చంద్రబాబుకు, కిరణ్‌కుమార్‌రెడ్డికి పెద్దగా తేడా లేదు: షర్మిల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబుకు, కిరణ్‌కుమార్‌రెడ్డికి పెద్దగా తేడా లేదు: షర్మిల

చంద్రబాబుకు, కిరణ్‌కుమార్‌రెడ్డికి పెద్దగా తేడా లేదు: షర్మిల

Written By news on Saturday, May 4, 2013 | 5/04/2013

 చంద్రబాబుకు, కిరణ్‌కుమార్‌రెడ్డికి పెద్దగా తేడా లేదు: షర్మిల

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘టీడీపీ అధినేత చంద్రబాబేమో.. ఎన్టీఆర్ రెక్కల కష్టం మీద అధికారంలోకి వస్తే, కిరణ్‌కుమార్‌రెడ్డి వైఎస్సార్ రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చారు. ఎన్టీఆర్ ఇచ్చిన పూర్తి మద్యపాన నిషేధం, రూ.2 కిలో బియ్యం వాగ్దానాలను చంద్రబాబు నిలుపుకోలేదు. వైఎస్సార్ ఇచ్చిన 9 గంటల ఉచిత విద్యుత్తు, ప్రతి కుటుంబానికి 30 కిలోల బియ్యం వాగ్దానాలను కిరణ్‌కుమార్‌రెడ్డి నిలుపుకోలేదు. మరి కిరణ్‌కుమార్‌రెడ్డికి, చంద్రబాబుకి ఏమిటి తేడా? ఏమీ తేడా లేదు.. దొందూ దొందే’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు.

‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర శుక్రవారం ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో సాగింది. జూలూరుపాడు మండల కేంద్రంలో భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ఈ సందర్భంగా షర్మిల ప్రసంగించారు. ‘‘చంద్రబాబు 8 ఏళ్ల 8 నెలల పాలనలో 8 సార్లు కరెంటు చార్జీలు పెంచారు. కిరణ్‌కుమార్‌రెడ్డి నాలుగేళ్ల పాలనలో నాలుగు సార్లు కరెంటు చార్జీలు పెంచారు. ఆయన ఐదు సార్లు ఆర్టీసీ చార్జీలు పెంచితే... ఈయననాలుగేళ్ల పాలనలో మూడు సార్లు పెంచారు. ఆయన గ్యాస్ ధర రెట్టింపు చేసి పెంచితే, ఈయనా రెట్టింపు చేశాడు. ఈ ఇద్దరికీ ఏమీ తేడా లేదు. ప్రజలు కూడా ఇద్దరినీ ఒకే రకంగా చూస్తున్నారు. ఎట్లయితే చంద్రబాబును ప్రజలు ఇంటికి పంపారో, అలాగే కిరణ్‌కుమార్‌రెడ్డిని, ఆయన ప్రభుత్వాన్ని ఇంటికి పంపే రోజు త్వరలోనే వస్తుంది’’ అని షర్మిల అన్నారు.

12.4 కిలోమీటర్ల మేర యాత్ర:

పాదయాత్ర 137వ రోజు శుక్రవారం ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం భగవాన్ నాయక్ తండా శివారు నుంచి ప్రారంభమైంది. షర్మిల అక్కడి నుంచి నడుచుకుంటూ అక్కినాపురం తండా, హిమాంనగర్, వినోభానగర్, జూలూరుపాడు మండల కేంద్రం చేరుకున్నారు. అక్కడ భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అక్కడి నుంచి సాయిరాం తండా శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. మొత్తం 12.4 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 1,846.4 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, ముదునూరు ప్రసాదరాజు, స్థానిక నాయకులు బానోత్ మదన్‌లాల్, నంబూరి రామలింగేశ్వరరావు, రామసహాయం నరేష్‌రెడ్డి, సాధు రమేష్‌రెడ్డి తదితరులున్నారు.
Share this article :

0 comments: