పాలించే హక్కు కోల్పోయిన ఈ పాలకులను బంగాళాఖాతంలో కలిపేయాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పాలించే హక్కు కోల్పోయిన ఈ పాలకులను బంగాళాఖాతంలో కలిపేయాలి

పాలించే హక్కు కోల్పోయిన ఈ పాలకులను బంగాళాఖాతంలో కలిపేయాలి

Written By ysrcongress on Monday, February 6, 2012 | 2/06/2012

విశాఖ జిల్లా బహిరంగ సభల్లో వైఎస్ జగన్ నిప్పులు
కాంగ్రెస్, టీడీపీ పెద్దలు నీచ రాజకీయాలతో కుమ్మక్కై ప్రజలను గాలికొదిలేశారు
రాష్ట్రంలో ఏ రైతు పరిస్థితి చూసినా కన్నీళ్లే.. ఎటుచూసినా ఆందోళనలే
అయినా పట్టించుకునే నాథుడు లేడు
పాలించే హక్కు కోల్పోయిన ఈ పాలకులను బంగాళాఖాతంలో కలిపేయాలి
ప్రజా సమస్యలు పట్టని చంద్రబాబు ప్రతిపక్ష నేత కావడం మన ఖర్మ
త్వరలో జరగబోయే ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కవుతాయేమో!
మంత్రులు డబ్బులు పంచడానికి వస్తారు.. పోలీసులు దౌర్జన్యానికి దిగుతారు
ఆ ఎన్నికల్లో రైతుకు, రైతు కూలీకి మద్దతుగానే ఓటేయాలని ప్రజలు గుర్తుంచుకోవాలి
ఆ ఎన్నికల ఫలితాలతో ఢిల్లీ పెద్దల దిమ్మతిరగాలి


విశాఖపట్నం, న్యూస్‌లైన్: దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై నీచ రాజకీయాలు చేస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. ‘‘వీరిద్దరికీ కూడా ఇవాళ ప్రజలు, ప్రజా సమస్యలు కనబడడం లేదు. వారిద్దరికీ కనబడుతున్నదల్లా రాజకీయాలు మాత్రమే. వారిప్పుడు ఒకే ఒక్క సిద్ధాంతంతో నడుస్తున్నారు. అది.. రాష్ట్రంలో రెండే రెండు పార్టీలు ఉండాలంట. ఒకటి కాంగ్రెస్సట.. రెండోది తెలుగుదేశం పార్టీనట. మూడో పార్టీ ఈ రాష్ట్రంలో ఉండనే ఉండకూడదట. కాంగ్రెస్‌పై బోర్ కొడితే టీడీపీకి ఓటేయాలట. టీడీపీపై బోర్ కొడితే కాంగ్రెస్‌కు ఓటేయాలట. ఇలాంటి దౌర్భాగ్యపు రాజకీయాలతో కుమ్మక్కై వీరు ప్రజలను గాలికి వదిలేశారు’’ అని జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. విశాఖ జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం రాత్రి పాయకరావుపేట నియోజకవర్గంలోని అడ్డరోడ్డు జంక్షన్‌లో రాత్రి తొమ్మిది గంటలకు జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే..

ప్రతి రైతుకూ కన్నీళ్లే..


ఇవాళ ఈ రాష్ట్రంలో అన్యాయమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అన్నా ఎలా ఉన్నావన్నా అని రైతన్నను అడిగితే.. వ్యవసాయం చేసుకోవడం కంటే ఉరి వేసుకోవడం మేలంటున్నాడు. చెరకు ఎంత గిడుతోందని చెరకు రైతును అడిగితే.. టన్నుకు రూ.1,800 కూడా ఇవ్వట్లేదని చెప్తుంటే బాధనిపిస్తోంది. చెరకు రసం తీసేసి పిప్పి అమ్మితే ఆ యజమానికి టన్నుకు రూ.1,600 వస్తోంది. పంచదారేమో మార్కెట్‌లో రూ.34కు తక్కువ లేదు. అయినా కూడా రైతన్నకు రూ.1,800 మాత్రమే దక్కుతున్నా.. పట్టించుకునే నాథుడు లేడు. వరి రైతు సంగతి చూస్తే.. ఏకంగా లక్ష ఎకరాలను బీడు పెట్టి చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా సమ్మెకు దిగాడు. క్వింటాలుకు రూ.3,500 కూడా రాని దుస్థితిలో, ఎకరాకు కనీసం రూ.70 వేల నష్టానికి పంట అమ్ముకోవాల్సిన పరిస్థితిలో పసుపు రైతు ఉన్నాడు. ఇవాళ వరి రైతు, పసుపు, చెరకు, మిర్చి, ఉల్లి రైతులందరూ కష్టాల్లో ఉన్నారు. వారందరూ ఒకటే మాట అంటున్నారు.. దివంగత వైఎస్సారే ఉంటే మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని! రైతులే కాదు రైతు కూలీల సంగతీ అలాగే ఉంది.

చెరకు కూలీలకైతే రూ.50 కూడా దక్కని పరిస్థితి. చదువుకుంటున్న పిల్లాడిని పలకరిస్తే.. ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలు రాక, గతేడాది స్కాలర్‌షిప్పులు అందక విలవిల్లాడుతున్నాడు.

108కు ఫోన్ కొడితే 2 గంటలైనా రావట్లేదు: చివరకు రాష్ట్రం ఎలా తయారైందీ అంటే.. పేదవాడు అనారోగ్యానికి గురై 108కు ఫోన్ కొడితే కుయ్ కుయ్ అంటూ 20 నిమిషాల్లో రావాల్సిన అంబులెన్స్ 2 గంటలైనా రావట్లేదు. కారణమేంటని అడిగితే.. మా అంబులెన్సులన్నీ రిపేర్‌లో ఉన్నాయని, డీజిల్ పోయించేందుకు కూడా డబ్బుల్లేని పరిస్థితుల్లో ఉన్నామని, మా సిబ్బంది అందరూ సమ్మెలో ఉన్నారన్న సమాధానాలు వినపడుతున్నాయి. ఇటువైపేమో జూనియర్ డాక్టర్లు నిరాహార దీక్షలు చేస్తున్నారు. అటు అంగన్‌వాడీలు రోజూ దెబ్బలు తింటూ స్ట్రైక్‌లు చేస్తున్నారు. అయినా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. చివరకు ఆదర్శ రైతులకు కూడా 8 నెలలుగా జీతాలు ఇవ్వలేదు. ఇంత దారుణమైన పరిస్థితుల్లోకి రాష్ట్రాన్ని నెట్టేసిన పాలకులకు రాష్ట్రాన్ని పాలించే హక్కు లేదు. వీళ్లను బంగాళాఖాతంలో కలిపేయాలి.

చంద్రబాబు అప్పుడు అవిశ్వాసం పెట్టలేదే: ఇలాంటి దుస్థితిలో కనీసం ప్రతిపక్షమైనా సర్కారును కాలర్ పట్టుకుని నిలదీస్తుందేమోనని ప్రజలు ప్రతిపక్షంవైపు ఆశగా చూస్తే.. మన ఖర్మ కొద్దీ అక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఆయన అధికార పక్షంతో కుమ్మక్కై ప్రజలను గాలికి వదిలేశారు. మొన్నటికి మొన్న దురుద్దేశంతో అవిశ్వాసం పెట్టారు. ఇదే తీర్మానాన్ని ఆరు నెలల క్రితం చిరంజీవి కాంగ్రెస్‌లో విలీనం కాక ముందు.. పెట్టివుంటే ప్రభుత్వం కూలిపోయి ఉండేది. జల్, లైలా తుపాన్‌లతో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఫీజు రీయింబర్స్‌మెంటు అందక వరలక్ష్మి ఆత్మహత్య చేసుకున్నప్పుడు, ఫీజుల బకాయిల కోసం కాలేజీలు సుప్రీం కోర్టుకెళ్లినప్పుడు.. అవిశ్వాసం పెట్టాలన్న ఆలోచన చంద్రబాబు చేయలేదు.

జగన్‌ను ఇబ్బంది పెట్టాలనే: అయితే మొన్న అవిశ్వాసం పెట్టాలన్న ఆలోచన ఆయనకు ఎందుకు వచ్చిందీ అంటే.. చిరంజీవి కలిసిపోయారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాగూ పడిపోదు.. జగన్‌ను, ఆయనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టాలంటే ఇదే సరైన సమయమని ఆయన అవిశ్వాసం పెట్టారు. ‘జగన్ ఎప్పుడూ విలువలు, విశ్వసనీయతల గురించి మాట్లాడతాడు.. మనం అవిశ్వాసం పెడితే తన ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటేయాలని చెబుతాడు. 

అలా ఓటు వేస్తే డిస్‌క్వాలిఫై అయ్యి ఉప ఎన్నికలు వచ్చి.. వాటిలో అధికారపక్షంతో పోటీపడడమంటే మామూలు విషయం కాదని ఆ ఎమ్మెల్యేలు భయపడతారు’ అన్న దురుద్దేశంతో టీడీపీ, కాంగ్రెస్ కలిసి అవిశ్వాసం నాటకమాడాయి. అయితే చెడిపోయిన ఈ రాజకీ య వ్యవస్థలో తులసి మొక్కల్లా ఉందామన్న నా మాటను గౌరవించి దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 17 మంది ఎమ్మెల్యేలు అవిశ్వాసానికి మద్దతుగా, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటేశారు. రైతన్నకు, రైతు కూలీకి అండగా నిలిచారు. ఆ 17 మందిలో పాయకరావు పేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు కూడా ఒకరని చెప్పడానికి గర్వపడుతున్నాను.

రైతన్నలకు మద్దతుగా ఓటేయాలి: త్వరలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. మళ్లీ టీడీపీ, కాంగ్రెస్ లోపాయకారీ ఒప్పందాలు కుదుర్చుకుని కలసికట్టుగా పోటీచేస్తారేమో! పోలీసులు వస్తారు.. దౌర్జన్యం చేస్తారు.. కేసులు పెడతారు. మంత్రులు వస్తారు.. ఇక్కడ మకాం వేస్తారు. కులాలకు, మతాలకు ఒక్కొక్కరుగా డబ్బులు పంచుతారు. అయితే ఆ ఉప ఎన్నికలు విశ్వాసానికి, విలువలకు, కుళ్లు, కుతంత్రాలకు మధ్య జరుగుతున్నవని ప్రజలు గుర్తెరగాలి. ఈ ఎన్నికల్లో ఒకవైపు రైతులు, రైతు కూలీలు.. మరోవైపు కుళ్లు, కుతంత్రాల రాజకీయాలు పోటీపడబోతున్నాయి. 

ఈ ఎన్నికల్లో ఓటు వేయడమంటే.. రైతు, రైతు కూలీలకు అండగా నిలబడేందుకు ఓటేస్తున్నామన్న సంగతి గుర్తుంచుకోవాలి. ప్రజలను, రైతన్నలను చిత్రహింసలు పెడుతున్న ప్రభుత్వ వైఖరిలో మార్పు తెచ్చేలా ఆ ఓటు ఉండాలి. ఆ ఓటుతో ఢిల్లీ పెద్దల దిమ్మ తిరిగిపోవాలి. ఈ ఎన్నికలను ఎక్కువకాలం ఆపే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. ఆపితే వారు అభాసుపాలవుతారు. కాబట్టి త్వరలో ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో నిలబడేది వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలు మాత్రమే కాదు.. ప్రతి రైతు, రైతు కూలీ నిలబడుతున్నాడని గుర్తుంచుకోవాలని ప్రజలను కోరుతున్నా.
Share this article :

0 comments: