ఎదిరిస్తే ఎంతకైనా... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎదిరిస్తే ఎంతకైనా...

ఎదిరిస్తే ఎంతకైనా...

Written By news on Tuesday, May 21, 2013 | 5/21/2013

ఎదిరిస్తే ఎంతకైనా...
* ఆది నుంచీ పథకం ప్రకారం సాగుతున్న కుట్ర.. 
* వైఎస్సార్ మరణించిన నాటి నుంచీ పదును.. 
* జనానికి దూరంగా ఉండాలంటూ ఆంక్షలు.. 
* వినకపోవటంతో ఐటీ నోటీసులు; ఆపై కేసులు.. 
* శంకర్రావు లేఖ నుంచి అరెస్టు దాకా.. ఆద్యంతం అక్రమమే

మహానేతను టార్గెట్ చేశారు రాజకీయ ప్రత్యర్థులు. జనానికి దూరం చేయాలనుకున్నారు. సాధ్యం కాలేదు. దురదృష్టవశాత్తూ... ఆయన ఈ లోకానికే దూరమయ్యారు. గుండె చెరువైన జనం ఆయన కుటుంబానికి మరింత చేరువయ్యారు. మహానేత తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అక్కున చేర్చుకున్నారు. దాంతో టార్గెట్ మారింది. చివరకు తండ్రి అడుగుజాడల్లో జన నేతగా ఎదిగిన తనయుడిని అరెస్టు చేసే దాకా వెళ్లింది కుట్ర. అంతటితో ఆగకుండా ఆయన బెయిలుపై కూడా బయటకు రాకూడదన్నట్టుగా ఆ కుట్ర అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. వైఎస్ జగన్‌ను అరెస్టు చేసి ఈ నెల 27కు ఏడాది కావస్తోంది. ఈ నేపథ్యంలో కుట్ర తీరుతెన్నులను, దాని పర్యవసానాలను వివరిస్తూ ‘సాక్షి’ ప్రచురిస్తున్న కథనాల పరంపరలో మొదటిది... 

పదేళ్ల పాటు అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీని... 2004లో అంతా తానై విజయం వైపు నడిపించారు వైఎస్ రాజశేఖరరెడ్డి. సంక్షేమ కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యమిస్తూ జనంలో తిరుగులేని నేతగా ఎదిగారు. 2009 ఎన్నికలకు ముందు... కాంగ్రెస్‌లో గెలుపుపై గట్టి భరోసా నింపారు. కానీ వరుసగా రెండోసారి కూడా ఓటమి ఖాయమన్న భయం... తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజలకు దూరమైన చంద్రబాబునాయుడిని నిద్రపోనివ్వలేదు. తెలుగుదేశానికి కంచుకోటలాంటి ఓ సామాజిక వర్గం వైఎస్‌కు చేరువ కావడం వారికి గిట్టనేలేదు. అదిగో... అప్పుడే కుట్రకు బీజాలు పడ్డాయి. వైఎస్సార్ ప్రభుత్వానికి అవినీతిని అంటగడుతూ బాబు అనుకూల పత్రికల్లో పేజీల కొద్దీ కథనాలు వెలువడ్డాయి. అందుకు కొన్ని చానళ్లూ తోడయ్యాయి. ‘సాక్షి’ పత్రికను పురిట్లోనే చిదిమే ప్రయత్నాలు చేశాయి. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లోకి వచ్చిన పెట్టుబడులపై అసెంబ్లీలోనూ యాగీ చేశాయి. ఎన్నికల వేళ... ఆ పత్రికలు ప్రత్యేక అనుబంధాలు పెట్టి మరీ విషం గుమ్మరించాయి. ఎన్ని చేసినా... వైఎస్సార్ ఒంటి చేత్తో మళ్లీ పార్టీని గెలిపించారు. కుట్రను పటాపంచలు చేశారు. 

ఆయన మరణం... కుట్రకు ప్రాణం
2009 సెప్టెంబర్ 2న జరిగిన ఓ దుర్ఘటన... ఈ రాష్ట్ర రాజకీయాల్లో పెను తుపాను సృష్టించింది. రాజకీయ బలాబలాల్ని తారుమారు చేసేసి... రాష్ట్రాన్ని ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఆ రోజున... ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి హెలికాప్టర్లో వెళ్లారు. మళ్లీ తిరిగి రాలేదు. ఆ దుర్ఘటనపై వెల్లువెత్తిన అనుమానాలు అన్నీ ఇన్నీ కావు. తరవాత జరిగిన ఉదంతాలు ఆ అనుమానాలను మరింత పెంచాయే తప్ప నివృత్తి చేయలేదు. ఆ దుర్ఘటన ఎన్ని ప్రకంపనాలు సృష్టించిందంటే... ఆ మహా విషాదాన్ని తట్టుకోలేక వందల గుండెలు ఆగిపోయాయి. చాలామంది ఆత్మహత్యలకూ వెనకాడలేదు. దుర్ఘటన స్థలానికి వెళ్లి తండ్రికి నివాళులర్పించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి... మృతుల కుటుంబాలను ఓదార్చడానికి రాష్ట్రమంతటా పర్యటిస్తానని సెప్టెంబర్ 25న అక్కడే ప్రతిజ్ఞ చేశారు. ఆ మాట ప్రకారం ‘ఓదార్పు యాత్ర’ ఆరంభించారు. జనం నీరాజనాలు పట్టారు. జగన్‌లో వైఎస్సార్‌ను చూసుకున్నారు. కానీ అలా జరగడం సొంత పార్టీ పెద్దలకు గానీ, ప్రతిపక్షాలకు గానీ సుతరామూ నచ్చలేదు. మరో వైఎస్సార్ తయారు కావడం వారికి ససేమిరా గిట్టలేదు. 

తొలుత ఆంక్షలు... ఆపై కేసులు
జగన్ జనంలోకి వెళ్లి వైఎస్సార్ వారసుడిగా ఎదగడం కాంగ్రెస్ పెద్దలకు నచ్చలేదు. యాత్రకు ఆంక్షలు పెట్టారు. 150 మందికి పైగా ఎమ్మెల్యేలు తనకోసం సంతకాలు చేసినా అధిష్టానం మాటే విన్నారు జగన్. కానీ ఆంక్షలు పెరిగాయి. ఇచ్చిన మాటకు కట్టుబడే తత్వాన్ని తండ్రి నుంచి అలవాటు చేసుకున్న జగన్.. యాత్ర కొనసాగించక తప్పలేదు. కాంగ్రెస్-టీడీపీల డ్రామా జోరందుకుంది. జగన్‌పై ఎందుకు ఉపేక్షిస్తున్నారంటూ ఎల్లో మీడియా నానా కథలల్లింది. కాంగ్రెస్ పెద్దలు జగన్‌ను బెదిరించడానికి శంకర్రావుతో 2010 అక్టోబర్లో కోర్టుకు ఒక లేఖ రాయించారు (సోనియా గాంధీ రాయమంటేనే లేఖ రాశానని ఆ తరవాత శంకర్రావే చెప్పారు.) జగన్ సంస్థల్లోకి వచ్చిన పెట్టుబడులపై విచారణ జరిపించాలని లేఖలో శంకర్రావు కోరారు. ఈ లేఖకు జగన్ బెదరలేదు. జనానికి తనను దూరం చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలు నచ్చక 2010 నవంబర్ 29న పార్టీ నుంచి బయటకొచ్చేశారు. ఓదార్పు యాత్రను కొనసాగిస్తానని చెబుతూ... ఎంపీ పదవికి రాజీనామా చేశారు. వైఎస్ సతీమణి, జగన్ మాతృమూర్తి వైఎస్ విజయమ్మ కూడా తన శాసనసభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 

బెదిరింపుల భూతం..
జగన్ కాంగ్రెస్‌ను వదిలి మూడు రోజులైనా కాకుండానే, 2010 డిసెంబర్ 2న కేంద్రం కనుసన్నల్లో పనిచేసే ఐటీ శాఖ ఆయనకు నోటీసులిచ్చింది. జగతి పబ్లికేషన్స్‌లోకి వచ్చిన పెట్టుబడులన్నిటినీ ఆదాయంగా పరిగణిస్తూ... దానిపై రూ. 122 కోట్ల పన్ను చెల్లించాలంది. ‘సాక్షి’ దాన్ని సవాల్ చేసింది. న్యాయ పోరాటం మొదలైంది. ఇంతలో... తేదీ వేయకుండా, సంతకం లేకుండా శంకర్రావు రాసిన లేఖను హైకోర్టు సుమోటోగా విచారణకు తీసుకుంది. 2011 జనవరి 24న దాన్ని విచారణకు తీసుకుని... ప్రతివాదులుగా పేర్కొన్న జగతి పబ్లికేషన్స్, జగన్ తదితరులకు నోటీసులిచ్చింది. ఈ మధ్యలోనే... కోర్టుకు లేఖ రాసిన శంకర్రావును మంత్రి పదవి వరించింది. 

* మృతుల కుటుంబాలను ఓదార్చటానికి యాత్ర చేస్తాననడం తప్పా? 
* ఇచ్చిన మాట ప్రకారం అధిష్టానం వద్దన్నా యాత్రను కొనసాగించటం నేరమా?
* జగన్ జనంలో ఎదుగుతున్నారని భయపడి కాంగ్రెస్ పెద్దలు ఆయన్ను అణచేసేందుకు చేసిన ప్రయత్నం అడుగడుగునా స్పష్టంగా కనిపించడం లేదా?
* ఒకవైపు లేఖ రాయించటం, మరోవైపు ఐటీ నోటీసులిప్పించటం వెనక అర్థమేంటి? 
* శంకర్రావుకు మంత్రి పదవి ఎందుకిచ్చారు? ఇది క్విడ్ ప్రో కో కాదా? 

శంకర్రావుకు టీడీపీ తోడయింది...
ముందు ఐదు పేజీల లేఖ రాసిన శంకర్రావు... కోర్టు నోటీసులిచ్చిన వారానికి... అంటే 2011 జనవరి 31న తన లేఖకు ఆధారాలంటూ కోర్టుకు కొన్ని పత్రాలు అందించారు. ఫిబ్రవరి 9న శంకర్రావు మరో అఫిడవిట్ వేశారు. తన లేఖకు మరిన్ని ఆధారాలంటూ 333 పేజీల డాక్యుమెంట్లు సమర్పించారు. ఇది జరిగిన నెలకు... అంటే మార్చి 14న ఈ కేసులో తమనూ వాదులుగా చేర్చుకోవాలంటూ టీడీపీ నేతలు కె.ఎర్రన్నాయుడు, పి.అశోక్‌జగపతిరాజు, బెరైడ్డి రాజశేఖర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. చిత్రమేంటంటే వీరు దాఖలు చేసింది కూడా మక్కికి మక్కి శంకర్రావు వేసిన పత్రాలనే. పేజీ నంబర్లు, రఫ్ రాతలతో సహా చాలా పత్రాలు రెండు పిటిషన్లలోనూ అచ్చంగా రిపీటయ్యాయి.

* ఇద్దరూ ఒకే పత్రాల్ని పంచుకుని మరీ కేసు వేశారంటే అర్థమేంటి?
* ఈ రెండు పిటిషన్లూ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తయారైనట్టు కాదా?
* చంద్రబాబునాయుడు దగ్గరుండి డెరైక్షన్ చేసినట్టు తెలియటం లేదా?
* జగన్‌మోహన్‌రెడ్డిని వేధించడానికి కాంగ్రెస్, టీడీపీ ఏకమయ్యాయని చెప్పడానికి ఇది చాలదా? 

విచారణకు ఆదేశించిన కోర్టు...
హైకోర్టు విచారణ మొదలైంది. టీడీపీ నేతలు ఇంప్లీడ్ పిటిషన్ వేసి 4 నెలలు కూడా గడవక ముందే విచారణ పూర్తయింది. ఈ కేసులోనూ, ఎమ్మార్ కేసులోనూ సీబీఐ ప్రాథమిక దర్యాప్తునకు ఆదేశిస్తూ నాటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నిస్సార్ అహ్మద్ కక్రూ నేతృత్వంలోని బెంచ్ 2011 జూలై 11, 12 తేదీల్లో ఉత్తర్వులిచ్చింది. రెండు వారాల్లో సీల్డ్ కవర్‌లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంస్థలు దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లాయి. ‘‘ఇది ప్రాథమిక విచారణేగా! ఆపేయడానికి ఏముంది? సీబీఐ ప్రాథమిక నివేదిక మీకూ అందుతుంది. దాని ఆధారంగా సమగ్ర విచారణకు ఆదేశిస్తే అప్పుడెలాగూ మీరు మమ్మల్ని ఆశ్రయించే అవకాశముంటుంది’’ అంది సుప్రీంకోర్టు.

మరోవైపు రెండు వారాల్లోపే సీబీఐ సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు నివేదిక ఇచ్చేసింది. దాన్ని తమకివ్వాలని జగన్ సంస్థల న్యాయవాదులు కోరారు. కానీ హైకోర్టు నో అంది. ఆరోపణలొచ్చింది ప్రధానంగా ప్రభుత్వ చర్యలపై కాబట్టి ప్రభుత్వ వైఖరి చెప్పాలంటూ సర్కారుకు నోటీసులిచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, 12 శాఖల కార్యదర్శులకు నోటీసులిస్తే... ఒక్కరైనా స్పందిస్తే ఒట్టు! ప్రాథమిక విచారణపై వాదనలు 4 రోజుల్లో ముగిశాయి. ఆగస్టు 4వ తేదీన హైకోర్టు తన తీర్పును వాయిదా వేసింది. సమగ్ర దర్యాప్తునకు ఆదేశిస్తూ 10న తీర్పు వెలువరించింది. ఈ మొత్తం ఉదంతంలో.. తొలి ప్రతివాదిగా ఉన్న ప్రభుత్వం అసలు స్పందించలేదు. కానీ 52వ ప్రతివాదిగా ఉన్న వైఎస్ జగన్‌ను మాత్రం అరెస్టు చేసేశారు. 

‘‘ప్రాథమిక విచారణ నివేదిక మాకివ్వాలని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అయినా నివేదిక మాకివ్వకుండా మాపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించటం అన్యాయం’’ అని జగన్‌మోహన్‌రెడ్డి తరఫు లాయర్లు వాదించారు. దానికి జస్టిస్ కక్రూ ఏమన్నారంటే... ‘‘మేం ఆ నివేదికను చూసి మళ్లీ సీల్ చేసేశాం. అయినా మేం విచారణకు ఆదేశిస్తున్నది ఆ నివేదిక ఆధారంగా కాదు. అందుకని దాన్ని మీకివ్వాల్సిన అవసరం లేదు’’ అని. ఆరోపణలు ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించినవని, ప్రభుత్వం కౌంటర్ వేయకుండా తీర్పునెలా ఇస్తారన్న వాదనకు ఆయనేమన్నారంటే... ప్రభుత్వం కౌంటర్ వేయకపోవటం తప్పేనని, కానీ ఆ ఒక్క కారణంతో తీర్పు ఇవ్వకుండా ఉండలేమని!!! దీనిపై ‘సాక్షి’ సుప్రీంకోర్టుకెళ్లింది. ‘‘దర్యాప్తునకు ఆదేశించారు కదా! మీరు తప్పు చేయకపోతే దాన్ని నిరూపించుకునేందుకు ఇదో అవకాశం కదా’’ అంది సుప్రీంకోర్టు. చిత్రమేంటంటే హైకోర్టు విచారణ ముగిసి దర్యాప్తునకు ఆదేశించడం... అది పూర్తయి దానిపై మళ్లీ విచారణ జరగడం... పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించడం... దీన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను ఈలోపు రెండుసార్లు సుప్రీంకోర్టు కొట్టివేయటం... ఇవన్నీ కేసులో టీడీపీ ఇంప్లీడ్ అయిన ఐదు నెలల్లో జరిగిపోయాయి!

* ప్రాథమిక విచారణ నివేదికలో ఏముంది? దాన్ని జగన్ సంస్థలకెందుకు ఇవ్వలేదు? సుప్రీం చెప్పినా ఎందుకు నిరాకరించారు?... పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది.
ప్రాథమిక నివేదిక ఆధారంగా కాకపోతే మరి దేని ఆధారంగా?
* ప్రభుత్వ నిర్ణయాల వల్ల కొందరికి లబ్ధి కలిగిందని, అందుకు ప్రతిగా వారు పెట్టుబడులు పెట్టారని ఆరోపణలొచ్చినప్పుడు ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు?
* ప్రభుత్వం స్పందించి, అన్నీ నిబంధనల ప్రకారమే జరిగాయని చెబితే కేసు నిలవదని భయమా?
* కీలకమైన ప్రభుత్వ వాదన వినకుండానే తీర్పు ఎలా వెలువడింది?
* సీబీఐ దర్యాప్తునకు నిర్దిష్ట గడువు ఎందుకు విధించలేదు?

సీబీఐ దాడులు మొదలయ్యాయ్...
ఆగస్టు 10న బుధవారం తీర్పు వెలువడింది. ఆగమేఘాలపై సీబీఐకి తీర్పు కాపీ అందింది. మధ్యలో రెండు రోజులు సెలవు దినాలొచ్చినా... వివిధ ప్రాంతాల నుంచి సీబీఐ సిబ్బందిని సమీకరించుకుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని ప్రధాన కుట్రదారుగా పేర్కొంటూ ఆగస్టు 17న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. 24 గంటలు కూడా గడవకముందే 28 ప్రత్యేక బృందాలతో మూకుమ్మడి దాడులు మొదలు పెట్టింది. ‘సాక్షి’ కార్యాలయాలపై దాడులు చేసి రికార్డులను, కంప్యూటర్లను స్వాధీనం చేసుకుంది. భారతీ సిమెంట్స్, ‘సాక్షి’ ఇన్వెస్టర్ల ఇళ్లు, కార్యాలయాలపై ఏక కాలంలో దాడులు చేసింది. పలువురిని పిలిచి ప్రశ్నించింది. ఒక రకమైన భయోత్పాతాన్ని సృష్టించింది. ఇదే సీబీఐ... వై.ఎస్.విజయమ్మ దాఖలు చేసిన కేసులో చంద్రబాబునాయుడిపై కోర్టు విచారణకు ఆదేశించినపుడు మాత్రం ముందుకు కదిలితే ఒట్టు.

కోర్టు నుంచి తీర్పు కాపీ తెచ్చకోవటానికే దానికి మూడు వారాలు పట్టింది. నెలదాకా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయనేలేదు. జగన్ వ్యవహారంలో మాత్రం సీబీఐ చేస్తున్నది, చేయబోయేది, ముందుగానే రాష్ట్రంలో ఎల్లో మీడియాలో ప్రత్యక్షమయ్యేది. అంతా అది చెప్పినట్టుగానే జరిగేది. సాక్షుల్ని పిలిచి సీబీఐ రహస్యంగా చేసిన విచారణలు కూడా ఆ మీడియాలో స్వయంగా వాళ్లు చూసినట్టుగా వెలువడ్డాయి. ఈ తీరుపై హైకోర్టులో కేసు కూడా దాఖలయింది. ఎమ్మార్ వ్యవహారంలో సీబీఐ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ కొందరు మీడియా వారితో టచ్‌లో ఉంటున్నారని, వందల ఫోన్లు చేస్తున్నారని, ఆయన్ను నిలువరించాలని కోరుతూ పారిశ్రామికవేత్త రఘురామకృష్ణంరాజు కోర్టులో పిటిషన్ వేశారు. 

* ఏ కేసులోనైనా సీబీఐ ఇంత క్రియాశీలంగా వ్యవహరించిందా?
* బోఫోర్స్ కేసులో సోనియా ఇళ్లపై దాడులు చేసిందా?
* ఫోక్స్‌వ్యాగన్ కేసులో సైతం బొత్స ఇంటికెళ్లి ఆయన చెప్పిందే రాసుకుని వచ్చేశారేం?
* లీకులెందుకు? సీబీఐ లక్ష్యం దర్యాప్తు చేయడమా, లేక వైఎస్సార్ కుటుంబ ప్రతిష్టపై బురదజల్లడమా?... సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ ఒక వర్గం మీడియాతో వందల కొద్దీ ఫోన్లు మాట్లాడాల్సిన అవసరమేముంది?
* మాట్లాడితే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మాట్లాడాలి గానీ లక్ష్మీనారాయణకు ఎందుకింత ఆసక్తి?

కోర్టుకు హాజరయ్యే ముందు అరెస్టు...
దర్యాప్తు మొదలుపెట్టిన సీబీఐ... 2012 జనవరి 2న... అప్పటికే వందలసార్లు విచారించిన విజయసాయిరెడ్డిని అరెస్టు చేసింది. అరెస్టు చేసిన 90 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీటు వేయాలి గనుక... అరబిందో, హెటెరో డ్రగ్స్ కంపెనీలకు ఫార్మా సెజ్‌లో భూమి కేటాయించిన అంశాన్ని తీసుకుని దానిపై మాత్రమే చార్జిషీటు వేసింది. మరో రెండు చార్జిషీట్లు వేసి... వాన్‌పిక్ అధిపతి నిమ్మగడ్డ ప్రసాద్‌ను అరెస్టు చేసింది. ఈ మూడు చార్జిషీట్లు వేసేదాకా జగన్‌మోహన్‌రెడ్డిని కనీసం ప్రశ్నించలేదు కూడా. ఇంతలో మొదటి చార్జిషీటును విచారణకు స్వీకరించే నిమిత్తం హాజరు కావాలంటూ 2012 మే 14న ప్రత్యేక కోర్టు వైఎస్ జగన్‌కు నోటీసులిచ్చింది. మే 28న హాజరు కావాలని పేర్కొంది. ఆయన కోర్టుకు హాజరైతే కోర్టు అక్కడే బెయిలు మంజూరు చేసే అవకాశం ఉంది. అయితే, తమ ముందు హాజరు కావాలంటూ అంతకు మూడు రోజుల ముందే, అంటే మే 25న జగన్‌కు సీబీఐ నోటీసులిచ్చింది. 2012 మే 25, 26, 27 తేదీల్లో వరుసగా మూడు రోజుల పాటు ఆయన సీబీఐ ముందు హాజరయ్యారు. 

విచారణలో వారికి సహకరించారు. అయినా తమకేమీ చెప్పడం లేదంటూ, కోర్టుకు హాజరయ్యే ముందు రోజు... మే 27 రాత్రి వైఎస్ జగన్‌ను అరెస్టు చేస్తున్నట్టు సీబీఐ ప్రకటించింది. నిజానికి ఈ అరెస్టును జగన్ ముందే ఊహించారు. తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు ఇవ్వాలంటూ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ‘‘సమన్లిచ్చాక అరెస్టు ఎందుకు చేస్తారు? మీది భయమే తప్ప దానికి ఆధారాలు లేవు’’ అంది కోర్టు. కానీ ఆయనది భయం కాదని అరెస్టుతో రుజువయింది. చిత్రమేమిటంటే... జగన్‌ను సీబీఐ త్వరలో అరెస్టు చేయబోతోందని అప్పటికే చంద్రబాబు దాదాపు ప్రతి సమావేశంలోనూ చెప్పేవారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డీ ఇదే అనేవారు. ఇంకా ఘోరమేంటంటే... జగన్ కనక తమ మాట విని ఉంటే సీఎం అయి ఉండేవారని సాక్షాత్తూ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ చెప్పారు. దీన్నిబట్టే కుట్ర ఎంత పక్కాగా సాగిందో చెప్పొచ్చు.

* జగన్‌ను కనీసం ప్రశ్నించడం కూడా చేయకుండా మూడు చార్జిషీట్లు వేశారు. మరి అప్పుడు ఆయన బయట ఉండి విచారణకు అడ్డు తగల్లేదా?
* ఇప్పుడు బెయిలు పిటిషన్ వచ్చిన ప్రతిసారీ ఆయన బయట ఉంటే విచారణకు అడ్డు తగులుతారని వాదిస్తున్నారు. ఇదెంత హాస్యాస్పదం?
* కోర్టుకు హాజరయ్యే 24 గంటల ముందు జగన్‌ను అరెస్టు చేయటంలో పరమార్థమేమిటి?
* దర్యాప్తు పూర్తయ్యాక వేసేదే చార్జిషీటు. అలాంటిది సీబీఐ ఒకవైపు దర్యాప్తు కొనసాగిస్తూ చార్జిషీట్లు వేస్తుండటంలో అర్థమేమిటి?.. ఎన్నాళ్లీ దర్యాప్తు? ఇంకెన్ని చార్జిషీట్లు వేస్తారు?

ఏడాది కాలాన్ని వెనక్కివ్వగలరా?
‘‘సీబీఐ అసమర్థతకు జగన్‌మోహన్‌రెడ్డి మూల్యం చెల్లిస్తున్నారు. కేవలం ప్రాథమిక దర్యాప్తు చేయడానికి సంవత్సరం సమయం తీసుకోవడంలో అర్థం లేదు. ఏడాదంటే తక్కువేమీ కాదు. ఆలోగా ఆరోపణలను రుజువు చేసి శిక్ష వేయించాలి, లేదంటే నిర్దోషిగా ప్రకటించాలి. రేపు కేసు విచారణ ముగిసి జగన్ నిర్దోషి అని నిరూపణయితే.. జైల్లో ఉన్న ఏడాది కాలాన్ని ఆయనకు వెనక్కు తెచ్చివ్వగలరా? సీబీఐ అసమర్థత వల్ల పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలగకూడదు. నిందితులను ఏడాది పాటు జైల్లో ఉంచడం ఆమోదయోగ్యం కాదు’’
- కె.రామచంద్రమూర్తి,
సీనియర్ జర్నలిస్ట్ 


అన్యాయం, చట్టవిరుద్ధం...
దర్యాప్తు పేరుతో ఒక వ్యక్తిని ఇన్ని రోజులు జైల్లో ఉంచడం అన్యాయం మాత్రమే కాదు, చట్ట విరుద్ధం కూడా. జగన్‌మోహన్‌రెడ్డి విషయంలో వివక్ష స్పష్టంగా కనిపిస్తోంది. జగన్ రాజకీయంగా ఎదుగుతున్నారు కాబట్టి, ఆయన బయటకు వస్తే ఇబ్బంది కలిగే వ్యక్తులే అలా రాకుండా సీబీఐ ద్వారా అడ్డుకుంటున్నారు. ఆ వ్యక్తులకు సీబీఐ ఓ సాధనంగా ఉపయోగపడుతోంది. సీబీఐ చర్యలు పూర్తిగా దురుద్దేశపూర్వకమైనవి. అందుకే కోర్టులు చెప్పిన మాట కూడా వినకుండా, చట్టం నిర్దేశించిన పరిమితిని కూడా కాదని, నిర్దిష్ట గడువంటూ లేకుండా ఏళ్ల తరబడి దర్యాప్తు చేస్తూ పోతోంది. సీబీఐ ఏళ్ల తరబడి దర్యాప్తు చేస్తూ పోతే అప్పటిదాకా జగన్ జైల్లోనే ఉండాలా? ఈ విషయంలో సుప్రీంకోర్టు తీరూ సరికాదు. సీబీఐ దురుద్దేశపూర్వక చర్యలను అందరూ ఖండించాలి.
- ఎస్.రామచంద్రరావు, హైకోర్టు సీనియర్ న్యాయవాది

పత్రికలే తీర్పరులు
కొన్ని దిన పత్రికలు, చానళ్లు న్యాయస్థానాల్లాగే విచారణ చేయడం మొదలుపెట్టాయి. ఊహాజనిత కథనాలతో వార్తలు రాస్తున్నాయి. విధానాలపైన కాకుండా కొన్ని రాజకీయ పక్షాలతో, నాయకులతో అంటకాగి, వ్యక్తులపై వ్యతిరేక వార్తలు రాస్తున్నాయి లేనటువంటి వార్తను తీసుకొచ్చి ప్రజలపై రుద్దుతున్నాయి.
- ఏబీకే ప్రసాద్,
సీనియర్ ఎడిటర్


జడ్జిలూ ప్రభావితులవుతారు
న్యాయమూర్తులూ సగటు మనుషులే. వారూ పత్రికలు చదువుతారు. వాటిలోని వార్తలు వారిని కూడా ప్రభావితం చేసే ఆస్కారముంది. అందుకే కోర్టు ధిక్కరణ చట్టంలో ఓ నిబంధన ఉంది. కేసు విచారణకు వచ్చాక.. విచారణను ఎదుర్కొంటున్న వారికి సంబంధించి ఎలాంటి వార్తలు, కథనాలు రాసినా కోర్టు విధులు, వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నట్టేనన్నది దాని సారాంశం. కాని పలు పత్రికలు ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నా చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. కోర్టు తీర్పుల సందర్భంలో జడ్జిలు చేసే వ్యాఖ్యలను వక్రీకరిస్తున్న సందర్భాలూ ఉన్నాయి. వాటిపైనా చర్యలు కనిపించడం లేదు. దీంతో కొన్ని పత్రికలది ఇష్టారాజ్యమైపోయింది. 
- సీవీ మోహన్‌రెడ్డి, మాజీ అడ్వొకేట్ జనరల్


http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=62694&Categoryid=1&subcatid=18
Share this article :

0 comments: