పింఛను కావాలంటే.. ఆ ఊళ్లో పింఛనుదారులెవరైనా చనిపోతే ఇస్తామనేవారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పింఛను కావాలంటే.. ఆ ఊళ్లో పింఛనుదారులెవరైనా చనిపోతే ఇస్తామనేవారు

పింఛను కావాలంటే.. ఆ ఊళ్లో పింఛనుదారులెవరైనా చనిపోతే ఇస్తామనేవారు

Written By news on Saturday, May 25, 2013 | 5/25/2013

* చార్జీలు పెంచింది వైఎస్సేనని, తాను ఏ చార్జీలూ పెంచలేదని బాబు అంటున్నారు
* ఆయన తీరుచూస్తే.. ఫీజులు, ఆరోగ్యశ్రీ, 108 పథకాలు తానే పెట్టాననేట్లున్నారు
* చంద్రబాబు తన పాలనలో ఎనిమిది సార్లు కరెంటు చార్జీలు పెంచారు
* బిల్లులు కట్టకపోతే కేసులు పెట్టి జైల్లో వేయించారు
* ఎవరైనా పింఛను కావాలంటే.. ఆ ఊళ్లో పింఛనుదారులెవరైనా చనిపోతే ఇస్తామనేవారు
* అధికారంలో ఉన్న 9 ఏళ్లలో ప్రజలకు ఏమీ చేయని బాబు.. ఇప్పుడు హామీల మీద హామీలిస్తున్నారు

‘‘టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన తొమ్మిదేళ్ల పాలనలో రైతుల ఉసురు తీశారు. వ్యవసాయం దండగన్నారు.. ప్రాజెక్టులు కడితే నష్టం వస్తుందని పిచ్చి లెక్కలు వేసి చెప్పారు. వృద్ధులు పింఛను కావాలంటే ఆ ఊళ్లో పింఛన్ వచ్చే వాళ్లెవరైనా చనిపోతే ఇస్తానన్నారు. సబ్సిడీ ఇస్తే ప్రజలు సోమరిపోతులవుతారని చెప్పారు. ఆయన పాలనలో తీవ్ర కరువుతో లక్షలాది మంది జనం పొట్ట చేత పట్టుకొని వలస పోయారు. నాడు ప్రజల్ని అంతలా వేధించిన చంద్రబాబు తనకు మళ్లీ అవకాశం ఇవ్వాలంటూ ఇటీవల పాదయాత్ర చేశారు. 

ఆ పాదయాత్రను ఇటీవలే అర్ధంతరంగా ముగించుకుని.. మళ్లీ పచ్చి అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారు. ఆయనేమంటున్నారంటే.. చార్జీలు పెంచింది వైఎస్సారట.. చంద్రబాబు తన హయాంలో ఏ చార్జీలూ పెంచలేదట.. రైతుల పక్షాన నిలబడ్డారట.. ఆయన వల్లనే ఉచిత విద్యుత్తు సాధ్యమయిందట.. ఇలా చంద్రబాబు ఎన్నో అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతున్నారు.’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ‘‘ఆయన తీరుచూస్తే.. ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం తానే ప్రవేశపెట్టానని చంద్రబాబు చెప్పినా చెప్తారు. ఆరోగ్యశ్రీ, 108, 104 పథకాలు తనవే అని కూడా చెప్తారు. చార్మినార్, నాగార్జున సాగర్ తానే కట్టాను అని కూడా ఆయన చెప్పగలరు’’ అని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో సాగింది. ఉండిలో భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

చంద్రబాబు 8 సార్లు కరెంటు చార్జీలు పెంచారు
‘‘చంద్రబాబుకు అబద్ధాలు చెప్పడం కొత్తేమీ కాదు. చంద్రబాబు నాయుడుకు ఒక మునీశ్వరుని శాపం ఉందట. ఏ రోజైతే చంద్రబాబు ఒక్క నిజం చెప్తారో ఆ రోజు ఆయన తల వెయ్యి ముక్కలవుతుందట. వైఎస్ ఉచిత విద్యుత్ ఇస్తానని హామీ ఇస్తే.. చంద్రబాబు పైన వేలాడుతున్న కరెంటు తీగలను చూపిస్తూ ‘ఉచిత విద్యుత్తు ఇస్తే వాటి మీద బట్టలు ఆరేసుకోవాల్సిందే’ అని హేళన చేసి మాట్లాడారు. తొమ్మిదేళ్లలో 8 సార్లు కరెంటు చార్జీలు పెంచి వాటిని కట్టాలని ఒత్తిడి చేశారు. ‘అయ్యా మేం కరువులో ఉన్నాం.. అప్పుల్లో ఉన్నాం’ అని రైతులు ఎంత మొరపెట్టుకున్నా చంద్రబాబు నాయుడు వినలేదు. వాళ్ల మీద కేసులు పెట్టారు. ప్రత్యేక కోర్టులు పెట్టి రైతులను జైలుకు పంపించే వరకు నిద్రపోలేదు. అవమానాలు తట్టుకోలేక వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న రోజులవి. చంద్రబాబు మన రాష్ట్రంలో రైతులను ఇంతగా హింసించారు.

ఎన్నికల తరువాత చంద్రబాబుకు గుర్తుండదు..
చంద్రబాబు 1999 ఎన్నికలకు ముందు ప్రతి మహిళకు బంగారు మంగళ సూత్రాలు ఇస్తానన్నారు. ఆడ పిల్లలు స్కూల్‌కు వెళ్తుంటే వాళ్లకు సైకిళ్లు ఇస్తామని అన్నారు. పాపం ప్రజలు నమ్మి ఓటేసి అధికారం ఇస్తే అన్ని వాగ్దానాల్లో చంద్రబాబు ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేదు. చంద్రబాబుకి మాట ఇవ్వడం అంటే ఏమిటో ఆ మీట మీద నిలబడడం అంటే ఏమిటో ఈ జన్మకు అర్థం కాదు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ఆయనకు ఎన్నికల తరువాత గుర్తుండదు. 

ఇప్పుడేమో మళ్లీ వాగ్దానాలు చేస్తున్నారు. గొప్పగొప్ప వాగ్దానాలు చేస్తున్నారు. ‘అమ్మకు అన్నం పెట్టడు కానీ.. చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాను’ అన్నాడట ఒకడు. అధికారం ఉన్నప్పుడే ఏమీ చేయలేదు కాని ఇప్పుడేమో అన్నీ చేస్తామని వాగ్దానాలు చేస్తున్నారు. అంటే ప్రజలు అమాయక గొర్రెలని, తాను ఏది చెప్తే అది నమ్ముతారని చంద్రబాబు అభిప్రాయపడుతున్నట్లున్నారు. ఎన్టీఆర్ గారు ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానైతే టీడీపీని స్థాపించారో, అదే కాంగ్రెస్ పార్టీతో ఈ రోజు చంద్రబాబు నాయుడు కుమ్మక్కైపోయారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక ఈ రోజు కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై సీబీఐని కలుపుకొని అబద్ధపు కేసులు పెట్టి జగనన్నను నిర్బంధించాయి.

మన దురదృష్టం కొద్దీ ఆ కాలం పోయింది..
అరోగ్యశ్రీ, 108, 104, ఫీజు రీయింబర్స్‌మెంట్, పావలా వడ్డీ రుణాలు, ఉచిత విద్యుత్తు, పక్కా ఇళ్లు ఇలా వైఎస్సార్ అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి చూపెట్టారు. ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి రూపాయి కూడా చార్జీ పెంచని రికార్డు ముఖ్యమంత్రి వైఎస్సార్. కానీ మన దురదృష్టం కొద్దీ ఆ కాలం పోయింది. ఇప్పుడు మన ఖర్మకొద్దీ కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ ముఖ్యమంత్రి ఇప్పటికే ఎరువుల ధరలు 300 శాతం పెంచారు. ఆర్టీసీ చార్జీలు 3 సార్లు పెంచారు. మరోవైపు రూ. 305 ఉన్న గ్యాసు ధర రూ. 420కు పెరిగింది. అదీ సబ్సిడీ ఉంటే. సబ్సిడీ లేకుంటే ఒక్క గ్యాసు సిలిండర్‌కు రూ.1,000 పెట్టాల్సిన పరిస్థితి. రిజిస్ట్రేషన్ చార్జీలు, వ్యాట్, కరెంటు చార్జీలు.. ప్రతి ఒక్కటీ పెంచేశారు.’’

11.5 కిలోమీటర్ల మేర యాత్ర..
‘మరో ప్రజాప్రస్థానం’ 158వ రోజు శుక్రవారం షర్మిల పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ఆరేడు గ్రామం నుంచి యాత్ర ప్రారంభించారు. కోలమూరు, పాములపర్రు మీదుగా ఉండి నియోజకవర్గ కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ భారీ ఎత్తున తరలిచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ఎన్‌ఆర్పీ అగ్రహారం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8.00 గంటలకు చేరుకున్నారు. శుక్రవారం ఆమె 11.5 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకు మొత్తం 2,095.3 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో ఎమ్మెల్యేలు పేర్ని నాని, మద్దాల రాజేశ్, కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు మేకా శేషుబాబు, జూపూడి ప్రభాకర్, నేతలు మొవ్వ ఆనంద శ్రీనివాసు, మాజీ ఎమ్మెల్యేలు పాతపాటి సర్రాజు, ముదునూరు ప్రసాదరాజు, స్థానిక నాయకులు ఉమాబాల, మేడిద జాన్సన్ తదితరులున్నారు.
Share this article :

0 comments: