సామాన్య ప్రజలను సైతం విస్మయానికి గురిచేస్తున్న ప్రశ్నలివి. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సామాన్య ప్రజలను సైతం విస్మయానికి గురిచేస్తున్న ప్రశ్నలివి.

సామాన్య ప్రజలను సైతం విస్మయానికి గురిచేస్తున్న ప్రశ్నలివి.

Written By ysrcongress on Sunday, February 5, 2012 | 2/05/2012

సీబీఐ దర్యాప్తు తీరుపై న్యాయ నిపుణుల విస్మయం 
సీబీఐ ప్రత్యేక ‘లక్ష్యం’తో పనిచేస్తోంద నే విమర్శలు
జగన్ పెట్టుబడుల కేసు ఎఫ్‌ఐఆర్‌లో వైఎస్ పేరు ప్రస్తావన
ఎమ్మార్ కేసులో బాబు పాత్ర ఉద్దేశపూర్వకంగా విస్మరణ
చార్జిషీట్‌లో టీడీపీ హయాంలోని ఐఏఎస్ అధికారి 
ఎల్వీ సుబ్రహ్మణ్యం పేరు.. బాబు ప్రస్తావనే కనిపించదు..
కీలక విషయాలు బయటకొస్తే..‘కావాల్సిన’వారికి ఇబ్బందులెదురవుతాయనే..?

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీఐఐసీ ఎండీగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యంను చార్జిషీట్‌లో నిందితునిగా పేర్కొన్న సీబీఐ.. బాబు విషయం లో అనుసరించిన వైఖరి పట్ల న్యాయ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు గురించి చార్జిషీట్‌లో నామమాత్రంగానైనా ప్రస్తావించకపోవడం ద్వారా.. సీబీఐ ప్రత్యేక లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పకనే చెప్పినట్లయిందని వ్యాఖ్యానిస్తున్నారు.


జగన్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసు ఎఫ్‌ఐఆర్‌లో.. మనిషి లేకున్నా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును ఎందుకు ప్రస్తావించింది?

ప్రజల్లో వైఎస్ ప్రతిష్టను దెబ్బతీయడం, జగన్‌కు పెరుగుతున్న ప్రజాదరణను తగ్గించడమే లక్ష్యం కాదా?
ఎమ్మార్ కేసు చార్జిషీట్‌లో.. టీడీపీ హయాంలోని సంబంధిత అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యంను నిందితునిగా చేర్చి అప్పటి సీఎం చంద్రబాబు పేరును ఎందుకు విస్మరించింది? 

ఎమ్మార్‌ను రాష్ట్రానికి తెచ్చి, కారుచౌకగా భూములు కట్టబెట్టి కథ నడిపిన బాబు గురించి కనీస మాత్రంగానైనా ఎందుకు పట్టించుకోదు? ఎందుకీ భిన్న వైఖరి? 

బాబును విచారిస్తే అసలు బండారం బయటపడుతుందనా? తమకు ‘కావాల్సిన’వారికి ఇబ్బందులు ఎదురవుతాయనా? తమ అసలు ‘లక్ష్యం’ నెరవేరకుండా పోతుందనా?...

పై రెండు కేసులకు సంబంధించి సీబీఐ దర్యాప్తు తీరుపై న్యాయ నిపుణులతోపాటు సామాన్య ప్రజలను సైతం విస్మయానికి గురిచేస్తున్న ప్రశ్నలివి.


ఎమ్మార్ కేసులో.. సీబీఐ ఇటీవల దాఖలు చేసిన చార్జిషీట్‌ను బట్టి విచారణ ఏ దిశగా సాగుతోందన్న విషయం సామాన్యుడికి కూడా అర్థమవుతోంది. కళ్ల ముందు కనిపించే నిగ్గు తేలాల్సిన విషయాలెన్నో ఉన్నప్పటికీ సీబీఐ లక్ష్యం అది కానందునే వాటి జోలికి వెళ్లకుండా ఒకే లక్ష్యంతో కేసు దర్యాప్తు జరుగుతోందన్న విమర్శలు తీవ్రమవుతున్నాయి. అసలు ఎమ్మార్ ఎక్కడిది? ఎవరి వల్ల రాష్ట్రానికి వచ్చింది? ఏ ప్రయోజనాల కోసం ఆ సంస్థతో ఒప్పందాలు కుదిరాయి? ముందుండి ఎమ్మార్ కథ నడిపించిన వ్యక్తులెవరు? తెరవెనుక సూత్రధారులెవరు? వారితో ఎవరెవరికి సంబంధాలున్నాయి? నామమాత్రపు ధరకు భూములను కేటాయించడంలోని అసలు కథ ఏమిటి? ఈ విషయాలన్నిటిపైనా లోతుగా దృష్టి సారిస్తే.. తమ లక్ష్యం నెరవేరదని సీబీఐ గట్టిగా భావిస్తున్నట్టు కనిపిస్తోంది. 

ఎమ్మార్‌కు నామమాత్రపు ధరకు భూములు కేటాయించడమే కాకుండా.. దానికి అన్నిరకాలుగా ప్రయోజనం కలిగించేలా నిబంధనలు రూపొందించిన అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి గురించి చార్జిషీట్‌లో కనీసస్థాయిలో కూడా ప్రస్తావించని నేపథ్యంలో ఈ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీఐఐసీ ఎండీగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యంను చార్జిషీట్‌లో నిందితునిగా పేర్కొన్న సీబీఐ.. బాబు విషయంలో అనుసరించిన వైఖరి పట్ల న్యాయ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు గురించి చార్జిషీట్‌లో నామమాత్రంగానైనా ప్రస్తావించకపోవడం ద్వారా.. సీబీఐ తాను ప్రత్యేక లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పకనే చెప్పినట్లయిందని వ్యాఖ్యానిస్తున్నారు. తమ అసలు ‘లక్ష్యం’ ఎవరనే విషయాన్ని కూడా ఈ చార్జిషీట్ ద్వారా సీబీఐ అధికారులు స్పష్టం చేశారని, ప్రజలకు కూడా ఆ విషయం పూర్తిగా అర్థమైందని అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు జరిగిన నిర్ణయాలకు సంబంధించి వైఎస్ చనిపోయిన తరువాత కూడా ఆయన గురించి ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించిన సీబీఐ అధికారులు.. చంద్రబాబు విషయంలో ఎందుకు ఇలా విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇది ఎంతమాత్రం నిష్పాక్షిక దర్యాప్తు అనిపించుకోదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అప్పుడలా..! ఇప్పుడిలా..!!

జగన్ కంపెనీల్లో పెట్టుబడుల కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ.. అందులో అప్పటికే మరణించిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును ప్రస్తావించింది. రాజశేఖరరెడ్డి, జగన్‌లు కుమ్మక్కయ్యారంటూ పెద్ద పెద్ద పదాలను ఉపయోగించింది. ‘ప్రజల్లో రాజశేఖరరెడ్డి ప్రతిష్టను దెబ్బతియ్యడం.. అదే సమయంలో జగన్‌కు ప్రజల్లో పెరిగిపోతున్న ఆదరణను తగ్గించడం’ అనే ఢిల్లీ పెద్దల ద్విముఖ వ్యూహాన్ని అమలు చేసే క్రమంలోనే సీబీఐ అధికారులు ఎఫ్‌ఐఆర్‌లో ఇష్టానుసారంగా రాసేశారు. అయితే ఎమ్మార్ కేసులో మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎక్కడో దుబాయ్‌లో ఉన్న ఎమ్మార్ ప్రాపర్టీస్‌ను రాష్ట్రానికి తీసుకువచ్చింది చంద్రబాబునాయుడు. ఆ సంస్థకు కారుచౌకగా భూములు కట్టబెట్టిందీ.. వారు కోరుకున్న విధంగా నిబంధనలు రూపొందించిందీ ఆయనే. చంద్రబాబు, ఎమ్మార్‌ల మధ్య సంబంధం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. సీబీఐ అధికారులు మాత్రం.. అసలు చంద్రబాబు పాత్ర గురించి కనీస స్థాయిలో కూడా ఆలోచించలేదు. అందుకే ఎమ్మార్ కేసు దర్యాప్తును మొదట్నుంచీ (ఎమ్మార్ రాష్ట్రంలో అడుగుపెట్టిన నాటి నుంచి) కాకుండా మధ్యనుంచి (రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి) ప్రారంభించారు. చంద్రబాబు హయాంలో.. అంటే 2002లో భూ కేటాయింపులు, ఒప్పందాలు జరిగితే.. సీబీఐ అధికారులు 2004 నుంచి.. అంటే రాజశేఖరరెడ్డి హయాం నుంచి దర్యాప్తు ప్రారంభించారు. ‘మొదటి నుంచి దర్యాప్తు చేస్తే చంద్రబాబు బండారం మొత్తం బయటపడుతుంది.. రాజశేఖరరెడ్డి ప్రభుత్వం చేసిందేమీ లేదని అందరికీ తెలిసిపోతుంది. రాజశేఖరరెడ్డిని, జగన్‌లను దెబ్బకొట్టడం వీలు కాదనే ఉద్దేశంతోనే 2004 నుంచి దర్యాప్తు ప్రారంభించారు’ అని పరిశీలకులంటున్నారు.

కీలక విషయాలు బయటకు వస్తాయనే..! 

సీబీఐ దారి తప్పి దర్యాప్తు చేస్తోందని.. ఇది అన్యాయమంటూ ఓ స్వాతంత్య్ర సమరయోధుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ సమరయోధుడి పిటిషన్‌పై స్పందించిన సుప్రీంకోర్టు.. సీబీఐ, చంద్రబాబు తదితరులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఆదేశించింది. ఎమ్మార్ వ్యవహారంలో చంద్రబాబు హయాంలో జరిగిన ప్రతి లావాదేవీకి సంబంధించిన పూర్తి వివరాలు.. సాక్ష్యాధారాలు సీబీఐ వద్ద ఉన్నాయి. ఎమ్మార్ విషయంలో ఇప్పటికే దర్యాప్తు చేసిన విజిలెన్స్ అధికారులు తమ నివేదికలో 2002 నుంచి జరిగిన విషయాలను ప్రస్తావించారు. ఎమ్మార్‌కు చంద్రబాబు కేటాయించిన 535 ఎకరాల గురించి.. అందులో ఏపీఐఐసీ వాటా గురించి.. ఎమ్మార్‌కు లబ్ధి చేకూర్చేలా రూపొందించిన నిబంధనల గురించి కూడా చర్చించారు. దీనిపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందని కూడా విజిలెన్స్ అధికారులు అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు విజిలెన్స్ నివేదికనే ప్రధాన ఆధారంగా చేసుకుంటూ దర్యాప్తు కొనసాగించిన సీబీఐ...విజిలెన్స్ అధికారులు 2002లో జరిగిన విషయాల గురించి స్పష్టంగా చెప్పినప్పటికీ చంద్రబాబు జోలికి మాత్రం వెళ్లడం లేదు! ఎమ్మార్ కేసులో ఇప్పటివరకు ఓ రాజ్యసభ సభ్యుడిని, పలువురు ప్రముఖులను, సీనియర్ అధికారులను పిలిపించి మాట్లాడిన సీబీఐ అధికారులు చంద్రబాబును మాత్రం ఇప్పటివరకు ఒక్కసారి కూడా పిలిపించలేదు. ఆయన్నుంచి ఎటువంటి వివరాలూ సేకరించలేదు. 

అసలు ఎమ్మార్‌ను ఎవరు పరిచయం చేశారు..? ఏ ఉద్దేశంతో పరిచయం చేశారు..? లాంటి వివరాలను తెలుసుకోకపోగా.. చంద్రబాబు కోడలుకు ఎమ్మార్‌లో విల్లాలు ఉన్న అంశానికి సంబంధించి కూడా ఆయన్నుంచి సీబీఐ అధికారులు ఎటువంటి వివరాలు సేకరించలేదు. చంద్రబాబును ప్రశ్నిస్తే అనేక కీలక విషయాలు బయటకు వస్తాయని.. తమకు ‘కావాల్సిన’ వ్యక్తులకు ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతోనే సీబీఐ అధికారులు వెనకడుగు వేస్తున్నారనే వాదనలు ఉన్నాయి. ‘సీబీఐ అసలు లక్ష్యం ఇతర వ్యక్తులు అయినప్పుడు.. వారికి చంద్రబాబుతో ఏం పని..? సీబీఐ తన దర్యాప్తును నిష్పాక్షికంగా సాగిస్తున్నట్టయితే చంద్రబాబును ఎప్పుడో పిలిపించి విచారించేది. ఓ ఎంపీని పిలిపించి విచారించగా లేంది.. ఎమ్మెల్యే అయిన చంద్రబాబును విచారించడానికి సీబీఐకి ఉన్న అభ్యంతరం.. ఇబ్బంది ఏమిటో అర్థం కావడం లేదు. ఏదో బలమైన కారణం వల్లనే చంద్రబాబు జోలికి వెళ్లడం లేదనిపిస్తోంది’ అని డీజీపీగా పనిచేసి పదవీ విరమణ పొందిన ఓ అధికారి వ్యాఖ్యానించారు.

అన్నీ తెలిసినా.. బాబు జోలికెళ్లరు!

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హయాంలోనే ఎమ్మార్ కుంభకోణానికి బీజం పడిందనే సంగతిని సీబీఐ ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మార్‌తో పాటు దేశీయ సంస్థ ఎల్‌అండ్‌టీ, మరో విదేశీ సంస్థ.. గోల్ప్‌కోర్స్ నిర్మాణానికి ముందుకు వచ్చినా ఒక్క ఎమ్మార్‌కు మాత్రమే టెండర్ దక్కేలా చంద్రబాబు నాడు తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని చక్రం తిప్పారు. ముందు ఎమ్మార్‌కు కేటాయించిన స్థలానికి సమీపంలోనే తన భార్య భువనేశ్వరి పేరిట ఉన్న భూమిని చంద్రబాబు ఎకరా రూ.కోటి చొప్పున రెడ్డి ల్యాబ్స్‌కు అమ్మారు. ఆ తరువాత ఎమ్మార్‌కు అదే ప్రాంతంలో ఎకరా కేవలం రూ.29 లక్షలకు కేటాయించడమంటే ఎమ్మార్ విషయంలో పక్షపాత ధోరణి కనబర్చినట్టు కాదా? టెండర్‌ను ఆమోదించడం మొదలు ధర నిర్ణయం వరకు చంద్రబాబు అడుగడుగునా ఎమ్మార్‌కు సహకరించిన విషయం సీబీఐకి ఎందుకు కనిపించడం లేదు? ఎమ్మార్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చంటూ, దానికి అనుగుణంగా ఎమ్మార్ మరేదైనా సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవచ్చంటూ చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా ఓ జీవోను వెలువరించిన సంగతి సీబీఐకి తెలియదా? నిర్దిష్ట కారణాలు లేకుండా ఎమ్మార్ మరో సంస్థతో కుదుర్చుకునే ఒప్పందంలో జోక్యం చేసుకునేది లేదంటూ నాటి చంద్రబాబు ప్రభుత్వం ఆ ఒప్పందంలో పేర్కొనడం అక్రమం కాదా? ఆ ఒప్పందం కారణంగానే ఎంజీఎఫ్, స్లైలిష్ హోమ్స్ వంటి సంస్థలు రంగంలోకి దిగి ఎమ్మార్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన సంగతి సీబీఐకి తెలియదనుకోవాలా? అన్నీ తెలుసు. కానీ ఆనాటి ముఖ్యమంత్రిని పిలిచి విచారించడానికే సీబీఐకి మనసొప్పడం లేదు! 

భార్య స్థలం మాత్రం ఎకరా రూ.కోటికి!


ఎమ్మార్‌కు ఇలా ఎకరా రూ.29 లక్షలకు కట్టబెట్టిన చంద్రబాబు... దానికి సమీపంలో ఉన్న తన భార్య భూమిని అంతకు మూడేళ్ల ముందే ఎకరా రూ.కోటికి విక్రయించటం మరీ విడ్డూరం. తల్లి అమ్మణ్ణమ్మ, భార్య భువనేశ్వరి, తనయుడు లోకేశ్ పేరిట ఉన్న మూడెకరాల స్థలాన్ని 2000లో ఎకరా కోటి రూపాయల చొప్పున అమ్మేశారు బాబు. మూడేళ్ల తరవాత ఎమ్మార్‌కు ఎకరం రూ.29 లక్షలకే అప్పగింత పెట్టారు. తన స్థలాన్ని ఖరీదైన ధరకు, సర్కారు స్థలాన్ని కారుచౌకగా విక్రయించడంలోనే బాబు దురుద్దేశాలన్నీ కళ్లకు కడతాయి. సిండికేట్‌ను నడిపించి, తన సన్నిహిత సంస్థ మాత్రమే రంగంలో ఉండేలా ప్లాన్ చేసిందీ బాబే. ఎల్ అండ్ టీ, ఐఓఐలను వెనక్కి తగ్గేలా చేసి... ఆ రెండింటికీ విలువైన ఇతర ప్రాజెక్టుల్ని కట్టబెట్టిందీ ఆయనే. ఇంత స్పష్టంగా కనిపిస్తున్నా... సీబీఐ 2004 కన్నా ముందు ఏం జరిగినా తమకు అవసరమే లేదంటోంది!

ఎమ్మార్ పరిణామాలు జరిగాయిలా...

ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ నిర్మించాలని 1999లో చంద్రబాబు భావించారు
1999 ఏప్రిల్ 5న, 2000 మార్చి 30న, 2001 జూలై 25న మూడుసార్లు ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లు పిలిచారు. అయితే 2000 నుంచే దీనికి సంబంధించి ఎమ్మార్ తరఫున బాబుతో కోనేరు ప్రసాద్ టచ్‌లో ఉన్నట్లు సీబీఐ స్పష్టంగా పేర్కొంది.

దుబాయ్‌కి చెందిన ఎమ్మార్‌తో పాటు మలేసియాకు చెందిన ఐఓఐ, హాంకాంగ్‌కు చెందిన సోమ్ ఏసియా, దేశీయ సంస్థలు ఎల్ అండ్ టీ, షాపుర్జీ పల్లోంజీ.. ఇలా 2001 సెప్టెంబర్ 7 కల్లా ఐదు సంస్థలు వచ్చాయి
2001 సెప్టెంబర్ 26 నాటికి సోమ్ ఏసియా, షాపుర్జీ పల్లోంజీలను ప్రభుత్వం పక్కకు తప్పించింది
మిగతా మూడింటికీ 2001 సెప్టెంబర్ 29న రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ (ఆర్‌ఎఫ్‌పీ) పంపించారు
2001 అక్టోబర్ 25న ఆ మూడు సంస్థలతో ప్రీ బిడ్ సమావేశం ఏర్పాటు చేశారు

2001 డిసెంబర్ 15తో టెండర్ల గడువు ముగిసింది. ఐఓఐ, ఎల్‌అండ్‌టీ తప్పుకున్నాయి. ఎమ్మార్ ఒక్కటే మిగిలింది. నిజానికి ఎల్‌అండ్‌టీకి అప్పటికే కాకినాడ పోర్టు ప్రాజెక్టును, హైటెక్ సిటీనీ బాబు అప్పగించారు. అందుకు ప్రతిఫలంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌ను అది ఉచితంగా నిర్మించిందనే ఆరోపణలున్నాయి. నిజానికి అప్పట్లో ఏ ప్రాజెక్టుకైనా బాబు పిలిస్తే తొలుత వచ్చేది ఎల్ అండ్ టీనే. ఐఓఐ ఇండియా సంస్థ కూడా బాబు సన్నిహితుడు చుక్కపల్లి సురేశ్‌ది. దానికి హైటెక్‌సిటీ రెండో దశను, ఏపీ జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్క్‌ను అప్పగించింది కూడా బాబే. అంటే.. తెలివిగా ఆ రెండింటినీ చివరిదాకా ఉంచి, చివర్లో తానే తప్పించారన్నది సుస్పష్టం.
2002 జనవరి 8న ఎమ్మార్‌ను డెవలపర్‌గా ఎంపిక చేశారు

2002 జూలై 10న నానక్‌రామ్‌గూడలో 80.35 ఎకరాలకు భూ సేకరణ నోటిఫికేషన్ విడుదలైంది
ఎమ్మార్‌కు 535 ఎకరాలు ఇస్తున్నట్టు, ప్రాజెక్టు అప్పగిస్తున్నట్టు పేర్కొంటూ 2002 సెప్టెంబర్ 4న జీవో 359 విడుదలైంది. అదే ఏడాది నవంబర్ 6న ఏపీఐఐసీ-ఎమ్మార్ మధ్య ఎంఓయూ కుదిరింది.
2003 ఆగస్టు 19న మళ్లీ ఈ రెండు పక్షాల మధ్యా కొలాబరేషన్ అగ్రిమెంట్ రిజిస్టరయింది. మూడో పక్షాన్ని చేర్చేందుకు వీలుగా కొత్త క్లాజును దీన్లో చేర్చారు. స్టైలిష్ హోమ్స్ పుట్టుకకు, విల్లాల్ని చౌకగా అమ్మినట్లు చూపించటానికి ఇదే మూలం.

2004లో వైఎస్ అధికారంలోకి వచ్చారు. పలు ప్రాజెక్టుల్ని సమీక్షించే పనిని జూలైలో నాటి ఆర్థిక మంత్రి రోశయ్య నేతృత్యంలోని మంత్రివర్గ ఉపసంఘానికి అప్పగించారు. దాన్లో ఎమ్మార్ కూడా ఉంది.
2004 సెప్టెంబర్ నాటికి ఉపసంఘం సిఫార్సులు చేసింది. ఎమ్మార్‌లో అదనపు పెట్టుబడి పెట్టే కంటే.. ఉన్న పెట్టుబడికి తగ్గట్టుగా వాటాను సర్దుబాటు చేస్తే సరిపోతుందని చేసిన సిఫార్సును ప్రభుత్వం ఆమోదించింది.
ఉపసంఘం సిఫార్సులకు అనుగుణంగా ఎమ్మార్‌తో ఒప్పందాన్ని సవరించారు. ఈ మేరకు 2005లో జీవో జారీ అయింది. దీని ప్రకారం కన్వెన్షన్ సెంటర్, ఫైవ్‌స్టార్ హోటల్‌లో ఏపీఐఐసీ వాటా 49 నుంచి 26 శాతానికి తగ్గింది. విల్లాలు, గోల్ఫ్ కోర్సుల్లో వాటా 26%గా యథాతథంగా ఉంది.
Share this article :

0 comments: