా సంపదను లూటీ చేయడానికి ఆస్కారం కల్పించాయంటున్న అధికారిక ఉత్తర్వులను (జీవోలను) జారీ చేసిన అధికారులు, మంత్రుల చర్యలకు జగన్‌ను ఎలా బాధ్యుడిని చేస్తారు? కానీ జరిగేదంతా చూస్తుంటే సీబీఐ, బహుశా తనపై ఉన్న ఒత్తిడుల వల్ల జగన్‌నే లక్ష్యంగా చేసుకుని వ్యవహరిస్తోంది. అధికార దుర్వినియోగానికి, ప్రజా సంపదను లూటీ చేయడానికి కారణమయ్యాయన్న ఆరోపణలున్న జీవోల జారీకి కారణమైన ఇతరుల జోలికి మాత్రం పోవడం లేదు. వివాదాస్పద జీవోలే ఈ కేసుకు ప్రధాన ప్రాతిపదిక అయినా, సీబీఐ రూపొందించిన ఎఫ్‌ఐఆర్‌లో మాత్రం వాటిని జారీ చేసిన అధికారులు, మంత్రుల పేర్లు లేకపోవడం దిగ్భ్రాంతిని కలిగించే విషయం. కేంద్ర ప్రభుత్వం సీబీఐని ఇంత పచ్చిగా దుర్వినియోగం చేస్తోందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? బహుశా సదరు అధికారులు, మంత్రులు నిస్సహాయులని తమ విచారణలో తేలిందనో, మరో సాకుతోనో (అదెంత మాత్రమూ సమర్థనీయం కాకపోయినా) వారి పేర్లను చార్జిషీటు నుంచి సీబీఐ బహుశా మినహాయించి ఉండవచ్చు. కానీ ఎలా చూసినా వారందరి పేర్లనూ నిందితులుగా ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొనడం తప్ప సీబీఐకి మరో అవకాశమంటూ ఏదీ నిజానికి లేదు. ఇక వైఎస్సార్ కుటుంబం పట్ల ఆది నుంచీ శత్రుత్వమున్న కొన్ని మీడియా సంస్థలను మాత్రమే ఎంచుకుని, వాటికి మాత్రమే సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా లీక్ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో భయోత్పాతానికి తెర తీయడంలో సీబీఐ పూర్తిగా విజయవంతమైంది. తద్వారా వారు ఆశించిన లక్ష్యం కూడా సుస్పష్టమే... రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీల ఓట్లను భారీగా చీల్చుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దాని శ్రేణులు దూరం కాకపోతాయా అన్న ఆశతో దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన కుమారుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిల ప్రతిష్టను చెరిపేసేందుకు శాయశక్తులా ప్రయత్నించడం!

కోర్టులకూ తప్పుడు సమాచారం...

సీబీఐ కోర్టు నుంచి ఏదోలా సానుకూల ఉత్తర్వులు పొందే లక్ష్యంతో, వైఎస్ ప్రభుత్వం భారీ ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడిందని చిత్రించేందుకు, న్యాయమూర్తికి తప్పుడు సమాచారాన్ని అందజేయడానికి కూడా సీబీఐ వెనుకాడడం లేదు. అంతర్రాష్ట్ర వివాదం ఉందని నీటి కేటాయింపుపై ఇంజినీరింగ్ శాఖ వ్యతిరేకించినా వైఎస్సార్ ప్రభుత్వం ఇండియా సిమెంట్స్ లిమిటెడ్‌కు 13 టీఎంసీల నీటిని కేటాయించిందంటూ తాజాగా ఒక కేసులో సీబీఐ కోర్టుకు సమాచారమిచ్చింది! ఇది పూర్తిగా వాస్తవ విరుద్ధం. ఇండియా సిమెంట్స్‌కు కేటాయించింది కేవలం 0.013 టీఎంసీ మాత్రమే! కోర్టుకు సీబీఐ చెప్పినట్టుగా 13 టీఎంసీలు ఎంతమాత్రమూ కాదు. ఇందులో వివాదం కూడా ఏమీ లేదు. ఇందులో ఉన్న వాస్తవాలేమిటంటే, దేశంలోనే అతి పెద్ద సిమెంట్ ఉత్పాదక సామర్థ్యమున్న రాష్ట్రం ఆంధ్రపదేశ్. ఇక్కడ 20కి పైగా అతి పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ైవె ఎస్ రాజశేఖరరెడ్డికి ముందున్న ప్రభుత్వాలు కూడా సిమెంట్ ఫ్యాక్టరీల నిర్మాణానికి అనుమతులివ్వడం, నీరు, విద్యుత్ వసతి, సున్నపురాయి కేటాయింపు, తవ్వకాలకు అనుమతులతో పాటుగా వాటికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కూడా కల్పించాయి. ఇందులో కొత్తేమీ లేదు కూడా. దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ ఇదే చేస్తాయి. మా రాష్ట్రంలోని గత ప్రభుత్వాలు కూడా సిమెంటుతో పాటుగా అన్ని పరిశ్రమలకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలనూ ఇలాగే కల్పించాయి. మరి ఇండియా సిమెంట్స్‌కు కేటాయించిన నీటి వ్యవహారంలోనే వారికేదో మేలు చేసినట్టుగా సీబీఐ ఓ అభిప్రాయానికి ఎలా వచ్చింది? ఒక కిలో లీటర్ నీటిని 28 రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసి స్టీలు ప్లాంటుకు ఏడు రూపాయలకే ప్రతి రోజూ 200 మిలియన్ లీటర్లు కేటాయిస్తున్న విషయం సీబీఐకి తెలియదా? మరి కోర్టులకు సీబీఐ ఎందుకు తప్పుడు సమాచారమిచ్చి తప్పుదోవ పట్టిస్తోంది? మీడియాకు కూడా వాస్తవ విరుద్ధమైన సమాచారాన్ని ఎందుకు ఇస్తోంది? ఐఎంజీ భారత ప్రాజెక్టు విషయంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం నగర ప్రాంతంలోని సువిశాలమైన భూమిని ఇంచుమించు ఉచితంగా బహుమానంగా కట్టబెట్టింది. ఖరీదైన భూమిని నామమాత్రపు ధరకు ఇవ్వడమే కాక ఆ భూమిని ఒక మోసపూరిత సంస్థ అయిన ఐఎంజీ భారత పేరు మీద రిజిస్టర్ చేసుకోవడానికి బాబు ప్రభుత్వం నిధులను ఎలా సమకూర్చింది?

తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ సాక్షులను సీబీఐ బెదిరిస్తోంది. తనకున్న పశు బలాన్ని ఉపయోగించి సాక్షులను ఒత్తిడి చేస్తున్నది. జగన్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించేందుకు సీబీఐ చేయని ప్రయత్నమంటూ లేదు. తనకు కావాల్సిన విధంగా సాక్ష్యాన్ని సేకరించడానికి 164 సీఆర్‌పీసీ కింద సాక్షులను నయానా, భయానా బెదిరించి.. జగన్‌కు వ్యతిరేకంగా వాంగ్మూలాన్ని సేకరిస్తోంది. రాష్ట్ర ప్రజల మనోగతాన్ని ఏ మాత్రమూ అర్థం చేసుకోకుండా, జగన్‌ను ఏదోలా ఇరికించి, ఆయనపై అనర్హత వేటు వేయించాలనే ప్రయత్నం జరుగుతోంది. తాజాగా జరిగిన రెండు ఉదంతాలే ఇందుకు నిదర్శనం. డెలాయిట్ సంస్థ ద్వారా జగతి సంస్థ అంతర్గత వినియోగం కోసం వాటాల విలువ కట్టిన నివేదిక ఒకటి. ఎమ్మార్ దర్యాప్తు రెండోది.

డిస్‌క్లెయిమర్ కూడా కన్పించదా...?

మొదటి కేసులో జగతి డెరైక్టర్ విజయసాయిరెడ్డి తమను ఒత్తిడి చేసి, సంస్థ వాటాల విలువలను ఎక్కువగా పెంచుతూ నివేదిక తీసుకున్నారని, ముందు తేదీతో నివేదిక ఇమ్మన్నారని డెలాయిట్ సంస్థ ప్రతినిధి ద్వారా న్యాయమూర్తి ముందు వాంగ్మూలం తీసుకున్నారు. తమ నివేదిక జగతి అంతర్గత అవసరాలకు మాత్రమే తప్ప, బయటి నుంచి పెట్టుబడి పెట్టేవారికోసం కాదని డెలాయిట్ ముందే స్పష్టంగా పేర్కొంది. నివేదిక ఆధారంగా పెట్టుబడులు పెట్టరాదని స్పష్టంగా నిర్దేశించినప్పుడు, దాని ఆధారంగానే పెట్టుబడులు వచ్చాయనడానికి ఆస్కారమెక్కడిది? నివేదికలో డిస్‌క్లెయిమర్ క్లాజు ఉన్నా, సీబీఐ మాత్రం డెలాయిట్ నివేదిక వల్లే ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టారని నమ్మబలుకుతోంది. అలా చెప్పని పక్షంలో జగన్‌కు వ్యతిరేకంగా అసలు కేసే లేదు. అందుకే సీబీఐ ఆదరాబాదరా డెలాయిట్ ప్రతినిధి నుంచి 164 సీఆర్‌పీసీ కింద స్టేట్‌మెంట్ తీసుకుంది. దాని ఆధారంగానే విజయసాయిరెడ్డిని అరెస్టు చేసింది. 300 గంటల పాటు అధికారికంగా ప్రశ్నించినా, సీబీఐకి ఇందుకు సంబంధించి రవ్వంతైనా నష్టపూరితమైన సమాచారం లభించలేదు. దాంతో ఇప్పుడు ఆనయకు నార్కో అనాలసిస్ చేయించాలంటోంది. అవి రాజ్యాంగంలోని 20(3) అధికరణకు పూర్తి విరుద్ధమని సుప్రీంకోర్టు ఇప్పటికే పేర్కొందని తెలిసీ, చేయించాలని కోరిందంటే.. జగన్‌కు సన్నిహితంగా ఉన్న వారందరినీ భయపెట్టాలన్నదే ఉద్దేశంగా కనబడుతోంది.
ఇక ఎమ్మార్ కేసులో ప్రధాన సూత్రధారి తుమ్మల రంగారావుకు.. కేసు నుంచి బయట పడే మార్గం చూపుతానని వాగ్దానం చేయడం ద్వారా.. వైఎస్సార్ కుటుంబానికి సన్నిహితుడైన సునీల్‌రెడ్డికి రూ.80 కోట్లు అందజేశానని 164 సీఆర్‌పీసీ కింద అతని నుంచి మేజిస్ట్రేట్ సమక్షంలో సాక్ష్యం తీసుకున్నారు. చదరపు గజానికి రూ.5,000 కంటే ఎక్కువగా వసూలు చేసిన సొమ్ముగా దాన్ని చూపించారు. అదే కారణంపై సునీల్‌ను వెంటనే అరెస్టు చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో కోట్లాది రూపాయల బ్లాక్ మనీ కార్యకలాపాలతో సహా అన్ని రకాల అవకతవకలకూ పాల్పడ్డ రంగారావు సాక్ష్యాన్ని నమ్మి సునీల్‌ను అరెస్టు చేసి, రంగారావును మ్రాతం వదిలేయడం చూస్తేనే.. సీబీఐ దర్యాప్తు నిజమైన దోషులను పట్టుకునే దిశలో కాకుండా, జగనే లక్ష్యంగా సాగుతోందని అర్థంమవుతోంది. లేకుంటే.. మొత్తం కుంభకోణంలో వందలాది కోట్ల రూపాయలు చేతులు మారడానికి, దుబాయ్‌లోని కోనేరు ప్రసాద్ కుమారుల ఖాతాల్లోకి తరలి వెళ్లడానికి కారకుడు రంగారావేనని ప్రాథమిక దశలోనే తేలినా.. ఎందుకు ఇంతవరకూ అతన్ని అరెస్టు చేయలేదు? ఎమ్మార్‌లో వసూలు చేసిన అధిక మొత్తంలో కొంత భాగం అన్ని పార్టీలకూ బ్లాక్‌లో అందినట్టు ప్రధాన సూత్రధారి వెల్లడించారంటూ కొద్ది రోజుల క్రితం ఓ వర్గం మీడియాకు సీబీఐ ఉద్దేశపూర్వకంగా లీకులిచ్చింది. కానీ దాని గురి మాత్రం జగన్ వైపే కొనసాగుతోంది. రంగారావు ఇచ్చాడంటున్న సాక్ష్యంలో ప్రస్తావించిన ఇతరులెవరినీ ప్రస్తావించడం కూడా లేదు!

బాబును ముట్టుకోలేదేం...?

ఎమ్మార్ ఉదంతంలో తొలి నుంచీ అప్పటి ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ప్రమేయమున్నట్టుగా సీబీఐకి స్పష్టంగా తెలిసినా, ఆయనను ఇప్పటి వరకూ విచారించిన పాపాన పోలేదు. అరెస్టు చేయడం దేవుడెరుగు, కనీసం ఆయన స్టేట్‌మెంట్‌ను కూడా తీసుకోలేదు. ఎమ్మార్ ప్రాజెక్టుకు పరోక్ష యజమాని కోనేరు ప్రసాదని ఈ దేశంలో అందరికీ తెలుసు. బాబుతో ఆయనకు దీర్ఘకాలికంగా సన్నిహిత సంబంధాలున్నాయనీ, ఆయనకు మంచి మిత్రుడనీ అందరికీ తెలుసు. ఎకరా రూ.4 కోట్లుచేసే 285 ఎకరాల స్థలాన్ని కేవలం ఎకరా రూ.29 లక్షలకు మాత్రమే బాబు కట్టబెట్టారు. సరిగ్గా ఈ స్థలానికి పక్కనే ఉన్న తన భార్య స్థలాన్ని మాత్రం అంతకు మూడేళ్ల ముందే ఎకరా రూ.కోటి చొప్పున అమ్ముకున్నారు. ఖజానాకు ఇదెంత నష్టం? కనీసం వందల కోట్లలో ఉంటుంది. సీబీఐ మాత్రం ఈ వాస్తవాలను వేటినీ పట్టించుకోలేదు. అభివృద్ధి కోసం ఈ స్థలాన్ని మూడో పార్టీకి ఇవ్వడానికి వీలు కల్పిస్తూ 2003 ఆగస్టు 19న బాబు జీవో నంబరు 359ని ఎందుకిచ్చారో సీబీఐ అసలు పరిగణనలోకి తీసుకోలేదు! ఈ ఒప్పందపు సవరణే మొత్తం కుంభకోణానికీ కీలకం. అదే లేకుంటే తదుపరి కుంభకోణానికి ఆస్కారముండేదే కాదు. కానీ ఈ దిశగా అసలు సీబీఐ దర్యాప్తే చేయలేదు. ప్రాజెక్టును కేటాయించిన టెండర్ల విధానాన్ని మించిన ప్రహసనం మరోటి ఉండబోదు! ఐదు సంస్థలు ముందుకొస్తే, సోమ్ ఏషియా, షాపూర్‌జీ పల్లోంజీలను కమిటీ నిరాకరించింది. మిగతా మూడు సంస్థల్లో అన్నీ బాబుతో సంబంధాలున్నవే. ఎల్ అండ్ టి, ఐఓఐ రెండింటికీ ఆయన మరో రకంగా లబ్ధి చేకూరినందున అవి బిడ్లను ఉపసంహరించుకున్నాయి. ఎమ్మార్‌కు మార్గం సుగమం చేయడానికే ఇదంతా జరిగింది. ఎల్ అండ్ టికి హైటెక్ సిటీ నిర్మాణం, కాకినాడ పోర్టు పనులు లభించాయి. ఇందులోనూ పెద్ద కుంభకోణమే చోటుచేసుకుంది. రైట్స్ సంస్థ ఎల్ అండ్ టి కన్సార్టియమ్‌కు సిఫార్సు చేయకపోవడంతో ప్రభుత్వాధికారులతో కమిటీ అన్ని నిబంధనలనూ తోసిరాజని ఆ సంస్థకు పోర్టు పనులు కట్టబెట్టింది. ఎల్ అండ్ టి డెరైక్టర్ రామకృష్ణ, ఐఓఐ చుక్కపల్లి సురేశ్ బాబుకు అత్యంత సన్నిహితులు. బిడ్ల నుంచి నిష్ర్కమించిన ఐఓఐ సంస్థకు జెమ్స్ అండ్ జ్యుయెల్ పార్కును, హైటెక్ సిటీ రెండో దశ ప్రాజెక్టునూ కట్టబెట్టారు.

చిరకాల మిత్రులైన బాబు, కోనేరు కలిసి మరో కుట్ర పన్నారు. ప్రాజెక్టును రెండుగా విభజించి అత్యధిక లాభాలిచ్చే టౌన్‌షిప్‌లో 74 శాతం ఈక్విటీ ఎమ్మార్‌కు, 26 శాతం ఈక్విటీ ఏపీఐఐసీకి ఉండేలా చూశారు. మరో దీర్ఘకాలిక ప్రాజెక్టయిన కన్వెన్షన్ సెంటర్, స్టార్ హోటల్‌లో మాత్రం 49 శాతం షేర్లు ఏపీఐఐసీకి, మిగతా షేర్లు ఎమ్మార్‌కు ఉండేలా చేశారు. దీనికన్నా మరో మోసం, కుంభకోణం ఇంకేమైనా ఉంటుందా? సీబీఐ ఎందుకు ఈ కుంభకోణం దిశగా దృష్టి సారించలేదు? రాష్ట్ర ప్రభుత్వాన్ని మోసం చేయడానికి కారణమైన కోనేరు ప్రసాద్, చంద్రబాబులను ఎందుకు పట్టించుకోలేదు? అందరికీ అనుమానాలు కలిగిస్తున్న ఈ విషయంలో సీబీఐ ఇక్కడి నుంచి ఎందుకు దర్యాప్తు ప్రారంభించలేదు? అసలు సునీల్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేయడమే ఒక పెద్ద మిస్టరీగా ఉంది. ప్రజల్లో వైఎస్ రాజశేఖరరెడ్డికి ఉన్న పరువుప్రతిష్టలను మంటగలిపేందుకే ఇలా చేస్తున్నారనేది స్పష్టం కావడం లేదా? వైఎస్ కుమారుడు జగన్ కాంగ్రెస్ అధిష్టానవర్గం పెత్తనాన్ని సవాలు చేసినందుకేననేది స్పష్టం కావడం లేదా? ఎమ్మార్ కుంభకోణంలో సూత్రధారిగా బాబు పాత్ర ఉన్నట్టు స్పష్టంగా రుజువులున్న తరవాత కూడా, ఆయనను అరెస్టు చేయడం మాట దేవుడెరుగు, కనీసం పిలిపించి ప్రశ్నించే విషయాన్ని కూడా సీబీఐ పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం తమిళనాడు గవర్నర్‌గా ఉన్న కె.రోశయ్య(అప్పటి ఆర్థిక మంత్రి) నేతృత్వంలోని మంత్రివర్గం ఉపసంఘం సిఫార్సుల మేరకే కన్వెన్షన్ సెంటర్ ప్రాజెక్టులో ఏపీఐఐసీ వాటాను అప్పట్లో వైఎస్సార్ ప్రభుత్వం 26 శాతానికి తగ్గించింది. దీని వల్ల ఎలాంటి న్యాయపరమైన హక్కులు పోకుండా ఎక్కువ ఆర్థికపరమైన భారం పడకుండా ఉంటుంది.

కాంగ్రెస్‌ది ఆది నుంచీ అదే తీరు..

మనలో చాలా మందిమి దశాబ్దాల తరబడి ప్రజా జీవితంలో ఉన్నాం. కానీ మేం ఇప్పుడు పడుతున్నన్ని ఇబ్బందులు, గురవుతున్నంత భయాందోళనలను గతంలో ఎన్నడూ చవిచూడలేదు. మేం జీవనం సాగిస్తున్నది చట్టబద్ధమైన పాలన ఉన్న స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యంలోనేనా, లేక పోలీసు రాజ్యంలోనా అని ఆశ్చర్యం, ఆవేదన కలుగుతున్నాయి. పైన పేర్కొన్న సీబీఐ చర్యలన్నీ న్యాయస్థానం ఆదేశాల మేరకే జరుగుతున్నాయనడాన్ని మేం విభేదించడం లేదు. అలాగే న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులకు దురుద్దేశాలు ఆపాదించే స్థాయికి దిగజారడం కూడా లేదు. అది కోర్టు ధిక్కారమవుతుందనే భయంతో మాత్రం కాదు, న్యాయస్థానాల పట్ల మాకున్న గౌరవాభిమానాలతో మాత్రమే! పిటిషనర్లు సమర్పించిన ప్రాథమిక సాక్ష్యాల ఆధారంగా కోర్టు సీబీఐ విచారణకు ఆదేశించినందుకు మాకు రవ్వంత కూడా వ్యతిరేకత లేదు. కానీ మాకున్న ఫిర్యాదల్లా.. తమ రాజకీయ బాసుల ఆదేశాల మేరకు కేసుల్లో సీబీఐ విచారణ జరుపుతున్న తీరుపైనే! కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 1975లో తీసుకున్న ఓ చర్యను ఇక్కడ వివరిస్తాను. కొందరు పిటిషనర్లు సమర్పించిన కొన్ని ప్రాథమిక సాక్ష్యాల ఆధారంగా.. మచ్చలేని మహానాయకులైన జయప్రకాశ్ నారాయణ్, మొరార్జీ దేశాయ్, నానాజీ దేశ్‌ముఖ్, అటల్ బిహారీ వాజ్‌పేయి, చరణ్‌సింగ్, మధు దండావతే, మధు లిమాయే, జార్జి ఫెర్నాండెజ్, ఎల్.కె.అద్వానీ వంటి నాయకులతో పాటు లక్షలాది మందిని కేవలం కాంగ్రెస్‌ను వ్యతిరేకించినందుకు జైళ్లలో ఉంచింది. న్యాయమూర్తులనూ సస్పెండ్ చేశారు. రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్నే మార్చేవిధంగా లోక్‌సభ పదవీకాలాన్ని ఆరేళ్లకు పొడిగిస్తూ రాజ్యాంగంలో సవరణ తె చ్చి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. ఈ అస్తవ్యస్త పరిస్థితిని జాతి మొత్తం నిశ్ఛేష్టమై నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది. మొత్తం ప్రజాస్వామిక హక్కులను కాలరాసినపుడు ఏమీ చేయలేకపోయింది. మీలాంటి వ్యక్తి పరిపాలనలో మళ్లీ అలాంటి అప్రజాస్వామిక పరిస్థితి ఈ దేశంలో తలెత్తకూడదనే మేం ఆశిస్తున్నాం.

తమ అధికార పెత్తనాన్ని ప్రశ్నించే వారందరినీ నిర్మూలించేందుకు, తమ కనుసన్నల్లో ఉండని వారెవరినైనా శిక్షించేందుకు సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖ వంటివాటిని కేంద్ర ప్రభుత్వం నిస్సిగ్గుగా దుర్వినియోగపరుస్తున్న తీరుపై ఫిర్యాదు చేస్తున్న వారిలో మేం మొదటి వ్యక్తులం ఎంతమాత్రమూ కాదు. గత డిసెంబర్ 27, 29 తేదీల్లో లోక్‌సభలో, రాజ్యసభలో లోక్‌పాల్ బిల్లుపై జరిగిన చర్చల్లో.. సీబీఐని కేంద్ర ప్రభుత్వం ఎలా దుర్వినియోగం చేస్తోందో చెబుతూ ఒక్క కాంగ్రెస్ తప్ప అన్ని పార్టీలూ తప్పుబట్టాయి. సీబీఐని అడ్డం పెట్టుకుని తమ పట్ల వ్యక్తం అవుతున్న అసమ్మతిని అణచి వేసేందుకు, ప్రతిపక్ష రాజకీయ పార్టీలను అణగ దొక్కేందుకూ ఎలా వ్యవహరిస్తోందో వివరించాయి.

అంతిమంగా నేను మనవి చేసేది ఒక్కటే...

సీబీఐ మీ పరిపాలనా నియంత్రణలోనే నడిచే సంస్థ. నిజాయితీ గల మీలాంటి వ్యక్తి ఈ పరిణామాలన్నింటినీ చూసే ఊరుకుంటున్నారని మేం అనుకోవడం లేదు. అందుకే తమ రాజకీయ బాసుల ఒత్తిళ్లకు లోను కాకుండా నిష్పాక్షికంగా దర్యాప్తు నిర్వహించేలా సీబీఐని ఆదేశించాల్సిందిగా మీకు మేం విజ్ఞప్తి చేస్తున్నాం.

వైఎస్ విజయమ్మ,
గౌరవాధ్యక్షురాలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
Share this article :

0 comments: