కమీషన్ల కోసం పుస్తకాల ప్రింటింగ్ గాలికి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కమీషన్ల కోసం పుస్తకాల ప్రింటింగ్ గాలికి

కమీషన్ల కోసం పుస్తకాల ప్రింటింగ్ గాలికి

Written By ysrcongress on Friday, February 10, 2012 | 2/10/2012

ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీపై అడుగడుగునా సర్కారు నిర్లక్ష్యం
వచ్చే విద్యా సంవత్సరం సెప్టెంబరులో కూడా స్కూళ్లకు పుస్తకాలు అందే పరిస్థితి లేదు
కమీషన్ల కోసం పేపర్ సరఫరా ఆర్డర్‌లో కోత?.. ఎల్-1కు 38 శాతమే ఆర్డర్ 
మిగిలిన ఆర్డర్‌ను ఇతర సంస్థలకు అప్పగించే యత్నం.. చక్రం తిప్పిన అమాత్యుడు!

హైదరాబాద్, న్యూస్‌లైన్: జూన్ వచ్చిందంటే బడి గంటలు గణగణ మోగుతాయి. పిల్లలంతా వడివడిగా స్కూలు బాట పడతారు. ఇక అక్కడ్నుంచి మొదలవుతుంది సర్కారువారిచ్చే పుస్తకాల కోసం విద్యార్థుల ఎదురుచూపులు! నెలలు గడిచిపోతున్నా బుక్కులు రావు. పాఠాలు మొదలుకావు. కిందటేడాదైతే ఏకంగా రెండు నెలల ఆలస్యంగా పుస్తకాలొచ్చాయి!! ఈ ఏడాది రెండు నెలలు కాదు కదా.. మూడు నెలలైనా సర్కారీ పుస్తకాలు స్కూళ్లను చేరే పరిస్థితి కనిపించడం లేదు. వివిధ రకాల పన్నులు గుంజుతూ జనం నెత్తిన వేల కోట్ల భారం మోపుతున్న ప్రభుత్వం.. 80 లక్షల మంది విద్యార్థుల బంగారు భవిష్యత్తును మాత్రం గాలికొదిలేస్తోంది. కమీషన్ల వేటలో సర్కారు పెద్దలే పుస్తకాల ప్రింటింగ్‌లోనూ కక్కుర్తిపడుతూ తీవ్ర జాప్యం చేస్తున్నా కళ్లు మూసుకుంటోంది.

ఎల్-1కు ఎగనామం!: పుస్తక ముద్రణకు అవసరమైన పేపరు కొనుగోలు టెండర్ల ప్రక్రియను ఏటా అక్టోబర్/నవంబర్‌లో పూర్తిచేసి, జనవరి ఒకటి నాటికల్లా ముద్రణ ప్రారంభించాలి. కానీ విద్యాశాఖ అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టకపోవడంతో పుస్తక పంపిణీలో జాప్యం జరుగుతూనే ఉంది. ఈసారి ఇప్పటివరకు పేపరు కొనుగోలు ప్రక్రియే పూర్తికాలేదు. వాస్తవానికి గతేడాది నవ ంబర్‌లోనే విద్యాశాఖ టెండర్లు పిలిచింది. అయితే ఎల్-1గా వచ్చిన తమిళనాడు పేపరు లిమిటెడ్(టీఎన్‌పీఎల్) ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో కమీషన్లు రావన్న ఉద్దేశంతో ఆర్డర్‌లో కోత (38 శాతానికి పరిమితం చేసి) పెట్టింది. రూ.100 కోట్ల విలువైన ఈ ఆర్డర్ తతంగం వెనుక ఓ మంత్రి హస్తం ఉందన్న ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో భారీగా కమీషన్లు దండుకొని, మిగిలిన 62 శాతం పేపరు సరఫరా ఆర్డర్‌ను ఇతర సంస్థలకు అప్పగించేందుకు బేరసారాలు జరుగుతున్నట్లు సమాచారం. దీంతో పేపరు సరఫరా, ముద్రణలో తీవ్ర జాప్యం అయ్యే పరిస్థితి నెలకొంది. ఫలితంగా వచ్చే జూన్‌లో విద్యార్థులకు పాఠ్య పుస్తకాల పంపిణీలో ఈసారీ తిప్పలు తప్పేలా లేవు.

రాష్ట్ర సంస్థలకు మొండిచేయి: ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు పాఠ్య పుస్తక ముద్రణాలయం ఉచితంగా పాఠ్య పుస్తకాలు సరఫరా చేస్తోంది. ఇందుకు 22వేల మెట్రిక్ టన్నుల 60 జీఎస్‌ఎం(క్వాలిటీ) పేపరుకు ఏటా రూ.60 కోట్లు వెచ్చిస్తోంది. పుస్తకాల నాణ్యతపై విమర్శలు రావడంతో ఈసారి 70 జీఎస్‌ఎంతో మిల్క్ షేడ్, వాటర్ మార్క్ క్వాలిటీ పేపరు కలిగిన పుస్తకాలను పంపిణీ చేస్తామని విద్యాశాఖ పేర్కొంది. అనంతరం ఆ పేపరు సరఫరా పనుల అప్పగింత విషయంలో ఓ మంత్రి ఇతర రాష్ట్రానికి చెందిన సంస్థతో బేరం కుదుర్చుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఐఎస్‌ఐ ప్రమాణాలు కలిగిన పేపరును సరఫరా చేసే రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పేపరు మిల్లులకు... ఈ ఆర్డర్ దక్కకుండా చేసేందుకు ‘మ్యాప్‌లితో’ అనే సూపర్ క్వాలిటీ పేపరు కావాలనే నిబంధన విధించినట్లు విమర్శలు వచ్చాయి. దీంతో రాష్ట్రంలోని సంస్థలకు అర్హత లేకుండా పోయింది.

బెడిసికొట్టిన వ్యూహం...: పేపరు కొనుగోళ్ల కోసం విద్యాశాఖ గతేడాది నవంబర్‌లో టెండర్లు పిలిచి, వాటిని జనవరి మొదట్లో తెరిచింది. ఈ సందర్భంగా అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. టీఎన్‌పీఎల్ ఒక మెట్రిక్ టన్ను పేపరు సరఫరాకు రూ.41వేలు కోట్ చేసి ఎల్-1గా నిలవగా, మిగిలిన సంస్థలు అంతకంటే ఎక్కువ కోట్ చేశాయని అధికారులే పేర్కొన్నారు. దీంతో ఆర్డర్‌ను టీఎన్‌పీఎల్‌కే ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీఎన్‌పీఎల్ ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో కమీషన్లు రావనే భావనతో దాదాపు రూ. 100 కోట్ల ఆర్డర్ మొత్తాన్ని వారికి అప్పగించేందుకు వెనుకడుగు వేసింది. నెల రోజులుగా ఆ ఫైలును తొక్కిపెట్టి టెండర్లను రద్దు చేసే దిశగా పావులు కదిపింది. ఎల్-1కు ఇవ్వకుండా రద్దు చేస్తే న్యాయపరమైన సమస్యలు తలెత్తుతాయనే భావనతో మూడు రోజుల క్రితం టీఎన్‌పీల్‌కు 38 శాతమే పేపరు కొనుగోలు ఆర్డర్ ఇచ్చింది. మిగిలిన ఆర్డర్‌ను ఇతర సంస్థలకు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Share this article :

0 comments: