స్త్రీ నిధి రుణాలపై సర్కారు వింత నిర్ణయం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » స్త్రీ నిధి రుణాలపై సర్కారు వింత నిర్ణయం

స్త్రీ నిధి రుణాలపై సర్కారు వింత నిర్ణయం

Written By ysrcongress on Sunday, January 15, 2012 | 1/15/2012

‘సూక్ష్మ రుణ సంస్థలు రుణాలు ఇవ్వకుంటేనేం.. మేము ప్రత్యేకంగా వెయ్యి కోట్లతో స్త్రీ నిధిని ఏర్పాటు చేస్తున్నాం. అవసరమైనప్పుడు మహిళా సంఘాలను ఆదుకుంటాం...’ అంటూ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. దాదాపు ఏడు లక్షల మంది మహిళలను స్త్రీ నిధి రుణాలకు దూరం చేసింది. రాష్ట్రంలో 1,100 మండల సమాఖ్యలు ఉంటే.. అందులో 213 మండల సమాఖ్యలు, వాటి పరిధిలోని 7,244 గ్రామ సమాఖ్యలను స్త్రీ నిధి నుంచి రుణాలు పొందటానికి అనర్హమైనవిగా అధికారులు ప్రకటించారు. ఫలితంగా ఆ గ్రామ సమాఖ్యల్లో సభ్యులుగా ఉన్న 7 లక్షల మంది మహిళలను రుణానికి దూరం చేశారు. ఆయా మండల, గ్రామ సమాఖ్యల పనితీరు సరిగా లేనందువల్లే వాటికి రుణాలు ఇవ్వలేమని సర్కారు అందుకు సాకుగా చెప్తోంది. 

గ్రామ, మండల సమాఖ్యలకు.. వాటి కార్యకలాపాలు ఎలా ఉన్నాయి? తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లిస్తున్నారా? లేదా? ఆయా సంఘాల్లో ఉన్న పొదుపు మొత్తం ఎంత? బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను సక్రమంగా వినియోగిస్తున్నారా? లేక కేవలం వడ్డీ వ్యాపారంతో సరిపెడుతున్నారా? అన్న అంశాలను పరిశీలించి ఆ సమాఖ్యలకు అధికారులు రేటింగ్‌లు నిర్ణయించారు. ఆయా అంశాల్లో అత్యుత్తమంగా ఉండే వాటికి ఎ-గ్రేడు ఇస్తూ.. పనితీరు ప్రకారం గ్రేడు తగ్గిస్తూ రేటింగ్ ఇచ్చారు. 

అలా డి-గ్రేడు వరకు ఉన్న సంఘాలకు ప్రతి సంవత్సరం రూ. 1.50 కోట్ల నుంచి రూ. 25 లక్షల వరకు రుణాలు కల్పించాలని విధాన నిర్ణయం తీసుకున్నారు. ఇ, ఎఫ్ రేటింగ్‌లు వచ్చిన మండల, గ్రామ సమాఖ్యలకు రుణాలు ఇస్తే స్త్రీ నిధి సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో పడుతుందంటూ.. ఆ రేటింగ్‌లలో ఉన్న 213 మండల సమాఖ్యలకు రుణాలు ఇవ్వరాదని నిర్ణయించారు. అధికారులు రేటింగ్ ఇచ్చిన మండల సమాఖ్యల పరిధిలో బాగా పనిచేస్తున్న గ్రామ సమాఖ్యలు ఉన్నప్పటికీ.. వాటికి కూడా రుణం లభించే అవకాశం లేకుండా పోతోంది. అయితే.. రుణం తీసుకోవటానికి ఈ మండల, గ్రామ సమాఖ్యలకు అర్హత లేదంటున్న అధికారులే.. వాటి నుంచి స్త్రీ నిధి కోసం మూలధనం పెట్టుబడులు సమీకరిస్తుండటం విశేషం. 

ఒక్కో మండల సమాఖ్య నుంచి రూ.10 లక్షల లెక్కన దాదాపు 1,100 మండల సమాఖ్యల నుంచి రూ. 110 కోట్లు మూలధనం సేకరించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. డిసెంబర్ చివరి నాటికి మహిళా సంఘాల నుంచి రూ.44 కోట్లు మూలధనం సేకరించాలని భావించినప్పటికీ.. రూ.21 కోట్ల వరకు సేకరించినట్లు సమాచారం. పైగా.. స్త్రీ నిధి నుంచి రుణాలు పొందటానికి అర్హత లేదని చెప్తున్న మండల సమాఖ్యలు తూర్పు గోదావరి, గుంటూరు, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మాత్రమే ఉండటం విచిత్రం. బ్యాంకు ఒకసారి రుణం ఇస్తే ఆ రుణం తీరే వరకు మళ్లీ రుణం ఇవ్వకపోవటం వల్ల కష్టాలు పడుతున్నారనే స్త్రీ నిధి ఏర్పాటు చేశారు. 7 లక్షల మందిని అనర్హులుగా ప్రకటిస్తే.. వారికి రుణాలు ఎలా వస్తాయన్నది అసలు ప్రశ్న. ఇదిలావుంటే.. జనవరి 1 నుంచి మిహ ళలకు వడ్డీ లేని రుణం ఇస్తున్నట్లు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించినప్పటికీ.. స్త్రీ నిధి నుంచి రుణాలు తీసుకునే మహిళా సంఘాలకు రుణం లేని వడ్డీ మాత్రం వర్తించదు.
Share this article :

0 comments: