‘ఎమ్మార్ హిల్స్ టౌన్‌షిప్’ సీఈఓ విజయరాఘవన్‌ను అరెస్టు చేసిన సీబీఐ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘ఎమ్మార్ హిల్స్ టౌన్‌షిప్’ సీఈఓ విజయరాఘవన్‌ను అరెస్టు చేసిన సీబీఐ

‘ఎమ్మార్ హిల్స్ టౌన్‌షిప్’ సీఈఓ విజయరాఘవన్‌ను అరెస్టు చేసిన సీబీఐ

Written By ysrcongress on Sunday, January 29, 2012 | 1/29/2012

30 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించిన కోర్టు
ఎమ్మార్ లావాదేవీల్లో ఈయనదే ప్రధాన పాత్ర: సీబీఐ
ఎక్కువ ధరకు విక్రయాలు జరిపి లెక్కలు చూపలేదు... కేటాయింపు లేఖలన్నీ ఆయనే జారీ చేశారు.. 

హైదరాబాద్, న్యూస్‌లైన్:ఎమ్మార్ కేసులో మరో అరెస్టు చోటుచేసుకుంది. ఎమ్మార్ హిల్స్ టౌన్‌షిప్ ప్రైవేట్ లిమిటెడ్(ఈహెచ్‌టీపీఎల్) ముఖ్య నిర్వహణాధికారి(సీఈఓ) విజయరాఘవన్‌ను సీబీఐ అధికారులు శనివారం సాయంత్రం అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. విజయరాఘవన్‌కు ఈ నెల 30 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి బి.నాగమారుతీశర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే సమయంలో విజయరాఘవన్‌ను 15 రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని సీబీఐ అధికారులు పిటిషన్ కమ్ రిమాండ్ రిపోర్టు దాఖలు చేశారు. ఎమ్మార్ హిల్స్ టౌన్‌షిప్, గోల్ఫ్‌కోర్స్ ప్రాజెక్టుల వ్యవహారాల్లో విజయరాఘవన్ కీలక వ్యక్తని ఇందులో సీబీఐ పేర్కొంది.

రూ.50 వేలకు అమ్మి.. రూ.5 వేలుగా..


విల్లాలను చదరపు గజం రూ.20 వేల నుంచి రూ.50 వేల చొప్పున విక్రయించి.. పుస్తకాల్లో మాత్రం రూ.5 వేలకు విక్రయించినట్లు చూపారని, ఈ లావాదేవీల్లో ప్రధాన పాత్ర పోషించింది రాఘవనేనని సీబీఐ పిటిషన్ కమ్ రిమాండ్ రిపోర్టులో వివరించింది. ఇలా ఎక్కువ ధరకు విక్రయించడం ద్వారా వచ్చిన సొమ్ముకు ఎక్కడా లెక్కలు చూపలేదని తెలిపింది. విక్రయాలు పూర్తయిన తరువాత.. వాటి కేటాయింపుల లేఖలన్నింటినీ విజయరాఘవనే జారీ చేశారని, ఎమ్మార్ ఎంజీఎఫ్, ఈహెచ్‌టీపీఎల్ తరఫున అన్ని ఒప్పందాల్లోనూ సంతకాలు ఆయనవేనని పేర్కొంది. ఎమ్మార్‌లో దాని యాజమాన్యం, ఉన్నత వర్గాలకు చెందిన పలువురు వ్యక్తులేవిల్లాలను కొనుగోలు చేశారని సీబీఐ తెలిపింది. కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన వారు కూడా విల్లాలు కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో ఉందని పేర్కొంది. ఆ రికార్డుల్లో చిరునామాల ప్రకారం ఆయా ప్రాంతాలకు వెళ్లి విచారిస్తే, ఆ చిరునామాలన్నీ తప్పని తేలాయని సీబీఐ తెలిపింది. ఎమ్మార్‌లో కీలక ఉద్యోగైన శ్రావణ్‌గుప్తాకు 25 విల్లాలు ఉన్నాయని వెల్లడించింది. ఇటువంటి కీలక సమాచారం రాఘవన్‌కు తెలుసునని, అందువల్ల ఆయనను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతున్నట్లు వివరించింది.

మూడో అరెస్టు..: ఎమ్మార్ కేసులో ఇది మూడో అరెస్టు. సీబీఐ అధికారులు ఇప్పటికే కోనేరు ప్రసాద్, సునీల్‌రెడ్డిలను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. విజయరాఘవన్‌ను సీబీఐ అధికారులు శనివారం ఉదయం దిల్‌కుషా అతిథి గృహానికి పిలిపించి.. మధ్యాహ్నం వరకు విచారించారు. అనంతరం 2.40 గంటల సమయంలో అరెస్ట్ చేసి.. తరువాత కోర్టులో హాజరుపరిచారు.

ఇదీ ఎమ్మార్ ఎఫ్‌ఐఆర్: ఎమ్మార్ ప్రాపర్టీస్ అక్రమాల కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లో.. తొలుత ఏపీఐఐసీ అప్పటి సీఎండీ బీపీ ఆచార్యతోపాటు ఎమ్మార్ ప్రాపర్టీస్ పీజేఎస్‌సీ, దుబాయ్‌కు చెందిన డెరైక్టర్లు, ఎమ్మార్ హిల్స్ టౌన్‌షిప్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు, ఎమ్మార్ ఎంజీఎఫ్ ల్యాండ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు, స్టైలిష్ హోమ్స్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన గుర్తుతెలియని అధికారులు, మరికొంతమంది గుర్తుతెలియని వ్యక్తులను నిందితులుగా పేర్కొన్నారు. కోనేరు ప్రసాద్‌ను అరెస్టుచేసిన తరువాత ఆయన పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. తాజాగా సునీల్‌రెడ్డి, శనివారం అరెస్టయిన విజయరాఘవన్ పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో జతచేశారు.


సునీల్‌రెడ్డి విచారణ...

ఎమ్మార్ వ్యవహారంలో అరెస్టు చేసిన సునీల్‌రెడ్డిని సీబీఐ అధికారులు శనివారం విచారించారు. సునీల్‌రెడ్డిని ఉదయం 10 గంటలకు జైలు నుంచి దిల్‌కుషా అతిథి గృహానికి తీసుకువచ్చిన అధికారులు.. సాయంత్రం 5.00 గంటల వరకు విచారించారు. సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, ఎస్‌పీ వెంకటేష్‌ల నేతృత్వంలో విచారణ సాగింది. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు సునీల్‌రెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. శనివారం ఉదయం నుంచి సోమవారం మధ్యాహ్నం రెండు గంటల వరకు సునీల్‌రెడ్డిని సీబీఐ కస్టడీకి ఇస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
Share this article :

0 comments: