ఇదీ ఒక ప్రభుత్వమేనా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇదీ ఒక ప్రభుత్వమేనా?

ఇదీ ఒక ప్రభుత్వమేనా?

Written By news on Friday, June 7, 2013 | 6/07/2013

మరో ప్రజాప్రస్థానంలో సర్కారును నిలదీసిన షర్మిల 
కిరణ్ పాలనలో రైతులకు నీళ్లు బంద్.. గ్రామాలకు కరెంటు బంద్
విద్యార్థులకు చదువుల్లేవు.. కార్మికులకు పని లేదు
అన్నీ బంద్ అయినా రాష్ట్రంలో మద్యం మాత్రం ఏరులై పారుతోంది
ఈ నాలుగేళ్లలో ప్రభుత్వం రెట్టింపు ఆదాయం సమకూర్చుకుంది
ప్రత్యక్ష నరకం చూస్తున్నామని ప్రజలు గోడు వెళ్లబోసుకుంటున్నారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ గురువారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 171, కిలోమీటర్లు: 2,264.5

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘ఈ కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనలో రైతులకు నీళ్లు బంద్.. గ్రామాలకు కరెంటు బంద్.. విద్యార్థులకు చదువులు బంద్.. కార్మికులకు పని బంద్, రాష్ట్రానికి అభివృద్ధి బంద్.. ప్రజలకు మనశ్శాంతి బంద్.. ఇదీ మన రాష్ట్రంలోని పరిస్థితి. అన్నీ బంద్ అయిపోయినా మద్యం మాత్రం రాష్ట్రంలో ఏరులై పారుతోంది. పగలూ, రాత్రీ అనే తేడా లేకుండా పల్లెలు, పట్టణాలు అనే భేదం లేకుండా ఎక్కడ చూసినా మద్యం పుష్కలంగా దొరుకుతోంది. మద్యం ధరలు పెంచడంతో ఈ నాలుగేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రెట్టింపు ఆదాయం సమకూర్చుకుంది..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల నిప్పులు చెరిగారు. పేదలను మద్యానికి బానిసలుగా చేసి ఆదాయం పెంచుకునే ప్రభుత్వం ఒక ప్రభుత్వమేనా అని నిలదీశారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో కుమ్మక్కైన చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర గురువారం తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో సాగింది. 

‘‘నాలుగైదు గంటలకు మించి ఊళ్లలో కరెంటు ఉండటం లేదమ్మా.. పగలంతా పొలం పనులు చేసుకొని తీరా ఇంటికి వస్తే కరెంటు ఉండదు.. కరెంటు లేకుండా ఇంటి పని, వంట పని చేసుకోవాలమ్మా.. కరెంటు లేక దోమలు కుడుతుంటే, ఉక్కపోతతోనే పడుకోవాలమ్మా.. ఈ కిరణ్‌కుమార్‌రెడ్డి నరకం చూపిస్తున్నాడు.. మాకు మనశ్శాంతే లేదమ్మా..’’ అని నాగేశ్వరి అనే మహిళ షర్మిల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. దారి మధ్యలో రైతులు కలిసి పంట పొలాలకు మూడు గంటల కంటే ఎక్కువ సమయం కరెంటు రావడం లేదని వాపోయారు. ప్రజల కష్టాలు వింటూ, వారి కన్నీళ్లు తుడుస్తూ, జగనన్న త్వరలోనే వస్తాడని భరోసా ఇస్తూ షర్మిల ముందుకు సాగారు. రాజానగరం పట్టణంలో భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..
వైఎస్ బతికి ఉంటే 9 గంటల విద్యుత్ అందేది..

‘‘వైఎస్సార్ రైతులకు ఏడు గంటల ఉచిత విద్యుత్తు ఇస్తామన్నారు.. ఇచ్చి చూపించారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడా కరెంటు లేదు. వైఎస్సార్ బతికే ఉంటే ఈరోజు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చి చూపించేవారు. ప్రజలకు అవసరమైన ప్రతి సంక్షేమ పథకాన్నీ అమలు చేశారు. అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా ఒక్క రూపాయి కూడా పన్నులు వేయని రికార్డు ముఖ్యమంత్రి వైఎస్సార్. ఈ ప్రభుత్వం ఇస్తామన్నా ఏడు గంటలు కాదు కదా.. కనీసం మూడు గంటలు కూడా ఇవ్వలేకపోతోంది. 

‘ఆ మూడు గంటలు కూడా ముక్కలు చెక్కలు చేసి గంటకోసారి, అరగంటకోసారి ఇస్తారమ్మా, అది కూడా పగలు ఇస్తారో, రాత్రి ఇస్తారో తెలియదు, రాత్రి కూడా చే లలోనే గడుపుతున్నాం.. వాళ్లిచ్చే కరెంటుతో చేను ఎప్పుడూ తడవదు’ అని ప్రతి రైతూ చెబుతున్నాడు. గ్రామాల్లో ఎక్కడా కూడా కరెంటు లేదు. ఆరు గంటలకు మించి ఏ ఊళ్లోనూ కరెంటు లేదు. కరెంటు లేకుండానే వండుకోవాలి. మార్చిలో పరీక్షలు ఉంటాయనే ఇంగితం లేకుండా అప్పుడు కూడా కరెంటు ఇవ్వలేదు. మే నెలలో ఎండలు అత్యధికంగా ఉంటాయని తెలిసి అప్పుడూ కరెంటు ఇవ్వలేదు. నరకం అంటే ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూస్తున్నామమ్మా.. అని ఒక అక్క చెప్పింది. ఓవైపు కరెంటు ఇవ్వకుండానే.. మరోవైపు లేని కరెంటుకు మూడింతలు బిల్లులు వసూలు చేస్తున్నారు. కరెంటు ఇవ్వకుండా బిల్లులు వసూలు చేయడం అనేది అమానుషమని అర్థం చేసుకునేంత పెద్ద మనసు, తెలివితేటలు ఈ కిరణ్ కుమార్‌రెడ్డికి లేవు. ఈ కరెంటు బాదుడుకు నిరసనగా, అన్యాయమైన పాలనకు నిరసనగా అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి అవిశ్వాస తీర్మానం పెడితే చంద్రబాబు గారు ప్రజల పక్షాన నిలబడకుండా కాంగ్రెస్‌కు రక్షణ కవచంలా నిలబడి ఈ ప్రభుత్వాన్ని కాపాడారు. చంద్రబాబు గారు అవిశ్వాసానికి మద్దతు ఇచ్చి ఉంటే ఈ ప్రభుత్వం ఎప్పుడో కూలిపోయి, ప్రజలకు ఈ పన్నుల భారం తప్పేది. ఈరోజు ఇంత దుర్మార్గపు ప్రభుత్వం ఇంకా అధికారంలో ఉంది అంటే అందుకు కారణం చంద్రబాబు నాయుడే.’’

14.4 కిలోమీటర్ల పాదయాత్ర

గురువారం 171వ రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం మధురపూడి శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడ్నుంచి బూరుగుపూడి, దోసకాయలపల్లి, నందరాడ, నరేంద్రపురం మీదుగా రాజానగరం చేరుకుంది. ఇక్కడ భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ఇదే పట్టణంలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. గురువారం 14.4 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 2,264.5 కి.మీ. యాత్ర పూర్తయింది. పాదయాత్రలో పాల్గొన్న వారిలో జిల్లా పార్టీ కన్వీనర్ కుడిపూడి చిట్టబ్బాయి, ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, గొల్ల బాబూరావు, మాజీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, చెల్ల జక్కిరెడ్డి, వరుపుల సుబ్బారావు, నేతలు కొల్లి నిర్మలకుమారి, జక్కంపూడి విజయలక్ష్మి, బొడ్డు వెంకటరమణచౌదరి, స్థానిక నేతలు బొమ్మన రాజ్‌కుమార్, జ్యోతుల నవీన్, చెలమలశెట్టి సునీల్, చెల్లుబోయిన వేణు, తోట సుబ్బారావు నాయుడు, బొంతు రాజేశ్వర్‌రావు, చిట్టిబాబు, మోహన్, రంగోలి లక్ష్మి, సుంకర చిన్న, అనంత ఉదయభాస్కర్ తదితరులు ఉన్నారు.
Share this article :

0 comments: