బాబు హయాంలో ఓ నీతి... ఇప్పుడో నీతా...? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు హయాంలో ఓ నీతి... ఇప్పుడో నీతా...?

బాబు హయాంలో ఓ నీతి... ఇప్పుడో నీతా...?

Written By ysrcongress on Tuesday, February 7, 2012 | 2/07/2012


జీవోల జారీపై జూపూడి ధ్వజం
బాబు హయాంలో ఓ నీతి... ఇప్పుడో నీతా...?
ఐఏఎస్‌లనే ఇరికించాలని సీబీఐ చూస్తోంది 
మంత్రులకు కూడా బాధ్యత ఉంటుందని ఎందుకు గుర్తించడంలేదు?
తప్పులను వైఎస్సార్‌కు ఆపాదించే యత్నం

హైదరాబాద్, న్యూస్‌లైన్: టీడీపీ అధికారంలో ఉన్నపుడు జీవోల జారీకి తమదే బాధ్యతని అప్పటి ప్రభుత్వం ప్రకటించినపుడు, కాంగ్రెస్ పాలనలో మాత్రం ఆ పాపం ఐఏఎస్ అధికారులపైనే నెట్టడం సబబా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు సూటిగా ప్రశ్నించారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎస్సీ విభాగం కన్వీనర్ నల్లా సూర్యప్రకాష్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీబీఐ విచారణ తీరు చూస్తూంటే ఐఏఎస్ అధికారుల చేత ఏదో విధంగా దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి పేరును చెప్పించి, ఆయనను దోషిగా చేసి జగన్‌మోహన్‌రెడ్డిని అపఖ్యాతి పాలుచేయాలని ప్రయత్నిస్తున్నట్లుగా ఉందని మండిపడ్డారు. 

చంద్రబాబునాయుడు 2004 ఫిబ్రవరి 9 వ తేదీన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఐఎంజీ భారత సంస్థకు 850 ఎకరాలను చౌకధరకు ధారాదత్తం చేస్తూ జారీ అయిన జీవోకు మంత్రివర్గానిదే బాధ్యత అని టీడీపీ ప్రభుత్వం అప్పట్లో హైకోర్టుకు నివేదించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ కేటాయింపు చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీని ఆయన విలేకరులకు చూపిస్తూ ‘‘ఐఎంజీకి భూమిని కేటాయించడంపై మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి హైకోర్టుకు వెళ్లారు. ఈ కేటాయింపునకు సంబంధించి అప్పటి కార్యదర్శి చందనాఖన్ (ఐఏఎస్ అధికారిణి) జీవో జారీ చేశారు. ఆమె జారీ చేసిన జీవోపై కోర్టులో వాదనలు నడిచినపుడు దానిని తాము మంత్రివర్గ సమావేశంలో పెట్టి ఆమోదించాం కనుక బాధ్యత ప్రభుత్వానిదేనని టీడీపీ ప్రభుత్వం పేర్కొంది. మరి అప్పుడు జారీ అయిన జీవోలకు ప్రభుత్వం మొత్తానిది బాధ్యత అయితే ఇపుడు మాత్రం ప్రభుత్వానికి బాధ్యత లేదా? మంత్రులను మినహాయించి సీబీఐ కేవలం ఐఏఎస్ అధికారులనే లక్ష్యంగా చేసుకుంటారా...?’’ అని జూపూడి నిలదీశారు. సీబీఐ పక్షపాత ధోరణితో సచివాలయంలో పనిచేసుకుంటూ పోయే ఐఏఎస్‌లను మాత్రమే ఇరికిస్తుందే తప్ప మంత్రుల జోలికి పోవడం లేదని విమర్శించారు. వివిధ ఆరోపణలు వచ్చిన 26 జీవోల విషయంలో మంత్రులకు కూడా బాధ్యత ఉందని సీబీఐ ఎందుకు భావించడం లేదని ఆయన ప్రశ్నించారు. 

తప్పులను వైఎస్సార్‌కు ఆపాదించే కుయత్నం

పాలనా వ్యవస్థలో అత్యంత కీలకమైన ఐఏఎస్ అధికారులను విచారణ పేరుతో సీబీఐ వేధిస్తోంటే గత్యంతరంలేక వారు ఉద్యమిస్తున్నారని జూపూడి ఆవేదన వ్యక్తం చేశారు. ఐఏఎస్‌లను సీబీఐ విచారణ చేస్తే తప్పేంటి...? తమ చేత ఎవరు జీవో జారీ చేయించారో వారి పేర్లు చెప్పాలి...? అంటూ టీడీపీ, కాంగ్రెస్‌తో పాటు ఓ వర్గం మీడియా తప్పులను రాజశేఖరరెడ్డికి ఆపాదించే విధంగా విషప్రచారం చేయాలని చూస్తోందని దుయ్యబట్టారు.
Share this article :

0 comments: