వారి ఇళ్లపై దాడులు చేయలేదేం? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వారి ఇళ్లపై దాడులు చేయలేదేం?

వారి ఇళ్లపై దాడులు చేయలేదేం?

Written By ysrcongress on Friday, March 22, 2013 | 3/22/2013

వైఎస్సార్‌సీపీ నేత సోమయాజులు ధ్వజం
యూపీఏకు మద్దతు ఉపసంహరించగానే డీఎంకే నేత స్టాలిన్ ఇంటిపై దాడులే నిదర్శనం
సంబంధం లేదంటూనే దాడులు ఎలా ఆపారు? 
జగన్ కేసులో ఇదే జరుగుతోంది


 సీబీఐ దర్యాప్తు సంస్థ కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలా మారిందని మరోసారి రుజువైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డి.ఎ.సోమయాజులు పేర్కొన్నారు. యూపీఏ ప్రభుత్వానికి డీఎంకే మద్దతు ఉపసంహరించిన రెండు రోజుల్లోనే ఆ పార్టీ నేత స్టాలిన్ ఇంటిపై సీబీఐ దాడులు చేయటమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. సోమయాజులు గురువారం వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘సీబీఐని యూపీఏ ప్రభుత్వం తన రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధించేందుకు వినియోగించుకుంటోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గత రెండేళ్లుగా చెబుతూ వస్తోంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేసులో ఇదే జరుగుతోంది. 

ఇటీవల పార్లమెంట్ ఉభయసభల్లో లోక్‌పాల్‌పై జరిగిన చర్చలో సీబీఐ తీరును, యూపీఏ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్న విధానాన్ని ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్ప దాదాపుగా ప్రతిపక్ష పార్టీలన్నీ దుయ్యబట్టాయి. రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడానికి సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్‌ను ప్రయోగిస్తున్నాయని ఆరోపించాయి. అయితే వాటి కార్యకలాపాల్లో జోక్యం చేసుకోమని, అవి స్వతంత్రంగానే వ్యవహరిస్తాయని ప్రధానమంత్రి, ఆర్థికమంత్రి చిదంబరం చెప్పారు. కానీ ఇపుడు జరుగుతున్నదేమిటి? శ్రీలంకలో తమిళుల ఊచకోతపై కేంద్రానికి డీఎంకే మద్దతు ఉపసంహరించుకోగానే స్టాలిన్ నివాసంపై సీబీఐ దాడులు చేయలేదా?’ అని ఆయన సూటిగా ప్రశ్నించారు. 

సీబీఐ దాడులు ఇంతలోనే ఎలా ఆగాయి?

స్టాలిన్ ఇంటిపై సీబీఐ ఎందుకు దాడులు చేసిందో, మళ్లీ అంతలోనే ఎందుకు ఆపారో చెప్పాలని సోమయాజులు డిమాండ్ చేశారు. దాడులు ఆపడానికి ప్రధాని, చిదంబరం, కమల్‌నాథ్ లాంటి వారు జోక్యం చేసుకోలేదా? అని ఆయన ప్రశ్నించారు. ‘సీబీఐ నిజంగా స్వతంత్రంగా వ్యవహరిస్తుంటే స్టాలిన్ ఇంటిపై దాడులు చేసినపుడు యూపీఏ ప్రముఖులు ఊరుకుని ఉండాలి కదా? మరి మధ్యలో ఎందుకు జోక్యం చేసుకున్నారు? దాడులు దురదృష్టకరమని, తమకు తెలియకుండానే జరిగాయని ఎలా వ్యాఖ్యానించారు? దీన్ని బట్టి చూస్తుంటే సీబీఐ పనితీరు రాష్ట్ర పోలీసుశాఖలోని ఎస్‌ఐ, సీఐ కంటే అధ్వానంగా తయారైంది. యూపీఏ ప్రభుత్వం ఏది చెబితే అది చేయడం, ఎలా ఆడమంటే అలా ఆడటం, ఎవరిపై కేసులు పెట్టమంటే వారి మీద మోపటం, ఎవరిని వేధించమంటే వారిని వేధించడమే సీబీఐ పనిగా మారింది’ అని సోమయాజులు వ్యాఖ్యానించారు. 

అనుమానంతోనే జగన్‌ను నిర్బంధించారు

కేవలం ఒక్క అనుమానంతోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని జైల్లో ఉంచారని సోమయాజులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘43 వేల కోట్ల రూపాయల మేరకు అవినీతి జరిగిందని జగన్ కేసులో సీబీఐ ఆరోపణలు చేసింది. ఇప్పటికి 70 శాతం దర్యాప్తు పూర్తయిందని చెప్పింది. కానీ ఇప్పటికి వారు తేల్చామని చెబుతున్నది రూ.900 కోట్ల మేరకు మాత్రమే! ఇదేం విడ్డూరం?’ అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 26 జీవోలు సక్రమమైనవని ఆరుగురు మంత్రులు, 8 మంది రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శులు సుప్రీంకోర్టుకు తెలియజేసిన తరువాత కూడా ఇందులో ఏదో జరిగిందనే అనుమానంతో జగన్‌ను జైల్లో పెట్టారన్నారు. జగన్ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చినపుడల్లా టీడీపీ నేతలు ఢిల్లీ వెళ్లి చిదంబరంకు ఓ వినతిపత్రం ఇవ్వడం, ఆయన తన ఆధ్వర్యంలోని ఈడీకి ఆదేశాలివ్వడం.. వారు ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఆదేశాలిచ్చి హడావుడి సృష్టించడం పరిపాటి అయిపోయిందన్నారు. ‘అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పుకుంటున్న చోట జరుగుతున్నది ఇదేనా? అసలు ఇలాంటివి గతంలో ఎప్పుడైనా జరిగాయా’ అని ప్రశ్నించారు.

వారి ఇళ్లపై దాడులు చేయలేదేం?

‘బోఫార్స్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ ఇంటిపై సీబీఐ దాడులు చేసిందా? ములాయంసింగ్, మాయావతిపై ఇలాంటి కేసులే ఉన్నాయి కదా? వారి ఇళ్లపై సీబీఐ దాడులు చేసిందా? ఒక్క జగన్‌మోహన్‌రెడ్డి ఇంటిపైనే 28 బృందాలతో ఏకకాలంలో దాడులు ఎందుకు నిర్వహించారు?’ అని సోమయాజులు మండిపడ్డారు.

కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై ఆరోపణలు

‘వచ్చే సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఫలానా వారు పోటీ చేయవచ్చనే ఊహాగానంతో ఒక ఆంగ్లపత్రిక పేర్ల జాబితాను ప్రకటించింది. ఆ జాబితాలో ఉన్న వారిని కేంద్రం వేధిస్తోంది. ఓవైపు నుంచి ఆదాయపు పన్నుశాఖ, మరోవైపు నుంచి ఈడీ శాఖలు వారిని చుట్టుముట్టాయి. ఇదేం న్యాయం?’ అని సోమయాజులు ప్రశ్నించారు. సీబీఐ దురుద్దేశంతోనే జగన్‌పైనా ఆయన మద్దతుదారుల ఇళ్లపైనా దాడులు చేయడం, వేధించడం... ఆ వివరాలను తామంటే గిట్టని కొన్ని టీవీ చానెళ్లు, పత్రికలకు చెప్పడం.. వాటిని అవి భూతద్దంలో వేసి ప్రచారం కల్పించడం జరుగుతోందని మండిపడ్డారు.వీరభద్రారెడ్డి ఆత్మహత్యను కూడా బ్రదర్ అనిల్‌కుమార్‌కు ఆపాదిస్తూ లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని చెప్పారు. 
Share this article :

0 comments: