మంచితనానికి ఇంక చోటు లేదా ? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మంచితనానికి ఇంక చోటు లేదా ?

మంచితనానికి ఇంక చోటు లేదా ?

Written By news on Sunday, January 27, 2013 | 1/27/2013

మొన్న 24వ తేదీ హైకోర్టు జగన్‌కు బెయిల్‌ను నిరాకరించిందని తెలిసిన రోజు సాయంకాలం అత్తమ్మ నా దగ్గరికి వచ్చి ఏడ్చారు. ‘‘ఈ కష్టాలు చూడమని మీ మామ నన్ను వదిలి వెళ్లాడమ్మా’’ అని అత్తమ్మ అన్నారు. ‘‘జగన్‌కు డిగ్రీలో కూడా నేనే అన్నం తినిపించేదానిని - ఎంతో అపురూపంగా చూసుకున్నానమ్మా నా కొడుకును’’ అని అత్తమ్మ అన్నప్పుడు నాకెంతో బాధ అనిపించింది. అత్తమ్మ చాలా వరకు ధైర్యంగా ఉంటారు. నిబ్బరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. మామ చనిపోయిన తరువాత తన మనసులో ఏమున్నా, బాధ ఉన్నా ఎప్పుడన్నా కొడుకు దగ్గరో, కూతురు దగ్గరో తన బాధను పంచుకుంటారు తప్ప పెద్దగా బయటపడరు. చాలా బాధ అనిపించింది. జగన్ వాళ్ల పెద్దమ్మ కూడా చాలా ఏడ్చారు ఆరోజు - ‘‘బాబు ఎప్పుడు వస్తాడమ్మా ఇంటికి’’ అని! నామటుకు నేనైతే ఇన్ని కుట్రలు జరుగుతున్నా, జగన్‌కు ఇన్ని రోజులు దూరంగా ఉన్నా బతికే ఉన్నానంటే దేవుని దయ అనుకుంటా! ఎంత ధైర్యపరచుకుందామనుకున్నా, ఎంత మనకు మనం సర్దిచెప్పుకున్నా మనసు మాట వినదు. అంత కృంగిపోయినా ఇంకా బతికే వున్నానంటే దేవుని దయనే!

రాజకీయ లబ్ధికోసం ఎంతవరకైనా దిగజారే మనుషులను చూస్తున్నాం. మంచితనానికి ఇంక చోటు లేదా అని అనిపిస్తోంది.
తెలుగుదేశం పుట్టడమే కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తూ పుట్టిన పార్టీ. కాని గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్, టీడీపీ కలిసి పనిచేయడం చూశాం; ఈ రోజు కాంగ్రెస్, టీడీపీ కలిసిపోతాయి అని పత్రికల్లో రాయడం చూస్తున్నాం. ఆ పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ గారి ఆత్మ ఎంత క్షోభిస్తూ వుంటుందో! ఆయన ఏ తెలుగువారి ఆత్మగౌరవం కోసం పార్టీని పెట్టారో, అదే పార్టీవారు తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పాద పీఠాల దగ్గర తాకట్టు పెడుతున్నారు. కొన్ని వార్తాపత్రికలు కూడా అంతే! మొదటినుంచీ కాంగ్రెస్‌కు బద్ధశత్రువుగా పరిగణించబడే ఒక పత్రిక నేడు కాంగ్రెస్‌ను వెనకేసుకొచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది... కలికాలం కాబోలు! అధికారమే పరమావధిగా పనిచేస్తున్న పాలక, విపక్షాలను చూస్తున్నాం. ఎవరైనా అడ్డం వస్తే జైలుపాలు జేస్తారు. అధికారులను పంపి వారిని బెదిరిస్తారు. అది జగన్ కావచ్చు... అసదుద్దీన్ గారు కావచ్చు... పార్టీ మారాలనుకునే ఎమ్మెల్యేలు కావచ్చు! రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం ఈ అధికార దుర్వినియోగం కింద మూలుగుతూ ఉంది. దేవుడు మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడో, ఎప్పుడు దృష్టిపెడతాడో అని నాలాంటి వారు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

వైఎస్‌ఆర్‌గారు ఒక్కరు లేకపోతే జీవితాలలో ఎంత తేడా వచ్చిందో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు చెబుతారు. మొన్న వయలార్ రవి కూడా ‘‘వైఎస్‌ఆర్ వంటి లీడర్ లేక మాకు ఈ సమస్యలన్నీ వచ్చాయి’’ అని అన్నారని పేపర్‌లో చూశాం. దేవుడు ఆయనకిచ్చిన అవకాశాన్ని ఆయన నిండు మనస్సుతో ప్రజలకు మేలు చేయాలని సంకల్పించారు. అందుకే దేవుడు ఆయన పాలనను ఆశీర్వదించాడు. తన పాలనలో ఎవ్వరికి ఏం కష్టం వచ్చినా నేనున్నానని భరోసా ఇచ్చేవారు ఆయన. కాని ఇప్పటి నాయకుల ధ్యాస అంతా పక్కన ఉండే వారిని ఎలా ఇబ్బందిపెట్టాలి, ఎలా కిందికి లాగాలి అనే! ఇప్పటి ప్రభుత్వం ‘ఖబడ్దార్ నా చేతిలో అధికారం ఉంది’ అనే భయం పుట్టిస్తోంది. అందుకే ప్రజలు వైఎస్‌ఆర్ గారు లేకున్నా ఆయనను కోరుకుంటున్నారు. ఆయనే అసలైన నాయకుడంటున్నారు. ఇప్పుడున్న నాయకులు ఎప్పుడు దిగిపోతారా, ఎప్పుడు మంచి నాయకులు వస్తారా అని అనుకుంటున్నారు.

దేవుడు త్వరలోనే మనలో కష్టాలలో ఉండే ప్రతి ఒక్కరిని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని దర్శించాలని, జగన్‌ను బయటకు తీసుకురావాలని, సుఖసంతోషాలను, ప్రేమ సమాధానాలను ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలని కోరుకుంటున్నాను.

అత్తమ్మ చాలా వరకు ధైర్యంగా ఉంటారు. నిబ్బరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. కాని హైకోర్టు మొన్న జగన్‌కు బెయిల్‌ను నిరాకరించిందని తెలిసిన రోజు నా దగ్గరికి వచ్చి ఏడ్చారు.

అధికారమే పరమావధిగా పనిచేస్తున్న పాలక, విపక్షాలను చూస్తున్నాం. ఎవరైనా అడ్డం వస్తే జైలుపాలు జేస్తారు. అధికారులను పంపి వారిని బెదిరిస్తారు.


- వైఎస్ భారతి
w/oవైఎస్ Jagan.






Source:sakshi
Share this article :

0 comments: