2జీ స్కాంలో రాజాపై విచారణకు అనుమతివ్వడానికి అంత సమయమా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 2జీ స్కాంలో రాజాపై విచారణకు అనుమతివ్వడానికి అంత సమయమా?

2జీ స్కాంలో రాజాపై విచారణకు అనుమతివ్వడానికి అంత సమయమా?

Written By ysrcongress on Wednesday, February 1, 2012 | 2/01/2012

న్యూఢిల్లీ: 2జీ కేసులో యూపీఏ సర్కారుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది! ఈ కుంభకోణంలో నాటి కేంద్ర మంత్రి ఎ.రాజా ప్రమేయంపై విచారణకు అనుమతివ్వడంలో ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) అలవిమాలిన జాప్యం చేసిందని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. రాజాను విచారించేందుకు అనుమతిచ్చే అంశాన్ని ఏకంగా 16 నెలలపాటు తొక్కిపెట్టడంపై ఆశ్చర్యం వ్యక్తంచేసింది. అవినీతి అధికారులపై విచారణకు అనుమతి ఇవ్వాలా వద్దా అన్న విషయాన్ని నాలుగు నెలల్లోపే తేల్చేయాలని స్పష్టంచేసింది. ఒకవేళ ఈ సమయం మించిపోయినా నిర్ణయాన్ని వెలువరించకపోతే.. విచారణకు అనుమతి ఇచ్చినట్టుగానే పరిగణించాలని తెలిపింది. 2జీ స్కాంలో రాజాపై విచారణకు అనుమతించడంలో ప్రధాని కార్యాలయం తీవ్ర జాప్యం చేసిందని ఫిర్యాదు చేస్తూ జనతాపార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం విచారణకు స్వీకరించింది.

ఈ సందర్భంగా పీఎంవో తీరుపై న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇంతకుముందు ఇదే పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. రాజాను విచారించేలా ప్రధానికి ఎలాంటి ఆదేశాలు వెలువరించలేమని తీర్పు చెప్పింది. అయితే ఢిల్లీ హైకోర్టు తీర్పును తాజాగా సుప్రీంకోర్టు పక్కనపెట్టింది. అవినీతి అధికారులపై విచారణ కోరే రాజ్యాంగ హక్కు ప్రతి పౌరుడికి ఉంటుందని పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జస్టిస్ జీఎస్ సింఘ్వీ, జస్టిస్ ఏకే గంగూలీలతో కూడిన ధర్మాసనం స్పష్టంచేసింది. అవినీతి అధికారులపై విచారణకు అనుమతిచ్చే విషయాన్ని నాన్చొద్దని సూచించింది. ‘‘అనుమతివ్వడంపై నిర్దిష్ట కాలపరిమితిలోగా నిర్ణయం తీసుకోవాలి. ఈ అంశంలో 1996లో వినీత్ నరేన్ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన మార్గదర్శకాలకు అనుగుణంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి. ఒకవేళ సంబంధిత యంత్రాంగం నాలుగు నెలలైనా ఎలాంటి నిర్ణయం వెలువరించకపోతే.. అనుమతి ఇచ్చినట్టుగానే పరిగణించాలి’’ అని ధర్మాసనం తెలిపింది. వాదనల సందర్భంగా.. విచారణ కోరే హక్కు సుబ్రహ్మణ్యస్వామికి లేదన్న అటార్నీ జనరల్ జీఈ వాహనవతి వ్యాఖ్యలను కోర్టు తప్పుపట్టింది. ఒక అవినీతి అధికారిపై విచారణకు అనుమతించాలని కోరే హక్కు ప్రైవేటు వ్యక్తికి కూడా ఉంటుందని స్పష్టంచేసింది.


ప్రధాని సలహాదారులు సరిగా వ్యవహరించలేదు..
2జీ కేసులో నాటి మంత్రి రాజాపై విచారణకు అనుమతిచ్చే విషయంలో.. ప్రధానికి సలహాలిచ్చే అధికారులు సరిగా వ్యవహరించలేదని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘‘ఈ కేసు తీవ్రతను ప్రధానికి వారు వివరించలేదు. కేసుకు సంబంధించిన అన్ని వాస్తవాలను, న్యాయ సంబంధ అంశాలను ప్రధానికి నివేదించడంలో సంబంధిత అధికారులు విఫలమయ్యారు. ఒకవేళ వారు అన్ని అంశాలను ఆయన దృష్టికి తీసుకువచ్చి ఉంటే.. ప్రధాని సకాలంలోనే సరైన నిర్ణయం తీసుకుని ఉండేవారనడంలో మాకు ఎలాంటి సందేహం లేదు’’ అని కోర్టు పేర్కొంది. సాధారణంగా ప్రధాని తన ముందుకు వచ్చే అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించలేరని, అందుకని సలహాదారులు, ఆధికారులపై ఆధారపడాల్సి వస్తుందని ధర్మాసనం వ్యాఖ్యానించడం గమనార్హం.

‘అనుమతి’ నిబంధనపై పార్లమెంటు జోక్యం చేసుకోవాలి
ఎవరైనా అధికారిపై విచారణ జరపాలంటే అందుకు పైఅధికారి నుంచి అనుమతి తీసుకోవాలని పేర్కొంటున్న ‘అవినీతి నిరోధక చట్టం’లోని సెక్షన్ 19 విషయంలో పార్లమెంటు జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. దీన్ని మరింత సహేతుకంగా, న్యాయబద్ధమైనదిగా మార్చాల్సిన అవసరం ఉందని జస్టిస్ ఏకే గంగూలీ అన్నారు. ఈ మేరకు ఆయన పార్లమెంటు పరిశీలన కోసం కొన్ని మార్గదర్శకాలను ఉటంకించారు. అవేంటంటే... అవినీతి అధికారిపై విచారణకు అనుమతి కోరుతూ వచ్చిన అభ్యర్థనలపై సంబంధిత యంత్రాంగం (కాంపిటెంట్ అథారిటీ) మూడు నెలలలోపు నిర్ణయం తీసుకోవాలి.

అటార్నీ జనరల్ లేదా సొలిసిటర్ జనరల్ లేదా అడ్వొకేట్ జనరల్‌తో సంప్రదించాల్సిన అవసరం ఏర్పడితే మరో నెల సమయం తీసుకోవచ్చు. అయితే వారిని సంప్రదించాలని భావించిన పక్షంలో... మొదటి మూడు నెలలోనే వారికి ఆ సమాచారాన్ని రాతపూర్వకంగా అందజేయాలి. ఈ విషయాన్ని ఫిర్యాదుదారుకు, దర్యాప్తు అధికారులకు కూడా తప్పకుండా తెలియజేయాలి. అప్పటికి కూడా.. అంటే నాలుగు నెలలు పూర్తయినా నిర్ణయం రాకుంటే విచారణకు అనుమతి ఇచ్చినట్టుగానే పరిగణించాలి. తర్వాత సంబంధిత దర్యాప్తు అధికారులు/ఫిర్యాదుదారు.. కోర్టులో చార్జిషీటు/ఫిర్యాదు దాఖలు చేసేందుకు అనుమతించాలి.

అవినీతి ప్రజాస్వామ్యానికే ముప్పు..
అవినీతి అధికారులపై విచారణకు అనుమతి కోరుతూ వచ్చే కేసుల్లో మూడింట ఒక వంతుకుపైగా కేసులను నిరాకరిస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ సందర్భంగా దేశాన్ని పట్టిపీడిస్తున్న అవినీతిని కోర్టు ప్రముఖంగా ప్రస్తావించింది. ‘‘ఈ రోజుల్లో అవినీతి అనేది రాజ్యాం గబద్ధపాలనకు ప్రమాదకరంగా మారడమేకాదు.. భారత ప్రజాస్వామ్యానికి, చట్టానికి పెను ముప్పుగా పరిణమిస్తోంది’’ అని తెలిపింది.

షేక్స్‌పియర్‌ను ఉటంకించిన ధర్మాసనం
సుప్రీం కోర్టు తన తీర్పులో ప్రధాని పరిస్థితిని వివరించేందుకు షేక్స్‌పియర్‌ను ఉటంకించింది. మాజీ మంత్రి రాజాపై విచారణకు అనుమతించేందుకు పీఎంవో చోటు చేసుకున్న జాప్యాన్ని ప్రస్తావిస్తూ ధర్మాసనం షేక్స్‌పియర్ నాటకం ‘కింగ్ హెన్రీ-4’లోని ‘కిరీటాన్ని ధరించిన తలకే అసౌకర్యం ఉంటుంది’ అనే వాక్యాన్ని ఉటంకించింది. ప్రాసిక్యూషన్‌కు అనుమతించడంలో జాప్యం చోటు చేసుకోవడం దురదృష్టకరమంది. ఇందులో దురుద్దేశాలేవీ ఉన్నట్లు ఆరోపణలు లేవని, అప్పీలు దాఖలు చేసుకున్న పిటిషనర్ సైతం జాప్యానికి ప్రధాని కారణమయ్యారనే ఆరోపణ చేయలేదని గుర్తు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.
Share this article :

0 comments: