ఉప ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వానికి నూకలు చెల్లినట్లే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఉప ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వానికి నూకలు చెల్లినట్లే

ఉప ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వానికి నూకలు చెల్లినట్లే

Written By ysrcongress on Friday, February 3, 2012 | 2/03/2012

ఉప ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కనుమరుగవుతుందని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో 24 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వానికి నూకలు చెల్లినట్లేనని అన్నారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. పదవీ కాలం ముగిసి సంవత్సరమవుతున్నా మండల, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేనిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. గ్రామాల్లోకి వెళ్లడానికి కాంగ్రెస్ నాయకులు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ చేపట్టిన పథకాలన్నీ అమలు కావాలంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. తనపై అనర్హత వేటు వేయాలంటే పీఆర్పీ విలీనం కాకుండా ఉండాలన్నారు. పార్టీయే లేనపు్పుడు విప్ ఎలా జారీ చేస్తారని ప్రశ్నించారు.


కొందరిని కాపాడుతూ, మరికొందరిని ఇరికిస్తోంది
బాబు హయాంలో తప్పులు జరిగితే ఆయన బాధ్యత ఉండదా?
వైఎస్ హయాంలో జరిగిన వాటికి మాత్రం వైఎస్సే బాధ్యుడా?

దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థయిన సీబీఐ కొందరు నాయకుల గుప్పిట్లో ఉంటూ, ఒక రాజకీయ పార్టీ చెప్పినట్లుగా వ్యవహరిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కోఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ ధ్వజమెత్తారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో వేసిన చార్జిషీటులో తాను కావాలనుకున్న వారిని కాపాడి, కాదనుకున్న వారిని ఇరికించడమే ఇందుకు నిదర్శనమని దుయ్యబట్టారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... 2002లో 359 జీవో ద్వారా ఎమ్మార్‌కు 535 ఎకరాల భూమిని కేటాయించడంలో లోపాలు జరిగాయని ఐఏఎస్ అధికారులు ఎల్.వి.సుబ్రమణ్యం, కె.వి.రావులను ముద్దాయిలుగా చేసిన సీబీఐ, అపుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబునాయుడుకు మాత్రం అందులో ఎలాంటి సంబంధం లేదని ఎలా భావించిందని సూటిగా ప్రశ్నించారు. బాబు హయాంలో జరిగిన తప్పులతో ఆయనకేమీ సంబంధం లేదన్నట్లుగా వదలి వేసి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జారీ అయ్యాయని చెబుతున్న జీవోలకు వైఎస్సార్‌ను, ఆయన తనయుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డినీ నిందితులుగా ఎలా చేరుస్తారని నిలదీశారు. 

జగన్‌పై వేసిన కేసులు కాంగ్రెస్ మాజీ మంత్రి, టీడీపీ నేతలు కలిసి చేసినవేనని గుర్తు చేశారు. ప్రజాధనాన్ని కొల్లగొట్టడానికి కారణమయ్యాయని ఆరోపిస్తూ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న 26 జీవోల్లో దుర్వినియోగం జరిగిందేమో సీబీఐ నిరూపించిందా...? ఈ విషయమై మంత్రులను, అధికారులను విచారించిందా? అని ఆయన నిలదీశారు. బాబును వదిలేసి వైఎస్‌నూ, ఆయన కుమారుడిని నిందితులుగా చేస్తున్నారంటే దీని వెనుక టీడీపీ, కాంగ్రెస్ మిలాఖత్ అయినట్లు స్పష్టంగా తెలుస్తోందని ధ్వజమెత్తారు. ఎమ్మార్ ఉదంతంలో కొలాబరేషన్ ఒప్పందం కూడా బాబు హయాంలో జరిగినా సీబీఐ పట్టించుకోలేదని తప్పుబట్టారు. తనపై సీబీఐ విచారణ జరక్కుండా చంద్రబాబు కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకున్నారనీ, ఆయన దర్యాప్తునకు సిద్ధపడితే ప్రజలు హర్షిస్తారని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడతానని చంద్రబాబు హామీ ఇచ్చినందుకు ప్రతిఫలంగానే ఆయనపై సీబీఐ విచారణ లేకుండా కాంగ్రెస్ అధిష్టానం చూస్తోందని ఆరోపించారు. విజయసాయిరెడ్డిని నార్కో పరీక్షలకు అనుమతిని నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన స్వాగతించారు. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు విరుద్ధమని గతంలో కూడా సుప్రీంకోర్టు తీర్పు నిచ్చిన విషయం తెలిసి కూడా సీబీఐ పిటిషన్ వేసిందని కొణతాల విమర్శించారు. 

బాబు వ్యాఖ్యలు అసంబద్ధం

తన హయాంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులు పునీతులనీ, దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి పాలనలో వారంతా అవినీతి పరులయ్యారనీ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అసంబద్ధంగా ఉన్నాయని కొణతాల ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా ఎవరున్నా అధికార యంత్రాంగం ఒక్కటేననీ, తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలా మాట్లాడ్డం అభ్యంతరకరమని విమర్శించారు. దువ్వూరి సుబ్బారావు రిజర్వుబ్యాంకు గవర్నర్ కావడం, సంపత్ కేంద్ర ఎన్నికల కమిషనర్ కావడం కూడా తన గొప్పేనని టీడీపీ అధినేత చెప్పుకోవడం వింతగా ఉందన్నారు. వాస్తవానికి వీరిద్దరూ కూడా చంద్రబాబు రాజకీయాల్లోకి రాక మునుపే 1973 సంవత్సరంలో ఐఏఎస్‌లైన అధికారులని చెప్పారు. ప్రభుత్వంలో పనిచేస్తున్న వారంతా సివిల్ సర్వీసెస్‌ద్వారా వచ్చిన వారైతే... బాబు తానే ఒక స్కూలును స్థాపించి వారికి శిక్షణ ఇచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. బాబు తన గొప్ప కోసం ఒక వ్యవస్థనే నిర్వీర్యం చేసే విధంగా మాట్లాడుతున్నారని ఆయన తప్పుబట్టారు. 
Share this article :

0 comments: