ఆఖరి ఏడాదిలో అందరిపై సీఎం ప్రేమ చూపిస్తున్నారు.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆఖరి ఏడాదిలో అందరిపై సీఎం ప్రేమ చూపిస్తున్నారు..

ఆఖరి ఏడాదిలో అందరిపై సీఎం ప్రేమ చూపిస్తున్నారు..

Written By news on Thursday, May 2, 2013 | 5/02/2013


* ఆఖరి ఏడాదిలో అందరిపై సీఎం ప్రేమ చూపిస్తున్నారు..
* ఆడబిడ్డలపై ప్రేమ ఉంటే ఇన్ని అత్యాచారాలు జరిగేవా?
* వయసుతో అంతరం లేకుండా అత్యాచారాలు జరుగుతున్నాయి
* ప్రభుత్వం మొద్దు నిద్ర వల్లే ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయింది
* చంద్రబాబు దారిలోనే కిరణ్ పయనం
* ఈ ప్రభుత్వ పాలనలో రైతులు, కార్మికులు చితికిపోయారు
* జగనన్న రాజ్యంలో ఆడబిడ్డలకు ‘అమ్మ ఒడి’
* రెండు రోజుల విరామం అనంతరం పాదయాత్ర కొనసాగింపు

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘‘ఆడబిడ్డల మీద ప్రేమతో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ‘బంగారు తల్లి’ పథకాన్ని ప్రవేశపెట్టానంటున్నారు. నిజంగా ఆడబిడ్డలపై ప్రేమ ఉంటే రాష్ట్రంలో ఇన్ని అత్యాచారాలు జరిగేవా? వయసుతో నిమిత్తం లేకుండా అత్యాచారాలు జరుగుతున్నాయి. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అత్యాచారాలు జరిగితే కఠిన శిక్షలు ఉండేవి. ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వల్లే ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయింది’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ధ్వజమెత్తారు. ఖమ్మం జిల్లాలో షర్మిల మరోప్రజాప్రస్థానం పాదయాత్ర రెండు రోజుల విరామం అనంతరం బుధవారం తిరిగి ప్రారంభమైంది.

కామేపల్లి మండలం ముచ్చెర్ల నుంచి పాదయాత్ర కొనసాగించారు. ఏన్కూరు మండలం మర్సకుంట్ల గ్రామంలో నిర్వహించిన రచ్చబండలో ఆమె ప్రసంగించారు. ఆడబిడ్డలపై నిత్యం అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం గురకపెట్టి నిద్రపోతోందని విమర్శించారు. ఇప్పటివరకు నిద్రపోయి ఆఖరి ఏడాదిలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రేమ ఒలకబోస్తున్నారని అన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటనల ముఖ్యమంత్రి తప్ప చేతల ముఖ్యమంత్రి కాదని విమర్శించారు. మంచి నీటి కోసం గ్రామాలలో మహిళలు పడుతున్న ఇబ్బందులు సీఎంకు కనిపించవా అని ప్రశ్నించారు. ‘‘వైఎస్ రాజశేఖరరెడ్డి 30 కేజీల బియ్యం అందిస్తామని వాగ్దానం చేశారు. ఈ వాగ్దానం ఎన్నికల మేనిఫెస్టోలో ఉంది.

ఇది కాంగ్రెస్ పార్టీ వాగ్దానం. వైఎస్ బతికి ఉంటే దీనిని అమలు చేసేవారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ఇప్పటికీ ఈ వాగ్దానం అమలు చేయలేదు. చంద్రబాబు దారిలోనే కిరణ్‌కుమార్‌రెడ్డి పయనిస్తున్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా రూ.2కే కిలో బియ్యం ప్రవేశపెట్టారు. సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు వాటిని తుంగలో తొక్కారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా అదే దారిలో పయనిస్తున్నారు’’ అని మండిపడ్డారు.

రైతులు, కార్మికులు చితికిపోయారు
‘వైఎస్ పాలనలో రెండు పంటలకు నీళ్లొచ్చాయి. ఏడు గంటలు ఉచిత విద్యుత్ అందింది. రైతులు, కూలీలు బాగుపడ్డారు. ఈరోజు కార్మికుల దినం. కానీ రాష్ట్రంలో రైతులు, కార్మికులు చితికిపోయారు. రైతు మంచిగా ఉంటేనే కూలీలు బాగుంటారు. ఈ ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా మోసం చేస్తుండటంతో వాళ్లు అప్పుల పాలై తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వైఎస్ హయాంలో మిర్చికి క్వింటాలుకు రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు ఇచ్చారు. ఇప్పుడు కేవలం రూ.4 వేలే ఇస్తున్నారు’’ అని షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. దేశంలో గిరిజనులకు రెండు లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేసిన ఏకైక వ్యక్తిగా వైఎస్ గుర్తింపు పొందారన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎవరూ ఇలా గిరిజనులకు భూమిని పంపిణీ చేయలేదని చెప్పారు.

జగనన్న రాజ్యంలో ‘అమ్మ ఒడి’
‘‘ఆడపిల్లలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ‘అమ్మ ఒడి’ పథకాన్ని ప్రవేశపెడతామని పార్టీ ప్లీనరీలో జగనన్న చెప్పారు. ఈ పథకం ప్రకారం.. పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు నెలకు రూ.500, ఏడాదికి రూ.6 వేలు, ఇంటర్ విద్యార్థులకు నెలకు రూ.700, ఏడాదికి రూ.8,400, డిగ్రీ విద్యార్థులకు ప్రతి నెలా రూ.వెయ్యి, ఏడాదికి రూ.12 వేలు అమ్మ ఖాతాలోనే పడతాయి. ఆడా మగా తేడా లేకుండా అందరూ చదివేందుకు ఈ డబ్బులు ఉపయోగపడతాయి. విద్యార్థుల జీవితాలు బంగారుబాటలో పయనిస్తాయి. ఇప్పుడు ఏడాది మిగిలి ఉండటంతో బంగారు తల్లి అంటూ కిరణ్ కుమార్‌రెడ్డి ప్రవేశపెట్టిన పథకం ఆడబిడ్డలపై ప్రేమతో పెట్టినది కాదు’’ అని షర్మిల అన్నారు.

12.3 కిలో మీటర్లు పాదయాత్ర
ఎడమ కాలి మడమకు గాయం కావడంతో రెండు రోజుల విరామం అనంతరం షర్మిల బుధవారం పాదయాత్ర తిరిగి ప్రారంభించారు. ఇల్లెందు నియోజకవర్గం కామేపల్లి మండలం ముచ్చెర్ల నుంచి నడక ప్రారంభించారు. అడవిమద్దులపల్లి, లాల్యాతండా, వైరా నియోజకవర్గంలోని ఏన్కూరు మండలం మర్సకుంట్ల, శ్రీరాంపురంతండా, తిమ్మారావుపేట, రాజలింగాల వరకు 12.3 కిలోమీటర్లు నడిచారు. రాజలింగాల గ్రామం సమీపంలో ఏర్పాటు చేసిన బసకు రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. చింతలపూడి ఎమ్మెల్యే రాజేష్, పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ ఖమ్మం జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు, నాయకులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, బానోత్ మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు, సాధు రమేష్‌రెడ్డి, భూక్యా దళ్‌సింగ్, బాణోతు పద్మావతి, నంబూరి రామలింగేశ్వరరావు తదితరులు పాదయాత్రలో పాల్గొన్నారు.
Share this article :

0 comments: