కేసుల భయం వెంటాడుతోంది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కేసుల భయం వెంటాడుతోంది

కేసుల భయం వెంటాడుతోంది

Written By ysrcongress on Monday, January 16, 2012 | 1/16/2012

ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు ఒకదాని తర్వాత ఒకటిగా వెలువడుతుంటే, వీటికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్ని కేసుల భయం వెంటాడుతోంది. ఇటీవల జరిగిన వివిధ ఉద్యమాల సందర్భంగా ఆందోళనల్లో పాల్గొన్న యువకులపై ప్రభుత్వం పలు కేసులు బనాయించింది. కొంతమందిపై క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. ఆందోళనల సందర్భంగా తమపై పెట్టిన కేసుల్ని ఎత్తివేయాలని ఒకపక్క యువకులు, మరోపక్క రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా కనిపించటం లేదు. ఒకవేళ ఉద్యోగం వచ్చినా తమపై పెట్టిన కేసులు అడ్డంకిగా మారతాయేమోనన్న ఆందోళన అభ్యర్థుల్ని వెంటాడుతోంది.
ఎపిపిఎస్‌సి సహా పలు రిక్రూట్‌మెంట్ సంస్థలు వరుసగా వేలాది ఉన్నత ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తున్నాయి. ఇంతకుముందు తెలంగాణ ఉద్యమం సందర్భంగా రకరకాల ఆందోళనల్లో పాల్గొన్న కొంతమంది విద్యార్థులపై 10 నుండి 15 కేసులు నమోదయ్యాయి. ఒక్కో కేసులోనూ నాలుగైదు సెక్షన్లను చేర్చటం కేసుల తీవ్రతను తేటతెల్లం చేస్తోంది. యుపిఎస్‌సి, ఎపిపిఎస్‌సి, బ్యాంకింగ్ సర్వీసు బోర్డులు ఇప్పటికే అనేక నోటిఫికేషన్లు జారీ చేశాయి. కేవలం ఎపిపిఎస్‌సి గత నెల రోజుల్లో 40 నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ ఎంపిక ప్రక్రియను అత్యంత వేగంగా ముగించాలని ఎపిపిఎస్‌సి చూస్తోంది. వీటిలో చాలావరకూ గ్రూప్-1 స్థాయి పోస్టులు ఎక్కువగా ఉండటం. ఇంతవరకూ ఇచ్చిన నోటిఫికేషన్లు ద్వారా దాదాపు 10వేల వరకూ పోస్టులు భర్తీ కాబోతున్నాయి. మరోపక్క 17వేల విఆర్వో, విఆర్‌ఎ పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. మరోవారంలో దాదాపు 50వేల వరకూ టీచర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ రాబోతోంది. యుపిఎస్‌సి సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ సహా ఇప్పటికే సిడిఎస్, ఎన్‌డిఎ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి.
రిక్రూట్‌మెంట్ల స్వర్ణయుగంగా 2012వ సంవత్సరాన్ని చెప్పుకుంటుండగా ఇది తమ భవిష్యత్తుకు ఏమేరకు ఉపకరిస్తుందన్న అనుమానం ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్ని వెంటాడుతోంది. ఈసారి ఉద్యోగం రాకపోతే జీవితంలో ఉద్యోగం వచ్చే అవకాశం లేదని భావించే రీతిలో లక్షలాది పోస్టులకు నోటిఫికేషన్లు వస్తున్నాయి. ఇంత పెద్ద ఎత్తున జరిగే రిక్రూట్‌మెంట్లకు వెళ్లాలంటే ప్రిపరేషన్‌తో పాటు విద్యార్థులపై ఎలాంటి పోలీసు కేసులు లేకుండా క్లీన్‌చిట్ ఉండాలి. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాల పుణ్యమా అని పిహెచ్‌డి చేస్తున్న విద్యార్థులు సైతం అనేక కేసుల్లో ఇరుకున్నారు.
2009 డిసెంబర్ తర్వాత రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోనూ దాదాపు 30 వేల మందిపై వేర్వేరు కేసులు నమోదయ్యాయి. పోలీసు లెక్కల ప్రకారం 2009 డిసెంబర్‌లో జరిగిన అల్లర్లలోనే 8047 మందిపై కేసులు పెట్టారు. ఆ తర్వాత ట్యాంకుబండ్ మిలియన్ మార్చ్, పంజాగుట్ట నిరసన ప్రదర్శనలు, సకల జనుల సమ్మె, ఉస్మానియా యూనివర్శిటీ బంద్ సందర్భాల్లో వేర్వేరుగా వేలాది కేసులు విద్యార్థులపై నమోదయ్యాయి. కొంతమంది విద్యార్థులపై అత్యంత తీవ్రమైన సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. సెక్షన్ 147, 148, 427, సెక్షన్ 435, 332, 333, 188సహా 120 (బి), 149 ఐపిసి, ప్రజాస్తుల నష్టనివారణ చట్టం 1984లోని 3, 4 క్లాజుల కింద కేసులు నమోదయ్యాయి. మరికొంత మందిపై క్రిమినల్ లా యాక్ట్ -1952లోని 7(1) క్లాజు కింద కూడా కేసులు నమోదు చేశారు. కొద్దిమందిపై ఐపిసి సెక్షన్ 307 కింద కేసులు నమోదయ్యాయి. 2009 డిసెంబర్ అల్లర్ల సందర్భంగా రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోనూ 8047 మంది విద్యార్థులపై 1667 కేసులు నమోదు చేసినట్టు స్వయంగా హోంమంత్రి సబిత అసెంబ్లీలో వెల్లడించారు. వీటిలో తెలంగాణ ప్రాంతంలో 963, ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో మరో 21 చొప్పున నమోదయ్యాయి. ఒక్కో కేసులో వందలాది విద్యార్థులు ఉన్నారు. విధ్వంసం, నిరసన కార్యక్రమాల తీవ్రత ఆధారంగా విద్యార్థులపై నమోదు చేసిన కేసులకు సంబంధించి వర్గీకరణ చేసి కొన్ని కేసులను ఉపసంహరించుకున్నట్టు హోం మంత్రి సబితారెడ్డి వెల్లడించారు. 526 కేసులను 2436 మంది విద్యార్థులపై ఉపసంహరించుకున్నట్టు హోం మంత్రి చెప్పారు. వీటిలో 411 మందిపై 122 కేసులను స్టేషన్ స్థాయిలోనే ఉపసంహరించుకోగా, 2500 మందిపై ఉన్న 383 కేసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. విద్యార్థుల కేసులపై ఒక దశలో ఎంపిలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసి నిరసన దీక్ష వరకూ వెళ్లడంతో మూడు ప్రాంతాలకు చెందిన విద్యార్థులపై నమోదైన 967 కేసుల ఉపసంహరణకు ఆదేశాలు ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పి ఎంపీల దీక్షకు తెరదించారు. తర్వాత క్రమంలో 843మంది విద్యార్థులపై ఉన్న మరో 135 కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ప్రభుత్వం కేసులను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించినా, సాంకేతికంగా విద్యార్థులు ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. వీటన్నింటికీ అదనంగా డబుల్ దమాకా అన్నట్టు విద్యార్థులపై రైల్వే ఆస్తుల ధ్వంసం కేసులను కూడా కేంద్ర ప్రభుత్వం నమోదు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ కేసులు ఉపసంహరించుకోగలిగినా, రైల్వే కేసులను ఉపసంహరించుకోవడం సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు-andhrabhoomi.
Share this article :

0 comments: