జగనన్నను చూడాలని ఉంది... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగనన్నను చూడాలని ఉంది...

జగనన్నను చూడాలని ఉంది...

Written By news on Saturday, February 16, 2013 | 2/16/2013


ఆంధ్రుల ప్రియతమ నాయకుడు, కడప ఎం.పి, వైయస్సార్ ిసీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిగారిని రాజకీయంగా ఎదుర్కోలేక ‘ఆస్తులు సంపాదించుకున్నారు’ అనే నింద మోపి సీబీఐ విచారణ పేరిట ఈ ప్రభుత్వం జగనన్నను జైలుపాలు చేసి రాష్ట్రప్రజలను ఎంతో బాధకు, ఆవేదనకు గురి చేసింది. విచారణ కొనసాగింపు పేరుతో ఎనిమిది నెలలు దాటినా విడుదల చేయలేదు. ఆంధ్రప్రజలు తమ కుటుంబంలో ఒక వ్యక్తిగా భావించిన జగన్‌ని ఇన్నిరోజుల పాటు కళ్లకి కనపడకుండా, జైలు గోడల మధ్య ఉంచడం ప్రజాస్వామ్యమేనా అని అడుగుతున్నాను. జగన్ త్వరలోనే బయటికి రావాలని, గాడి తప్పి పక్కదోవ పడుతున్న రాష్ట్ర రాజకీయాలను చక్కదిద్ది, సక్రమ మార్గంలో నడపాలని కోరుకుంటున్నాను.

- నాగ బ్రహ్మం, ఒంగోలు

సూర్యుడు ఉండాల్సింది మబ్బుల చాటున కాదు!


కొమ్మపై కూర్చున్న పక్షి పెనుగాలికి కొమ్మ ఊగినా, విరిగినా భయపడదు. ఎందుకంటే ఆ పక్షికి కొమ్మలు, చెట్టురెమ్మల కంటే తన రెక్కల పైనే విశ్వాసం. అలాగే మా జగనన్నకు తన మీద తనకు నమ్మకం ఉంది. మాకూ ఆయన మీద నమ్మకం ఉంది. కల్లాకపటం తెలియని నవ్వుతో నిష్కల్మషంగా ఉండే మా జగనన్న అనునిత్యం ప్రజల గుండెల్లో చోటుకోసం మాత్రమే తపిస్తుంటారు. ఏదైనా చేయాలని ఆరాటపడుతుంటారు. ప్రజాసమస్యలపై పోరాడేతత్వం, ప్రపంచాన్ని జయించే ఆత్మవిశ్వాసం జగనన్నలో ఉన్నాయి. లీడర్ అంటే ఇలాగే ఉండాలని ఆనాడు మహానేత వైయస్సార్ గారిని చూసి అనుకున్నాం. ఈరోజు అలా జగనన్నని చూస్తున్నాం. తండ్రి వారసత్వాన్నే కాక ఆయన ఆశయాలనూ వారసత్వంగా స్వీకరించిన పులిబిడ్డ మా జగనన్న. అంతరించిపోయిన కాంగ్రెస్ పార్టీ ప్రాభవాన్ని వైయస్సార్ ఆనాడు తన పాదయాత్రతో తిరిగితెస్తే... ప్రజలకి ఇచ్చిన మాట కోసం ఓదార్పుయాత్రతో అధికారాన్ని, పదవినీ త్యాగం చేసిన యువనేత జగన్.

పార్టీలు, పదవులు శాశ్వతం కాదని నమ్మి, ప్రజల కోసమే ఆయన రాజకీయాలలోకి వచ్చారు. అలాగే నాయకుడనేవాడు ఎన్నేళ్లు పరిపాలించామని కాకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేలా పరిపాలించాలని వైఎస్సార్ అనేవారు. ఆ మాటనే జగన్ నేడు ఆచరిస్తున్నారు. వైఎస్సార్ మరణంతో మన రాష్ట్రానికి పెద్ద దిక్కు లేకుండా పోయిందనీ, ఆ లోటును జగనన్న తప్ప మరెవరూ భర్తీ చేయలేరనీ గుర్తించి, ఆ నిజాన్ని భరించలేకపోయిన ప్రభుత్వం, ప్రతిపక్షం, ఈ రెండు పార్టీలకు తొత్తులుగా మారిన ఎల్లో మీడియా కలిసి నీచ రాజకీయాలతో కుమ్మక్కయి, కుట్రపన్ని మహానేత కుటుంబంలో ఆడపడుచులను సైతం రోడ్డుపైకి వచ్చేటట్లు చేశారు.

పదవుల కోసం, అధికారం కోసం ఆనాడు వైఎస్సార్‌తో ఉన్న వాళ్లంతా ఇప్పుడు జగన్‌కు దూరం అయ్యారు. అయితేనేం, ఆనాడు అధికారం ఇచ్చిన రాష్ట్ర ప్రజలు మాత్రం నేటికీ పెద్దాయన కుటుంబంతోనే ఉన్నారు. జగనన్నపై ఆదరణ కురిపిస్తున్నారు. ఇప్పటికైనా ఈ కుటిలకూటములు ప్రజాభిప్రాయాన్ని గౌరవించి వై.ఎస్. కుటుంబ సభ్యులను వేధించడం మానుకోవాలి. లేదంటే ప్రజల ఆగ్రహాన్ని చవిచూడ్డానికి సిద్ధం కావాలి. ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడు ఉండవలసింది మబ్బులచాటున గాదు, ప్రజల మధ్యలో. ఆ విషయాన్ని పాలకులు గుర్తెరగాలి. నా కుటుంబమే నా ప్రపంచం అనుకోకుండా ఈ ప్రపంచమే నా కుటుంబం అని ముందుకు సాగుతున్న వై.ఎస్. కుటుంబానికి క్షమాపణ చెప్పి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి.

- ఎ.కృపావతి, కపాడిపాలెం, నెల్లూరు

 చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34.
e-mail: ysjagankosam@gmail.com
Share this article :

0 comments: