కార్మికులు, కర్షకులు, మహిళలు.. రాష్ట్రంలో ఏ వర్గమూ సంతోషంగా లేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కార్మికులు, కర్షకులు, మహిళలు.. రాష్ట్రంలో ఏ వర్గమూ సంతోషంగా లేదు

కార్మికులు, కర్షకులు, మహిళలు.. రాష్ట్రంలో ఏ వర్గమూ సంతోషంగా లేదు

Written By ysrcongress on Tuesday, March 19, 2013 | 3/19/2013

కరెంటు కోతలతో పరిశ్రమలు మూతపడి.. లక్షల మంది కార్మికులు రోడ్డున పడ్డారు
ప్రజలంతా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వద్దని ముక్తకంఠంతో నినదిస్తున్నారు
పాదయాత్రలో ప్రజల కష్టాలు చూసి కూడా.. చంద్రబాబు అవిశ్వాసం పెట్టలేదు
పైగా వైఎస్సార్ సీపీ అవిశ్వాసం పెడితే.. ప్రభుత్వాన్ని కాపాడారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ సోమవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 94, కిలోమీటర్లు: 1,293.8

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మన నుంచి దూరమైన ఈ మూడున్నరేళ్లలో రాష్ట్ర ప్రజల బతుకులు తలకిందులయ్యాయి. వైఎస్ ఉన్నప్పడు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలూ సుభిక్షంగా ఉంటే.. ఇప్పుడు ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదు. రైతులు, మహిళలు, విద్యార్థులు, కార్మికులు, కూలీలు... ఏ వర్గమూ ఈ రోజు సంతోషంగా లేదంటే.. ఆ పాపం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానిదే’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. రాష్ట్ర ప్రజానీకం పుట్టెడు కష్టాల్లో ఉంటే పాలక కాంగ్రెస్‌కుగాని, ప్రధాన ప్రతిపక్షం టీడీపీకిగాని పట్టడం లేదని షర్మిల నిప్పులు చెరిగారు. ప్రజలను గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, ఆ సర్కారుతో కుమ్మక్కైన తెలుగుదేశం అధినేత చంద్రబాబు వైఖరికి నిరసనగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర సోమవారం గుంటూరు జిల్లా పొన్నూరు, వేమూరు నియోజకవర్గాల్లో కొనసాగింది. మోదుకూరులో భారీ ఎత్తున హాజరైన ప్రజలనుద్దేశించి షర్మిల ప్రసంగించారు. ప్రసంగం పూర్తి సారాంశం ఆమె మాటల్లోనే..

ఏ వర్గమూ సంతోషంగా లేదు..

ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. రైతులకైతే నీళ్లు లేవు.. కరెంటు లేదు. ఎరువుల ధరలు మూడింతలు పెరిగినా.. మద్దతు ధర పెరగలేదు. పెట్టుబడి పెట్టిన ప్రతిసారీ అప్పులపాలై రైతు పంట వేయడమే మానేశాడు. రైతులు చివరికి భూములను, ఇళ్లను, బంగారాన్ని అమ్ముకొనే పరిస్థితికి వచ్చారంటే దానికి కారణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మహిళలు కూడా అంతే బాధపడుతున్నారు. నిత్యావసరాల ధరలన్నీ పెరిగిపోయి.. ఏది కొందామన్నా ఆకాశాన్నంటే ధరలను చూసి భయపడుతున్నారు. ఉప్పు, పప్పు, నూనె, చక్కెర.. ఏదీ కొనేటట్టు లేదు. కనీసం మంచి నీళ్లు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదని మహిళలంతా అల్లాడిపోతున్నారు. చార్జీలన్నీ విపరీతంగా పెరిగిపోయాయి. రాజశేఖరరెడ్డి ఈ రోజు వరకు బతికే ఉంటే 9 గంటల ఉచిత విద్యుత్ వచ్చేది. ప్రతి కుటుంబానికి 30 కిలోల బియ్యం వచ్చేది. ఇప్పడు ఆ పరిస్థితి లేదు. రైతులకైతే 3 గంటలు, గ్రామాలకైతే 4 గంటల కరెంటు మాత్రమే ఇస్తున్నారు. పరిశ్రమలకైతే నెలకు 12 రోజుల కరెంటు కోత. దీంతో లక్షల మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడుతున్నారంటే.. ఆ పాపం కాంగ్రెస్ ప్రభుత్వానిదే. విద్యార్థులు చదువుకోవాలో.. చదువుకోవద్దో అర్థం కాని పరిస్థితి. చదువుకోవాలని ఎంతో ఆశ ఉన్నా కూడా చదువుకునే స్తోమత లేక, ప్రభుత్వం చదివిస్తుందన్న భరోసాలేక.. వారు మధ్యలోనే బడి మానేసి ఇంట్లో కూర్చొని బాధపడుతున్నారంటే కారణం.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం.
అన్ని చార్జీలూ పెరిగిపోయాయి: ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పెరగని చార్జీ లేదు. ఆర్టీసీ ధరలు పెరిగిపోయాయి. గ్యాసు ధరైతే ఏకంగా రూ.1,000కి చేరిపోయింది. కరెంటు బిల్లయితే ప్రతి ఒక్కరికీ రూ.500, 1,000 వస్తూనే ఉంది. కరెంటు బిల్లుల ద్వారా ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రూ.32 వేల కోట్లను ప్రజల నెత్తిన మోపి.. వారి రక్తం పిండైనా సరే ఆ డబ్బును వసూలు చేయాలని చూస్తోంది. రాజశేఖరరెడ్డి ఐదేళ్లకుపైగా సీఎంగా ఉన్నారు. ఏ ఒక్కరోజూ కరెంటు చార్జీలు పెంచలేదు. గ్యాస్ ధర పెంచలేదు. ఆర్టీసీ చార్జీలు పెంచలేదు. ఏ చార్జీలూ పెంచకుండానే, కొత్త పన్నులు వేయకుండానే.. ఆరోగ్యశ్రీని అమలు చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంటు అందించారు. లక్షలకొద్దీ పక్కా ఇళ్లు కట్టించారు. ఆపదలో ఉన్నప్పుడు కుయ్.. కుయ్.. కుయ్ అని వచ్చే 108 తెచ్చారు. ఆయన రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం మాత్రం ఆయన తెచ్చిన ప్రతి పథకానికీ తూట్లు పొడుస్తోంది.

ప్రభుత్వానికి చంద్రబాబు అమ్ముడుపోయారు..

ఇన్ని విధాల కష్టాలు పెడుతున్న ఈ ప్రభుత్వం మాకొద్దని ప్రజల ముక్తకంఠంతో చెబుతున్నా.. మన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు పాదయాత్రలో ఆ ప్రజల కష్టాలు చూసి కూడా.. ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టలేదు. పైగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన అవిశ్వాసానికి మద్దతివ్వకుండా ప్రభుత్వాన్ని కాపాడారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు.. ప్రజల పక్షాన నిలబడకుండా పాలక పక్షాన నిలబడి వాళ్లకు అమ్ముడుపోయారని నిరూపించుకున్నారు. చంద్రబాబు కాంగ్రెస్ వారితో కుమ్మక్కయిపోయారు కాబట్టి.. ఆయన మీద ఏ కేసులూ పడకుండా కాంగ్రెస్‌వారు చూసుకుంటున్నారు.’’

అడుగడుగునా బ్రహ్మరథం..

పాదయాత్ర 94వ రోజు సోమవారం షర్మిల 14 కిలోమీటర్ల మేర నడిచారు. పొన్నూరు నియోజకవర్గం మంచాలకు ముందు యాత్ర ప్రారంభమై మంచాల, బ్రాహ్మణ కోడూరు, వెల్లలూరు, వేమూరు నియోజకవర్గం తొట్టెంపూడి, మామిళ్లపల్లి, మోదుకూరు మీదుగా సాగింది. మోదుకూరు శివార్లలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి సోమవారం రాత్రి 8 గంటలకు షర్మిల చేరుకున్నారు. సోమవారం యాత్రలో వాసిరెడ్డి పద్మ, మర్రి రాజశేఖర్, రావి వెంకటరమణ, డాక్టర్ హరికృష్ణ, స్థానిక నేతలు మేరుగ నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి, కావటి మనోహర్ నాయుడు, ఈపూరి అనూప్, దేవళ్ల రేవతి, బండారు సాయిబాబు మాదిగ తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: