జగనన్న వస్తే ఆరోగ్యశ్రీకి జీవం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగనన్న వస్తే ఆరోగ్యశ్రీకి జీవం

జగనన్న వస్తే ఆరోగ్యశ్రీకి జీవం

Written By news on Thursday, June 6, 2013 | 6/06/2013

వైఎస్సార్ గొప్ప సంకల్పంతో ఆరోగ్యశ్రీకి ప్రాణం పోశారు
ఈ సీఎం కిరణ్ ప్రభుత్వం దాని ప్రాణం తీసి పాడెక్కించింది
135 వ్యాధులను పథకం పరిధి నుంచి తొలగించింది
జగనన్న వస్తే.. వైఎస్ పథకాలన్నింటికీ ప్రాణం పోస్తారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ బుధవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 170, కిలోమీటర్లు: 2,250.1

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘వైఎస్సార్ పేదలకు అందాల్సిన ఆరోగ్యం గురించి ఆలోచన చేశారు. తాను అనారోగ్యం పాలైనపుడు ఎలాగైతే కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకుంటారో.. అలాగే ప్రతి పేదవాడూ కూడా అనారోగ్యం పాలైనప్పుడు ధైర్యంగా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి తన మంచం పక్కనే మంచం వేసుకొని తలెత్తుకొని వైద్యం చేయించుకోవాలనే గొప్ప సంకల్పంతో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకానికి ప్రాణం పోశారు. కానీ ఈ కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ప్రాణం తీసి పాడెక్కించింది. ఆ పథకం నుంచి 135 వ్యాధులను తొలగించింది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి విమర్శించారు. ‘‘అవకాశం వచ్చినప్పుడు జగనన్నను ఆశీర్వదించండి, ఒక్క ఆరోగ్యశ్రీ పథకానికే కాదు, 108, 104 పథకాలు ఇలా రాజన్న అమలు చేసి చూపించిన ప్రతి పథకానికీ జగనన్న మళ్లీ జీవం పోస్తారు’’ అని ప్రజలకు భరోసా ఇచ్చారు. 

ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర బుధవారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో సాగింది. ‘‘అమ్మా.. నా భర్తకు కాళ్లు, చేతులకు వాపు వచ్చిందని ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని ఆసుపత్రికి పోతే కార్డు చెల్లదని, డబ్బు కట్టాలని చెప్పారమ్మా’’ అని సానిటోరియం సెంటర్‌కు చెందిన రామానుజమ్మ అనే మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిల నడుస్తున్న దారివెంట ఎయిడ్స్ బాధితులు, జాలర్లు, చేనేతలు, వృద్ధులు, వికలాంగులు పలుచోట్ల కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. వాళ్ల ఆవేదనను శ్రద్ధగా విన్న షర్మిల ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ, వాళ్లకు ధైర్యం చెప్తూ ముందుకు కదిలారు. ఈ సందర్భంగానే పై వ్యాఖ్యలు చేశారు. వారితో మాట్లాడుతూ షర్మిల చేసిన వ్యాఖ్యల్లో ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే..

త్వరలోనే జగనన్న వస్తారు..

‘‘కాంగ్రెస్, టీడీపీలు కుట్రలు పన్ని, కుతంత్రాలు చేసి సీబీఐని వాడుకొని అబద్ధపు కేసులు పెట్టి జగనన్నను జైలుపాలు చేశాయి. అన్యాయంగా ఏడాది కాలంగా ఆయనను నాలుగు గోడల మధ్య బంధించాయి. కానీ త్వరలోనే జగనన్న బయటికి వస్తారు.. రాజన్న రాజ్యం నిర్మించే దిశగా మనందరినీ నడిపిస్తారు. రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత మన విద్యార్థుల కోసం మళ్లీ ఫీజు రీయింబర్స్‌మెంటు, పేదల కోసం ఆరోగ్యశ్రీ నిలబెడతారు. వృద్ధులకు, వితంతువులకు పింఛను రూ. 700 అవుతుంది. వికలాంగులకైతే రూ. 1000 అవుతుంది. తమ పిల్లలను చదివించేలా అక్కాచెల్లెళ్లను ప్రోత్సహించడం కోసం ‘వైఎస్సార్ అమ్మ ఒడి’ పథకం ప్రవేశపెడతారు. కుటుంబంలో ఇద్దరు పిల్లలకు పదో తరగతి వరకు ఒక్కొక్కరికీ రూ.500 చొప్పున ఇస్తారు. 

అంటే ఏడాదికి రూ. 6 వేలు అమ్మ అకౌంట్లోనే పడుతుంది. ఇంటర్మీడియెట్ చదివితే ఏడాదికి రూ. 8,400, డిగ్రీ చదివితే రూ. 12,000 అమ్మ అకౌంట్లోనే పడతాయి. అంతకంటే పెద్ద చదువులు చదివే వారికి ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం ఎలాగూ ఉండనే ఉంది. రాష్ట్రంలో గుడిసె అనేదే లేకుండా ప్రతి నిరుపేదకూ పక్కా ఇల్లు కట్టిస్తారు. పేదవాళ్లు ఎప్పటిలాగే ధీమాగా పెద్దాసుపత్రికి వెళ్లి ఆరోగ్య శ్రీ పథకం కింద వైద్యం చేయించుకునే రోజులు మళ్లీ వస్తాయి. వైఎస్సార్ హామీ ఇచ్చినట్టు ప్రతి పేద కుటుంబానికీ నెలకు 30 కిలోల బియ్యం ఇస్తారు. ఆ రోజు వచ్చేంత వరకు మీరందరూ జగనన్నను ఆశీర్వదించాలని, వైఎస్సార్ పార్టీని బలపరచాలని, మాతో కలిసి కదం తొక్కాలని మా ప్రార్థన.’’

14.3 కిలోమీటర్ల మేర యాత్ర..

పాదయాత్ర 170వ రోజు బుధవారం షర్మిల రాజమండ్రి నగరంలోని సెయింట్ పాల్ చర్చి ప్రాంగణం నుంచి యాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి ఆజాద్ చౌక్, నందంగరిరాజు సెంటర్, కంబాల చెరువు, సానిటోరియం సెంటర్, కొనతనూరు, కొలమూరు మీదుగా నడిచారు. మధురపూడి శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 7.45 గంటలకు చేరుకున్నారు. బుధవారం మొత్తం 14.3 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 2,250.1 కిలోమీటర్ల యాత్ర పూర్తయ్యింది. పాదయాత్రలో పాల్గొన్న వారిలో తూర్పుగోదావరి జిల్లా పార్టీ కన్వీనర్ కుడిపూడి చిట్టబ్బాయి, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, బొడ్డు భాస్కర రామారావు, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, ముదునూరి ప్రసాదరాజు, నేతలు జక్కంపూడి విజయలక్ష్మి, బొడ్డు వెంకట రమణ చౌదరి, మొవ్వ ఆనంద శ్రీనివాసు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, గంపల వెంకటరమణ, స్థానిక నాయకులు బొమ్మన రాజ్‌కుమార్, ఆకుల వీర్రాజు తదితరులు ఉన్నారు.
Share this article :

0 comments: