పాలక, ప్రతిపక్షాలు ఎన్నికల తర్వాత యుగళ గీతం పాడుకోవలసిందే! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పాలక, ప్రతిపక్షాలు ఎన్నికల తర్వాత యుగళ గీతం పాడుకోవలసిందే!

పాలక, ప్రతిపక్షాలు ఎన్నికల తర్వాత యుగళ గీతం పాడుకోవలసిందే!

Written By news on Friday, June 7, 2013 | 6/07/2013

భాగవతగాథలో హిరణ్యకశిపుడు తన ఆధిక్యాన్ని నిరూపించుకోవడానికి ప్రహ్లాదుణ్ణి అనేక చిత్రహింసలకు గురి చేస్తాడు. ప్రహ్లాదుడు అన్నింటినీ అధిగమించి పులుగడిగిన ముత్యంలా రాణిస్తాడు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ భాగోతంలో పాలక ప్రతిపక్షాలు ఉమ్మడి ధ్యేయంతో జగన్ మోహన్ రెడ్డిని అవినీతి పరుడిగా చిత్రిస్తున్నాయి. జగన్‌మోహన్‌రెడ్డిని మానసికంగా, ఆర్థికంగా వేధించి పబ్బం గడుపుకోవాలనుకోవడం అధికారంలో ఉన్న నాయకుల రాక్షసానందమే తప్ప వేరొకటి కాదు! ఇతరులను హింసించడం ఆత్మహత్యాసదృశం అన్న బాపూజీ మాటలు వారికి తెలియవనుకోవాలా?

ఈ భాగోతంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల ధ్యేయం ఒక్కటే అయినా ఎవరి ఎత్తుగడలు వారికున్నట్టు గోచరిస్తోంది. జగన్‌ను బూచిగా చూపి కాంగ్రెస్ మెడలు వంచాలనే భావన తెలుగుదేశంలోనూ, తెలుగుదేశం మెడలు వంచి అధికార పీఠాన్ని అధిష్టించాలన్న తపన కాంగ్రెస్‌లోనూ వ్యక్తమౌతోంది. అంతే తప్ప ప్రజాసంక్షేమంపై లేశమైనా ధ్యాస లేదు. దీనికి నిదర్శనం వారు అసెంబ్లీలో ఒకరకంగా, బయట మరొకరకంగా మాట్లాడమే. పాలక పక్షం... మనది రాచరిక వ్యవస్థ అనుకుంటున్నట్లుంది. రాజు తప్పు చేయడు అనే సూక్తిని పాటిస్తున్నట్లుంది. 

గాడి తప్పిన పాలక పక్షాన్ని దారి మళ్లించాల్సిన బాధ్యత ప్రతిపక్షానిది. అలాంటి ప్రతిపక్షం పాలకపక్షంతో కుమ్మక్కు కావడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు. ఉభయులు రాక్షసానందంలో మునిగి వారిని నమ్మిన ప్రజానీకాన్ని నట్టేట ముంచేస్తున్నారు. అనాలోచిత వ్యూహాలతో ఈ రెండు పార్టీల ప్రజాప్రతినిధులు తమ నియోజక వర్గ ప్రజల దగ్గరకు వెళ్లే యోగ్యతను కోల్పోతున్నారు. కుట్రలు, కుతంత్రాలు, కక్షలతో ఎవరూ ఎవరినీ సాధించలేరు. 

అందునా స్థితప్రజ్ఞుడైన జగన్ తలవంచడం అంటే కుందేటి కొమ్ము సాధించడమే. మౌనపోరాటమే ఆయన విజయరహస్యం. జగన్ సూర్యుడిలా ఉదయిస్తాడు. అప్పుడు వీరి వీర భాగోతం విషాదాంతమవుతుంది. కుట్రదారులిద్దరూ చేతులు కలిపి నీ వల్ల నే చెడితి రామాహరి, నావల్ల నీవు చెడితివి రామాహరి’ అని యుగళగీతం పాడుకోవాల్సి ఉంటుంది.

- అన్నెం ఇన్నారెడ్డి, నాగార్జున సాగర్, పైలాన్, నల్గొండ జిల్లా

 చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34.
e-mail: ysjagankosam@gmail.com
Share this article :

0 comments: