ఒకే చార్జిషీట్ అన్నారుగా? ‘సుప్రీం’కు హామీ కూడా ఇచ్చారు కదా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఒకే చార్జిషీట్ అన్నారుగా? ‘సుప్రీం’కు హామీ కూడా ఇచ్చారు కదా?

ఒకే చార్జిషీట్ అన్నారుగా? ‘సుప్రీం’కు హామీ కూడా ఇచ్చారు కదా?

Written By news on Wednesday, April 3, 2013 | 4/03/2013


సీబీఐని ప్రశ్నించిన ప్రత్యేక కోర్టు
ఇంకెన్ని చార్జిషీట్లు వేస్తారు? దర్యాప్తు ఏ దశలో ఉంది?
జగన్ సంస్థల్లో పెట్టుబడుల కేసులో సీబీఐని నిలదీసిన ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి
ఒకే చార్జిషీట్ వేస్తామని ‘మౌఖికంగా’ చెప్పాం: సీబీఐ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించిన ‘క్విడ్ ప్రో కో’ కేసులో దర్యాప్తు పూర్తిచేసి చివరగా ఒకే చార్జిషీట్ దాఖలు చేస్తామని సుప్రీంకోర్టు ముందు హామీ ఇచ్చి.. ఇప్పుడు వేర్వేరుగా చార్జిషీట్లు వేయటం ఏమిటని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు సీబీఐని ప్రశ్నించారు. ఈ కేసులో ఏడు అంశాలకు సంబంధించి దర్యాప్తు ఏ దశలో ఉంది? ఇంకా ఎన్ని చార్జిషీట్లను ఎప్పుడు వేయబోతున్నారు? అని సీబీఐని న్యాయమూర్తి సూటిగా నిలదీశారు. జగన్ కంపెనీల్లో ఫార్మా కంపెనీల పెట్టుబడులకు సంబంధించి ఇప్పటికే సమర్పించిన మొదటి చార్జిషీట్ (సీసీ నంబర్ 8)కు అనుబంధంగా 29 పేజీలతో కూడిన సప్లిమెంటరీ చార్జిషీట్‌ను సీబీఐ మంగళవారం కోర్టుకు సమర్పించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి సీబీఐకి అనేక ప్రశ్నలు సంధించారు.

‘‘ఈ కేసులో ఫైనల్‌గా ఒకే చార్జిషీట్ దాఖలు చేస్తామని సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చినట్లున్నారు. సుప్రీంకోర్టు ముందు అంగీకరించినట్లుగా ఒకే చార్జిషీట్ వేయటం లేదా? ఇంకా ఎన్ని చార్జిషీట్లు వేస్తారు?’’ అని ప్రశ్నించారు. ఫైనల్‌గా ఒకే చార్జిషీట్ వేస్తామని సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ మోహన్ పరాశరన్ మౌఖికంగా మాత్రమే సుప్రీంకోర్టుకు తెలిపారని సీబీఐ తరఫున డిప్యూటీ లీగల్ అడ్వయిజర్ బళ్లా రవీంద్రనాథ్ విజ్ఞప్తి చేశారు. నిందితుల బెయిల్ పిటిషన్లు విచారణకు వచ్చిన సమయంలో మాత్రమే చార్జిషీట్లు దాఖలు చేసి వారి బెయిల్ హక్కును హరిస్తున్నారనే ఆరోపణను నిందితులు చేసినప్పుడు.. అన్ని నేరాలపై విచారణ పూర్తిచేసి ఫైనల్‌గా ఒకే చార్జిషీట్ వేస్తామని చెప్పామని తెలిపారు. అయితే ఇవన్నీ వేర్వేరు నేరాలని, అందుకే వేర్వేరుగా చార్జిషీట్లు దాఖలు చేస్తామని చెప్పారు. సిమెంట్ కంపెనీల పెట్టుబడులకు సంబంధించి దర్యాప్తు పూర్తయిందని, వెంట వెంటనే చార్జిషీట్లు దాఖలు చేస్తామని పేర్కొన్నారు. దర్యాప్తు కీలక దశలో ఉన్న అంశాలకు సంబంధించి కూడా త్వరలోనే చార్జిషీట్లు దాఖలు చేస్తామన్నారు.

ఆర్‌ఓసీ నివేదికను సాక్ష్యంగా పెట్టాం...

జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన అరబిందో, హెటిరో, ట్రిడెంట్ ఫార్మా కంపెనీలు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీ చట్టాన్ని ఉల్లంఘించాయని, ఈ మేరకు ఆర్‌ఓసీ నివేదిక ఇచ్చిందని అనుబంధ చార్జిషీట్‌లో పేర్కొన్నామని సీబీఐ డిప్యూటీ లీగల్ అడ్వయిజర్ బళ్లా రవీంద్రనాథ్ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. పెట్టుబడులు పెట్టిన సంస్థలు కంపెనీ చట్టంలోని నిబంధనలు ఉల్లంఘించాయా? అనే విషయాలపై నివేదిక ఇవ్వాలని ఆర్‌ఓసీని కోరామని, ఇటీవలే వారు తమకు నివేదిక ఇచ్చారని.. దాన్ని చార్జిషీట్‌లో సాక్ష్యంగా చేర్చాలని కోరుతూ ఈ అనుబంధ చార్జిషీట్ దాఖలు చేస్తున్నామని చెప్పారు. ఇందులో ఆర్‌ఓసీకి చెందిన ఉన్నతాధికారులతో పాటు మొత్తం తొమ్మిది మందిని సాక్షులుగా పేర్కొన్నామని, 8 డాక్యుమెంట్లను సమర్పిస్తున్నామని తెలిపారు. అనుబంధ చార్జిషీట్‌ను పరిశీలించిన న్యాయమూర్తి.. అన్ని డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాత టేకెన్ ఆన్ రికార్డుగా స్వీకరిస్తామని చెప్పారు.

ఈ చార్జిషీట్‌లో ఆర్‌ఓసీ ఎం.వి.చక్రనారాయణ, ఏఆర్‌ఓసీ పోలా రఘునాథ్‌లతో పాటు మరికొందరు అధికారులను సాక్షులుగా పేర్కొన్నారు. ఇందులో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డికి ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన జన్నత్‌హుస్సేన్‌ను కూడా సాక్షిగా చేర్చినట్లు సమాచారం. ఇదిలావుండగా.. 2012 ఏప్రిల్ 31న సీబీఐ మొదటి చార్జిషీట్ (సీసీ నంబర్ 8) దాఖలు చేసింది. ఇదే చార్జిషీట్‌లో 13 డాక్యుమెంట్లను, 9 మంది సాక్షులను అదనంగా చేరుస్తూ గత ఏడాది జూన్‌లో అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసింది. దాదాపు ఎనిమిది నెలల తర్వాత మళ్లీ ఇదే చార్జిషీట్‌లో రెండో అనుబంధ చార్జిషీట్ దాఖలు చేయటం గమనార్హం.

Share this article :

0 comments: