స్వతంత్రంగా వ్యవహరించే ట్రస్టు ఏర్పాటుకు మాత్రం నో - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » స్వతంత్రంగా వ్యవహరించే ట్రస్టు ఏర్పాటుకు మాత్రం నో

స్వతంత్రంగా వ్యవహరించే ట్రస్టు ఏర్పాటుకు మాత్రం నో

Written By ysrcongress on Friday, January 20, 2012 | 1/20/2012

ఉద్యోగుల ప్రత్యేక ట్రస్టుకు సర్కారు ఓకే.. స్వతంత్రంగా వ్యవహరించే ట్రస్టు ఏర్పాటుకు మాత్రం నో
*ఖర్చు పెరుగుతుందని వాదన
*ఆరోగ్యశ్రీ ట్రస్టులో అంతర్భాగంగానే అమలు చేయాలనే ధోరణి
*వ్యతిరేకించిన ఉద్యోగ సంఘాలు.. ‘స్వతంత్రత’ కోసం పట్టు
*ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ భేటీని మధ్యలోనే బహిష్కరించిన సచివాలయ ఉద్యోగ సంఘాలు

హైదరాబాద్, న్యూస్‌లైన్: నగదు ప్రమేయం లేకుండా వైద్యం అందించడానికి ఉద్దేశించిన హెల్త్ కార్డుల కోసం.. ప్రత్యేక ట్రస్టు ఏర్పాటు చేసే విషయంలో ప్రభుత్వానికి, ఉద్యోగ సంఘాలకు మధ్య ‘ట్రస్టు’ కుదరలేదు. హెల్త్‌కార్డుల పథకాన్ని ఆరోగ్యశ్రీ ట్రస్టులో అంతర్భాగంగా అమలు చేయాలనే ధోరణిని ప్రభుత్వం ప్రదర్శించింది. ఉద్యోగుల ప్రత్యేక ట్రస్టు ఏర్పాటుకు సర్కారు హామీ ఇచ్చినా.. దాని స్వరూపాన్ని ఉద్యోగుల డిమాండ్‌కు అనుగుణంగా కాకుండా.. ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా వైద్య సేవలు అందించడానికి వీలుగా ఏర్పాటు చేయాలనే భావన ఉన్నతాధికారుల మాటల్లో వ్యక్తమయింది. దీంతో గురువారమిక్కడ హెల్త్ కార్డుల కమిటీ చైర్మన్, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సుధీర్ నేతృత్వంలో ఉద్యోగ సంఘాలతో జరిగిన సమావేశం అసంపూర్తిగా ముగిసింది. 

స్వతంత్రంగా వ్యవహరించే ప్రత్యేక ట్రస్టును ఏర్పాటు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేయగా.. అలా చేస్తే.. అంచనా వ్యయంలో కనీసం 20 శాతం పరిపాలనా వ్యయం కింద ఖర్చు చేయాల్సి ఉంటుందని, ఫలితంగా మొత్తం ఖర్చు పెరుగుతుందని అధికారులు చెప్పుకొచ్చారు. ఆరోగ్యశ్రీ కింద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వమే పూర్తిగా ప్రీమియం భారాన్ని భరిస్తోందని.. ఇక్కడ తాము కూడా ప్రీమియం చెల్లిస్తున్నందున మెరుగైన వైద్య సేవలకు అవకాశం ఉండాలనే ఉద్యోగ సంఘాల డిమాండ్‌ను అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. తాము అనుకొన్న విధంగానే మార్గదర్శకాలు రూపొందించి సమావేశంలో ఉంచారు. ఫలితంగా ‘హెల్త్‌కార్డుల పథకం’లో ఎలాంటి ముందడుగు పడకుండానే సమావేశం ముగిసింది. 

ఈనెలాఖరున మరోసారి భేటీ ఏర్పాటు చేసి ఉద్యోగుల పెండింగ్ డిమాండ్ల మీద చర్చిస్తామని అధికారులు చెప్పారు. కాలయాపన కోసం జరిపే ఇలాంటి సమావేశాల వల్ల ప్రయోజనం లేదంటూ పీఆర్‌టీయూ అధ్యక్షుడు వెంకటరెడ్డి అధికారులను నిలదీయగా.. ఆరోగ్యశ్రీ ట్రస్టుతోనే వ్యవహారం నడిపించాలనే సర్కారు కుయుక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదని యూటీఎఫ్ అధ్యక్షుడు నారాయణ తేల్చి చెప్పారు. సచివాలయ ఉద్యోగ సంఘాలు సర్కారు తీరును నిరసిస్తూ.. మధ్యలోనే సమావేశాన్ని బహిష్కరించాయి. ఈ సమావేశంలో సాధారణ పరిపాలన శాఖ(సేవలు) కార్యదర్శి వెంకటేశ్వరరావు, ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో శ్రీకాంత్, వి.గోపాల్‌రెడ్డి(ఏపీఎన్జీవో), స్వామిగౌడ్(టీఎన్జీవో), కత్తి నరసింహారెడ్డి(ఎస్టీయూ), నారాయణ(యూటీఎఫ్), వెంకటరెడ్డి(పీఆర్‌టీయూ), ఆనందరావు(రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్) తదితరులు హాజరయ్యారు.

భేటీలో అధికారులు చెప్పిన అంశాలివీ.. 
*మొత్తం 13.78 లక్షల కుటుంబాలకు(ఉద్యోగులు, సర్వీస్ పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లు కలిపి).. అంటే 42 లక్షల మందికి ఉచిత వైద్య సేవలు అందించడానికి ఏటా రూ.350 కోట్లు అవసరమని అంచనా. అందులో 60 శాతం సర్కారు భరిస్తుంది. ఉద్యోగుల చందాల(గెజిటెడ్ అధికారులు నెలకు రూ.120, మిగతా ఉద్యోగులు రూ.90) ద్వారా మిగతా 40 శాతాన్ని సమకూర్చుకుంటారు.

*హెల్త్‌కార్డుల పథకం అమలుకు ప్రత్యేకంగా ఉద్యోగుల ట్రస్టు ఏర్పాటు చేయనున్నారు. అయితే, ఉద్యోగుల ట్రస్టే నేరుగా పథకం అమలు చేయాలంటే పరిపాలనా వ్యయం కింద ఏటా రూ.70 కోట్లు అవుతుందని అంచనా. అందువల్ల ఆరోగ్యశ్రీ ట్రస్టుతో ఒప్పందం కుదుర్చుకోవాలి. ఆరోగ్యశ్రీ ట్రస్టుకు మౌలిక సదుపాయాలు, సిబ్బంది ఉన్నందున.. మొత్తం అంచనా వ్యయంలో పరిపాలనా వ్యయం 5 శాతానికి మించదు. 

*మున్సిపల్, ఎయిడెడ్ ఉపాధ్యాయులనూ ఈ పథకం కింద చేర్చడానికి సూత్రప్రాయంగా అంగీకారం కుదిరింది. ఉద్యోగులకు సంబంధించిన 80 శాతం వివరాలు ట్రెజరీ విభాగం వద్ద ఉన్నాయి. మిగతా వివరాల సేకరణకు ప్రత్యేకంగా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. 

*డెంటల్, బీపీ, షుగర్ తదితరాలనూ ఈ పథకం కిందకు తీసుకురావడానికి అంగీకరించారు. ఏటా చికిత్స వ్యయ పరిమితి రూ.3 లక్షలుగా నిర్ణయించారు. పరిమితి దాటితే.. రూ.175 కోట్లతో ఏర్పాటు చేయనున్న కార్పస్ ఫండ్ నుంచి ఇస్తారు. 

*నూతన పథకం అమలు కోసం ఏర్పాటు చేసిన కమిటీలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో సభ్యత్వం ఉన్న అన్ని సంఘాలతో పాటు పెన్షనర్ల సంఘాలకూ చోటు కల్పించారు.

పెండింగ్ డిమాండ్లు ఇవీ..
*హెల్త్‌కార్డుల పథకం అమలుకు ఏర్పాటు చేయబోయే ప్రతిపాదిత ట్రస్టుకు పథకం అమలు విషయంలో పూర్తి స్వేచ్ఛ ఉండాలి. చికిత్స వ్యయం గరిష్ట పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలి. ఆరోగ్యశ్రీ పరిధిలోని వ్యాధులతో పాటు జలుబు, దగ్గు, జ్వరం లాంటి సీజనల్ వ్యాధులనూ హెల్త్‌కార్డుల పరిధిలో చేర్చాలి.

*వైద్య సేవల్లో నాణ్యత లోపించకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడానికి అవకాశం ఉండాలి. ఉదాహరణకు.. మార్కెట్‌లో స్టెంట్స్ రూ.20 వేలు నుంచి రూ.1.5 లక్షల వరకు లభిస్తున్నాయి. చికిత్స వ్యయ పరిమితిని చూడకుండా.. ఉత్తమమైన స్టెంట్స్‌నే అమర్చాలనే నిబంధనలు ఉండాలి. ఇతర రాష్ట్రాల్లోని మన ఉద్యోగులకు వైద్య సేవలు అందించడానికి వీలుగా అక్కడి ఆసుపత్రులతోనూ ఒప్పందం కుదుర్చుకోవాలి. 

*తాజా పథకంలో 13.78 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఉంటారు. అవసరమైనప్పుడు ‘వెయిటింగ్’ లేకుండా చికిత్స అందించడానికి వీలుగా రెఫరల్ ఆసుపత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలి.
*ప్రభుత్వ రంగ సంస్థలు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులనూ హెల్త్‌కార్డుల పథకం కిందకు తీసుకురావాలి.

ఉద్యోగుల ఆరోగ్యంతో ఫుట్‌బాల్ ఆడుతోంది..
ఉద్యోగులకు హెల్త్‌కార్డులు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి ఏడాది పూర్తయినా.. ఇంకా సమావేశాలు, చర్చలతో కాలయాపన చేస్తున్నారంటూ సచివాలయ ఉద్యోగ సంఘాలు, పీఆర్‌టీయూ ప్రతినిధులు అధికారులపై ధ్వజమెత్తారు. టైం పాస్ సమావేశాల వల్ల లాభం లేదని, చర్చించిన అంశాలనే ఎన్నిసార్లు చర్చిస్తారని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు హనుమంతరెడ్డి నిలదీశారు. మొత్తం వ్యయంలో 40 శాతం ఉద్యోగులు భరించాలనే ప్రతిపాదనను అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. 

హెల్త్‌కార్డుల హామీని నెరవేర్చకుండా తీవ్ర జాప్యం చేస్తూ.. ప్రభుత్వం ఉద్యోగుల ఆరోగ్యంతో ఫుట్‌బాల్ ఆడుతోందని ధ్వజమెత్తారు. పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారనే విషయం చెప్పకుండా ఉబుసుపోని సమావేశాల వల్ల ప్రయోజనం ఉండదని పీఆర్‌టీయూ అధ్యక్షుడు వెంకటరెడ్డి అన్నారు. గత ఏడాది జనవరి 23న హామీ ఇచ్చారని.. ఈ సంవత్సరం జనవరి 23 కూడా వస్తోందని, ఇప్పటికీ సమావేశాలతో సాగతీయడంలో అంతరార్థం ఏమిటని ప్రశ్నించారు.
Share this article :

0 comments: