ప్రభుత్వం గుడ్డిదైతే నేరగాళ్లు, తాగుబోతులే రాజ్యమేలుతారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రభుత్వం గుడ్డిదైతే నేరగాళ్లు, తాగుబోతులే రాజ్యమేలుతారు

ప్రభుత్వం గుడ్డిదైతే నేరగాళ్లు, తాగుబోతులే రాజ్యమేలుతారు

Written By news on Monday, May 6, 2013 | 5/06/2013

కాంగ్రెస్‌తో చంద్రబాబు మిలాఖత్ రాజకీయం
ప్రభుత్వం గుడ్డిదైతే నేరగాళ్లు, తాగుబోతులే రాజ్యమేలుతారు
జగన్ ఒక అన్నలా, తమ్ముడిలా మహిళలకు రక్షణ కల్పిస్తారు
వైఎస్ పథకాల పేర్లు మార్చడం తప్ప కిరణ్ చేస్తున్నదేమీ లేదు
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే అమ్మలకు అధికారంతో పాటు లాఠీలిస్తాం
‘మహిళలకు చదువు, రక్షణ’

సాక్షి, గుంటూరు: కాంగ్రెస్ పార్టీతో కలసి చంద్రబాబునాయుడు మిలాఖత్ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ తెలిపారు. జగన్‌ను జైల్లోనే ఉంచి అణగదొక్కాలనే కుట్రతో రాబోయే రోజుల్లో ఆ రెండు పార్టీలు మాయకూటమిగా ఆవిర్భవించడం తథ్యమని చెప్పారు. ఆదివారం గుంటూరు జిల్లా బాపట్లలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సునీల ప్రాంగణంలో వైఎస్సార్‌సీపీ మహిళా నగారాలో ఆమె ప్రసంగించారు. 

పార్టీ నాయకుడు కోన రఘుపతి ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ నగారాలో తొలుత తెనాలిలో ఇటీవల దారుణంగా మృతి చెందిన సునీలకు నివాళులర్పించారు. పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి సభకు అధ్యక్షత వహించారు. నేటి సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, పెరుగుతున్న నేర ప్రవృత్తి, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, ఇతర అంశాలపై విజయమ్మ సుదీర్ఘంగా ప్రసంగించారు. ప్రసంగ పాఠం ఆమె మాటల్లోనే... ‘‘మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని, కందుకూరి వీరేశలింగం, రాజారామ్‌మోహన్‌రాయ్, బి.ఆర్.అంబేద్కర్‌లాంటి మహనీయులు ఆకాంక్షించారు. కానీ నేటి మహిళ ఎన్నో ఇబ్బందులు పడుతోంది. భద్రత లేదు. ఎన్నో రకాలుగా దాడులు జరుగుతున్నాయి. 

అత్యాచారాలు, కత్తితో గొంతు కోసిన ఘటనలు, యాసిడ్‌దాడులు, వరకట్న వేధింపులు, కిడ్నాపులు, లైంగిక దాడులు ఇలా అనేక అకృత్యాల్లో ఆడవాళ్ళు బాధితులుగా ఉంటున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 66 ఏళ్ళు గడచినా అర్ధరాత్రి కాదు కదా పట్టపగలు కూడా మహిళలు స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారు. తెనాలిలో మద్యం షాపు వద్ద పోలీసులు చూస్త్తూండగానే కొందరు యువకులు సునీలను బస్సుకింద తోసివేసి దారుణంగా హత్య చేశారు. నేడు ఆరేళ్ళ పిల్ల నుంచి 70 ఏళ్ళ వృద్ధుల వరకు అందరిపై అత్యాచారాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం గుడ్డిదైతే నేరగాళ్ళు, తాగుబోతులు రాజ్యమేలుతారు. ఆత్మహత్య ఘటనల్లో 70 శాతం మహిళలే. వారిలో ఎక్కువ వివాహితులే. ఏటా సగటున 150 వరకట్న ఆత్మహత్యలు, 1,200లకుపైగా వేధింపు కేసులు నమోదు అవుతున్నాయి. 

అత్తింటి వేధింపుల కేసుల్లో రాష్ట్రం రెండవ స్థానంలో ఉంది. ఏటా సగటున 780 అత్యాచార కేసులు, 1,169 కిడ్నాప్ కేసులు, 1,296 ఆత్మహత్య కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి ఘటనల్లో రాష్ట్రం దేశంలోనే మొదటి రెండు స్థానాల్లో నిలుస్తోంది. ఈ విష సంస్కృతి పల్లెలకు కూడాపాకింది. గుంటూరులో కొన్నేళ్ళ క్రితం లక్ష్మీప్రసన్న అనే విద్యార్థినిని కొబ్బరి బోండాలు కొట్టే కత్తితో నరికి కర్కశంగా హత్య చేశారు. మహిళలపై ఏం జరిగినా కఠిన శిక్షలు లేవు. రెండు లక్షల కేసుల్లో 660 మందికి కూడా శిక్షలు పడలేదంటే పరిస్థితి ఎలా ఉందో తెలుస్తోంది. ప్రభుత్వ పరోక్ష చర్యల వల్లే నేరాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వానికి మద్యం ఆదాయమైతే మహిళలకు, పిల్లలకు మాత్రం శాపంగా మారింది. డబ్బులు ఇస్తే చాలు దుకాణాలకు అనుమతులు, కొత్త లెసైన్సులు ఇస్తున్నారు. దేవాలయాలు, స్కూళ్ళు అని కూడా చూడకుండా ఇష్టానుసారంగా లెసైన్సులు ఇస్తున్నారు. బొత్స సత్యనారాయణ ఓ లిక్కర్ డాన్, ఆయనకు వంద షాపులు బినామీ పేర్లతో ఉన్నాయట. 

ఇలాంటి నాయకులు ఉంటే పరిస్థితి ఏమిటి. దివంగత వైఎస్సార్ మరణం తరువాత బెల్టుషాపులు పెరిగిపోయాయి. ప్రభుత్వం పేదల రక్తాన్ని పిండి పిప్పి చేస్తోంది. మద్యాన్ని అరికట్టాలనే ఓ నిర్ణయంతో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అమ్మలకు అధికారంతో పాటు లాఠీలిస్తాం. దివంగత వైఎస్సార్‌లాగా జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఒక అన్నగా, తమ్ముడిగా మహిళలకు రక్షణ కల్పిస్తారు. ప్రతి పదివేల మంది జనాభాకు పది మంది మహిళా కానిస్టేబుళ్ళను ఏర్పాటు చేస్తారు. మీ అందరి ఆశీస్సులు జగన్‌కు ఉండాలి. ‘మహిళకు చదువు, రక్షణ..’ ఇదే మన నినాదం. మహిళా సాధికారత అంటే మహిళల అభివృద్ధే. మహిళలు ఆర్థికంగా ఎదగాలి. మహిళలకు రక్షణగా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఉంటుంది. 

కిరణ్‌ను నిలదీయాల్సిన బాబు మిలాఖత్ అయ్యారు

దివంగత వైఎస్సార్ బాలిక సంరక్షణ పథకాన్ని ప్రవేశపెట్టి అమలుచేశారు. బిడ్డ పుట్టగానే రూ. 5 వేలు వేసి 18 ఏళ్ళు వచ్చేసరికి రూ.లక్ష ఇచ్చేలా పథకాన్ని ఏర్పాటుచేశారు. ఇది సమీకృత శిశు అభివృద్ధి పథకం. దీనినే పేరుమార్చి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ‘బంగారు తల్లి’ అని చెబుతున్నారు. వైఎస్ పథకాలకు పేర్లు మార్చడం తప్ప కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రజలకు ఏమీ చేయడం లేదు. వీటన్నింటినీ నిలదీయాల్సిన చంద్రబాబు మిలాఖత్ రాజకీయాలు చేస్తున్నారు..’’. వేదికపై పార్టీ శాసనసభా డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌లు శోభానాగిరెడ్డి, మేకతోటి సుచరిత, పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, ఆర్ కె.రోజా, జక్కంపూడి విజయలక్ష్మి, ఉప్పులేటి కల్పన, రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలు వంగపండు ఉష, వివిధ జిల్లాలు, నగర మహిళా విభాగం కన్వీనర్ల్లు ఉషాకిరణ్, ఎల్.సునీత, ఆర్.లక్ష్మి, బి.సుశీలమ్మ, ఎ.నారాయణమ్మ, ఎం. ప్రమీల, ఎం.సులోచన కిషన్, రాధ, పద్మావతి, అమృతసాగర్, పి.శారద, వెంకట సుబ్బమ్మ, పోకల అనూరాధ, జిల్లా పార్టీ మహిళా విభాగం నేతలు ఆరిమండ విజయశారదారెడ్డి, రూత్‌రాణి, జక్కిరెడ్డి సుబ్బాయమ్మలతో పాటు పలువురు మహిళా నేతలు పాల్గొన్నారు. 

సదస్సుకు హాజరైన నేతలు

వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా, నగర కన్వీనర్లు మర్రి రాజశేఖర్, లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, నేతలు జంగా కృష్ణమూర్తి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పూనూరి గౌతమ్‌రెడ్డి, తలశిల రఘురామ్, మందపాటి శేషగిరిరావు, షేక్ షౌకత్, ఎం.డి. నసీర్ ఆహ్మద్, వాకా వాసుదేవరావు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, మహ్మద్ ముస్తఫా తదితరులు సదస్సులో పాల్గొన్నారు.
Share this article :

0 comments: